కుల్‌దీప్ యాదవ్: ఫాస్ట్ బౌలర్ కావాలనుకుని స్పిన్నర్ ఎందుకు అయ్యాడంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అభిజీత్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘నేను క్రికెట్‌ను విడిచిపెట్టిన తరువాత కూడా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లను తీయడాన్ని నేనెప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని కుల్‌దీప్ యాదవ్ అన్నాడు.
228 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను టీమ్‌ఇండియా మట్టికరిపించిన మొన్నటి మ్యాచ్‌లో కుల్‌దీప్ యాదవ్ అత్యధికంగా ఐదు వికెట్లను తీశాడు.
ఆ తర్వాత వెంటనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు వికెట్లు అవసరమైన సమయంలో మళ్లీ కుల్‌దీప్ బంతి అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా మొత్తంగా నాలుగు వికెట్లను తీశాడు.
గత రెండు రోజులుగా తన రిస్ట్ స్పిన్‌తో కొలంబో పిచ్‌పై ఈ చైనామన్ బౌలర్ బ్యాటర్లను డ్యాన్స్ వేయించాడు. షేన్ వార్న్‌ను ఇది గుర్తు చేస్తుంది.
మోకాలి శస్త్రచికిత్స తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన కుల్‌దీప్ యాదవ్, అప్పటి నుంచి వికెట్లను తీస్తూనే ఉన్నాడు. మంగళవారం వన్డేలో తన 150వ వికెట్‌ను పడగొట్టాడు కుల్‌దీప్ యాదవ్.

ఫొటో సోర్స్, GETTY IMAGES
స్పిన్, స్పీడ్.. ఇతన్ని స్టార్ చేశాయి
కుల్‌దీప్ యాదవ్‌కు గాయం కావడంతో 2021లో అతను టీమ్‌లో స్థానం కోల్పోయాడు.
ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స జరిగింది.
ఆ తరువాత మళ్లీ ఆయన ఆడుతాడని కానీ, ఇలా మ్యాచ్‌లు గెలిపిస్తాడనని కానీ చాలామంది ఊహించి ఉండకపోవచ్చు.
సోమవారం పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు బ్యాటర్లను పెవిలియన్‌కు పంపిన కుల్‌దీప్ యాదవ్, ఇది కేవలం ఒక్క రాత్రి వల్ల జరగలేదని అన్నారు. దీని వెనుక ఎంతో కృషి ఉందని చెప్పారు.
గత ఏడాదిన్నరగా కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో మంచి ప్రతిభ చూపుతున్నాడు.
మోకాలి శస్త్రచికిత్స తర్వాత తిరిగి వచ్చాక, కుల్‌దీప్ బౌలింగ్ స్పీడు అంతకుముందు కంటే పెరిగింది.
పాకిస్తాన్ మ్యాచ్‌లో అతను తీసిన ఐదు వికెట్లలో బౌలింగ్‌ను 82 నుంచి 87 కి.మీ.ల స్పీడుతో వేశాడు.

ఫొటో సోర్స్, ANI
జట్టులో చోటు కోసం ఇబ్బందులు పడ్డాడు
ఇప్పుడు టీమ్‌లో వికెట్లు తీసే లీడింగ్ స్పిన్ బౌలర్‌గా కనిపిస్తున్న కుల్‌దీప్ యాదవ్, ఒకప్పుడు టీమ్‌లో చోటు కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. జట్టులో అతనికి చోటు దక్కనప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు.
ఆ సమయంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను జట్టులో ఉంచుతూ, కుల్‌దీప్ యాదవ్‌ను కూడా జట్టులోకి తీసుకోవడం అసాధ్యం.
ముంబయి ఇండియన్స్‌తో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన కుల్‌దీప్ యాదవ్ జట్టులో ఆడుతూనే తన సీనియర్ల నుంచి చాలా నేర్చుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
కానీ, వన్డేలలో రెండుసార్లు హ్యాట్రిక్‌ను సాధించిన ఈ బౌలర్‌కి భారత క్రికెట్ జట్టులో కానీ లేదా ఐపీఎల్‌లో కానీ ఆడే అవకాశాలు తగ్గిపోయాయి.
2021 ఐపీఎల్ సమయంలో మోకాలి గాయంతో ఐపీఎల్ మధ్యలో నుంచే కుల్దీప్ యాదవ్ జట్టు నుంచి బయటికి వచ్చాడు.
కుల్దీప్ యాదవ్ జట్టు నుంచి బయటికి రావడం, లోపలికి వెళ్లడం జరుగుతూనే ఉంది.

