‘ముధోల్ హౌండ్’ కుక్క ప్రత్యేకతలేంటి... దాన్ని ప్రధాని మోదీ భద్రతా బృందంలోకి ఎందుకు తీసుకుంటున్నారు?

ముధోల్ కుక్క

ఫొటో సోర్స్, Rashmi Mavinkurve

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రక్షణ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతా బృందంలోకి స్వదేశీ జాతికి చెందిన ముధోల్ వేట కుక్కలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇవి ఒక చిన్న జొన్న రొట్టె తిని కూడా బ్రతకగలవు.

కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని కెనైన్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ఉన్న ఈ కుక్కలు భారతీయ ఇళ్లల్లో సాధారణంగా తినే తిండినే తింటాయి.

వీటికి రోజుకు రెండు సార్లు మొత్తం అరకేజీ మొక్క జొన్న, గోధుమలు, కందిపప్పు పెడితే చాలు. దీంతో పాటు ప్రతి రోజు రెండు కోడిగుడ్లు, అర లీటర్ పాలు ఇస్తారు. కొంత మంది వీటికి వారానికొకసారి చికెన్ కూడా పెడతారు.

ముధోల్ కుక్కల తల, మెడ, ఛాతీ భాగం లోతుగా ఉంటాయి. కాళ్ళు తిన్నగా ఉండి పొట్ట లోపలికి ఉంటుంది. చెవులు కిందికి వంగి ఉంటాయి.

స్వదేశీ జాతుల్లో ఇది పొడవైన కుక్క. ఇది 72 సెంటీమీటర్ల పొడవు ఉండి 20 - 22 కేజీల వరకు బరువుంటుంది. ఇవి రెప్పపాటులో ఒక కిలోమీటర్ దూరం పరుగు పెట్టగలవు. ఇవి క్రీడాకారుల మాదిరిగా దృఢంగా కనిపిస్తాయి. వేట విషయంలో వేరే జాతులు వీటితో పోటీ పడలేవు.

ముధోల్ జాతి కుక్కల లక్షణాలు ఆశ్చర్యపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వీటి కళ్ళను 240 డిగ్రీల నుంచి 270 డిగ్రీల వరకు తిప్పగలవు. కానీ, వీటి వాసన పసిగట్టే సామర్ధ్యం మిగిలిన జాతుల కుక్కల కంటే తక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణాన్ని తొందరగా తట్టుకోలేవు.

"ముధోల్ కుక్కలు ఫ్యాన్సీ ఆహారాన్ని తినకూడదు" అని కర్ణాటక లోని బీదర్‌లో వెటర్నరీ ఆనిమల్ ఫిషరీస్ సైన్సెస్ యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ శివ ప్రకాష్ చెప్పారు.

"ముధోల్ కుక్కలు రకరకాల పరిస్థితులను తట్టుకోగలవు. కావాలంటే వీటికి చికెన్ కూడా పెట్టొచ్చు. ఇవి ఒక జొన్న రొట్టె తిని కూడా బ్రతకగలవు" అని చెప్పారు.

ముధోల్ కుక్కలు

ఫొటో సోర్స్, Venkayya Navalgi

"ఈ కుక్కను కట్టి ఉంచలేం. ఇవి స్వేచ్ఛగా తిరగడాన్ని ఇష్టపడతాయి. ఉదయం, సాయంత్రం ఒక గంట సేపు నడిపిస్తే, చురుకుగా ఉంటాయి. దీనికి ఒకే ఒక యజమాని ఉండాలి. వీటిని సాధారణంగా పర్యవేక్షణ పనుల్లో వాడతారు" అని యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుశాంత్ హాండ్గే చెప్పారు.

ప్రధాని మోదీ 2018లో ఉత్తర కర్ణాటకలో జరిగిన ఒక ర్యాలీలో ఈ జాతి కుక్కలను ప్రశంసించారు.

ఆ తర్వాత చాలా భద్రతా సంస్థలు వీటిని సీఆర్‌ఐసీ నుంచి తీసుకుని శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాయి.

2018లో ఎస్‌ఎస్‌బీ రాజస్థాన్ కూడా రెండు కుక్కపిల్లలను తీసుకుంది. సీ‌ఆర్‌పీ‌ఎఫ్ బెంగళూరు కూడా రెండు కుక్కలను తీసుకుంది. చాలా భద్రతా సంస్థలు తర్వాత వీటిని తమ భద్రతా బృందాల్లో చేర్చాయి.

ముధోల్ కుక్కలు

ఫొటో సోర్స్, Venkayya Navalgi

ఎక్కడ నుంచి వచ్చాయి?

ముధోల్ కుక్కలు మొదట రాజా మాలోజిరావ్ ఘోర్పడే (1884 - 1937) దృష్టిని ఆకర్షించాయి. గిరిజనులు వీటిని వేట కోసం ఉపయోగించేవారు. ఘోర్పడే బ్రిటన్ సందర్శించినప్పుడు అప్పటి బ్రిటిష్ రాజు ఐదో జార్జికి కూడా కొన్ని ముధోల్ కుక్కలను బహుమతిగా ఇచ్చారు.

ఛత్రపతి శివాజీ సైన్యం కూడా ముధోల్ కుక్కలను వాడిందని సుశాంత్ హాంగ్దే చెప్పారు.

ఈ కుక్కలు సాధారణంగా ముధోల్ తాలూకాలోనే కనిపిస్తాయి. వీటిని ప్రస్తుతం కొంత మంది ప్రైవేటు వ్యక్తులు సీఆర్‌ఐసీ నుంచి తీసుకుని వెళుతున్నారు. వీటిని ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా పెంచుతున్నారు.

