ఆంధ్రప్రదేశ్: చిత్తూరు చింతపండు ఎందుకు తగ్గిపోతోంది... చింత చెట్లు ఏమైపోతున్నాయి?

చింతపండు

ఫొటో సోర్స్, bbc/tulasi prasad reddy

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

దక్షిణాది ప్రజల ఆహారంలో చింతపండు ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చడిలో చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది.

కూరలు, సాస్‌లు, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలోనూ చింతపండు విస్తృతంగా వాడతారు. చింతపండు పీచును కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి కూడా వాడతారు.

చింతపండు ప్రత్యేక సీజన్‌లో మాత్రమే లభిస్తుంది. చింతకాయలతో, మిరపపళ్ళను కలిపి నిలవ పచ్చడిని కూడా తయారుచేస్తారు.

చింతపండు

ఫొటో సోర్స్, bbc/tulasi prasad reddy

చిత్తూరు చింతపండు ప్రత్యేకత ఏంటి.?

మన దేశంలో చిత్తూరు చింతపండుకు మంచి డిమాండ్ ఉంది. ఈ కాయ పొట్టు తీస్తే కొంచెం నలుపు రంగు వస్తుంది. దీనిలో పులుపు కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. దీని గురించి తెలిసినవారు ఎక్కువగా దీన్నే ఇష్టపడతారు.

వంటకాల్లో పులుపు కోసం వాడే ఈ చింతపండు ధర పెరిగిపోవడంతో ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా టమాటాను వాడుతున్నారు.

చింతపండు

ఫొటో సోర్స్, bbc/tulasi prasad reddy

ఎలా ఉంటుంది. .ఎక్కడ పెరుగుతుంది?

చింత పండునే 'భారతదేశ ఖర్జూరం' అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం టామరిండస్ ఇండికా.

చింత చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు చాలా మంది అలానే తింటుంటారు. ప్రపంచ వ్యాప్తంగా వంటకాల్లో విరివిగా వీటిని ఉపయోగిస్తుంటారు.

సంప్రదాయ ఔషధాలు, మెటల్ పాలిష్ మొదలైన వాటిలోనూ దీన్ని ఉపయోగిస్తారు. చింత చెక్కలను వడ్రంగి, వంట చెరకు, ఇటుక బట్టీలకు ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు.

చింతచెట్టు ఇంచుమించు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. వేసవి కాలంలో ఇది మంచి నీడ నిస్తుంది. చింతపండు గుజ్జు మధ్యలో గట్టి చింతపిక్కలు ఉంటాయి.

చింతపండు

ఫొటో సోర్స్, bbc/tulasi prasad reddy

ఎందుకు నరికేస్తున్నారు.?

ఒకప్పుడు రోడ్డుకు ఇరువైపులా విస్తారంగా కనిపించే చింత చెట్లను ఇప్పుడు రోడ్డు విస్తరణల వల్ల తొలగిస్తున్నారు. తిరుపతి నుంచి బెంగుళూరుకు వెళ్లే దారి పొడవునా ఈ చెట్లు నీడనిచ్చేవి. కానీ, వీటిని ప్రస్తుతం నరికేస్తున్నారు.

చింతచెట్లు ఉండడం వల్ల ఇతర పంటలు పండడంలేదని, కూలీలు కూడా కాయలు తీయడానికి అందుబాటులో లేరని, దాంతో పొలం గట్లుపైన ఉన్న చింతచెట్లను తొలగిస్తున్నామని చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన బాస్కర్ రెడ్డి అనే రైతు బీబీసీతో చెప్పారు.

‘‘మా పొలంలో అయితే చింత చెట్లు పది వరకు ఉండేవి. ఒక్కొక్క చెట్టుకు పది బస్తాల చింతకాయలు వచ్చేవి. ఇదివరకు మేమే సొంతంగా చింత చెట్టు ఎక్కి కాయలు తీసేవాళ్లం. ఇప్పుడు చింత చెట్టు ఎక్కి కాయలు తీయాలంటే కూలీలు దొరకటంలేదు. ఎవరైనా దొరికినా రూ.వెయ్యి అడుగుతున్నారు. ఈ చెట్లు పెట్టుకుంటే పొలంలో వేరే పంట పండదు. మాకు నష్టం వస్తుంది. అందుకే చెట్లు తీసేస్తున్నాం. ఈ చెట్లు ఉండే గడ్డి కూడా మొలవదు’’అని ఆయన అన్నారు.