ఫొటో సోర్స్, ANI
బాల్ వేగంగా వేయాలనే ఆశతో...
కుల్‌దీప్ యాదవ్ తొలుత క్రికెట్‌ను తన అంకుల్ వద్ద నేర్చుకున్నాడు. కుల్‌దీప్ క్రికెట్ ఆడాలని తన తండ్రి కూడా కోరుకున్నాడు. కాన్పూర్‌లో తన సోదరునితో కలిసి నివసించేందుకు కుల్‌దీప్‌ను అక్కడికి పంపాడు తండ్రి.
కుల్‌దీప్ జీవితంలో రెండు అత్యంత ప్రభావితమైన అంశాలున్నాయి. ఒకటి తన కోచ్ ఒకరు ఫాస్ట్ బౌలింగ్ ఆపి, స్పిన్ బౌల్‌ను వేయాలని సూచించడం. రెండోది షేన్ వార్న్.
స్పిన్‌తో అద్భుతాలు సృష్టించే కుల్‌ప్ మొదట తాను ఫాస్ట్ బౌలర్‌గా కావాలనుకున్నాడు.
తన ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుంటుందని ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పాడు. కానీ, కోచ్ తనని స్పిన్ వేయమన్నాడని అన్నాడు.
‘‘అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే నాకు స్పిన్ బౌలింగ్ అంటే ఇష్టముండదు’’ అని కుల్‌దీప్ యాదవ్ చెప్పారు.
దీని వల్ల 10 రోజుల పాటు కుల్‌దీప్ అసలు ఆడనేలేదు. నీకు క్రికెట్ ఆడాలని ఉంటే, మైదానానికి వచ్చి, కేవలం స్పిన్ బౌల్ మాత్రమే వేయి అని కోచ్ చెప్పారు.
ఆ తర్వాత పది రోజులకు కుల్‌దీప్ యాదవ్ తిరిగి అకాడమీకి వెళ్లాడు. అప్పుడు అతన్ని స్పిన్ బౌల్ చేయమని కోచ్ చెప్పాడు.
‘‘ఎడమ చేతితో చైనాబాల్ చేయడం నాకు తెలియదు. ఆ సమయంలో నాకు చైనామన్ అంటే కూడా తెలియదు’’ అని కుల్‌దీప్ చెప్పారు.
ఆ తర్వాత కుల్‌దీప్ స్పిన్ బౌలింగ్‌ను తీర్చిదిద్దేందుకు కోచింగ్ ప్రయత్నించారు. ఇదే అతన్ని నేటి ఈ స్థాయిలో నిలబెట్టింది.

ఫొటో సోర్స్, ANI
కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌పై షేన్ వార్న్ ప్రభావం
2017లో పుణె టెస్ట్‌కు ముందు తాను షేన్ వార్న్‌ను కలిశానని కుల్‌దీప్ తెలిపాడు.
అనిల్ కుంబ్లే టీమ్ కోచ్‌గా ఉన్నప్పుడు, ఆయన తనని షేన్ వార్న్‌కు పరిచయం చేసేందుకు ప్రయత్నించారని ఆన్‌లైన్ షో లైవ్ కనెక్ట్‌లో కుల్దీప్ చెప్పాడు.
‘‘నేను షేన్ వార్న్‌ను తొలిసారి కలిసినప్పుడు 10 నిమిషాల పాటు నేనేమీ మాట్లాడలేదు. అనిల్ సార్‌తో ఆయన మాట్లాడుతున్నారు. దేని గురించో వివరిస్తున్నారు. ఆ తర్వాత నేను నా ప్లాన్ గురించి షేన్ వార్న్‌తో మాట్లాడాను. నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు అన్నారు వార్న్’’ అని కుల్‌దీప్ తెలిపాడు.
ఆ తర్వాత చాలా సార్లు షేన్ వార్న్‌ను కుల్‌దీప్ కలిశాడు. ఏదైనా ప్రశ్న వచ్చిందంటే.. దానిపై తాము చాలా మాట్లాడుకునేవాళ్లమన్నారు. ఆయన సలహాను మేం కోరుకునే వాళ్లమని చెప్పాడు.

