ముంబయి: 'తొమ్మిదేళ్ల తరువాత అమ్మను కలిశాను' - కిడ్నాప్ అయిన 'గర్ల్ నంబర్-166'

పూజ

ఫొటో సోర్స్, BBC AND MUMBAI POLICE

ఫొటో క్యాప్షన్, పూజ
    • రచయిత, దీపాలీ జగ్తాప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"తొమ్మిదేళ్ల తరువాత మా అమ్మని కలిశాను. అమ్మ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నా. ఎలాగోలా ఇన్నాళ్లకు తప్పించుకోగలిగాను. మా నాన్న బతికి ఉంటే బావుండేది. నేను ఇంటికి రాగానే ఆయన కోసం వెతికాను. కానీ, ఆయన కనిపించలేదు" అని 16 ఏళ్ల పుజ చెప్పింది. దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది.

ముంబయిలోని అంధేరి ప్రాంతంలో నివసించే పూజా గౌడ్ 2013 జనవరిలో కిడ్నాప్‌కు గురైంది. అప్పటికి ఆమె వయసు ఏడేళ్లు. ఒకటవ తరగతి చదువుతోంది. అప్పట్లో పూజ మిస్సింగ్ కేసు 'గర్ల్ నంబర్ 166'గా మీడియా రిపోర్టులలో పాపులర్ అయింది. ఎందుకంటే, పోలీసు రికార్డుల ప్రకారం ముంబై శివార్లలోని ప్రాంతాలలో అపహరణకు గురైన పిల్లల్లో పూజ 166వ బాలిక.

2013 జనవరి 22 ఉదయం 8.00 గంటలకు పూజ స్కూల్‌కు వెళుతుండగా, ఐస్‌క్రీమ్ ఇస్తానని ఆశ పెట్టి ఆమెను అపహరించారు.

సరిగ్గా 9 ఏళ్ల తర్వాత 2022 ఆగస్టు 4న పూజ ఆచూకీ లభించింది. ప్రమీల అనే మహిళ సాయంతో ఆమె కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని తన కుటుంబాన్ని కలుసుకోగలిగింది. పూజకు ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు.

ఇన్నాళ్లూ పూజ ఎక్కడ ఉంది? ఏ పరిస్థితిలో ఉంది? ఆమెను ఎవరు తీసుకెళ్లారు? ఎలా తిరిగి రాగలిగింది? కుటుంబాన్ని ఎలా కలుసుకుంది?

ఈ తొమ్మిదేళ్లల్లో పూజ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ఆమె చెప్పిన విషయాలు హృదయాన్ని కదిలిస్తాయి. దిగ్భ్రాంతి కలిగిస్తాయి.

ప్రమీల
ఫొటో క్యాప్షన్, ప్రమీల దేవేంద్ర

చివరికి పూజ ధైర్యం కూడదీసుకుంది..

ఆరు నెలల క్రితం అంటే 2022 ఫిబ్రవరిలో పూజ కిడ్నాపర్ల చెరలో ఉంది. పశ్చిమ ముంబై శివార్లలో ఉన్నతవర్గాలు నివసించే ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో పూజను ఆ ఇంట్లో పసిపిల్లలను చుసుకునేందుకు నియమించారు. అదే ఇంట్లో 35 ఏళ్ల ప్రమీల దేవేంద్ర కూడా పనిచేస్తున్నారు.

ఒకే ఇంట్లో కలిసి పని చేస్తుండడంతో ప్రమీల, పూజల మధ్య మంచి స్నేహం కుదిరింది. పూజ తరచూ కనీళ్లు పెట్టుకుంటూ ఉండడం, ఎప్పుడూ విచారంగా ఉండడం ప్రమీల గమనించారు.

"పూజ ఇంట్లో పరిస్థితులు బాగాలేవని అనుకున్నా. తల్లిదండ్రులకు, కూతురుకు పడదేమో అనుకున్నా. ఎందుకు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావు, నీ బాధేంటో చెప్పు? అని చాలాసార్లు అడిగాను. తన కుటుంబం తనను వేధిస్తోందని చెప్పింది. పూజ ఇంట్లో వాతావరణం సవ్యంగా లేదు అనుకున్నా" అని ప్రమీల చెప్పారు.

