కరోనా వైరస్‌: ఇండియాలో వైరస్‌ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్‌ వేవ్‌ ఉంటుందా?

కరోనావైరస్ కేసులు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, సౌతిక్‌ బిశ్వాస్‌
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్‌

వచ్చే ఏడాది ఆరంభం నాటికి భారతదేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చే అవకాశం ఉందా? అవుననే అంటున్నారు సైంటిస్టులు. ఈ సెప్టెంబర్‌లో ఇండియాలో వైరస్‌ వ్యాప్తి అత్యున్నత దశ (పీక్‌ స్టేజ్‌)కు చేరుకుందని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి ఇది అదుపులోకి రావచ్చని గణాంకాల ఆధారంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, గుంపులు గుంపులుగా ఒకచోట చేరకుండా ఉండటం, భౌతిక దూరాన్ని పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడంలాంటి నియమాలన్నీ పాటిస్తేనే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు భారతదేశంలో దాదాపు 75లక్షలకు పైగా కోవిడ్‌-19 కేసులు నమోదు కాగా, లక్షా 14వేలమంది మరణించారు. ప్రపంచ జనాభాలో ఆరింట ఒకవంతుమంది ఉన్న భారతదేశం, కేసులలో కూడా అదే స్థాయిలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా నమోదైన మృతుల్లో 10% మరణాలు భారతదేశంలోనే సంభవించాయి. వైరస్‌ బాధితుల్లో 2శాతంమంది మృతితో ప్రపంచంలో అతి తక్కువ మృతులను నమోదు చేసిన దేశాలలో ఒకటిగా ఇండియా నిలిచింది.

మార్చిలో లాక్ డౌన్ ప్రకటించకపోయినట్లే మృతుల సంఖ్య 23రెట్లు పెరిగేదని ప్రభుత్వం వేసిన నిపుణులు కమిటీ అంచనా వేసింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్చిలో లాక్ డౌన్ ప్రకటించకపోయినట్లే మృతుల సంఖ్య 23రెట్లు పెరిగేదని ప్రభుత్వం వేసిన నిపుణులు కమిటీ అంచనా వేసింది

సెప్టెంబర్‌ రెండోవారానికి భారతదేశంలో కేసుల నమోదు అత్యున్నత స్థాయికి చేరింది. అప్పటికే దేశంలో పదిలక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి కేసుల నమోదు (కేస్‌లోడ్) క్రమంగా తగ్గుముఖం పట్టింది.

గత వారంలో రోజువారి సరాసరి కేసులు 62,000గాను, మరణాలు 784గాను నమోదయ్యాయి. చాలా రాష్ట్రాలలో రోజువారి మరణాల సంఖ్య తగ్గింది. టెస్టింగ్‌ మాత్రం యథావిధిగా కొనసాగింది. గత వారంలో రోజుకు దాదాపు పది లక్షల టెస్టులు జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఈ గణాంకాలను అధ్యయనం చేయడానికి మైక్రోబయాలజిస్టు, రాయల్ సొసైటీ ఆఫ్‌ లండన్‌కు ఫెలోగా ఎంపికైన తొలి భారతీయ డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ సహా ఏడుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ప్రజలు ఎలా వైరస్‌బారిన పడుతున్నారు, ఏ విధంగా రికవర్‌ అవుతున్నారు, ఎంతమంది లక్షణాలతో ఉంటున్నారు, ఏ స్థాయిలో మరణిస్తున్నారు అన్నది అంచనా వేయడం ఈ కమిటీ విధి.

ఏ మాత్రం లక్షణాలు చూపించని బాధితుల గణాంకాల ఆధారంగా వైరస్‌వ్యాప్తి ప్రస్థానం (ట్రాజెక్టరీ) ఎలా సాగుతుందో కూడా ఈ కమిటీ అంచనా వేస్తుంది.

కరోనావైరస్ కేసులు

లాక్ డౌన్ ప్రభావం ఎంత?

మార్చిలో లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకోకపోయినట్లయితే దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య కోటి 40 లక్షలకు చేరేదని, 26 లక్షల మందికి పైగా మరణించేవారని ఈ కమిటీ అంచనా వేసింది. ప్రస్తుత మరణాల సంఖ్యకు ఇది 23 రెట్లు ఎక్కువ.

విశేషం ఏంటంటే ఉపాధి కోల్పోయి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లకు అసంఖ్యాకంగా వచ్చిన వలస కూలీల ప్రభావం కేసుల సంఖ్య మీద ఏమాత్రం పడలేదని ఈ కమిటీ అభిప్రాయపడింది.

