చైనాకు శ్రీలంక లక్ష కోతులను ఎందుకు పంపిస్తోంది?

కోతి

ఫొటో సోర్స్, Getty Images

శ్రీలంక నుంచి కోతులను చైనాకు పంపేందుకు చర్చలు జరుగుతున్నాయని శ్రీలంక వ్యవసాయ మంత్రి మహింద అమరవీర బీబీసీతో చెప్పారు.

లక్ష కోతులను తమ దేశానికి పంపాలని చైనా కోరిందని, ఆ దిశగా చైనా ప్రతినిధులు, శ్రీలంక అధికారుల మధ్య మూడు విడతలుగా చర్చలు జరిగాయని తెలిపారు.

ఈ కోతులను 1000 జంతు ప్రదర్శనశాలలో ఉంచాలని చైనా యోచిస్తోంది.

చైనాకు కోతులను పంపే విషయంపై ఏప్రిల్ 11న శ్రీలంక వ్యవసాయ శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించింది. ఈ సమావేశంలో నేషనల్ జూలాజికల్ విభాగం, వన్యప్రాణి విభాగం అధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ విషయంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.

కోతులను చైనాకు పంపడానికి సంబంధించిన చట్టపరమైన అంశాలను కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది.

త్వరలో ఈ ప్రతిపాదనను మంత్రి మహింద అమరవీర కేబినెట్ ముందుంచనున్నారు.

కోతులు

ఫొటో సోర్స్, Getty Images

శ్రీలంకలో 30 లక్షలకు పైగా కోతులు

ప్రస్తుతం శ్రీలంకలో కోతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. గతంతో పోలిస్తే చాలా రెట్లు పెరిగింది.

శ్రీలంకలో ప్రస్తుతం 30 లక్షలకు పైగా కోతులు ఉన్నాయని మంత్రి మహింద అమరవీర చెప్పారు. ఈ కోతుల వల్ల వ్యవసాయానికి, పంటలకు భారీ నష్టం వాటిల్లుతోందని తెలిపారు.

గత ఏడాదిలోనే కోతులు సుమారు రెండు కోట్ల కొబ్బరి కాయలను కోతులు ధ్వంసం చేశాయని మహింద తెలిపారు.

కోతుల వల్ల పంటలు నాశనం కావడంతో ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లుతోందని, అందుకే కొన్ని కోతులను చైనాకు పంపాలని నిర్ణయించుకున్నట్లు ఆయన బీబీసీతో చెప్పారు.

మహింద అమరవీర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంక వ్యవసాయ మంత్రి మహింద అమరవీర

చైనాలో కోతులను మాంసం కోసం ఉపయోగిస్తారా?

శ్రీలంక నుంచి వచ్చే కోతులను చైనాలో మాంసం కోసం వినియోగిస్తారనే భయాన్ని కొందరు వ్యక్తంచేస్తున్నారు.

మంత్రి మహిందా అమరవీర ఈ వాదనను తిరస్కరించారు. జంతు ప్రదర్శనశాలలో ఉంచడానికే చైనా ప్రభుత్వం కోతులను పంపించమని అడిగినట్టు చెప్పారు.

కోతులను పట్టుకోవడం నుంచి వాటిని చైనాకు తరలించే వరకు అన్ని ఖర్చులను చైనా భరిస్తుందని మంత్రి తెలిపారు.

ఒక్క కోతిని పట్టుకోవడానికి మాత్రమే సుమారు 5000 శ్రీలంక రూపాయలు ఖర్చవుతుందని మహింద చెప్పారు. (నాలుగు శ్రీలంక రూపాయలు భారత కరెన్సీలో ఒక్క రూపాయికి సమానం.)

కోతులను పట్టుకోవడం, వాటిని వేరు చేయడం, ఏవైనా వ్యాధులు ఉన్నాయో లేదో పరీక్షించడం, బోనుల్లో ఉంచడం, తరువాత వాటిని చైనాకు రవాణా చేయడం, ఈ మొత్తం ప్రక్రియకు అయ్యే ఖర్చును చైనా భరిస్తుందని మంత్రి చెప్పారు.

ఒక్కో కోతి కోసం చైనా 30 వేల నుంచి 50 వేల శ్రీలంక రూపాయలను (భారత కరెన్సీలో ఏడు వేల రూపాయల నుంచి 12,665 రూపాయలు) వెచ్చించడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

"చైనాకు తరలించాక కోతిని అమ్మాలంటే 50 వేల శ్రీలంక రూపాయలకు మించి ధర పెట్టాలి. అంత ఖర్చు పెట్టి చైనాలో ఎవరూ కోతిని కొనుక్కొని తినరని, కాబట్టి మాంసం కోసం కోతులను ఉపయోగిస్తారనే ఆందోళనలో అర్థం లేదు" అని ఆయన చెప్పారు.

వ్యవసాయాన్ని నాశనం చేసే ఆరు రకాల జంతువులను చంపడానికి లేదా వేటాడేందుకు శ్రీలంక ప్రభుత్వం అనుమతించింది. అందులో కోతులు కూడా ఉన్నాయి.

అయితే తాను అలాంటి చర్యలేవీ తీసుకోలేదని మంత్రి మహింద అమరవీర చెప్పారు.

వీడియో క్యాప్షన్, చైనాకు శ్రీలంక లక్ష కోతులను ఎందుకు పంపిస్తోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)