అయితే, ఆరు నెలల తరువాత ఆగస్టు 2న పూజ ధైర్యం కూడదీసుకుని, ప్రమీలకు అసలు విషయం చెప్పింది.

"ప్రస్తుతం నేను ఎవరితో ఉంటున్నానో వాళ్లు నా సొంత తల్లిదండ్రులు కాదని ప్రమీల అక్కకు చెప్పాను. నన్ను చిన్నపిల్లగా ఉన్నప్పుడు కిడ్నాప్ చేశారని చెప్పాను. యూట్యూబ్‌లో నా పేరు సెర్చ్ చేశా. కొన్ని వీడియోలు కనిపించాయి. నేను తప్పిపోయినట్టు వేసిన పోస్టర్లు చూశాను. వాటి మీద కొన్ని మొబైల్ నంబర్లు ఉన్నాయి" అని పూజ చెప్పారు.

పూజ చెప్పిన విషయాలు విని ప్రమీల నిర్ఘాంతపోయారు. ఆ వీడియోలు చూసి నిజం తెలుసుకున్నారు. పూజ ఎందుకు ఎప్పుడూ దిగులుగా ఉంటుందో ఆమెకు అర్థమైంది.

"పూజ యూట్యూబ్ వీడియోలు చూపించింది. వీళ్లే నా అసలు తల్లిదండ్రులని ఒక ఫొటో చూపించింది. పోస్టర్‌లో రెండు జడలు, స్కూలు యూనిఫాంలో ఉన్న పిల్లని నేనే అంది. ఆ వీడియోను మా ఇంటి దగ్గర ఉన్న ఒక అమ్మాయికి పంపించాను. ఆ పిల్ల గూగుల్‌లో సెర్చ్ చేసి, మూడు, నాలుగు నంబర్లు ఫోన్ నంబర్లు ఇచ్చింది. ఒకరికి కనక్ట్ అయింది. అతడి పేరు రఫీక్" అని ప్రమీల చెప్పారు.

వీడియో క్యాప్షన్, ముంబయి: కిడ్నాప్ అయిన పూజ 9 ఏళ్ళ తరువాత ఎలా తిరిగి వచ్చిందంటే...

ప్రమీల ధైర్యంగా అడుగు ముందుకు వేశారు..

పూజ కుటుంబం అంధేరీలోని మురికివాడలో నివసిస్తుంది. రఫీక్ కూడా అక్కడే ఉంటారు. ఆయనకు పూజ కుటుంబం బాగా తెలుసు.

"పూజ వాళ్ల నాన్న, నేను కలిసి పూజ కోసం చాలా వెతికాం. ముంబైలోని అణువణువూ గాలించాం. పక్క రాష్ట్రాల్లో కూడా వెతికాం. పూజ తండ్రి గోవా, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ, కశ్మీర్‌కు కూడా వెళ్లి వెతికారు. కానీ, ఆమె ఆచూకీ దొరకలేదు. 2022 ఆగస్టు 3న రాత్రి 8.00 గంటల ప్రాంతంలో నాకు ప్రమీల నుంచి కాల్ వచ్చింది. పూజ తల్లితో మాట్లాడాలాని అడిగారు. నాకు చిరాకొచ్చింది. గతంలో ఇలాంటి కాల్స్ బోల్డు వచ్చాయి. వాళ్లు చెప్పిన వివరాలు పట్టుకుని వెళ్లి చూస్తే, పూజ కాకుండా వేరే అమ్మాయిలు కనిపించేవారు. అందుకే ప్రమీల ఫోన్ చేశాక, వెంటనే పూజ కుటుంబానికి ఈ విషయం చెప్పలేదు. మర్నాడు వీడియో కాల్ చేయమని ప్రమీలకి చెప్పి ఫోన్ పెట్టేశాను" అని రఫీక్ బీబీసీకి చెప్పారు.

2022 ఆగస్టు 4 ఉదయం, పూజ ఆ ఇంట్లో పనికి వెళ్లింది. "మీ అమ్మకు వీడియో కాల్ చేయాలని" ప్రమీల ఆమెకు చెప్పారు. 10.00 గటలకు ఇద్దరూ కలిసి రఫీక్‌కు వీడియో కాల్ చేశారు.

