ఎల్లో క్రేజీ యాంట్: ఈ చీమల దండయాత్రతో హడలెత్తుతున్న జనం..పాములు, కుందేళ్లు, పశువులనూ చంపేస్తాయి

ఫొటో సోర్స్, COURTESY DR PRONOY BAIDYA
- రచయిత, ప్రసన్న వెంకటేష్, శుభగుణం కణ్ణన్
- హోదా, బీబీసీ తమిళ్
చీమల దండు దండయాత్రతో తమిళనాడులోని కొన్ని గ్రామాల ప్రజలు హడలెత్తిపోతున్నారు.
ఎల్లో క్రేజీ యాంట్ అని పిలిచే ఈ చీమలు తమ పంటలను తినేస్తున్నాయని, తమ పశువుల మీద దాడి చేస్తున్నాయని, తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ సమాచారం ప్రకారం.. ప్రపంచంలో అత్యంత దురాక్రమణదారు జాతుల్లో ఎల్లో క్రేజీ యాంట్స్ కూడా ఒకటి.
ఈ చీమలు కుట్టవు. కరవవు. కానీ ఇవి ఫోర్మిక్ యాసిడ్‌ను చిమ్ముతాయి. దానివల్ల అలర్జీ రియాక్షన్లు వస్తాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ చీమల శాస్త్రీయ నామం 'అనొప్లోలెప్సిస్ గ్రాసిలిపెస్'. ఇవి సాధారణంగా ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి గజిబిజిగా నడుస్తాయి. వీటి మధ్య సమన్వయం ఉండదు. వీటిని కదిలిస్తే ఇవి మరింత గందరగోళంగా తిరుగుతాయి.
ఈ చీమలు వేగంగా పెంపొందుతూ వ్యాపిస్తాయని, స్థానిక వన్యజీవులకు భారీ నష్టం చేయగలవని నిపుణులు చెప్తున్నారు. ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో కూడా ఈ చీమల సంతతి విపరీతంగా పెరిగిపోయి తిప్పలు పెడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.
ఇవి 'అవకాశవాద జాతుల'ణి ఈ ఎల్లో క్రేజీ యాంట్స్ మీద పరిశోధన చేసిన కీటక శాస్త్రవేత్త డాక్టర్ ప్రొణోయ్ బైద్య అభివర్ణించారు.
''వీటికి తిండికి సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యతలేమీ లేవు. ఇవి దేనినైనా తింటాయి. ప్రతి దానినీ తింటాయి. వేరే జాతుల చీమలను కూడా తింటాయి. తేనెటీగలు, కందిరీగలను సైతం తింటాయి'' అని ఆయన తెలిపారు.

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో.. కరంతమలై అడవి వద్ద గల పర్వత ప్రాంతాల సమీపంలోని ఏడు గ్రామాలు ఈ చీమల బారిన పడ్డాయి. ఇక్కడ నివసించే వందలాది జనం చాలా వరకూ రైతులు, పశు పోషకులు.
''మేం అడవి దగ్గరికి వెళ్లగానే ఈ చీమలు మా మీదకు ఎక్కేస్తాయి. వెంటనే శరీరం మీద దద్దుర్లు వస్తాయి. దురద పుడుతుంది. మేం తాగటానికి నీళ్లు కూడా తీసుకెళ్లలేకపోతున్నాం. ఎందుకంటే ఆ చీమలు నీటిని కూడా చుట్టుముడతాయి. ఏం చేయాలో మాకు తెలియటం లేదు'' అని 55 ఏళ్ల వయసున్న రైతు సెల్వన్ వాపోయారు.
అడవిలో ఈ చీమలను గత కొన్నేళ్లుగా చూస్తున్నామని.. కానీ ఇవి ఇంత భారీ సంఖ్యలో గ్రామాల్లో ప్రత్యక్షమవటం, ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేయటం ఇదే మొదటిసారి అని ఈ గ్రామాల ప్రజలు బీబీసీ తమిళ్‌తో చెప్పారు.
అడవికి సమీపంలో నివసించే పశు పోషకులు కొందరు.. ఈ చీమల దండయాత్ర కారణంగా తాము అక్కడి ఇళ్లు ఖాళీ చేసి దూరంగా వెళ్లామని చెప్తున్నారు.
''మా ఇల్లంతా ఈ చీమలతో నిండిపోవటంతో ఆ ఇల్లు వదిలేసి ఊర్లోకి వచ్చాను. వాటిని మేం నియంత్రించలేక పోతున్నాం. ఆ చీమలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి'' అని నాగమ్మాళ్ తెలిపారు. ఆమె గొర్రెల మీద ఆ చీమలు దాడి చేశాయి.