అయితే, చిత్తూరులో క్రమంగా చింత పంట విస్తీర్ణం తగ్గుతోందని శాస్త్రవేత్త విమల బీబీసీతో చెప్పారు. విమల అనంతపురం హార్టీకల్చర్ రీసెర్చ్ స్టేషన్‌లో చింత చెట్లపై పరిశోధనలు చేస్తున్నారు.

‘‘ఇప్పుడు రోడ్ల విస్తరణతోపాటు వయసు పైబడటంతో కొన్ని చెట్లు చచ్చిపోతున్నాయి. పురుగుల దాడులు కూడా చెట్లు తగ్గిపోవడానికి మరో కారణం. అందుకే చింత చెట్ల సంఖ్య తగ్గిపోతోంది’’అని విమల అన్నారు.

చింతపండు

ఫొటో సోర్స్, bbc/tulasi prasad reddy

చింతపండుకు ప్రత్యామ్నాయంగా ఏం వాడుతున్నారు.?

చింతపండు కొరత

చింతపండు రేటు ఎక్కువ అవుతుండటంతో, దానికి బదులుగా టమాటాలు వాడుతున్నామని తిరుపతికి చెందిన పుష్పలత బీబీసీతో చెప్పారు.

‘‘అన్ని కూరల్లోనూ, పప్పులోనూ చింతపండు వాడే వాళ్ళం. రేటు పెరగడంతో ఇప్పుడు టమాటా వాడుతున్నాం. చింతపండు రేటు కిలో ధర రూ.200 నుంచి రూ.250 మధ్య పలుకుతోంది. అదే టమాటా తీసుకుంటే రూ.10కి అటూఇటుగా ఉంది’’ అని ఆమె అన్నారు.

వ్యవసాయంలో వచ్చిన మార్పులేంటి.?

వ్యవసాయంలో వచ్చిన మార్పులు, రోడ్లు విస్తరించడం వల్లా చింతచెట్లు తగ్గిపోతున్నాయని చిత్తూరు జిల్లా హార్టీకల్చర్ డీడీ మధుసుదన్ రెడ్డి కూడా బీబీసీతో చెప్పారు.

‘‘గతంతో పోలిస్తే, చింత విస్తీర్ణం దాదాపు 50 శాతం పడిపోయింది. దానివల్ల చింత దిగుబడి 30% మాత్రమే వస్తోంది. అవసరాలకు సరిపడా చింత ప్రస్తుతం రావడం లేదు. చింతను మళ్లీ సాగులోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఒక 20, 25 ఏళ్లకు ముందు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కొన్ని కొత్త రకాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలానే కొత్త రకాలను తీసుకొచ్చారు. కానీ, వీటి వల్ల పెద్ద ఫలితాలు కనిపించడం లేదు’’ అని మధుసుదన్ రెడ్డి చెప్పారు.

చింతపండు

ఫొటో సోర్స్, bbc/tulasi prasad reddy

మహిళలకు ఉపాధి దొరుకుతుందా?

చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతంలో ఏటా కోట్లలో చింతపండు వ్యాపారం జరుగుతుంది. దీనికి అక్కడ ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్‌లు ఉన్నాయి. చింత గింజల నుంచి వచ్చే సీడ్‌ను ఇక్కడే ప్రాసెస్ చేసి గుజరాత్‌కు ఎగుమతి చేస్తున్నారు.

పుంగనూరులో మహిళలు ఇళ్లలోనే కాయలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తున్నారు. దీనివల్లా చాలా మంది మహిళలకు ఉపాధి దొరుకుతోంది.

అయితే దిగుబడి తగ్గిపోవడంతో మహారాష్ట్ర నుంచి చింతకాయలను తెప్పిస్తున్నామని వ్యాపారులు అంటున్నారు. ఆ చింతపండు బయట ఎర్రగా ఉండడం, లోపల తెల్లగా ఉండడంతో దానికి మార్కెట్ కూడా బాగుంటుందని చింతపండు వ్యాపారి ఫరూక్ బీబీసీతో చెప్పారు.