ఆ కాల్ అందుకోగానే రఫీక్ పరిగెత్తుకుని పూజ తల్లి పూనం గౌడ్ దగ్గరకు వెళ్లారు. పూజ అనే అమ్మాయి ఫోన్ చేసింది అని చెప్పారు.

"నాకేం చేయాలో పాలుపోలేదు. భయమేసింది. ఏడవాలో, నవ్వలో కూడా తెలియలేదు. పూజ అనే అమ్మాయి ఫోన్ చేసి, నీ కూతుర్ని అని చెప్పింది" అన్నారు పూజ తల్లి పూనం గౌడ్ చెప్పారు.

మరో మొబైల్ నుంచి రఫీక్ ఈ వీడియో కాల్ రికార్డ్ చేశారు. ఆ వీడియోను బీబీసీ చూసింది. తొమ్మిదేళ్ల క్రితం తప్పిపోయిన పూజ వీడియో కాల్‌లో తన తల్లిని చూసి బావురుమంది. ఆమె తల్లి కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.

ఈ వార్త వీధిలో దావానలంలా వ్యాపించింది. గుడిసెల్లోంచి జనం బయటికొచ్చి గుమికూడారు. వీడియో కాల్‌లో పూజను చూసేందుకు ఎగబడ్డారు. కొందరు దూరం నుంచి చూసి ’ఆ పిల్ల మన పూజ’ అంటూ అరిచారు.

పూనం, పూజను కొన్ని ప్రశ్నలు వేశారు. నా పేరేంటి? అని డిగారు. పూనం అని చెప్పింది పూజ. నాన్న పేరేంటి? అని అడిగారు. సంతోష్ అని చెప్పింది.

వీడియో క్యాప్షన్, వైరల్: ఆ చిన్నారి అపహరణ నిజం కాదు.. అది ఫేక్ వీడియో

పూజతో వీడియో కాల్ ముగిశాక, ప్రమీలతో మాట్లాడి ఒక ప్రదేశంలో కలవాలని నిర్ణయించుకున్నారు. పూజను తీసుకుని ప్రమీల ఆ ప్రదేశానికి చేరుకున్నారు. తోడుగా కొంతమంది దగ్గరి చుట్టాలను, స్నేహితులను కూడా తీసుకెళ్లారు.

పూజ తల్లి పూనం, ఆమె ఇద్దరు సోదరులు, మేనత్త, మేనమామ, రఫీక్ వచ్చారు.

తొమ్మిదేళ్ల తరువాత తల్లిని చూడబోతున్న ఆనందలో పూజ మనసు గెంతులు వేసింది. తల్లిని చూడగానే కన్నీళ్లు ఉబికివచ్చాయి. తల్లీకూతుళ్లిద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఏడ్చేశారు. పూనం గౌడ్, పూజ పుట్టుమచ్చలను చెక్ చేశారు.

"పూజ ఒంటి మీద ఒక పుట్టుమచ్చ గురించి నాకు మాత్రమే తెలుసు. నేను ఎవరికీ చెప్పలేదు. అందుకే ఆ మచ్చ ఉందో లేదో చూశాను. అది చూడగానే నా సందేహాలన్నీ మాయమైపోయాయి" అని పూనం గౌడ్ చెప్పారు.

"పూజ తప్పిపోయాక, ఎలాగైనా మళ్లీ దొరుకుతుందని ఆశపడ్దాం. కానీ, వాళ్ల నాన్న చనిపోయాక మా ఆశలు సన్నగిల్లాయి. పూజ కోసం అన్ని దిక్కులకూ వెళ్లి ఇంకెవరు వెతుకుతారు? కానీ, భగవంతుడి దయ వల్ల ఇన్నాళ్లకు మా బిడ్డ మాకు దక్కింది. పూజ వాళ్ల నాన్న పైకెళ్లి దేవుళ్లతో ఫైట్ చేసుంటారు.. నా భార్య ఒక్కర్తే ఉంది, మా పిల్లని మాకు తిరిగి ఇప్పించండని గొడవ పెట్టుకుని ఉంటారు. ఈ దీదీ (ప్రమీల) వల్లే మాకు మా బిడ్డ దక్కింది. నా కూతురు నాకు రత్నంతో సమానం. పోయిన వజ్రం తిరిగి దొరికినంత ఆనందంగా ఉంది. ఇప్పుడు మా అమ్మాయిలో వాళ్ల నాన్న పోలికలు బాగా కనిపిస్తున్నాయి. అచ్చు వాళ్ల నాన్నలాగే ఉంది. ఆయన పాప కోసం ఎంతో తపించిపోయారు. సరిగ్గా అన్నం కూడా తినలేకపోయేవారు. చివరికి, కూతుర్ని చూడకుండానే ఈ లోకం నుంచి వెళ్లిపోయారు" అని పూనం గౌడ్ అన్నారు. ఇది చెబుతున్నంతసేపు ఆమె కళ్లు చెమర్చుతూనే ఉన్నాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇంతలో రఫీక్ డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. 2013లో పూజ తప్పిపోయినప్పుడు డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేశారు. అందుకే ఈ కేసు గురించి అక్కడి పోలీసులకు బాగా తెలుసు.

