బజరంగ్ దళ్‌ను పీవీ నరసింహారావు ప్రభుత్వం ఎందుకు నిషేధించింది? దీని చరిత్ర ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వి.రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం వివాదంగా మారింది.
హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రేమికుల రోజున పార్కుల వద్ద, రోడ్లపై బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రత్యక్షం కావడమనేది తెలిసిన విషయమే. ఇంతకూ బజరంగ్ దళ్ అంటే ఏమిటి? ఇది ఎలా ఏర్పడింది? ఎలా ఎదిగింది? వివిధ ఉద్యమాలు, హింసాత్మక దాడుల్లో దీని పాత్ర ఏమిటి? ఇలాంటి వివరాాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
బజరంగ్ దళ్ అంటే ‘‘హనుమంతుని సైన్యం’’ అని అర్థం. ఆంజనేయునికి ఉన్న మరొక పేరు బజరంగ్.
ఇదొక హిందుత్వ సంస్థ. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్‌ఎస్) అనుబంధ సంస్థల్లో విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఒకటి. వీహెచ్‌పీ యువజన విభాగం పేరే బజరంగ్ దళ్.

ఫొటో సోర్స్, ANI
ఎలా మొదలైంది?
1984 అక్టోబరు 8న ఉత్తర్ ప్రదేశ్‌లో బజరంగ్ దళ్ పుట్టింది.
1964లో ఏర్పడిన విశ్వ హిందూ పరిషత్, అయోధ్యలో రాముని గుడి నిర్మాణం కోసం పోరాటం ప్రారంభించింది. 1984లో ‘‘రామ్-జానకి రథయాత్ర’’ అనే కార్యక్రమాన్ని ఉత్తర్ ప్రదేశ్‌లో చేపట్టింది.
‘‘రథయాత్ర చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కొన్నిహిందూ వ్యతిరేక శక్తులు హెచ్చరించాయి. రథయాత్రకు రక్షణ కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా నిరాకరించింది. దాంతో రథయాత్ర రక్షణకు రావాల్సిందిగా యువతకు సాధువులు పిలుపునిచ్చారు. వారి పిలుపుతో వందల మంది యువకులు అయోధ్యకు చేరుకున్నారు. రథయాత్రకు రక్షణగా నిలిచారు’’ అని తన వెబ్‌సైట్‌లో వీహెచ్‌పీ రాసుకుంది.
అలా రథయాత్రకు రక్షణ పేరుతో అయోధ్యకు వచ్చిన వారితో బజరంగ్ దళ్ ఏర్పడింది. యూపీలోని హిందూ యువతలో చైతన్యం తీసుకురావడం ఆ సంస్థ తొలి లక్ష్యం.
1985లో “ప్రాణాలు త్యాగం చేయడానికి” సిద్ధంగా ఉండే ‘‘రామ్ భక్త బలిదాని’’ అనే దళాన్ని బజరంగ్ దళ్ ఏర్పాటు చేసింది.
1986లో బజరంగ్ దళ్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరించారు.
బజరంగ్ దళ్ లక్ష్యాలు ఏంటి?
హిందువులను చైతన్య పరచడం
హిందువుల రక్షణ
దేవాలయాల పునరుద్ధరణ
ఆవులను కాపాడటం
కట్నం, అంటరానితనం నిర్మూలనకు పోరాడటం
హిందూ సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలకు అగౌరవం కలగకుండా చూడటం
అందాల పోటీలను వ్యతిరేకించడం
‘అశ్లీలత’ను అడ్డుకోవడం
అక్రమంగా దేశంలోకి చొరబడేవాళ్లను వ్యతిరేకించడం
ఇవే కాకుండా అఖండ భారత్ సంకల్ప్ దివస్, హనుమాన్ స్మృతి దివస్, శౌర్య దివస్, బాలోపాసన దివస్ వంటి కార్యక్రమాలను కూడా బజరంగ్ దళ్ నిర్వహిస్తుంది.
