సునీల్ గావస్కర్ షర్ట్‌పై ధోనీ ఆటోగ్రాఫ్.. ఇది చరిత్రలో నిలిచే క్షణం అవుతుందా?

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
- రచయిత, వాత్సల్య రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పై చిత్రం చూశారా?
ఒక లెజెండ్ క్రికెటర్ మరొక స్టార్ క్రికెటర్ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోనీని సునీల్ గావస్కర్ అటోగ్రాఫ్ అడిగాడు. హృదయానికి దగ్గరగా.. చొక్కాపై సంతకం చేశాడు ధోనీ.
ఇది కేవలం 'ఫ్యాన్ మూమెంట్' మాత్రమే కాదు. ఇదొక కథ. బహుశా ఈ ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రాయగలిగే కథ.
సునీల్ గావస్కర్ తన బ్యాట్‌తో, మహేంద్ర సింగ్ ధోని తన గ్లోవ్స్, కెప్టెన్సీతో ఇప్పటికే లెక్కలేనన్ని విజయగాథలు లిఖించారు. వాటిలో ఎక్కువ చిరకాలం నిలిచిపోయే కథలే.
ఆదివారం రాత్రి ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చి రెండు క్షణాల్లో లిఖించిన ఈ కథ కూడా చాలాకాలం గుర్తుండిపోతుంది.
దీన్ని జ్ఞాపకం చేసుకోవడం క్రికెట్‌కూ, ఐపీఎల్‌కూ మేలు చేస్తుంది.
స్టార్ ప్లేయర్‌ల మధ్య ఇగో క్లాష్, నువ్వా-నేనా అనుకోవడం, స్లెడ్జింగ్, గొడవలు, చెప్పులు చూపించడం లాంటి వాటితో ఎంతో అపఖ్యాతిని మూటగట్టుకున్న ఐపీఎల్‌కు కాస్తయినా ఉపశమనం కలిగించడానికి ఇంతకంటే మంచి దృశ్యం ఉండదు.
కానీ, ఐపీఎల్‌ను ఉద్ధరించడానికో, టీ20కి కళ తేవడానికో గావస్కర్, ధోనీని ఆటోగ్రాఫ్ అడిగినట్టు కనిపించలేదు.
గావస్కర్ ఆటోగ్రాఫ్ అడుగుతారని ధోనీ ఊహించి ఉండడు. సడన్‌గా అడిగేసరికి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు కూడా.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
గావస్కర్ ధోనిని ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు..
ఆదివారం రాత్రి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
మ్యాచ్ ముగిసిన తరువాత సీఎస్‌కే కెప్టెన్ ధోనీ సహా జట్టు మొత్తం మైదానం చుట్టూ తిరుగుతూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.
సీఎస్‌కేకు మద్దతుగా పసుపు రంగు జెర్సీలు వేసుకుని వచ్చిన ఫ్యాన్స్ కోలాహలంతో మైదానం హోరెత్తిపోయింది.
ధోనీ, అభిమానుల వైపుకు టీ షర్టులు, టెన్నిస్ బంతులు విసిరాడు. వాటిని అందుకునేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంగా పోటీపడ్డారు.
కామెంటేటర్స్‌లో ఒకరైన సునీల్ గావస్కర్ మైదానంలోకి వచ్చి పరిగెత్తుకుంటూ ధోనీ వద్దకు వెళ్లాడు.
గావస్కర్‌ను చూడగానే ధోనీ ఒక్క క్షణం ఆగి, నవ్వుతూ వాటేసుకున్నాడు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. గావస్కర్ పెన్ను ఇచ్చి తన షర్ట్ వైపు చూపించాడు. నవ్వుతూ ధోనీ 'మహి' అని సంతకం చేశాడు. ఇది ధోనీ అభిమానులకు సుపరిచితమైన సంతకమే.
మళ్లీ ఇద్దరూ కౌగలించుకున్నారు. గావస్కర్ వెళ్లిపోయాడు. ధోనీ ఫ్యాన్స్ వైపు తిరిగి టీ షర్టులు విసురుతూ ముందుకు కదిలాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సోషల్ మీడియా అంతా వాళ్లిద్దరే...
క్షణాల్లో ఈ వార్త సోషల్ మీడియాలో వ్యాపించింది. గావస్కర్ పరిగెత్తుకొచ్చిన వీడియో, ధోనీ సంతకం చేస్తున్న ఫొటో వైరల్ అయిపోయింది.
స్టార్స్ ఇద్దరూ వెలిగిపోయారు. వాళ్ల పేర్లు ట్రెండింగ్‌లోకొచ్చాయి.
సీఎస్‌కే అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో గావస్కర్ చొక్కాపై ధోని ఆటోగ్రాఫ్ చేస్తున్న చిత్రాన్ని పోస్ట్ చేస్తూ "ఇది నేరుగా మా హృదయాలను తాకింది" అని రాశారు.
