బాంబు పేలుడులో గాయపడి బోనులో బతికిన ఏనుగు మళ్లీ స్వేచ్ఛగా అడవిలోకి ఎలా వెళ్లిందంటే...

ఫొటో సోర్స్, S.Booominathaan
రివాల్డో. ఒక ఏనుగు. దాని తొండం ఒక పేలుడులో తెగిపోయింది. అడవి సమీపంలోని ఓ గ్రామం దగ్గర మనుషులు పెట్టే తిండి తింటూ గడిపేది. కానీ జనం భయపడేవారు. ఓ రోజు అటవీ అధికారులు దానిని బంధించి బోనులో పెట్టారు. ఆ బోనులో నుంచి ఆ ఏనుగు ఎలా బయట పడింది? తిరిగి అడవికి ఎలా చేరింది? స్వేచ్ఛా వాయువులను ఎలా పీల్చుకోగలిగింది? అనేది ఆసక్తికరమైన కథ.
తమిళనాడులోని ముడుమలై టైగర్ రిజర్వ్ ఈ ఏనుగు నివాస ప్రాంతం
2013లో ఓ నాటు బాంబు పేలి రివాల్డో తొండం 30 సెంటీమీటర్ల మేర తెగిపోయిందని స్థానికులు చెప్తారు.
చట్టవ్యతిరేకమే అయినప్పటికీ.. పంటలను తినే అడవి పందులను చంపటానికి పండ్లలో నాటు బాంబులు దాచిపెట్టి ప్రయోగించటం ఇంకా జరుగుతూనే ఉంది.
అలా ఓ బాంబు పేలి గాయపడ్డ రివాల్డోను గుర్తించారు. అది గాయపడటానికి బాధ్యులు ఎవరనేది తెలియలేదు.
గాయం కారణంగా రివాల్డో సొంతంగా తిండి తినలేకపోయేది.
అటవీ అధికారులు, అడవి సరిహద్దులో ఉన్న వాళాయ్ తొట్టమ్ గ్రామస్థులు ఆ ఏనుగుకు తిండి పెట్టటం మొదలుపెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
స్థానికులు పనస, కొబ్బరి, పుచ్చకాయ, బొప్పాయి వంటి పండ్లను రివాల్డోకు తినిపించేవారని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ సభ్యుడైన మోహన్ రాజ్ బీబీసీకి చెప్పారు. రివాల్డోను అడవిలో వదిలిపెట్టే అవకాశాలను అంచనా వేయటానికి ఏర్పాటైన బృందంలో ఆయన సభ్యుడిగా ఉన్నారు.
''ఇక్కడి రిసార్టులకు వచ్చే జనం కూడా ఆ ఏనుగుకు తిండి పెట్టేవారు. దీంతో ఈ ప్రాంతాలకు ఈ ఏనుగు తరచుగా వస్తుంది. ఇక్కడ అందరికీ బాగా తెలిసిపోయింది. గ్రామంలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ తిరుగుతుంది'' అని ఆయన వివరించారు.
''కానీ అడవి ఏనుగుకు ఇది మంచిది కాదు. ఘర్షణలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ఏనుగును ఒక శిబిరానికి తరలించారు'' అని చెప్పారాయన.
అయితే దీనిని వన్యప్రాణుల ఉద్యమకారులు వ్యతిరేకించారు. ఎలిఫెంట్ కారిడార్‌గా ప్రకటించిన సిగూర్ మైదానం నుంచి ఈ ఏనుగు వచ్చిందని, ఈ అడవి ఏనుగును దాని ఆవాసానికి తప్ప ఎక్కడికి పంపిస్తారని వారు వాదించారు.
''శిబిరంలో ఉంచటమనేది యావజ్జీవ కారాగార శిక్ష వంటిదని, అలాంటి శిక్ష అనుభవించటానికి ఆ ఏనుగు చేసిన నేరమేమిటని కూడా వారు వాదించారు'' అని మోహన్ రాజ్ పేర్కొన్నారు.
రివాల్డోను పట్టుకోవాలని 2015లోనే డిమాండ్లు మొదలయ్యాయి. కానీ అప్పుడు ఈ విషయం పెద్దగా ప్రచారంలోకి రాలేదు.
