థైరాయిడ్ ఉంటే గర్భం దాల్చడం కష్టమవుతుందా? పిల్లలను కనొచ్చా?

థైరాయిడ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ శిల్పా చిట్నీస్ జోషి,
    • హోదా, బీబీసీ కోసం

కొన్నేళ్ల కిందట, ఒక రోజు 23-24ఏళ్లు ఉండే అమ్మాయిని తీసుకొని వాళ్ల అమ్మ నా దగ్గరకు వచ్చింది.

ఆ అమ్మాయి ఇంజినీర్‌గా పని చేస్తోంది. మంచి జీతం.

సమస్య ఏంటని అడగ్గానే వాళ్ల అమ్మకు ఏడుపొచ్చింది.

‘‘మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాం. చాలా మంచి సంబంధం. కొంతకాలంగా తనకు పీరియడ్స్ సరిగ్గా రావడం లేదు. టెస్టులు చేయిస్తే థైరాయిడ్ ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు మేం ఏం చేయాలి? ఈ విషయాన్ని ఎలా చెప్పాలి? నా బిడ్డ జీవితం ఏమవుతుంది?’’ అంటూ ఆ తల్లి ఏడుస్తూనే చెప్పింది.

ఆ తల్లిని చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది.

‘‘థైరాయిడ్ అనేది పెద్ద జబ్బేమీ కాదు. హార్మోనుల సమస్య మాత్రమే. నేను ఇచ్చే మందులు క్రమం తప్పకుండా వేసుకుంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. గర్భం దాల్చొచ్చు. కాన్పులో కూడా సమస్య ఉండదు’’ అని నేను ఆ తల్లికి వివరించాను.

ఆ తరువాత ఆ అమ్మాయికి కాబోయే భర్తకు ఫోను చేసి విషయం చెప్పాను. అతను చాలా బాగా అర్థం చేసుకున్నాడు.

అది జరిగి మూడేళ్లు గడచి పోయాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక పాప. ఆ కుటుంబం చాలా సంతోషంగా జీవిస్తోంది.

ఇప్పుడు ఈ కథ ఎందుకు చెబుతున్నానంటే చాలా మంది థైరాయిడ్ పెద్ద భూతంలా చూస్తుంటారు. లేనిపోని భయానికి గురవుతుంటారు.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

నిర్లక్ష్యం కూడా తగదు

మరి కొందరు ఉంటారు. థైరాయిడ్ సమస్యను చాలా లైట్‌గా తీసుకుంటారు.

5ఏళ్ల కిందట 28ఏళ్ల అమ్మాయి నా దగ్గరకు వచ్చింది.

పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడం లేదని చెప్పింది. టెస్ట్ చేస్తే థైరాయిడ్ ఉన్నట్లు తేలింది.

ఆ అమ్మాయికి మందులు రాసి, 2-3నెలల తరువాత మళ్లీ టెస్టు చేయించుకోమని చెప్పాను. కానీ ఆ తరువాత మళ్లీ అమ్మాయి నాకు కనిపించలేదు.

ఇటీవలే మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమెను చూసినప్పుడు నేను షాకయ్యాను. సుమారు 15 కేజీలు బరువు పెరిగింది. పీరియడ్స్ సమస్య మరింత తీవ్రమైంది. ఏడాది కిందట అబార్షన్ అయింది. గర్భం దాల్చడంలో సమస్యల వల్ల తను ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది.

పెళ్లి అయిన తరువాత థైరాయిడ్ మందులు వాడటాన్ని ఆపేసింది. థైరాయిడ్ మందులు రోజూ తీసుకుంటే ఇక జీవితాంతం వాడాల్సి ఉంటుందని వాళ్ల బంధువు ఎవరో చెప్పారంట.

ఇలా డాక్టర్ల సలహా లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదా బంధువుల సలహాలు పాటించడం కూడా మంచిది కాదు.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

10 మందిలో ఒకరికి

భారత్‌లో ప్రతి 10 మందిలో ఒకరికి థైరాయిడ్ సమస్య ఉంది. 2021 గణాంకాల ప్రకారం 4.2 కోట్ల మంది థైరాయిడ్ పేషెంట్లు భారత్‌లో ఉన్నారు.

44.3శాతం మహిళల్లో డెలివరీ తరువాత తొలి మూడు నెలల్లో థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంది.

నేడు చాలా మంది అమ్మాయిల్లో 30ఏళ్లకే థైరాయిడ్ సమస్య తలెత్తుతోంది. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం థైరాయిడ్ సమస్య ప్రధాన లక్షణాల్లో ఒకటి.

పీరియడ్స్ సరిగ్గా రాకపోతే గర్భం దాల్చగలమా? అనే సందేహం చాలా మంది అమ్మాయిలకు వస్తుంది. కానీ డాక్టర్లను సంప్రదించి మందులు వాడటం వల్ల ఆ సమస్యను అధిగమించొచ్చు. గర్భం దాల్చొచ్చు.

థైరాయిడ్ గ్రంథి

ఫొటో సోర్స్, Getty Images

థైరాయిడ్ అంటే?