ఈ పరిస్థితిపై సమగ్రంగా సర్వే చేసి నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు స్థానిక అటవీ అధికారి ప్రభు బీబీసీతో చెప్పారు. ఆ నివేదిక లభించాక తాను దీని మీద స్పందించగలనని పేర్కొన్నారు.
ఆ చీమలు మామూలు చీమల్లాగానే కనిపిస్తాయని ప్రభుత్వ పశు వైద్యుడు డాక్టర్ సింగముత్తు బీబీసీకి వివరించారు.
''అవి అంతగా ఎందుకు వ్యాపించాయనేది మాకు తెలీదు. వాటిని నియంత్రించటం ఎలాగన్నది కూడా తెలీదు. మనుషులు, పశువులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఇదీ కారణం అని నిర్దిష్టంగా చెప్పలేం'' అని ఆయన పేర్కొన్నారు.
పశువులను మేత కోసం అడవికి పంపించవద్దని గ్రామస్తులకు సూచించినట్లు ఆయన చెప్పారు.
ఇదిలావుంటే.. ఈ చీమల దాడిలో పాములు, కుందేళ్లతో పాటు తమ పశువులు కూడా చనిపోయాయని గ్రామస్తులు వాపోతున్నారు.
వందలాది చీమలు చిమ్మిన ఫోర్మిక్ యాసిడ్ ఆ జంతువుల కళ్లు దెబ్బతిని ఉంటాయని డాక్టర్ బైద్య పేర్కొన్నారు. అయితే ఈ చీమలు నిర్దిష్టంగా కళ్లను లక్ష్యం చేసుకుని దాడి చేస్తాయా అనే విషయం ఇంతకుముందు ఎక్కడా నమోదు కాలేదని చెప్పారు. ఈ యాసిడ్ వల్ల మనుషుల్లో అలర్జిక్ రియాక్షన్లు రావచ్చునని, అది ప్రాణాలకు అపాయం కాకపోవచ్చునని వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, @WetTropicsMA
ఈ చీమల దండు పెరుగుతూ పోవటం..ఈ ప్రాంతంలో జీవావరణం మీద ప్రతికూల ప్రభావం చూపించవచ్చునని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఈ చీమలు తొలుత ఆస్ట్రేలియాలోని క్రిస్‌మస్ ఐలండ్ మీద దండయాత్ర చేసినపుడు.. అక్కడి స్థానిక చీమల మీద దాడి చేసి పారదోలాయని, వాటి ఆహార వనరులను ఇవి స్వాధీనం చేసుకున్నాయని డాక్టర్ బైద్య తెలిపారు. ఆ దీవిలో లక్షలాది ఎర్ర పీతలను కూడా ఈ చీమలు చంపేసినట్లు చెప్పారు.
స్థిరంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఈ చీమలు విపరీతంగా వ్యాపించి ఉండవచ్చునని కీటక శాస్త్రవేత్త డాక్టర్ ప్రియదర్శన్ ధర్మరాజన్ అభిప్రాయపడ్డారు.
''పర్యావరణంలో ఉష్ణోగ్రత పెరిగినపుడు వీటి జీర్ణక్రియ తీరు కూడా మారుతుంది. అందువల్ల ఇవి మరింత ఎక్కువగా తింటాయి. అది కారణం కావచ్చు. కానీ గణాంకాలు, సమాచారం లేకుండా ఇదీ కారణమని నిర్ధారించలేం'' అని ఆయన చెప్పారు.
''ఈ చీమలు వ్యాపించిన ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం సేకరించి, విశ్లేషించాల్సి ఉంటుంది'' అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ప్రేమలో విఫలమయ్యారా? ఆ బాధ నుంచి కోలుకోవడం ఎలా
- నిరుద్యోగం పెరుగుతున్న వేళ, జీవనోపాధికి భరోసా ఇస్తున్న ‘గిగ్ వర్క్’
- వేలంలో కొన్న సూట్‌కేసులు, ఇంటికి తెచ్చి చూస్తే అందులో మానవ అవశేషాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