హిందూమత రక్షణ కోసం పని చేస్తామని చెబుతున్న బజరంగ్ దళ్, ఇతర మతాలకు వ్యతిరేకం కాదని అంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
రామ జన్మభూమి ఉద్యమం
అయోధ్యలో రాముని గుడి కోసం జరిగిన ఉద్యమాల్లో బజరంగ్ దళ్ చాలా యాక్టివ్‌గా పని చేసింది.
కేంద్రంలోని నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం, 1989 నవంబరు 9న అయోధ్యలో రాముని గుడి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసేందుకు వీహెచ్‌పీకి అనుమతి ఇచ్చింది. ఆ కార్యక్రమం విజయవంతం కావడంలో బజరంగ్ దళ్ కీలక పాత్ర పోషించిందని వీహెచ్‌పీ చెబుతోంది.
బజరంగ్ దళ్‌కు గుర్తింపు తెచ్చిన మరో ఘటన అయోధ్య రథయాత్ర. ఈ సంస్థకు చెందిన కార్యకర్తలు రథయాత్రకు రక్షణగా పని చేశారు.
1990 సెప్టెంబరు 25న గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి యూపీలోని అయోధ్య వరకు బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అడ్వాణీ రథయాత్ర ప్రారంభించారు.
1990 అక్టోబరు 23న బిహార్‌లోని లాలు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం, రథయాత్రను అయోధ్య వెళ్లకుండా అడ్డుకుంది. ఎల్‌కే అడ్వాణీని అరెస్టు చేసింది. ఫలితంగా చాలా మంది హిందూ కరసేవకులు(స్వచ్ఛంద కార్యకర్తలు) అయోధ్యకు బయలుదేరారు.
1990 అక్టోబరు 30న బాబ్రీ మసీదును చుట్టుముట్టేందుకు బజరంగ్ దళ్ కార్యకర్తలు, ఇతర కరసేవకులు ప్రయత్నించారు. అప్పుడు జరిగిన ఘర్షణల్లో పోలీసులు కాల్పులు జరపడంతో సుమారు 20 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.
1990 నవంబరు 2న మరోసారి పోలీసులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 17 మంది కరసేవకులు చనిపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అయోధ్య రథయాత్రతో బజరంగ్ దళ్‌కు ప్రాచుర్యం పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
బాబ్రీ మసీదు కూల్చివేత
బజరంగ్ దళ్ కార్యకర్తలు కీలకంగా వ్యవహరించిన మరొక ఘటన బాబ్రీ మసీదు కూల్చివేత.
1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదు వద్ద బీజేపీ నాయకులు అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలతో పాటు వీహెచ్‌పీ నేతల ప్రసంగాలు వినేందుకు లక్ష మందికి పైగా కరసేవకులు, హిందుత్వ సంస్థల కార్యకర్తలు హాజరయ్యారు.
నేతల ప్రసంగం తరువాత వారంత బాబ్రీ మసీదు మీద దాడి చేసి దాన్ని కూల్చివేశారు.
కరసేవకులను సమీకరించడంలో బజరంగ్ దళ్ కీలక పాత్ర పోషించిందనే ఆరోపణలున్నాయి. దాంతో నాడు కేంద్రంలోని పీవీ నరసింహరావు ప్రభుత్వం బజరంగ్ దళ్‌ను నిషేధించింది. సుమారు ఏడాది తరువాత నిషేధం ఎత్తివేశారు.
గుజరాత్, ఒడిశాల్లో క్రైస్తవులపై దాడులు
బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత బజరంగ్ దళ్ దృష్టి ‘మతమార్పిడిల’ వైపు మళ్లింది. హిందువులను ‘బలవంతం’గా క్రైస్తవంలోకి మారుస్తున్నారంటూ మిషనరీలతో ఘర్షణలు మొదలయ్యాయి.
1997-1999 మధ్య గుజరాత్‌లో క్రైస్తవుల మీద వరుస దాడులు జరిగాయి. పాఠశాలలు, చర్చిలు, దుకాణాలను ధ్వంసం చేశారు. బైబిల్ గ్రంథాలను కాల్చివేశారు.
