కపిల్ దేవ్ 175: వరల్డ్ కప్ గెలవగలమనే నమ్మకాన్ని భారతజట్టుకు ఇచ్చిన చరిత్రాత్మక ఇన్నింగ్స్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1983 ప్రపంచకప్ వరకు వన్డేలకు 60 ఓవర్లు ఉండేవి. ఒక్కో బౌలర్‌కు బౌలింగ్ చేయడానికి గరిష్టంగా 12 ఓవర్లు కేటాయించేవారు. అప్పటికి తెల్ల బంతి లేదు. ఎరుపు రంగు బంతే.
మొత్తం ఇన్నింగ్స్‌కు ఒక బంతినే వాడేవారు. ఫీల్డింగ్, పవర్ ప్లే నిబంధనలూ లేవు. అప్పటివరకు డీఆర్ఎస్ కూడా వినలేదు. ఆటగాళ్లందరూ తెల్లటి దుస్తులు ధరించేవారు. వన్డేల్లో లంచ్, టీ బ్రేక్ కూడా ఉండేది.
1983 ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ వెళ్లింది. మొదటి మ్యాచ్‌లోనే పటిష్ట వెస్టిండీస్‌ను టీమిండియా ఓడించింది.
ఇంతకుముందు ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ను ఏ జట్టూ ఓడించలేదు. ఆ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 60 ఓవర్లలో 8 వికెట్లకు 262 పరుగులు చేసింది. విండీస్ జట్టును 228 పరుగులకే ఆలౌట్ చేసింది.
జింబాబ్వేతో జరిగిన తదుపరి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ తర్వాతి రెండు మ్యాచ్‌లు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో భారత్ భారీ తేడాతో ఓడిపోయింది.
జింబాబ్వేతో ఐదో మ్యాచ్ ఆడేందుకు కపిల్ దేవ్ బృందం కెంట్‌లోని టన్‌బ్రిడ్జ్ వెల్స్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో కపిల్ ఇండియా రన్ రేట్‌ను మెరుగుపరచుకోవడానికే ఎక్కువ ఆలోచించాడు.
కపిల్ తన ఆత్మకథ 'స్ట్రెయిట్ ఫ్రమ్ ది హార్ట్'లో..
"టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు మాతో పాయింట్ల పరంగా సమానంగా ఉంది. వారి రన్‌రేట్ మా కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి, మా రన్‌రేట్‌ను మెరుగుపరచడంపైనే మా దృష్టి ఉంది. ముందుగా బ్యాటింగ్ చేసి 300కి పైగా పరుగులు స్కోర్ చేయాలనుకున్నాం. పిచ్‌పై చాలా తేమ ఉంది, దానిపై మొదట బ్యాటింగ్ చేయడం ఇబ్బందులను ఆహ్వానించినట్లే అవుతుందని అస్సలనుకోలేదు. పరిస్థితి దృష్ట్యా బ్యాటింగ్ తప్ప మరే ఎంపికను పరిగణించలేదు. వారి బౌలర్లు విజృంభించారు. ఫలితంగా మా ఓపెనర్లిద్దరూ తొందరగానే పెవిలియన్ చేరుకున్నారు'' అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
17 పరుగులకే పెవిలియన్‌కు సగం జట్టు ..
బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికి సునీల్ గవాస్కర్ ఔటయ్యాడు.
అయితే, అప్పటికే ఫామ్‌లో ఉన్న మొహిందర్ అమర్‌నాథ్‌పై ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. అతను కూడా ఐదో ఓవర్‌లో వికెట్ వెనుక క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
డీప్ మిడ్ ఆఫ్ వద్ద శ్రీకాంత్ సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో స్కోరు 6 పరుగులకే 3 వికెట్లు. ఆ సమయంలో సందీప్ పాటిల్ బ్యాటింగ్‌కు రావడంతో స్టేడియంలో నిశ్శబ్దం నెలకొంది. కొన్ని బంతుల తర్వాత సందీప్ పాటిల్ కూడా వికెట్ కీపర్ చేతికి చిక్కాడు.
సందీప్ పాటిల్ తన ఆత్మకథ 'శాండీ స్టార్మ్'లో "కపిల్ తన వంతు ఆలస్యంగా వస్తుందనుకొని, స్నానం చేయడానికి వెళ్లాడు. కానీ మా బ్యాటర్లు త్వరగా ఔటవడంతో యశ్‌పాల్ శర్మతో కలిసి క్రీజులోకి వచ్చా.
సునీల్ వాల్సన్ (12వ ఆటగాడు) క్రీజులో ఉన్న మా వైపు పరిగెత్తుకొచ్చి, కపిల్ ఇంకా వాష్‌రూమ్‌లో ఉన్నాడని చెప్పాడు'' అని తెలిపారు.