అయితే 2020లో ఈ డిమాండ్లు మరింత బలపడ్డాయి. చివరికి 2021లో ఈ ఏనుగును పట్టుకున్నారని ప్రొఫెసర్ టి.మురుగవేల్ చెప్పారు. రివాల్డోను విడుదల చేయాలంటూ ఆయన ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఫొటో సోర్స్, S.Booominathaan
ఆ ఏనుగు తరచుగా వచ్చే వాళాయ్ తొట్టమ్ చెక్‌పోస్ట్ దగ్గర.. బలమైన కలపతో చేసిన పెద్ద బోను - క్రాల్‌ను ఉంచారని మురగవేల్ తెలిపారు. ఈ బోన్లను ఏనుగులు ధ్వంసం చేయలేవు. అడవి ఏనుగులను నియంత్రించటానికి, వాటికి శిక్షణ ఇవ్వటానికి ఈ బోనులు ఉపయోగిస్తారు.
యూకలిప్టస్‌తో చేసిన ఈ బోనులో రివాల్డోను బంధించటానికి పనసపండ్లు, బొప్పాయి పండ్లు ఎరగా పెట్టారు. ఆ పండ్లను తినటానికి ఆ ఏనుగు నడుచుకుంటూ బోనులోకి వచ్చింది. దీంతో దానిని సులభంగా బంధించారు.
అటవీశాఖ ఆ బోనులోనే ఏనుగును మచ్చిక చేసుకోవటం ప్రారంభించిందని, కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని మురుగవేల్ అంటారు.
ఆ ఏనుగును తాము మచ్చిక చేసుకోవటం లేదని, దాని గాయాలకు చికిత్స చేస్తున్నామని కోర్టుకు చెప్పారు.
''బోను పైకప్పును తొలగించటానికి రివాల్డో ప్రయత్నించేది. రాత్రంతా ఘీంకరిస్తూ ఉండేది. దీనిపై మద్రాస్ హైకోర్టుకు మేం నివేదిక సమర్పించాం. అడవి ఏనుగులను మచ్చిక చేసుకోవటం కోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని చెప్తూ మేం కోర్టు ధిక్కార నోటీసులు పంపించాం. కానీ తాము కేవలం దానికి చికిత్స చేస్తున్నామని అటవీ శాఖ చెప్పింది'' అని మురగవేల్ తెలిపారు.
ఈ పరిస్థితుల్లో 2021 జూలైలో డాక్టర్ శేఖర్ కుమార్ నీరజ్.. తమిళనాడుకు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ అయ్యారు. ఆయన ముందుకు వచ్చిన మొదటి కేసు రివాల్డో కేసు.
రివాల్డో స్థానిక ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తుండటం వల్ల, దాని నుంచి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉండటం వల్ల.. ఆ ఏనుగును బోనులోనే ఉంచినట్లు డాక్టర్ నీరజ్ చెప్తున్నారు.
''ఒక బృందం ఆ ఏనుగును పర్యవేక్షిస్తుండేది. దానిని తెప్పక్కాడు ఎలిఫెంట్ క్యాంప్‌కు తరలించాలని, క్యాంప్ ఎలిఫెంట్‌గా ఉపయోగించాలని ప్రణాళిక'' అని తెలిపారు.
అలాగే.. ఆ ఏనుగు తొండం తెగిన విషయంతో పాటు.. దానికి ఒక కంట్లో క్యాటరాక్ట్ ఉందని, వాటివల్ల ఆ ఏనుగు అడవిలో జీవించగలిగే సామర్థ్యం తగ్గిపోతుందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు.
''ఈ కేసును నేను విశ్లేషించినపుడు.. 40 ఏళ్ల వయసున్న ఏనుగును బోనులో ఎందుకు ఉంచాల్సి వచ్చిందో స్వయంగా చూడాలని నేను నిర్ణయించుకున్నాను. జూలై 10వ తేదీన మొదటిసారి నేను ఈ ఏనుగును చూశాను. రివాల్డో ఆరోగ్యంగా ఉన్నాడని, తెలివైన వాడని, మృదువైన వాడని చూసిన మొదటిసారే నాకు అనిపించింది'' అని డాక్టర్ నీరజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Mohan Raj
ఈ ఏనుగుకు చికిత్స చేయటం కోసం దానిని బంధించినట్లు కోర్టుకు నివేదించారని, కానీ తాను వన్యప్రాణి వైద్యులను సంప్రదించినపుడు రివాల్డోకు ఇంకేమీ చికిత్స అవసరం లేదని చెప్పారని ఆయన తెలిపారు.