ఆ హింసకు కారణం బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగ్ దళ్, హిందూ జాగరణ్ మంచ్ అని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది.
ఒడిశా: క్రైస్తవ ప్రచారకుని హత్య
1999 జనవరిలో ఒడిశాలోని మనోహర్‌పుర్ ఆస్ట్రేలియా క్రైస్తవ మిషనరీకి చెందిన గ్రాహం స్టెయిన్స్‌ను సజీవంగా కాల్చివేశారు. ఆయన ఇద్దరు పిల్లలు కూడా ఆ ఘటనలో చనిపోయారు. ఆ కేసులో కీలక నిందితునిగా ఉన్న దారా సింగ్‌కు బజరంగ్ దళ్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
2008 ఆగస్టు 23న ఒడిశాలో వీహెచ్‌పీ నేత లక్ష్మానంద సరస్వతి, ఆయన అనుచరులు హత్యకు గురయ్యారు. క్రైస్తవులుగా మారిన దళితులు, ఆదివాసీలను తిరిగి హిందూమతంలోకి మార్చడం మీద ఆయన పని చేస్తూ ఉండేవారు.
నాడు ఆయన హత్య తర్వాత 600కి పైగా గ్రామాల మీద దాడులు జరిగాయి. సుమారు 39 మంది క్రైస్తవులు చనిపోయారు. 232 చర్చిలు నాశనమయ్యాయి.
ఇందులోనూ బజరంగ్ దళ్ మీద ఆరోపణలున్నాయి.
2002 గుజరాత్ అల్లర్ల హింసలోనూ బజరంగ్ దళ్ కార్యకర్తల ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రధానంగా 97 మంది ముస్లింలు హత్యకు గురైన ‘‘నరోదా పాటియా నరమేధం’’ కేసులో నాటి గుజరాత్ బజరంగ్ దళ్ నేత బాబుభాయి పటేల్ బజరంగీ దోషిగా తేలారు. ఆయనకు కోర్టు జీవితకాల కారాగారశిక్ష విధించింది.
2007లో ఒక ప్రైవేటు చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో హింసకు పాల్పడిన తీరును బజరంగీ వివరిస్తూ కనిపించారు.
ఇటీవల అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు బజరంగీ సహా ఆ కేసులో నిందితులుగా ఉన్న 69 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
బజరంగ్ దళ్ కార్యకర్తల మీద బాంబుల తయారీ ఆరోపణలు కూడా వచ్చాయి.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో 2006లో బాంబు పేలి ఇద్దరు బజరంగ్ దళ్ కార్యకర్తలు చనిపోయారు. ఆ బాంబును వారు తయారు చేస్తుండగా అది పేలిందనేది ఆరోపణ.
యూపీలోని కాన్పూర్‌లో 2008లో బాంబు తయారు చేస్తూ ప్రమాదవశాత్తు పేలడంతో ఇద్దరు బజరంగ్ దళ్ కార్యకర్తలు చనిపోయినట్లు కేసు నమోదైంది.
కర్ణాటకలో ఎదుగుదల
దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో 2008 మేలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు.
అదే సంవత్సరం సెప్టెంబరు, అక్టోబరు మధ్య దక్షిణ కర్ణాటకలోని ఉడుపి, చిక్‌మగుళూరు లాంటి జిల్లాల్లో చర్చిల మీద బజరంగ్ దళ్ దాడులు చేసింది. హిందువులను అక్రమంగా క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారంటూ అది ఆరోపించింది.
ఆ తరువాత కాలంలోనూ క్రైస్తవులు, ముస్లింల మీద ఆ సంస్థ కార్యకర్తలు దాడులు చేస్తున్న ఘటనలు వరుసగా రిపోర్ట్ అవుతూ వచ్చాయి.
