ఆవులను కౌగలించుకోవడం ప్రపంచంలో కొత్త వెల్‌నెస్ ట్రెండా? ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందా?

ఫొటో సోర్స్, Catchlight Visual Services/Alamy
- రచయిత, యాస్మిన్ ఎల్బేహ్
- హోదా, బీబీసీ రీల్
ఆవులను కౌగలించుకోవడం కొత్త వెల్‌నెస్ ట్రెండ్‌గా మారింది. దీని వల్ల అనేక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీని పట్ల ఆకర్షణ పెరుగుతోంది.
మేక యోగా నుంచి శబ్దాల స్నానం (సౌండ్ బాత్) వరకు ప్రపంచంలో మానసిక, శారీరక ఆరోగ్య చికిత్సలకు కొదవలేదు. శరీరాన్ని, మనసును, ఆత్మను ప్రశాంతంగా ఉంచుకోవడానికి వివిధ మార్గాలు అన్వేషిస్తున్నారు. కొన్ని బాగా ట్రెండ్ అవుతున్నాయి కూడా.
భారత జంతు సంక్షేమం బోర్డ్ (యానిమల్ వెల్‌ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా) తాజాగా.. ఫిబ్రవరి 14వ తేదీన ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే.. కౌ హగ్గింగ్ అనేది ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యంలో ఉంది.
నెదర్లాండ్స్‌లో కొత్తగా వచ్చిన 'ఆవు కౌగలింత' మానసికోల్లాసాన్ని కలిగిస్తోందని, పెదవులపై చిరునవ్వు పూయిస్తోందని అభ్యాసకులు అంటున్నారు.
డచ్‌లో "కోయ్ క్నుఫెలెన్" అంటే అక్షరాలా "ఆవును కౌగలించుకోవడం" అని అర్థం.
మానవులు, జంతువులను కౌగలించుకుంటే పొందే మానసిక ప్రశాంతత స్వాభావికమన్న భావన నుంచి ఈ ప్రాక్టీస్ వచ్చింది.
ఆవులను కౌగలించుకోవాలనుకునేవాళ్లు గోశాలలకు వెళ్లి, అక్కడున్న ఆవులన్నీ పరీశీలించి, ఒక ఆవును ఆనుకుని గంట, రెండు గంటలు కూర్చుంటారు.

ఆవు శరీర ఉష్ణోగ్రత, మెల్లగా కొట్టుకునే గుండె, భారీ శరీరం.. మనసుకు సాంత్వన చేకూరుస్తుందని, ఆవు వీపుపై రాస్తూ, దానికి జారబడి కూర్చోవడం, దాని చేత నాకించుకోవడం అన్నీ చికిత్సలో విధానాలే.
ఆవును కౌగలించుకుంటే శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుందని, దానివల్ల ఒత్తిడి తగ్గుతుందని, సానుకూల దృక్పథం ఏర్పడుతుందని విశ్వాసిస్తున్నారు. సామాజిక బంధాలు ఏర్పడినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువ విడుదల అవుతుంది.
సాధారణంగా పెంపుడు జంతువులను కౌగలించుకోవడం లేదా వాటి నుంచి ఎమోషనల్ సపోర్ట్ తీసుకోవడం మానవులకు పరిపాటి. ఇదే పెద్ద జంతువులను కౌగలించుకుంటే ఆ ప్రభావం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
ఈ ఆరోగ్యకరమైన కాలక్షేపం గ్రామీణ డచ్ ప్రాంతాల్లో ఒక దశాబ్దం క్రితం మొదలైంది.
ఇప్పుడు ఇది డచ్ మొత్తం ఒక ఉద్యమంలా పాకింది. మానవులను ప్రకృతికి, గ్రామీణ జీవనానికి దగ్గర చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
నేడు, రోటర్‌డామ్, స్విట్జర్లాండ్, అమెరికాలో కూడా గోశాలలు ఆవు కౌగలింత సెషన్లు నిర్వహిస్తున్నాయి. ఇది మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని ప్రచారం చేస్తున్నాయి.
ఈ కౌగలింతల ప్రహసనం ఆవులకు కూడా ఆనందాన్ని కలిగిస్తుండవచ్చు.
2007లో అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ జర్నల్‌లో వచ్చిన ఒక అధ్యయనంలో.. ఆవులకు మెడ, వీపు భాగాలలో రుద్దినప్పుడు విశ్రాంతి పొందిన సూచనలు కనిపించాయని, ఒళ్లు విరుచుకుని, చెవులు వెనక్కు వాల్చి సేదతీరినట్టు కనిపించాయని తేలింది.
పశువులతో హృదయపూర్వక బంధం మనుషులనూ సేద తీరుస్తుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:
- కేరళ: బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట
- మహిళల టీ20 వరల్డ్ కప్: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు... టీం ఇండియా కంటే బలంగా ఉన్న జట్లు ఏవి?
- అప్పర్ భద్ర: ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకు నీళ్లు అందవా... ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత ఎందుకు
- పరీక్షా పత్రాల లీక్: దేశంలో పెరుగుతున్న స్కాములు... పరీక్షల వాయిదాలతో నలిగిపోతున్న నిరుద్యోగులు
- తుర్కియే భూకంపం: మరణాలు పెరగడానికి ప్రభుత్వమే కారణమా... అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించడమే తీవ్రతను పెంచిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