"పోలీసులకు అన్నీ చెప్పాను. నన్ను ఎక్కడుంచారో చూపించాను. నన్ను కిడ్నాప్ చేసినవారిని పోలీసులు పట్టుకున్నారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు" అని పూజ చెప్పింది.

ఆరోజు రాత్రి పూజ తన తల్లి ఒడిలో ప్రశాంతంగా నిద్రపోయింది. అయితే, పూజకి అక్కడితో అన్నీ సర్దుకున్నట్టు కాదు.

"నన్ను కిడ్నాప్ చేసినామె నన్ను బాగా కొట్టేవారు. ఆ దెబ్బలతో రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. వీపు చాలా నొప్పేట్టేది. ముక్కు మీద గుద్దేవారు. రక్తం బొటబొటా కారేది" అంటూ పూజ తను పడ్డ బాధలు చెప్పుకొచ్చారు.

పూజ శరీరానికి, మనసుకు తగిలిన గాయాలు మానడానికి ఇంకొంత సమయం పడుతుంది.

తొమ్మిదేళ్లు వెతికినా కనిపించని పూజ, ప్రమీల ధైర్యంగా తీసుకున్న నిర్ణయం వల్ల ఇంటికి చేరుకుంది. ప్రమీల చొరవ వల్ల పూజ జీవితం మారిపోయింది.

"పూజ తన కుటుంబాన్ని కలవడం కన్నా ఎక్కువ ఆనందం ఏముంటుంది! ఏడు నెలల పాటు మేమిద్దరం తల్లీకూతుళ్లలా మెలిగాం. నేను పూజను మిస్ అవుతాను. ప్రతి తల్లి బాధతో తన దగ్గరకు వచ్చే పిల్లలకు ఇలాగే సాయం చేయాలి. నేను తనకు సొంత తల్లి కాకపోయినా తల్లిలాంటి దాన్నే" అంటూ భావోద్వేగానికి గురయ్యారు ప్రమీల.

కిడ్నాప్

ఫొటో సోర్స్, Deepali Jagtap

ఈ తొమ్మిదేళ్లల్లో ఏం జరిగింది?

పూజ కుటుంబంలో మొత్తం అయిదుగురు సభ్యులు. పూజకు ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు.

ఆరోజు పూజ తన అన్నతో కలిసి స్కూలికి వెళుతోంది. స్కూలు లోపలికి అడుగుపెట్టబోతుంటే, ఎవరో గేటు దగ్గరే ఆపి, పూజకు ఐస్క్రీం కొనిస్తామని చెప్పి తీసుకెళ్లారు. తరువాత ఏం జరిగిందో పూజ వివరించి చెప్పింది.

"ఇంటికెళ్లిపోతా, నన్ను వదిలిపెట్టండని ఏడ్చాను. ముంబై శివార్లలోని ఓ కొండ ప్రాంతానికి నన్ను తీసుకెళ్లారు. నేను ఏడుస్తూనే ఉన్నా. మా అమ్మ, నాన్నల దగ్గరకు తీసుకెళ్లమని అరిచి గీపెట్టాను. ఏడిస్తే ఆ కొండ మీంచి కిందకు తోసేస్తామని బెదిరించారు. నాకు భయమేసి ఏడుపు ఆపేశా. అక్కడ ఒక 2-3 రోజులు ఉన్నాం.