"కానీ నేను వికెట్ల వెనక దొరికిపోయా. దీంతో 17 పరుగులకే మా 5 వికెట్లు పడిపోయాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో ఇతర ఆటగాళ్లు కపిల్ దగ్గరికి వెళ్లి త్వరగా బ్యాటింగ్‌కు సిద్ధం చేశారు. నేను మైదానంలో కపిల్‌ను సమీపిస్తున్నప్పుడు శరీరం వణికింది, అతన్ని చూడలేకపోయా. నేను డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లినపుడు గవాస్కర్, శ్రీకాంత్, అమర్‌నాథ్, యశ్‌పాల్ శర్మలు కూర్చుని ఉన్నారు. వారి ముఖాలు వాడిపోయాయి. బయటకు వెళ్లి మ్యాచ్ చూసే ధైర్యం ఎవ్వరికీ లేదు’’ అని తెలిపారు సందీప్ పాటిల్.

ఫొటో సోర్స్, Getty Images
తొలి 50 పరుగుల్లో ఒక్క బౌండరీ కొట్టలేదు..
కపిల్ బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి వచ్చే సమయానికి పీటర్ రాసన్, కెవిన్ కుర్రాన్ భారత్ టాప్ ఆర్డర్‌ను పెవిలియన్‌కు పంపారు.
కపిల్ తన ఆత్మకథలో.. "పెవిలియన్‌లో మదన్ లాల్ భార్య అను, నా భార్య రోమీతో కలిసి మెట్లు ఎక్కుతోంది. అప్పుడు మదన్ లాల్ వారిని ఆపి, మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు? హోటల్‌కి తిరిగి వెళ్లండి అని చెప్పాడు, ఎందుకు? అని అను అడిగితే.. 17 పరుగులకే మా 4 వికెట్లు పడిపోయాయని మదన్ లాల్ బదులిచ్చారు. అను, రోమీలిద్దరూ ఆశ్చర్యంతో ఏంటి? అన్నారు. అప్పుడే యశ్‌పాల్ శర్మ కూడా ఔటయ్యి పెవిలియన్‌కు తిరిగి వస్తున్నాడు. స్కోరుబోర్డుపై భారత స్కోరు 5 వికెట్లకు 17 పరుగులు" అని రాశారు.
ఐదు వికెట్లు పడటంతో కపిల్ దేవ్ జాగ్రత్తగా ఆడటం ప్రారంభించాడు. ఇది అతని సహజమైన ఆటైతే కాదు. అతని తొలి 50 పరుగుల్లో ఒక్క బౌండరీ లేదు.
ఆ సమయంలో కపిల్ దేవ్ తన గౌరవాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని, టీమిండియా స్కోరును కనీసం 180కి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు.
రోజర్ బిన్నీ అతనికి మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరును 77కు చేర్చారు.
ఆ తర్వాత బిన్నీ ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ కాగా, ఒక పరుగు చేసి రవిశాస్త్రి కూడా పెవిలియన్ చేరుకున్నాడు.
కానీ అప్పటికి వికెట్ కాస్త తేలికైంది. కపిల్ వికెట్ వెనుక బంతిని కట్ చేస్తూ, పరుగులు రాబట్టడం ప్రారంభించాడు.
కపిల్ ఆత్మకథలో "ఈ ఓవర్ ముగిసే వరకు నేనుండాలని నాకు నేను చెప్పుకున్నా. అప్పుడు మదన్ లాల్ నా వద్దకు వచ్చి, 'నేను ఒక ఎండ్‌ను హ్యాండిల్ చేస్తాను. నువ్వు రన్స్ కొట్టు' అన్నారు. 35 ఓవర్ల తర్వాత లంచ్ బ్రేక్ వచ్చింది. అప్పటికి ఇండియా స్కోరు 7 వికెట్లకు 106 పరుగులు, నేను 50 పరుగులతో ఆడుతున్నా'' అని రాశారు.
మరోవైపు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న గవాస్కర్, శ్రీకాంత్, మొహిందర్, యశ్‌పాల్ శర్మ, సందీప్ పాటిల్ అలా నిశ్శంబ్ధంగానే, మ్యాచ్ చూడకుండా ఉండిపోయారు.