ఇది క్రికెట్‌లో "మరపురాని క్షణమని", ఐపీఎల్‌లో "బెస్ట్ మూమెంట్" అని లెజెండ్ గావస్కర్, ధోనీ ఆటోగ్రాఫ్ కోసం పరిగెత్తుకుంటూ రావడం "అద్భుతమైన దృశ్యమని", "ధోనీ లాంటి ఆటగాళ్లు శతాబ్దానికి ఒక్కరు ఉంటారని" ట్విట్టర్‌లో పోస్టులు వెల్లువెత్తాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
వివాదాల నీడలో అపురూపమైన దృశ్యం
ఐపీఎల్ 16వ సీజన్‌లో కూడా వివాదాలు కమ్ముకున్నాయి. విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మైదానంలో మాటా మాటా అనుకోవడం కెమెరాలో చిక్కింది. ఇద్దరికీ జరిమానా విధించారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై వాడి వేడి చర్చలు జరిగాయి.
రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ), దిలీ క్యాపిటల్స్ (డీసీ)పై గెలిచిన తరువాత డీసీ మెంటర్ సౌరవ్ గంగూలీ కోహ్లీతో కరచాలనం చేయకుండా తప్పించుకోవడం, ఆ తరువాత కోహ్లీ ఇన్‌స్టాగ్రాంలో గంగూలీని అన్‌ఫాలో చేయడం వివాదాంశమైంది.
అయితే, తరువాత జరిగిన మ్యాచ్‌లో ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, కౌగలించుకున్నారు. కానీ, వివాదాల నీడ పూర్తిగా తొలగిపోలేదు.
ఈ నేపథ్యంలో, ఆదివారం రాత్రి గావస్కర్, ధోనీల తీరు క్రికెట్ అభిమానులను మురిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్‌ను జెంటిల్‌మన్ గేమ్ అంటారు. ఆ పేరుకు బ్రాండ్ అంబాసిడర్లలా కనిపిస్తారు గావస్కర్, ధోనీ.
1970, 1980లలో గావస్కర్ క్రికెట్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపాడు. టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగుల మైలురాయిని దాటిన మొదటి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
ఔటయితే అంపైర్ వేలు పైకెత్తే వరకూ చూడకుండా పెవిలియన్ వైపు నడచివెళ్లిపోతాడని, గావస్కర్‌కు పేరుంది.
ఇక ధోనీ సంగతి ఈ కాలం వారికి తెలిసిందే. హెలికాప్టర్ షాట్లు ధోనీ సృష్టి. కెప్టెన్‌గా మైదానంలో ఎంతో సంయమనం పాటిస్తాడని, 'మిస్టర్ కూల్'గాపేరు తెచ్చుకున్నాడు.
భారత్ 2007లో ధోనీ సామర్థ్యంలో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ సాధించింది.
1987లో గావస్కర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడినప్పుడు ధోనీ వయసు ఆరేళ్లు. గావస్కర్ ఆట ధోనీ చూసి ఉండడు. కానీ, గావస్కర్ ధోని కెరీర్ మొత్తాన్ని దగ్గరగా చూశాడు. ధోనీ నైపుణ్యానికి వీరాభిమానిని అని చాలాసార్లు చెప్పుకున్నాడు.
"నాకు జీవితంలో కొన్ని క్షణాలే మిగిలి ఉంటే 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో ధోనీ కొట్టిన సిక్స్ చూసి ఈ ప్రపంచానికి గుడ్ బై చెబుతాను" అని గావస్కర్ ఇండియా టుడే వార్తాపత్రికతో చెప్పినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇప్పుడు గావస్కర్, ధోనీ సంతకం కోసం మైదానంలోకి పరుగుతీయడం క్రికెట్ చరిత్రలో అపురూపమైన క్షణాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. అభిమానులు ఆ జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకుంటారు.
ఇవి కూడా చదవండి:
- క్రైస్తవంలోకి మారితే గిరిజనులకు రిజర్వేషన్లు ఉండవా? చత్తీస్‌గఢ్‌లో వివాదం ఏంటి?
- గంగమ్మకు మళ్లీ సొంతమైన జీడితోట...బీబీసీ కథనంతో స్పందించిన పోలీసులు అధికారులు
- థైరాయిడ్ ఉంటే గర్భం దాల్చడం కష్టమవుతుందా? పిల్లలను కనొచ్చా?
- మనుషులు చేరుకోలేని ఉత్తర ధ్రువాన్ని ఎలా కనిపెట్టారు? చావు అంచుల వరకు వెళ్లి ఎలా బయటపడ్డారు?
- ‘నానమ్మ చనిపోయి రోజులు గడుస్తున్నా మృతదేహాన్ని తెప్పించలేకపోతున్నా’ - ఓ మనవరాలి వేదన
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