ముధోల్ కుక్కలు స్వదేశీ జాతికి చెందిన కుక్కలని గత సంవత్సరం నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్స్ రిసోర్సెస్ గుర్తించింది.

దీని తర్వాత చాలా మంది ప్రైవేటు వ్యక్తులు వీటి క్రయవిక్రయాలు మొదలుపెట్టారు.

ముధోల్ తాలూకాలోని లోకపూర్ వెంకప్ప నావాల్గి దగ్గర 18 కుక్కలున్నాయి. ఇందులో 12 మగ కుక్కలు, 8 ఆడవి ఉన్నాయి. ఒక ఆడకుక్క ఏడాదిలో రెండు నుంచి 14 కుక్క పిల్లలను కనగలదు.

నావాల్గి వీటిని రూ. 12,000 లకు అమ్మేస్తారు. కుక్కలకు వ్యాక్సీన్లు చేయించి, సర్టిఫికెట్లు తీసుకుంటే రూ.13,000 - 14,000 వరకు అమ్ముతారు. ఇవి 16 ఏళ్ల వరకు బ్రతుకుతాయి. కానీ, వీటి జీవిత కాలం 13 - 14 సంవత్సరాలకు పడిపోయింది.

ముధోల్ కుక్క

ఫొటో సోర్స్, Venkayya Navalgi

"మా ఇంట్లో ఒక ముధోల్ కుక్క ఉంది. చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. నా మూడేళ్ళ కూతురితో బాగా కలిసిపోయింది. పిల్లలు వాటిని టెడ్డీ బేర్‌ల మాదిరిగా భావిస్తారు. అవి భయంకరంగా ఉంటాయని అంటారు కానీ, అది నిజం కాదు. వాటిని చూసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. మా ఇంట్లో 7 కుక్కలు ఉన్నాయి. వీటికి నెలకొకసారి స్నానం చేయిస్తే చాలు" అని బెంగళూరుకు చెందిన రష్మీ మవిన్‌కుర్వే చెప్పారు.

"వీటికి చాలా తేలికపాటి ఆహారం పెడతాం. రోజుకు 250 గ్రాముల ఆహారాన్ని రాగి జావ, పెరుగుతో కలిపి ఇస్తాం. వీటి పెంపకానికి ఎక్కువ ఖర్చు అవ్వదు. వీటిలో గుడ్లు, చికెన్ కూడా ఉంటాయి. వారానికి 100 గ్రాముల అన్నం పెడతాం. సంవత్సరానికొకసారి వ్యాక్సీన్ ఇప్పిస్తాం" అని న్యూజీలాండ్‌లో శిక్షణ పొందిన కెనైన్ బిహేవియరిస్ట్ అమృత్ హిరణ్య చెప్పారు.

"ముధోల్ కుక్కలను వేట కుక్కలని అంటారు. శత్రువు నుంచి పొంచి ఉన్న ముప్పు కనిపెట్టేందుకు, శత్రువు పై దాడి చేసేందుకు భారత సైన్యంలోకి తీసుకుంటే బాగా పనికొస్తాయి" అని అన్నారు.

భారత సైన్యంలో ముధోల్ కుక్క

ఫొటో సోర్స్, @artrac_ia

"ఇవి చాలా వేగంగా పరుగుపెడతాయి. ఇవి పరుగు పెడుతుండగా లాంగ్ జంప్స్ చేయగలవు. చీకట్లో గస్తీకి బాగా పనికొస్తాయి. వీటి వినికిడి శక్తి చాలా ఎక్కువ. కానీ, ఇవి పేలుడు సామగ్రి, మాదక ద్రవ్యాలను కనిపెట్టేందుకు, దొంగతనాల లాంటి నేరాల పరిశోధనలో అంత బాగా పనికిరావు" అని చెప్పారు.

"పొడి వాతావరణాన్ని కూడా ఇవి బాగా తట్టుకోగలవు. అయితే.. వాతావరణంలో చిన్న పాటి మార్పులు వల్ల వాటి శరీరం మీద ఫంగస్ చేరి దురదలు రావచ్చు" అని చెప్పారు.

"ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జర్మన్ షెపర్డ్, బెల్జియన్ మెలినాయిస్ పెంచుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. ముధోల్ కుక్కలు పరిమాణంలో బెల్జియన్ మెలినాయిస్, జర్మన్ షెపర్డ్ కంటే చిన్నదిగా ఉండటమే కాదు.. ఇవి అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకోగలవు’’ అని వివరించారు.

"ఒసామా బిన్ లాడెన్‌ను కనిపెట్టి పట్టుకున్నది బెల్జియన్ మెలినాయిస్ జాతి కుక్కే. పేలుడు పదార్ధాలను కనిపెట్టడంలో ఒక్క క్షణం ఆలస్యమైనా కూడా విధ్వంసం చోటు చేసుకుంటుంది. ఇలాంటి పనులకు ముధోల్ కుక్కలను ఉపయోగించటం రిస్కీ కావచ్చు’’ అని ఆయన చెప్పారు.

గత 7 - 8 ఏళ్లలో బెల్జియన్ మెలినాయిస్ కుక్కలు సుమారు 5000 కేజీల మాదకద్రవ్యాలను కనిపెట్టాయని ఆయన పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, ఆ ఊళ్లో కుక్కలు చాలా రిచ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)