"మేం ప్రపంచం నుంచి దాక్కోవాలనుకున్నాం. పైకి వెళ్లి మ్యాచ్ చూసే ధైర్యం మాకు లేదు. ఓ 20 నిమిషాల తర్వాత, ప్రేక్షకుల శబ్దం వినిపించడం ప్రారంభించింది. అనంతరం మరింత చప్పుడు ప్రతి ఐదు నిమిషాలకోసారి వినిపించింది. మరో వికెట్ పడిపోయిందా? ఫోర్ లేదా సిక్స్ కొట్టారా? మాకు ఏమీ తెలియట్లేదు. చివరికి శ్రీకాంత్ పైకి వెళ్లే ధైర్యం చేశాడు. దీని తరువాత, మేం కూడా మ్యాచ్ చూడటానికి ఒకరి తర్వాత ఒకరు పైకి వెళ్లాం. మా కళ్ల ముందు అద్భుతం జరగడం చూశాం. అది మరెవరో కాదు మన కెప్టెన్ కపిల్ దేవ్'' అని సందీప్ పాటిల్ తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
కపిల్ బ్యాటింగ్ చేస్తుండగా కదలని గవాస్కర్
భారత ఇన్నింగ్స్‌ను బాధ్యతను కపిల్ తన భుజాలపై వేసుకున్నాడు. అతనికి రోజర్ బిన్నీ, మదన్ లాల్, సయ్యద్ కిర్మాణీ సాయం చేశారు.
అక్కడే నిలబడి మద్దతు తెలుపుతున్నారు సునీల్ గవాస్కర్. ఆయన్ను ఎవరో అడిగారు- 'సన్నీ, నువ్వు చాలా సేపు ఇలా నిలబడి ఉన్నావా? అని,
గవాస్కర్ బదులిస్తూ.. 'అవును నిలబడి ఉన్నాను. నా స్థానం మార్చుకుంటే కపిల్ ఔటవుతాడేమోనని భయం' అని తెలిపారు.
యశ్‌పాల్ శర్మ చాలాసేపు మోకాళ్లు వంచి కూర్చున్నట్లు మరో ఆటగాడు చూశాడు.
దాని గురించి అతన్ని అడిగితే "భారత్ ఇన్నింగ్స్ ముగిసే వరకు నేను ఇలాగే కూర్చుంటాను" అని బదులిచ్చాడు.
"అప్పుడు గవాస్కర్.. మా కోచ్ డ్రైవర్ బాబ్ కుర్చీపై ఒక కాలుతో నిలబడి ఉన్నట్లు చూపించాడు. కపిల్ క్రీజులో ఉన్నంతసేపు కదలనని అతను చెప్పాడు'' అని కపిల్ గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
లంచ్ చేయని కపిల్...
లంచ్ తర్వాత కపిల్ డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నప్పుడు, ఒక్క టీమిండియా ఆటగాడు కూడా అక్కడ లేడు.
కపిల్ తన ఆత్మకథలో, "నా కుర్చీ దగ్గర ఒక గ్లాసు వాటర్ పెట్టారు. ఒక నాటౌట్ బ్యాట్స్‌మెన్ లంచ్ కోసం వచ్చినప్పుడు, జట్టులోని రిజర్వ్ ఆటగాడు ప్లేట్‌లో ఆహారాన్ని అక్కడ ఉంచాలి. ఆ రోజు నా భోజనం జాడ లేదు. భోజనాల గదికి వెళ్లి నా ఆహారం తెచ్చుకోవలసి వచ్చింది. సహచరులు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకర్థం కాలేదు? నా కోపం నుంచి తప్పించుకునేందుకే అక్కడ ఎవరూ లేరని తర్వాత తెలిసింది. ఇది విన్న తర్వాత నేను పెద్దగా నవ్వాను. ఆ రోజు నేను లంచ్‌కి ఏమీ తినకుండా రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ తాగి మళ్లీ రంగంలోకి దిగాను" అని తెలిపారు.
లంచ్ తర్వాత భారత్ స్కోరు 140 పరుగులకు చేరుకోగానే మదన్ లాల్ (17) ఔటయ్యాడు. అతని స్థానంలో కిర్మాణి వచ్చాడు.
కిర్మాణి తరువాత గుర్తుచేసుకుంటూ "నేను క్రీజులోకి చేరుకోగానే కపిల్ నాతో కిరీ భాయ్, మనం 60 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలని అన్నాడు. 'క్యాప్స్, చింతించకండి. మనం పూర్తి 60 ఓవర్లు ఆడతాం. నేను మీ కోసం బ్యాటింగ్ చేస్తా. నేను మీకు స్ట్రైకింగ్ ఇస్తా. మీరు ప్రతి బంతిని కొట్టాలి, జట్టులో మీ కంటే మెరుగైన హిట్టర్ లేరు' అని బదులిచ్చాను. మేం పూర్తి 60 ఓవర్లు ఆడాం. కపిల్, నేను అజేయంగా పెవిలియన్‌కు చేరుకున్నాం" అని అన్నారు.
