కుశాల్ శర్మ: ఏనుగులు మాట్లాడే భాష ఆయనకు అర్థమవుతుంది

ఏనుగులు

కుశాల్ కొన్వార్ శర్మను అందరూ ఏనుగుల డాక్టర్ అని పిలుస్తుంటారు. ఏనుగుల సంరక్షణలో ఆయన 35 ఏళ్ల నుంచీ గడుపుతున్నారు. భారత్, ఇండోనేసియా అడవుల్లో ఆయన వేల ఏనుగుల ప్రాణాలను కాపాడారు. ఆయనపై బీబీసీ హిందీకి చెందిన దిలీప్ కుమార్ శర్మ అందిస్తున్న కథనం.

‘‘ఏనుగుల దగ్గర ఉండేటప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది’’అని శర్మ వివరించారు. ‘‘నేను కుటుంబంతో గడిపే సమయం కంటే ఏనుగులతోనే ఎక్కువ సమయం గడుపుతుంటాను’’.

60 ఏళ్ల శర్మ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం అసోంలో పెరిగారు. 2017లో చేపట్టిన సర్వే ప్రకారం.. భారత్‌లోని 27,000కు పైచిలుకు ఏనుగుల్లో దాదాపు 5,000 ఇక్కడే ఉన్నాయి.

ఆయనకు ఏనుగులు మాట్లాడే ‘‘భాష’’ కూడా అర్థం అవుతుంది. ‘‘వాటికి ఆహారం తినిపించడంతోపాటు సంజ్ఞలతో మాట్లాడుతుంటాను. ఇక్కడ చాలా ఏనుగులు నన్ను గుర్తుపడతాయి’’.

ఆయన చేసిన విశేష కృషికిగాను ఈ ఏడాది ప్రారంభంలో ఆయన్ను పద్మ శ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. 1984 ఓ జబ్బు పడ్డ ఏనుగుకు ప్రొఫెసర్ సుభాష్ చంద్ర పాఠక్ సాయంతో ఆయన చికిత్స చేశారు. అప్పటి నుంచి మొదలుపెట్టి.. ఇప్పటివరకు పది వేలకుపైనే ఏనుగులకు చికిత్స అందించానని ఆయన తెలిపారు.

‘‘మొదటిసారి ఏనుగులకు చికిత్స అందిచేందుకు మానస్ నేషనల్ పార్క్‌కు వెళ్లడం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ రోజు నేను చాలా ఉత్సాహంతో ముందుకు వెళ్లాను’’.

ఏనుగులు

బాల్యం నుంచే అనుబంధం

ఏనుగులతో తన అనుబంధం బాల్యం నుంచే ముడిపడింది. చిన్నప్పుడు తన ఇంట్లో లక్ష్మీ అనే ఆడ ఏనుగు ఉండేది. దాన్ని శర్మ కుటుంబమే పెంచేది.

‘‘నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు లక్ష్మీపై కూర్చొని ఊరంతా తిరిగేవాణ్ని. నాకు తనతో మంచి అనుభవాలున్నాయి. అప్పుడే ఏనుగులపై నాకు ప్రేమ పుట్టింది’’.

ఈ ప్రేమ నానాటికీ బలపడుతూ వచ్చింది. డాక్టర్ కావడంతో ఏనుగులకు ఆయన మరింత చేరువయ్యారు. ముఖ్యంగా వర్షాకాలంలో అసోంలో ఏనుగులకు ఆయన మరింత చేరువ అవుతుంటారు. ఇక్కడ వర్షాకాలంలో వరదలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి వన్యప్రాణుల ప్రాణాలకే ముప్పు తెస్తుంటాయి.

యునెస్కో గుర్తింపు పొందిన ద కాజీరంగా నేషనల్ పార్క్ అలాంటి ప్రాంతాల్లో ఒకటి. తాజాగా గత జులైలోనూ ఇక్కడ వరదలు ముంచెత్తాయి. దీంతో 51 జంతువులు పార్క్‌లో మరణించాయని అధికారులు వెల్లడించారు.

‘‘పార్క్‌లో వరదలు ముంచెత్తినప్పుడు జంతువులకు చాలా సమస్యలు చుట్టుముడతాయి. చాలా జంతువులు మరణిస్తాయి. ఏనుగులు కూడా వరదల్లో కొట్టుకుపోతాయి’’అని శర్మ తెలిపారు. జంతువులను సంరక్షించడంలో అధికారులకు శర్మ సాయం చేస్తారు.