తరువాత, నన్ను గోవా తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్లిన వారిలో ఒక ఆడ, మగ ఉన్నారు. నేను చాలా ఏడ్చాను. ఏడిస్తే నాలుక మీద వాతలు పెట్టేస్తానని ఆ ఆడ మనిషి బెదిరించింది. మా అమ్మ గుర్తొస్తూ ఉండేవారు. ఆ తరువాత నన్ను గోవా తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ల బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. నా పేరును ఆనీగా మార్చారు. అయితే, గోవాలో వాళ్ల అత్త వాళ్లను అక్కడ ఉండనివ్వలేదు. అప్పుడు నన్ను రాయచూర్ (కర్ణాటక) తీసుకెళ్లారు. నన్నొక హాస్టల్‌లో ఉంచారు. అక్కడ రెండో తరగతి వరకు చదివాను.

2015లో వాళ్లకు ఒక పాప పుట్టింది. దాంతో నా పట్ల వాళ్ల ప్రవర్తన మారిపోయింది. నన్ను హాస్టల్ నుంచి ముంబై తీసుకొచ్చారు. అప్పటికి నాకు తొమ్మిదేళ్లు. నన్ను కొట్టడం, తన్నడం మొదలుపెట్టారు. బాగా తిట్టేవారు. ఒకరోజు అప్పడాల కర్రతో నన్ను చావబాదారు. నా వీపు నిండా రక్తం. అయినా, నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. దెబ్బల మీద సున్నం రాశారు.

ఇంట్లో పనులన్నీ నా చేత చేయించేవారు. చేతులు కాలిపోతున్నా రోజూ నేనే చాపాతీలు చేయాలి. 2020లో నన్ను బయట పనికి పంపించారు. మొదట్లో 24 గంటలు చేసే పనిలో పెట్టారు. అక్కడ నేను బట్టలు ఉతికి, వంట చేస్తూ, ఇంటి పనులన్నీ చేయాలి. నా జీతం మొత్తం వాళ్లు తీసుకునేవారు. నాకొక్క పైసా కూడా ఇచ్చేవారు కాదు" అని చెప్పారు పూజ.

కిడ్నాప్

ఫొటో సోర్స్, RAFIQ

పూజ ఎప్పుడైనా పారిపోవడానికి ప్రయత్నించిందా?

మొదట్లో పూజను ఎప్పుడూ ఒకరు కాపలా కాసేవారు. బయటకువెళ్లనిచ్చేవారు కాదు.

"ఒకరోజు అందరూ నిద్రపోయాక, నేను ఫోన్ తీసుకుని నా పేరు టైప్ చేశా. నా చిన్నప్పటి ఫొటో కనిపించింది.నేను తప్పిపోయినట్టు వార్తలు కనిపించాయి. అప్పుడు అనుకున్నా.. ఎలాగైనా, ఎవరో ఒకరి సాయం తీసుకుని అక్కడి నుంచి తప్పించుకోవాలని."

'మాకు సహాయం కావాలి'

పూజ రాక తమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది కానీ, తమ కుటుంబం ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగా లేవని పూజ తల్లు పూనం చెప్పారు.

పూజ తండ్రి అంధేరీ రైల్వే స్టేషన్‌లో సెనగలు అమ్మేవారు. ఆయన సంపాదించిన దానితోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. కానీ ఆయన చనిపోయాక, పూజ తల్లి ఒంటరైపోయారు.

"పూజ మిస్సింగ్ కేసులో కోర్టు వ్యవహారాలు మొదలయ్యాయి. దాని కోసం మేము డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తరచూ పోలీస్ స్టేషన్‌కు వెళుతూ ఉండాలి. పూజకు తోడుగా ఉండాలి. మాకు పనిచేయకపోతే పూట గడవదు. పూజకు సాయం కావాలి. ఇప్పటికే మా బిడ్డ ఎన్నో బాధలు పడింది" అని పూనం అన్నారు.

పూజ కూడా ఏదైనా పని చేసి తన తల్లికి తోడుగా నిలవాలనుకుంటోంది. కానీ, పూజ మైనర్ కావడంతో ఆమెకు పని దొరకదు.

పూజను కిడ్నాప్ చేసిన హ్యారీ, సోనీ డిసౌజాలపై డీఎన్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అపహరణ, బెదిరించడం, శారీరకంగా వేధించడం, చిన్నపిల్ల చేత పని చేయించడం మొదలైన నేరాల కింద కేసు నమోదు చేసినట్లు డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మిలింద్ కుర్దే తెలిపారు.