ఆవులను తరలిస్తున్నారనే ఆరోపణలతో ముస్లింల మీద దాడులు చేయడం, హలాల్ మీట్ అమ్మకుండా అడ్డుకోవడం వంటి కేసుల్లోనూ బజరంగ్ దళ్ కార్యకర్తల మీద ఆరోపణలు ఉన్నాయి.
మోరల్ పోలీసింగ్
ప్రేమికుల రోజు అనేది భారతదేశ సంస్కృతికి విరుద్ధమంటూ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది బజరంగ్ దళ్.
ఏటా ఫిబ్రవరి 14న హైదరాబాద్ లాంటి నగరాల్లో పార్కులకు వెళ్లి అమ్మాయిల చేత అబ్బాయిలకు రాఖీలు కట్టించడం లాంటివి చేస్తుంది. కొందరు జంటలకు బలవంతంగా ‘పెళ్లి’ చేయడం, వారి మీద దాడులు చేయడం లాంటి ఆరోపణలు కూడా బజరంగ్ దళ్ కార్యకర్తల మీద ఉన్నాయి.
కర్ణాటకలోని మంగళూరులో 2009 జనవరి 24న ఒక పబ్‌లో యువత మీద బజరంగ్ దళ్, శ్రీరామ్ సేన కార్యకర్తలు దాడులు చేశారు. పాశ్చాత్య సంస్కృతి నుంచి హిందూమతాన్ని రక్షించేందుకు ఇలా చేసినట్లు ఆ సంస్థలు ప్రకటించాయి.
2023 మార్చిలో కర్ణాటకలోని శివమొగ్గలో మహిళల ‘‘నైట్ అవుట్ పార్టీ’’ని బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది హిందూ సంస్కృతికి విరుద్ధమంటూ నిరసనలకు దిగారు.
నిషేధానికి డిమాండ్లు
2002 మార్చి 16న అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం వివాదాస్పద భూమిని అప్పగించాలనే డిమాండ్‌తో బజరంగ్ దళ్, వీహెచ్‌పీ, దుర్గావాహిని కార్యకర్తలు ఒడిశా అసెంబ్లీ వద్ద నిరసనలకు దిగారు.
కొద్దిసేపటి తరువాత సుమారు 500 మంది అసెంబ్లీలోకి చొచ్చుకుని పోయారు. లోపల విధ్వంసం సృష్టించారని ఫ్రంట్‌లైన్ మ్యాగజైన్ రిపోర్ట్ చేసింది. అప్పుడు బజరంగ్ దళ్, వీహెచ్‌పీలను నిషేధించాలంటూ టీఎంసీ, జేడీయూ డిమాండ్ చేశాయి.
2006లో మహారాష్ట్రలో జరిగిన మాలేగావ్ పేలుళ్లలో సుమారు 40 మంది చనిపోయారు. ఈ కేసులో బజరంగ్ దళ్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి.
ఒడిశా, కర్ణాటకలో క్రైస్తవుల మీద జరిగిన దాడులకు సంబంధించి బజరంగ్ దళ్‌ను నిషేధించాలంటూ 2008లో పార్లమెంటులో కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేశాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని తాజాగా కాంగ్రెస్ ప్రకటించడంతో ఈ సంస్థపై మరోసారి పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ దివాలా తీయడానికి కారణాలేంటి... ఇతర విమానయాన సంస్థలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది?
- ఆంధ్రప్రదేశ్: చిత్తూరు చింతపండు ఎందుకు తగ్గిపోతోంది... చింత చెట్లు ఏమైపోతున్నాయి?
- సూర్య, చంద్ర గ్రహణాలు కాకుండా వేరే గ్రహణాలు కూడా ఉంటాయా, ఎలా ఏర్పడతాయి?
- ప్రపంచ బ్యాంకును పర్సనల్ లోన్ అడగొచ్చా, ఆ బ్యాంకు ఎలా పని చేస్తుంది?
- ఏపీ-తెలంగాణ వర్షాలు: ఈసారి ఎండాకాలం లేదా అని ఎందుకు చర్చ జరుగుతోంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