ఫొటో సోర్స్, ANI
బౌలింగ్‌లో మార్పులు
2021లో మోకాలి శస్త్రచికిత్స అయినప్పుడు, ఆయన దీర్ఘకాలం పాటు ఫిజియోథెరపీని చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కేవలం భారత క్రికెట్ జట్టులో మాత్రమే కాక, ఐపీఎల్‌లో వికెట్లు తీసేందుకు కూడా ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున మళ్లీ ఆయన కెరీర్ ప్రారంభించాడు. కుల్‌దీప్ యాదవ్‌పై రిషబ్ పంత్ ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శించాడు.
తొలి మ్యాచ్ నుంచే అద్భుతాలు చేయడం ప్రారంభించాడు కుల్‌దీప్.
రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్‌ను ఓడిచేందుకు, కుల్‌దీప్ కేవలం 4 ఓవర్లలోనే 18 పరుగులు చేయడమే కాకుండా.. రోహిత్ వంటి మగ్గురు బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి పంపాడు.
ఐపీఎల్ 2022లో కుల్‌దీప్ 21 వికెట్లు తీశాడు. అప్పటి నుంచి ఆయన బౌలింగ్ మెరుగుపరుచుకుంటూనే ఉన్నాడు.
సోమవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను చూసిన మాజీ కెప్టెన్, కోచ్ రవి శాస్త్రి, తన బౌలింగ్ చాలా మెరుగుపడినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
150 వికెట్లను తీసిన ఘనత
ఈ ఏడాది ఇప్పటి వరకు కుల్‌దీప్15 వన్డేలలో 31 వికెట్లు తీశాడు. బౌలింగ్ యావరేజ్, ఎకానమీలో కెరీర్ పరంగా ఇదే మంచి సంవత్సరం.
వన్డేలో 150 వికెట్లను తీసిన 15 మంది భారత బౌలర్ల జాబితాలో ప్రస్తుతం కుల్‌దీప్ కూడా ఒకడు.
100 కంటే తక్కువ మ్యాచ్‌లలోనే 150 వికెట్లు తీసిన రికార్డును భారత్‌కు చెందిన ముగ్గురు క్రీడాకారులకు మాత్రమే ఉంది. వారిలో కుల్‌దీప్ ఒకడు.
తన 88వ మ్యాచ్‌లోనే ఈ ఘనతను సాధించాడు.

ఫొటో సోర్స్, ANI
ట్రంప్ కార్డు
కుల్దీప్‌తో పాటు బుమ్రా కూడా గాయం నుంచి కోలుకుని మ్యాచ్‌లలోకి వచ్చాడు. ఈయన కూడా మ్యాచ్‌లలో రాణిస్తున్నాడు.
భారత్‌తో మ్యాచ్ తరువాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ బుమ్రా బౌలింగ్ ఆడటం తనకి కష్టమే అని చెప్పారు.
వరల్డ్ కప్ వరకు జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌ల జోరు ఇలానే కొనసాగితే.. వీరిద్దరూ కీలకం అవుతారని మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌ను చూసి పాకిస్తాన్ నేర్చుకోవాలని, విధానాలను సమీక్షించుకోవాలని ఆ దేశ నెటిజన్లు ఎందుకు అంటున్నారు
- లిబియా వరదలు: సునామీ ముంచెత్తిందా అన్నట్లు ఎటు చూసినా శవాలే... రెండు వేలకు పైగా మృతులు, 10 వేల మంది గల్లంతు
- ఆవును చంపిన పులి... ఆ ఆవు యజమాని ఎలా పగ తీర్చుకున్నాడంటే
- పార్లమెంట్లో లైంగిక వేధింపులు: ‘అతను నా మెడకు దగ్గరగా ఊపిరి పీల్చుతూ, అసభ్యకరంగా మాట్లాడేవారు’
- యాంటీ బయాటిక్స్ వేసుకోవడం ప్రమాదకరమా,పేగు మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)