మెడ దగ్గర సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథినే థైరాయిడ్ అంటారు. మెదడు, గుండె, కండరాలు వంటివి సరిగ్గా పని చేయడానికి థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చే హార్మోన్లు చాలా ముఖ్యం.

శరీరంలోని ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగం వంటి వాటిని నియంత్రించడానికి దీని నుంచి వచ్చే టీ3, టీ4 అనే హార్మోన్లు ఉపయోగపడతాయి.

ఒంట్లోని జీవక్రియలకు అవసరమైన హార్మోన్లను థైరాయిడ్ గ్రంథి విడుదల చేయకపోతే కలిగే సమస్యను హైపోథైరాయిడిజమ్ అంటారు. అవసరానికి మించి హార్మోన్లు విడుదల అయితే దాన్ని హైపర్‌థైరాయిడిజమ్ అని పిలుస్తారు.

కెఫిన్‌ను మరీ ఎక్కువగా తీసుకునే వారిలోనూ హైపోథైరాయిడ్ లక్షణాలు కనిపిస్తాయి.

థైరాయిడ్ సమస్య అనేది లోపమే కానీ జబ్బు కాదు.

గర్భవతి

ఫొటో సోర్స్, Getty Images

గర్భవతిగా ఉన్నప్పుడు ఏం చేయాలి?

థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు గర్భవతి అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి.

గర్భం దాల్చిన తరువాత అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు రావొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదిస్తూ ఉండాలి.

థైరాయిడ్ విడుదల చేసే హార్మోన్ల లోపం ఉంటే తల్లి కడుపులోని బిడ్డ మెదడు మీద ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు బిడ్డ ఎదుగుదల కోసం థైరాయిడ్ మాత్రలు కొంతకాలం వేసుకోవాలి. కావాలంటే డెలివరీ తరువాత ఆపివేయొచ్చు.

పుట్టినప్పుడు పిల్లలకు కూడా థైరాయిడ్ టెస్టు చేయించాలి. ఎందుకంటే ఒకోసారి పుట్టుకతోనే సమస్య వస్తుంది. ముందుగా గుర్తించకపోతే ఆ తరువాత పిల్లల మానసిక, శారీరక పెరుగుదల మీద ఇది చాలా ప్రభావం చూపుతుంది.

గర్భవతి

ఫొటో సోర్స్, Getty Images

ఇతర జాగ్రత్తలు:

  • తల్లికి థైరాయిడ్ సమస్య ఉంటే ఉంటే కూతుర్లకు కూడా ఆ టెస్టులు చేయించాలి.
  • థైరాయిడ్ సమస్య వల్ల బరువు పెరుగుతారు. జుట్టు ఊడిపోతుంది. చర్మం పొడిబారుతుంది. థైరాయిడ్ మందులు క్రమతప్పకుండా వాడటం, ఎక్సర్‌సైజులు చేయడం వల్ల బరువును కంట్రోల్ ఉంచొచ్చు.
  • థైరాయిడ్ సమస్యను ముందుగానే గుర్తించగలిగే చర్మ, శిరోజాల సమస్యలు ఉండవు.
  • ఐయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ సమస్య వస్తుంది. కాబట్టి ఐయోడిన్ ఉన్న ఉప్పు తీసుకోవడం చాలా ముఖ్యం.
  • వ్యాయామం చేయడం వల్ల థైరాయిడ్ సమస్య పూర్తిగా తగ్గుతుందని భావించడంలో నిజం లేదు. బరువు తగ్గడం వల్ల థైరాయిడ్ మందుల డోసును తగ్గించొచ్చు. అంతే కానీ సమస్య తగ్గదు. వ్యాయామం అవసరమే కానీ మెడకు సంబంధించి పిచ్చిపిచ్చి ఎక్సర్‌సైజులు చేయకూడదు. అవి మెడనొప్పికి దారి తీయొచ్చు.
  • జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా థైరాయిడ్ సమస్యను తగ్గించొచ్చు.
  • డాక్టర్ల సలహా లేకుండా థైరాయిడ్ మాత్రలు తీసుకోవడాన్ని ఆపకూడదు.
  • చాలా మంది టెస్టులు చేయించుకోకుండా ఒకే డోసును దీర్ఘకాలం వాడుతుంటారు. అది కూడా తప్పే. ప్రతి ఆరు వారాలకు ఒకసారి థైరాయిడ్ టెస్టు చేయించుకోవాలి. దాన్ని బట్టి డోసులను డాక్టర్లు తగ్గించడమో పెంచడమో చేస్తుంటారు.
  • ఉదయాన్నే పరగడుపున థైరాయిడ్ పిల్ తీసుకోవాలి. దాదాపు అరగంట వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు.

(నోట్: రచయిత డాక్టర్. ఈ వ్యాసం అవగాహన కోసం మాత్రమే. ఎటువంటి నిర్ణయాలైనా డాక్టర్లను సంప్రదించి తీసుకోగలరు.)

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)