''ఆ రోజు రాత్రి నేను వివిధ రంగాలకు చెందిన 10 మంది నిపుణులతో మాట్లాడాను. ఆ మరుసటి రోజు కూడా నేను రివాల్డోను పరిశీలించాను. దానికి మావట్లు తిండి పెడుతున్నారు'' అని వివరించారు.
అప్పుడు ఆయన అన్నీ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు - రివాల్డోను తిరిగి అడవికి పంపించాలని.
అప్పటికి రివాల్డో దాదాపు 75-80 రోజులుగా బోనులోనే ఉంది. మావట్లు దానిని పాక్షికంగా మచ్చిక చేశారు కూడా. దానిని అడవిలో వదిలిపెడితే అది మళ్లీ గతంలో మాదిరిగా తిరిగి మనుషుల ఆవాసాల్లోకి వస్తుందేమో, ఆస్తులను ధ్వంసం చేస్తుందేమో అనే భయాలు కూడా కలిగాయి.
అయితే అధికారులు తమ ప్రణాళికతో ముందుకు సాగాలని నిశ్చయించుకున్నారు.
ఇందుకోసం కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు:
- రివాల్డోను వదిలిపెట్టే అడవిలో దానికి ఇష్టమైన ఆహారం ఆకులు, అలములు ఎక్కువగా ఉండాలి.
- ఆ ఏనుగును ఉంచిన బోనుకు చాలా దూరంగా అడవి ఉండాలి.
- ఆ ప్రాంతంలో నీటి వనరులు, చిత్తడి నేలలు తగినంతగా ఉండాలి.
- ఆ ఏనుగు ఆవాస ప్రాంతమైన వాళాయ్ తొట్టమ్‌కు ఈ ప్రాంతం విడిగా ఉండకూడదు.
- ఆ ప్రాంతంలో మానవ నివాసాలు ఉండకూడదు.
- అదే ప్రాంతంలో మరో ఏనుగు ఉన్నట్లయితే వీటి మధ్య ఘర్షణ తలెత్తవచ్చు కాబట్టి ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
చిక్కాల అడవికి ప్రయాణం...
ఈ అంశాలన్నిటిని బట్టి చూస్తే.. చిక్కాల అడవి అనువుగా ఉన్నట్లు కనిపించింది. రివాల్డోను బోనులో ఉంచిన ప్రదేశానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉందా అడవి.
మరో సవాలు ఏమిటంటే.. మనుషులు తినిపిస్తే తినటానికి రివాల్డో అలవాటు పడివుంది. కాబట్టి అది తను సహజంగా తినే విధానానికి తిరిగి అలవాటు పడేలా చేయాలి. దీంతో ఈ ఏనుగు ఆహారాన్ని క్రమంగా మార్చుతూ వచ్చారు. తొలుత 90 శాతం మనుషులు ఇచ్చే ఆహారం, 10 శాతం సహజ ఆహారంగా ఉండగా.. దానిని 90 శాతం సహజ ఆహారానికి, 10 శాతం మనుషులు ఇచ్చే ఆహారానికి మార్చుకుంటూ వెళ్లారు.
ఈ ఏనుగు రక్తం, మూత్రం, డీఎన్ఏ నమూనాలను సేకరించారు. దీనికి డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్టరాల్, థైరాయిడ్ సమస్యలతో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ ఉన్న రేడియో కాలర్‌ను, వైర్‌లెస్ సిస్టమ్‌లు అన్నీ సిద్ధం చేశారు.
2021 ఆగస్టు 2వ తేదీన తెల్లవారటానికి ముందు 3:00 గంటల సమయంలో రివాల్డోను అడవిలో వదిలిపెట్టే ప్రక్రియ మొదలైంది. దాదాపు 30 మంది వన్యప్రాణి నిపుణులు, జంతువైద్యులతో పాటు సుమారు 100 మంది అటవీ సిబ్బంది ఈ పనిలో నిమగ్నమయ్యారు.
కానీ చివర్లో ఒక అడ్డంకి ఎదురైంది.