“కేసుల నమోదు అత్యున్నత స్థాయి(పీక్‌)కి చేరడం జూన్‌ నాటికే మొదలైంది. ఈ కారణంగానే దేశంలో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. జనం హడలిపోయారు. కేసుల గ్రాఫ్‌ను లాక్‌డౌన్‌ చాలా వరకు కంట్రోల్‌ చేయగలిగింది’’ అని మతుకుమల్లి విద్యాసాగర్‌ నాతో అన్నారు. ఆయన హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. రాయల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌లో ఆయన కూడా ఫెలో. ఈ అధ్యయన బృందానికి విద్యాసాగర్‌ నాయకత్వం వహిస్తున్నారు.

కరోనావైరస్ కేసులు

కానీ ఇప్పుడు భారతదేశంలో పండగల సీజన్‌ మొదలైంది. ఎక్కడెక్కడో ఉన్నవారంతా తమ ఇళ్లకు చేరుకుంటారు. ప్రయాణాలు, సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్‌లవంటివి రెండువారాల్లో వైరస్‌ వ్యాప్తి గతిని మార్చేయ గలవు. కేరళనే ఉదాహరణగా తీసుకుంటే, సెప్టెంబర్‌ నెలలో జరిగిన ఓనం పండగ తర్వాత కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది.

సరైన రక్షణ చర్యలు తీసుకోకపోతే ఇప్పుడున్న 8 లక్షల యాక్టివ్‌ కేసులు అక్టోబర్‌ చివరి నాటికి 26 లక్షలకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

“ఇప్పుడు మేం వేస్తున్న అంచనాలన్నీ ప్రజలంతా వైరస్‌ నుంచి రక్షణ చర్యలు పాటించినప్పుడే నిజమవుతాయి. సెప్టెంబర్‌ నెలలో భారతదేశం అత్యధిక కేసుల నమోదు దశను అధిగమించింది. అలాగని మనం రిలాక్స్‌ కావడానికి వీలు లేదు. సహజంగా కాస్త రిలీఫ్‌ రాగానే పీడ విరగడైందని ప్రజలు భావిస్తుంటారు’’ అన్నారు ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌.

అయితే ఈ వైరస్‌ వ్యాప్తికి సంబంధించి మరో అత్యున్నత దశ ఉండొచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. తీవ్రమైన చలి, పొగమంచు కాలం రానున్నందున నవంబర్‌లో రెండో అత్యున్నత దశను చూసే అవకాశం ఉందన్నది వారి మాట.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
కరోనావైరస్ కేసులు

భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది?

ఇటీవల మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం శుభపరిణామమే అయినా, దాని ఆధారంగా మహమ్మారి ఉధృతి తగ్గుతోందన్న నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందంటున్నారు నిపుణులు.

“వైరస్‌ వ్యాప్తిలో ఇండియా మొదటి దశను దాటినట్లు అనిపిస్తోంది’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగన్‌లో బయోస్టాటిస్టిక్స్‌ అండ్‌ ఎపిడెమాలజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ భ్రమర్‌ ముఖర్జీ నాతో అన్నారు.

చలికాలంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిలో మరణాలు ఎక్కువగా ఉండొచ్చని డాక్టర్‌ భ్రమర్‌ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.తక్కువమంది వైరస్‌ బాధితులు ఉన్న ప్రాంతంలో వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పట్టణాలు, గ్రామాలలో యాంటీబాడీ సర్వేలు ఎక్కువగా నిర్వహించడం మేలని ఆమె సూచిస్తున్నారు.

“ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు మరో పీక్‌స్టేజ్‌ ఉంటుందని చెబుతున్నాయి. కానీ అది ఏ స్థాయిలో ఉంటుందనేది చెప్పడం కష్టం. ఇప్పుడు చేయగలిగింది వీలైనంత తక్కువమంది ఆసుపత్రికి వచ్చేలా చూడటం, ఆరోగ్య నియమాలు కఠినంగా పాటించడం’’ అన్నారు డాక్టర్‌ ముఖర్జీ.

ఆశావహ దృక్పథంతో ఉండటం, మాస్క్‌ ధరించడం, గుంపులుగా చేరకుండా జాగ్రత్త పడటం, ఆరోగ్య నియమాలు కచ్చితంగా పాటించడం ఇప్పుడు అందరి ముందున్న బాధ్యత.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)