కరోనావైరస్: కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్య సమస్యలు ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కమలేష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భరత్ జునేజాది హరియాణాలోని గురుగ్రామ్. తను కోవిడ్ పాజిటివ్ అని ఆయనకు మేలో తెలిసింది. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండడంతో ఆయనను చికిత్స కోసం ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.
చాలారోజుల చికిత్స తర్వాత ఆయన పూర్తిగా కోలుకున్నారు. కానీ తర్వాత కూడా ఆయనకు అలసట, బలహీనత, శ్వాస ఇబ్బందులు, సరిగా నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి.
“నేను దాదాపు ఏడు రోజులు వెంటిలేటర్ మీద ఉన్నాను. తర్వాత జూన్ 16న నా రిపోర్ట్ నెగటివ్ వచ్చింది. రెండ్రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. కానీ ఆ తర్వాత కూడా నాకు అలసటగా, బలహీనంగా ఉంటోంది. కళ్లు తిరుగుతున్నాయి” అని 51 ఏళ్ల భరత్ జునేజా చెప్పారు.
“మెట్లు ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటోంది. చిన్న విషయాలకే కోపం వస్తుంది. చాలా రోజులు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కూడా భయంకరమైన కలలు వచ్చేవి. డాక్టర్ అదంతా ప్రక్రియలో భాగం అన్నారు. అంతా సర్దుకుంటుందని చెప్పారు” అన్నారు
ఇంజనీర్ అయిన భరత్ జునేజాకు ప్రస్తుతం ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స నడుస్తోంది. ఇప్పుడు ఆయనకు కాస్త మెరుగ్గా ఉన్నట్టు అనిపిస్తోంది.
కరోనావైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. వారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లు తిరగడం, అలసట, తేలికపాటి జ్వరం, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు ఉంటున్నాయి.
భరత్ మాత్రమే కాదు, విదేశాల్లో ఉంటున్న చాలా మంది సోషల్ మీడియా లేదా సర్వేలలో తమ అనుభవాలను చెప్పారు.
ఇటీవల హోంమంత్రి అమిత్ షాకు కోవిడ్-19 రిపోర్ట్ నెగటివ్ వచ్చిన మూడు రోజుల తర్వాత మళ్లీ ఆయన్ను ఆస్పత్రిలో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. కళ్లు తిరిగాయని, ఒళ్లు నొప్పులు ఉన్నాయని ఆయన డాక్టర్లకు చెప్పారు.
దిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇదే నెలలో పోస్ట్-కోవిడ్ క్లినిక్ కూడా ఏర్పాటు చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా సమస్యలు ఎదుర్కుంటున్న రోగులకు ఇక్కడ చికిత్స జరుగుతుంది.
కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చిన తర్వాత కూడా ఆ లక్షణాలు ఉండడంతో చికిత్స అవసరం అవుతున్న చాలా మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
పోస్ట్ కోవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి
ఈ లక్షణాల గురించి వైశాలిలోని మాక్స్ ఆస్పత్రి పల్మనాలజీ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ జోషీ వివరించారు.
“కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత మా దగ్గరకు చాలా మంద రోగులు వస్తున్నారు. వారికి అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లు తిరగడం, స్పృహతప్పడం లాంటి సమస్యలు ఉన్నాయి. వారిలో చాలామందికి రుచి కూడా తెలీడం లేదు. గొంతులో నొప్పి కూడా అలాగే ఉంది” అన్నారు.
ఒక రోగిలో కరోనా ఇన్ఫెక్షన్ ఎంత ఎక్కువగా ఉంటే, కోలుకున్న తర్వాత వారిలో అన్ని ఎక్కువ లక్షణాలు కనిపిస్తాయి. అయితే తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి కూడా తర్వాత బలహీనంగా అనిపించవచ్చు
వీరిలో చాలామందికి బెడ్ మీద నుంచి లేచి బాత్రూంకు కూడా వెళ్లలేనంత బలహీనంగా ఉన్నట్లు అనిపించవచ్చు. అయితే, ప్రతి రోగిలో ఇలాంటి లక్షణాలు కనిపించాల్సిన అవసరం లేదు అని డాక్టర్లు చెప్పారు.
తీవ్ర లక్షణాలతో తన దగ్గరకు వచ్చిన రోగుల్లో 30 నుంచి 35 శాతం మందికి కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ సమస్యలు వస్తున్నాయ”ని డాక్టర్ శరద్ జోషి చెప్పారు.
తేలికపాటి లక్షణాలున్న 30 శాతం రోగుల్లో బలహీనత ఉంది. కొంతమంది రోగుల ఎక్స్-రే బాగానే ఉంటుంది. కానీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేయించిన తర్వాత వారి ఊపిరితిత్తుల సామర్థ్యం 50 శాతం తగ్గిపోయినట్లు తెలుస్తోంది.