ఫొటో సోర్స్, S.Booominathaan
రొనాల్డోను అడవిలోకి తీసుకెళ్లటానికి ఏర్పాటు చేసిన ట్రక్కులోకి ఎక్కటానికి ఆ ఏనుగు తిరస్కరించింది.
ఏనుగును ఆ ట్రక్కులోకి ఎక్కించటానికి దాదాపు 4 గంటల పాటు తిప్పలు పడ్డారు. తరువాత వెటర్నరీ డాక్టర్ల సలహాతో రొనాల్డోకు స్వల్పమోతాదులో మత్తుమందు ఇచ్చారు. దీంతో అది ట్రక్కులోకి ఎక్కింది.
ఉదయం 6:30 గంటల సమయంలో ప్రయాణం మొదలైంది. ట్రక్కు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఏనుగును అడవిలోకి తీసుకెళుతోంది.
ఉదయం 9:00 గంటల సమయంలో వారు అడవి వద్దకు చేరుకున్నారు. ఏనుగును ట్రక్కు నుంచి కిందకు దింపటానికి మరో గంటన్నర పాటు కష్టపడ్డారు.
ఎట్టకేలకు రివాల్డో కిందికి దిగింది. కొంతసేపు కదలకుండా నిలబడింది. ఆ తర్వాత అడవిలోకి వెళ్లింది.

ఫొటో సోర్స్, Mudumalai tiger reserve team
అటవీ అధికారులకు షాక్...
ఒక డ్రోన్ కొంత దూరంగా ఉంటూ రివాల్డోను అనుసరించింది. డాక్టర్ శేఖర్ కుమార్ నీరజ్‌తో పాటు ముగ్గురు సభ్యుల బృందం, వారి వెనుక 15 మందితో కూడిన మరో బృందం కూడా ఏనుగును కొంత దూరంగా ఫాలో అయ్యాయి.
అడవిలో మరింత లోపలికి వెళ్లాక ఆ ఏనుగు డ్రోన్ దృష్టి నుంచి, దానిని అనుసరిస్తున్న బృందాల కళ్లకు కనిపించకుండా మాయమైంది.
ఏనుగు మెడకు అమర్చిన రేడియో కాలర్ నుంచి శాటిలైట్ ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ ఏనుగు మార్గాన్ని ట్రాక్ చేశారు.
అయితే డాక్టర్ నీరజ్‌కు, ఆయన బృందానికి నిర్ఘాంతపరిచే విషయం తెలిసింది.

ఫొటో సోర్స్, Mudumalai tiger reserve team
రివాల్డో తనను పట్టుకున్న చోటుకే తిరిగి వచ్చింది.
ఈ ఏనుగు 24 గంటల్లో సునాయాసంగా 40 కిలోమీటర్లు నడిచి వచ్చేసింది.
''పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది'' అన్నారు డాక్టర్ నీరజ్.
ఆ వెంటనే అటవీ అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రామం చుట్టూ ఉన్న ప్రాంతాల మీద నిరంతరం దృష్టి పెట్టారు.
అవసరమైతే రివాల్డోను నియంత్రించటం కోసం మూడు కుమ్కీ ఏనుగులను కూడా సిద్ధంగా ఉంచారు. అడవి ఏనుగులను నియంత్రించటానికి, పట్టుకోవటానికి శిక్షణనిచ్చిన ఏనుగులను కుమ్కీ ఏనుగులు అంటారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
రివాల్డోకు తిండి పెట్టవద్దని స్థానికులకు గట్టిగా చెప్పారు. అడవి నుంచి ఈ గ్రామానికి వచ్చే దారులన్నిటినీ మూసివేశారు. సంప్రదాయంగా వాడే మిరప కంచెలను ఇందుకు ఉపయోగించారు.
కానీ రివాల్డో ఈ గ్రామంలోకి రాలేదు. మాసినాగుడి సమీపంలోని అడవుల్లో తిరుగుతూ ఉండింది. అటవీ అధికారులు దాని కదలికలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
తరువాతి 15 రోజుల్లో రివాల్డో మరో రెండు ఏనుగులతో స్నేహం చేసిందని, వాటితో కలిసి తిరగటం మొదలు పెట్టిందని డాక్టర్ నీరజ్ చెప్పారు.