‘‘గున్న ఏనుగులు తల్లి ఏనుగుల నుంచి విడిపోవడం సర్వసాధారణం. అలాంటి సమయాల్లో వాటికి మరింత సంరక్షణ అవసరం. అందుకే వరదల సమయంలో వాటికి సాయం చేయడానికి వెళ్తుంటాను’’.

ఏనుగులు

ఆయనే వెళ్తారు..

వరదల సమయంలో ఆయన రావాలని ఎవరూ అధికారికంగా పిలవరు. ‘‘అయితే, ప్రతిసారే నేనే వెళ్తాను. ఎందుకంటే వీలైనన్ని ఎక్కువ జంతువులను కాపాడాలని భావిస్తాను’’.

అసోంలోని 3,00,000 కి.మీ. పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వేల కొద్దీ ఏనుగులకు ఆయన సేవ చేశారు. చిన్న నాటి ఏనుగు లక్ష్మీతోపాటు మరో ఏనుగు గీతతోనూ ఆయనకు మంచి అనుభవముంది. గీత.. కాజీరంగా నేషనల్ పార్క్‌లో ఉండే ఓ ఆడ ఏనుగు.

‘‘నేను అమెరికాలో ఉన్నప్పుడు.. కాజీరంగా పార్క్‌లో తిరుగుతున్న గీతను ఎవరో కాల్చేశారని సమాచారం అందింది. అయితే, అదృష్టవశాత్తు ఐదు బుల్లెట్లలో ఒకటి కూడా కీలకమైన అవయవాలను తాకలేదు. నాకు చాలా ఆందోళనగా అనిపించింది. వెంటనే పర్యటనను రద్దు చేసుకొని భారత్‌కు వచ్చేయాలని అనిపించింది’’.

‘‘అయితే, ఫోన్ సాయంతో గీతకు అందించాల్సిన చికిత్స గురించి సూచనలు ఇచ్చాను. వారం తర్వాత భారత్‌కు వచ్చిన వెంటనే నేరుగా గీతను కలిసేందుకు పార్క్‌కు వెళ్లాను’’.

‘‘తనను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాను. తన శరీరంలోకి దూసుకెళ్లిన తూటాలన్నీ బయటకు తీస్తానని చెప్పాను. మెటల్ డిటెక్టర్ సాయంతో తన శరీరంలోని బుల్లెట్లను గుర్తించాను. శస్త్రచికిత్స సాయంతో మొదటి మూడు తూటాలు తీయగలిగాను’’.

అయితే, తర్వాతి రెండు బుల్లెట్లు శరీరం లోపలకు చొచ్చుకెళ్లాయి. వాటిని బయటకు తీయడం చాలా కష్టమైంది. ‘‘అయినప్పటికీ చికిత్స కొనసాగించాను. ఐదు శస్త్రచికిత్సల తర్వాత తూటాలన్నీ బయటకు తీయగలిగాను. గీత ఇప్పటికీ బతికే ఉంది. చాలా ఆరోగ్యంగా ఉంది కూడా..’’.

ఏనుగులు

ఫొటో సోర్స్, Getty Images

ముప్పులూ ఉంటాయి...

తన వృత్తిని శర్మ ప్రేమించేటప్పటికీ.. దీనిలో ముప్పులుంటాయని ఆయనకు తెలుసు.

తన వృత్తిలో భాగంగా చాలాసార్లు ఆయన తన జీవితాన్ని ఫణంగా కూడా పెట్టారు. ‘‘కొన్నిసార్లు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు నేను ఎలా బతికి బయటపడ్డాను అని’’.

‘‘ఒకసారి అయితే, రాత్రి మొత్తం ఒక చెట్టుపై గడపాల్సి వచ్చింది. ఓ అడవి ఏనుగుకు మత్తు మందు ఇవ్వడం కోసం అలానే కూర్చున్నాను. మొత్తానికి దాన్ని పట్టుకొని చికిత్స అందించాను’’.

ఎన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ తన వృత్తి తనకు సంతృప్తిని ఇస్తుందని ఆయన వివరించారు. తన కుమార్తె తన నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కూడా పశు వైద్యంలో పట్టా అందుకున్నారు. తండ్రికి ఆమె సాయం చేస్తుంటారు.

‘‘ఈ బాధ్యతను నా కుమార్తె ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను. ఆమె కూడా నాలాగే ఏనుగులకు సాయం చేయాలి’’.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)