చివర్లో విజృభించిన కపిల్
చివరి ఓవర్లలో కపిల్ భారీగా పరుగులు సాధించాడు. కపిల్, కిర్మాణి కలిసి చివరి 7 ఓవర్లలో 100 పరుగులు జోడించారు. కుర్రాన్ ఓవర్లో కపిల్ కొట్టిన సిక్స్ మైదానం దాటి స్టేడియం బయట పార్క్ చేసిన కార్లపై పడింది.
అతని బౌలింగ్‌లో బాదడంతో కపిల్‌ను దుర్భాషలాడటం ప్రారంభించాడు కుర్రాన్.
కపిల్ తన ఆత్మకథలో "అది నాకు మరింత కోపం తెప్పించింది. అతనికి ధైర్యం ఉంటే నాపై బౌన్సర్ వేయాలంటూ రెచ్చగొట్టాను. అతని బౌన్సర్‌లలో ఒకదాన్ని నేను స్టేడియం బయటకు పంపి, నా బ్యాట్‌ని కరెన్‌కి చూపించాను. తదుపరి 18 బంతుల్లో నేను 3 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి 49వ ఓవర్లో నా సెంచరీని పూర్తి చేశా'' అని తెలిపాడు.
సునీల్ గవాస్కర్ తన పుస్తకం 'ఐడల్స్'లో, "మదన్ లాల్, కిర్మాణి తనకు బాగా మద్దతు ఇస్తున్నారని కపిల్ విశ్వసించి ఎదురుదాడికి దిగాడు. కపిల్ 160కి చేరుకున్నప్పుడు మా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. గ్లెన్ టర్నర్ 171 పరుగుల ప్రపంచ రికార్డు చాలా దగ్గరగా ఉందని మాకు తెలుసు. బహుశా కపిల్‌కు దీని గురించి తెలియదు. భారీ షాట్లు ఆడుతున్నప్పుడు ఔటై, కపిల్ ఈ రికార్డును కోల్పోతారని మేం భయపడ్డాం. తన ప్రపంచ రికార్డు కోసం ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారని అంపైర్ బారీ మేయర్ కపిల్‌తో చెప్పాడు. ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన గ్లెన్ టర్నర్ రికార్డును బద్దలు కొట్టాడని కపిల్‌కు అప్పుడే తెలిసింది. ఆ సమయంలో కపిల్ అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం కేవలం ఐదేళ్లు మాత్రమే'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, BCCI
మ్యాచ్ ఫలితం ఏంటి?
60 ఓవర్లలో భారత్ 266 పరుగులు సాధించగా, కపిల్ అజేయంగా 175 పరుగులు చేశాడు. కానీ మ్యాచ్ ఇంకా ముగియలేదు. జింబాబ్వే కూడా శుభారంభం చేసింది.
తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించింది. దీని తర్వాత భారత బౌలర్లు విజృంభించడంతో ఒక్కసారిగా 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే.
అయితే కెవిన్ కుర్రాన్ భారత్‌పై పోరాడాడు. 56వ ఓవర్‌లో కుర్రాన్‌ను అవుట్ చేసినప్పటికీ, అప్పటికి అతను 73 పరుగులు చేశాడు.
చివరికి భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. కపిల్ దేవ్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. జింబాబ్వేపై విజయంతో ప్రపంచకప్‌లో భారత్ సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించింది.
"ఈ ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్‌లో కపిల్ దేవ్‌ను చిరస్థాయిగా నిలిపింది. ఈ విజయం ప్రపంచకప్‌ను గెలుచుకోగలమనే స్ఫూర్తిని టీమిండియాలో ఏర్పరిచింది" అని రవిశాస్త్రి తన పుస్తకం 'స్టార్ గేజింగ్' లో రాశాడు.
ఇవి కూడా చదవండి
- ADR రిపోర్ట్: పార్లమెంటు సభ్యుల్లో తెలుగు ఎంపీలే సూపర్ రిచ్... నేర చరిత్రలోనూ మనవారే టాప్
- ఆ చర్చిని కదిలిస్తే 1,000 దాకా లైంగిక వేధింపుల కేసులు బయటపడ్డాయి... బాధితుల్లో చాలా మంది పిల్లలు
- లిబియా వరదలు: సునామీ ముంచెత్తిందా అన్నట్లు ఎటు చూసినా శవాలే... రెండు వేలకు పైగా మృతులు, 10 వేల మంది గల్లంతు
- ఆవును చంపిన పులి... ఆ ఆవు యజమాని ఎలా పగ తీర్చుకున్నాడంటే
- పార్లమెంట్లో లైంగిక వేధింపులు: ‘అతను నా మెడకు దగ్గరగా ఊపిరి పీల్చుతూ, అసభ్యకరంగా మాట్లాడేవారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)