పోలీసులు హ్యారీ డిసౌజాను అరెస్ట్ చేశారు. సోనీ డిసౌజాను కూడ అరెస్ట్ చేయాలని పూజ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

"ఆ ఆడ మనిషి మా పిల్లను నరకయాతన పెట్టింది. ఆమెను అరెస్ట్ చేయకపోతే ఎలా ఊరుకుంటాం? పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేయాలి" అని పూనం అన్నారు.

కుటుంబంతో పూజ

ఫొటో సోర్స్, RAFIQ

ఫొటో క్యాప్షన్, కుటుంబంతో పూజ

పూజకు కొత్త జీవితం

ముంబై మురికివాడల్లోని ఒక చిన్న ఇంట్లో పూజ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లో ఒకే ఒక్క గది. పూజ తండ్రి నాలుగు నెలల క్రితం క్యాన్సర్‌తో చనిపోయారు.

పూజ తన తండ్రి గురించి చాలా బెంగపెట్టుకున్నారు. ఏడేళ్లప్పుడు ఆయన్ను చూడ్డమే. మళ్లీ ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి ఆయన లేరు.

"మా నాన్న కూడా మాతో బావుండేది. నేను నాన్నని చూస్తాను అనుకున్నా. అమ్మని, అన్నయ్యని, తమ్ముడిని చూశాక నాన్న కోసం వెతికాను. కానీ, ఆయన లేరని తెలిసి చాలా ఏడ్చాను" అంటూ పూజ కన్నీళ్లు పెట్టుకుంది.

చాలా ఏళ్ల తరువాత ఇంటికొచ్చిన పూజకు అన్నీ కొత్తగా ఉన్నాయి. ఈ తొమ్మిదేళ్లల్లో ఎన్నో మారిపోయాయి. పూజను చూడ్డానికి ఆ చుట్టుపక్కల వాళ్లంతా వస్తున్నారు.

పూజ చిన్నప్పుడు ఒక అంగన్‌వాడీ స్కూల్లో చదివింది. ఆ స్కూలు టీచర్లు కూడా పూజను చూడ్డానికి వచ్చారు.

పూజ తండ్రి చనిపోయాక, ఆమె తల్లి సెనగలు అమ్మడం ప్రారంభించారు. పూజ వచ్చిన దగ్గర నుంచి రోజూ సెనగలు అమ్మడానికి వీలు కుదరట్లేదు. అందుకే ఇప్పుడు పూజ కూడా సెనగలు అమ్మే పనిలో పడింది.

"కిడ్నాపర్లు మా పిల్లను చిత్రహింసలు పెట్టారు. ఇప్పటికీ అర్థరాత్రి లేచి కూర్చుంటుంది. బిగ్గరగా ఏడుస్తుంది" అని పూనం చెప్పారు.

రోజులో చాలాసేపు పూజ వాళ్ల అమ్మతోనే ఉంటుంది. పూనం కూడా కూతురిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టట్లేదు. తనకు అన్నం తినిపిస్తూ, నిద్రపుచ్చుతూ తనతోనే సమయం గడుపుతున్నారు.

పూనం బయటకు వెళ్లినప్పుడు, పూజ తన అన్నదమ్ములతోనూ, బంధువులతోను సమయం గడుపుతోంది.

"నేను కూడా పని చేసి మా అమ్మకు సాయం చేయాలనుకుంటున్నా. కానీ, నన్ను బయట పనికి పోలీసులు అనిమతించట్లేదు" అని పూజ చెప్పారు.

మరోవైపు పూజ కిడ్నాపింగ్ కేసు పనులు జరుగుతున్నాయి. పూజ దగ్గర నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు.

పూజ కోల్పోయిన ఆ తొమ్మిదేళ్లను ఎవరూ వెనక్కి తీసుకురాలేరు. కానీ, పూజ కొత్త జీవితం ప్రారంభించింది. కోటి ఆశలతో భవిష్యత్తు వైపు చూస్తోంది.

వీడియో క్యాప్షన్, రాయచోటిలో కోడలిని దారుణంగా హత్య చేసిన అత్త

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)