‘‘మహారాష్ట్రలో దిగుబడి ఎక్కువగా ఉంది. అక్కడ హైబ్రిడ్ మొక్కలు కూడా నాటుతున్నారు. వ్యాపారులు మహారాష్ట్రపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. స్థానికంగా చూస్తే ప్రస్తుతం ఈ ఏడాది దిగుబడి 40 మాత్రమే ఉంది. వర్షం వల్ల 20% ధ్వంసమైంది. అంటే 20% పంట మాత్రమే అందుబాటులో ఉంది’’ అని ఫరూక్ చెప్పారు.

చింతపండు

ఫొటో సోర్స్, bbc/tulasi prasad reddy

ఇప్పుడు ఏమైంది?

గతంలో తరహాలో పొలాలు, రోడ్ల పక్కన చింత చెట్లను సాగుచేసిన పద్ధతి నేడు జిల్లాతోపాటు రాష్ట్రంలోనూ ఎక్కడా కనిపించడంలేదని మధుసుదన్ రెడ్డి అన్నారు.

‘‘చిత్తూరు జిల్లాలో గతంలో ప్రతి పల్లెలోనూ పొలం, బావి దగ్గర చింత చెట్లు ఉండేవి. వీటి నుంచి రైతులకు అవసరమైన చింతపండు వచ్చేది. దీనిలో కొంత మార్కెట్‌కు కూడా వచ్చేది. బ్రిటిష్ కాలంలో ఇలా చాలా మొక్కలను నాటారు. వీటిలో చాలావరకు ఆర్‌అండ్‌బీ నియంత్రణలో ఉండేవి. వీటి నుంచి కూడా దిగుబడి వచ్చేది. 20, 30 ఏళ్ల క్రితం వరకు చింతకు పెద్ద మార్కెట్‌గా పుంగనూరుకు గుర్తింపు ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి’’అని ఆయన అన్నారు.

చింతపండు

ఫొటో సోర్స్, bbc/tulasi prasad reddy

మళ్లీ చింతవైపు రైతులు చూస్తారా?

ప్రస్తుతం మళ్లీ చింత పంటవైపు వస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని అధికారులు అంటున్నారు.

‘‘హార్టీకల్చర్ యూనివర్సిటీ రెండు కొత్త రకాలను తీసుకొచ్చింది. వీటిని నాటిన తర్వాత 4 ఏళ్ల నుంచి దిగుబడి మొదలు అవుతుంది. మామిడికి ఆరు సంవత్సరాలు, నిమ్మకు నాలుగు సంవత్సరాల తర్వాతే దిగుబడి వస్తుంది. ఇప్పుడు చింతలోనూ మంచి రకాలు అందుబాటులోకి వచ్చాయి. పైగా చింతను ఏ దశలో అయినా నిలువ చేసుకోవచ్చు. మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం రైతులకు ఉంటుంది. ఈ కారణంతో రాయలసీమలో రాబోయే రోజుల్లో చింత విస్తీర్ణం పేరిగే అవకాశాలు చాలా ఉన్నాయి’’ అని మధు అన్నారు.

ఈ మొక్కల్ని కూడా రాయితీతో ప్రభుత్వం సరఫరా చేస్తుందని మధు అంటున్నారు.

‘‘హార్టీకల్చర్ విభాగం కూడా కొత్తగా ఎవరైనా చింత నాటడానికి ముందుకు వస్తే 50% సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించేందుకు కొన్ని పథకాలు అమలు చేస్తోంది’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఖర్జూరం సాగు: ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడి’

ఏ రకాలను పెంచుకోవాలి?

చింతల్లో ‘‘ధార్వార్డ్’’ రకం మన ఏరియాకు బాగా ఉంటుందని శాస్త్రవేత్త విమల అన్నారు.

‘‘అనంతపూర్ పరిశోధన కేంద్రం 2018లో అనంత రుద్ర, తెట్టు అమాలిక అనే రెండు కొత్త రకాల్ని విడుదల చేసింది. 2021లో కేంద్రం కూడా ఈ రకాలను నోటిపై చేసింది. ఈ రెండు రకాలకు చెందిన 50,000కుపైగా మొక్కలను రైతులకు సరఫరా చేశారు. వీటిని అన్ని ప్రాంతాలకు చెందిన రైతులు తీసుకెళ్లారు. ఇవి కూడా చాలా బాగా పెరుగుతాయి’’అని విమల చెప్పారు.

వీడియో క్యాప్షన్, రూ.3,000 తో కోళ్ల పెంపకం మొదలుపెట్టిన పేద రైతు, ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)