''రివాల్డో శిబిరంలో ఉన్నపుడు కూడా దానిని కలవటానికి మరో రెండు అడవి ఏనుగులు వచ్చేవి. ఆ రెండు ఏనుగులే అడవిలో ఉన్నాయి. తన స్నేహితుల మధ్య ఈ ఏనుగు సంతోషంగా ఉండటం చూశాం'' అని చెప్పారాయన.

ఫొటో సోర్స్, Dr Shekhar K Niraj
అడవి ఏనుగులతో స్నేహం...
2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రివాల్డో మీద నిరంతర పర్యవేక్షణను కొనసాగించారు. అంతా ప్రశాంతంగానే ఉండింది. రివాల్డో ప్రయాణం సత్యమంగళం, ముడుమలై, బండీపూర్‌ల వరకూ సాగింది.
ఇదిలావుంటే.. మురళీధరన్ అనే ఒక వ్యక్తి మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. రివాల్డోను బలవంతంగా అడవిలోకి పంపించకూడదని, మరో ఆరు ఆడ ఏనుగులు గల ఎం.ఆర్.పాలాయం క్యాంపుకు ఈ ఏనుగును తరలించాలని అతడి వాదన.
ఇరుపక్షాల వాదనలు విన్న తమిళనాడు ప్రధాన న్యాయమూర్తి.. వైకల్యాలను అధిగమించి సాధారణ జీవితం సాగించే ఇతరుల లాగానే, ఏనుగులు కూడా తమ వైకల్యాలతో జీవించాల్సిందేనని చెప్పారు.
''అంతేకాదు.. ఆ ఏనుగు ఆరోగ్యం మెరుగుపడినందున దానిని విడుదల చేశారు. ఆ ఏనుగు తినటానికి, శ్వాస తీసుకోవటానికి కష్టపడుతోందన్న పిటిషనర్ వాదనకు ఆధారాలేమీ లేవు'' అని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఏనుగును క్యాంపుకు తరలించాలన్న పిటిషనర్ వినతిని తిరస్కరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఏనుగులు అడవుల్లో స్వేచ్ఛగా జీవిస్తున్నపుడు వాటి జనాభా పెరుగుతుందని తమిళనాడు పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు విభాగానికి అదనపు ముఖ్య కార్యదర్శి సుప్రియా సాహు బీబీసీతో చెప్పారు.
అలాగే.. వన్యప్రాణుల సంరక్షణ సుస్థిరంగా ఉండాలి. శిబిరంలో బంధించిన ఏనుగు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఆపరేషన్ రివాల్డో లాగా ఆ ఏనుగులను తిరిగి అడవుల్లో వదిలిపెడితే.. వాటిని పర్యవేక్షించటానికి, అవసరమైన పక్షంలో చికిత్స చేయటానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది'' అని పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
రివాల్డోను తిరిగి అడవిలోకి వదిలి పెట్టిన క్షణం డాక్టర్ నీరజ్‌కు ఇంకా గుర్తుంది. ఆ ఏనుగు వెళ్లటానికి కొంతసేపు తటపటాయించినా కానీ.. అడవి నేల మీద అడుగు పెట్టిన క్షణం తన తొండంతో కొంత మట్టిని తీసుకుని తన మీద చల్లుకుంది.
''ఈ ప్రవర్తన అడవి ఏనుగులకే ఉండే ప్రత్యేకమైన ప్రవర్తన. మచ్చిక చేసుకున్న ఏనుగులు ఇలా చేయవు. అడవిలో మనుగడ సాగించే తన సహజ స్వభావాన్ని రివాల్డో కోల్పోలేదని ఆ క్షణంలో మాకు అనిపించింది'' అన్నారాయన.
ఓ అడవి ఏనుగు మట్టి తీసుకుని తన మీద చల్లుకోవటం.. నేలతల్లిని ముద్దాడటం వంటిది. రివాల్డో తన చర్యల ద్వారా తను తిరిగి స్వాతంత్ర్యాన్ని పొందానని చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- మనం ఎందుకు చనిపోతాం? సంతాన సామర్థ్యం.. వృద్ధాప్యానికీ, మరణానికీ దారితీస్తుందా?
- అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి
- తల్లిపై అత్యాచారం జరిగిన 28 ఏళ్ల తర్వాత నిందితులపై కేసు పెట్టి అరెస్టు చేయించిన కొడుకు
- హమీదా బాను: 20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో కనిపించిన భారతీయ మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