డిశ్చార్జి అయిన 110 మంది రోగుల్లో 81 శాతం మందికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, తరచూ స్పృహతప్పడం, కీళ్ల నొప్పులు లాంటివి ఉన్నాయని బ్రిటన్‌లోని నార్త్ బ్రిస్టల్ ఎన్‌హెచ్ఎస్ ట్రస్ట్ సర్వేలో తేలింది.
తీవ్ర ఊపిరితిత్తుల సమస్య లేదా వాటి సామర్థ్యం తగ్గడం లాంటివి ఉన్న రోగులు తక్కువ మంది ఉన్నట్టు ఈ రీసెర్చ్ ప్రాథమిక ఫలితాల్లో కనుగొన్నారు.

ఫొటో సోర్స్, SPL
పల్మనరీ ఫైబ్రోసిస్
కోవిడ్-19 రోగులకు పెద్ద సమస్య ‘పల్మనరీ ఫైబ్రోసిస్’ వల్ల వస్తోంది. అది ఊపిరి తిత్తులకు సంబంధించినది.
“కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వల్ల ‘అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్’(ఏఆర్డీఎస్)కు గురైనవారికి, అంటే ఊపిరితిత్తులు సరిగా పనిచేయకుండా పోయినవారికి, పల్మనరీ ఫైబ్రోసిస్ సమస్య రావచ్చు. పల్మనరీ ఫైబ్రోసిస్‌లో ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో రోగులకు చాలా కాలం పాటు శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉండవచ్చు. పరిస్థితి తీవ్రంగా ఉంటే, ఇంట్లో ఆక్సిజన్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది” అని డాక్టర్ శరద్ జోషి చెప్పారు.
“ఏఆర్డీఎస్ కనిపించిన కోవిడ్-19 రోగుల్లో ఒక శాతం మందికి జీవితాంతం ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఉండవచ్చు. వారి ఊపిరితిత్తులు బలహీనం అయిపోతాయి. భవిష్యత్తులో వారు ఇతర ఇన్ఫెక్షన్లకు కూడా గురయ్యే ప్రమాదం ఉంటుంది. వారు చాలా కాలంపాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది”.
“పల్మనరీ ఫైబ్రోసిస్‌లో పెద్దగా స్పందన లేదు. సార్స్ లేదా హెచ్1ఎన్1 లాంటి వైరస్‌లు వచ్చి కోలుకున్న వారిలో కూడా పల్మనరీ ఫైబ్రోసిస్ ఇంత ఎక్కువగా కనిపించలేదు. కోవిడ్-19లో ఇవి రెట్టింపు కేసులు వస్తున్నాయి” అని జోషి చెప్పారు.
దానితోపాటూ కరోనావైరస్ నుంచి కోలుకున్న తర్వాత రోగులు నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం పడుతోంది. ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో న్యూరాలజీ చీఫ్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా ఆ సమస్య గురించి చెప్పారు.
“కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత నరాలు పక్షవాతానికి గురికావచ్చు. అప్పుడప్పుడూ మెదడుపై కూడా ఆ ప్రభావం పడవచ్చు. దానివల్ల జ్ఞాపకశక్తిపై ప్రభావం ఉండచ్చు. కోవిడ్ వచ్చి ఐసొలేషన్ తర్వాత భయం ఉంటుంది. దానిని ‘పోస్ట్ డిసీజ్ స్ట్రెస్ డిజార్డర్’ అంటారు. మెదడులో వాపు లేదా తీవ్ర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నరోగుల్లో తర్వాత లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. బలహీనత, కళ్లు తిరగడం లాంటివి సాధారణ లక్షణాలు” అన్నారు.

ఫొటో సోర్స్, Spl
కరోనా నుంచి కోలుకున్నా లక్షణాలు ఎందుకు?
లక్షణాలు కనిపించడం కొత్తేం కాదని డాక్టర్లు చెబుతున్నారు. మిగతా వైరస్ కేసుల్లో కూడా ఇలా జరిగిందని తెలిపారు. డాక్టర్ శరద్ జోషి దానికి కారణాలు చెప్పారు.
“వైరస్‌తో పోరాటం చేయడానికి శరీరంలో తయారైన యాంటిజెన్, మన రోగనిరోధక శక్తి అతిగా స్పందించేలా దానిలో మార్పులు చేస్తాయి. దాంతో జ్వరం, ఒళ్లు నొప్పులు, మిగతా సమస్యలు కనిపిస్తాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ జరగడం మొదలవుతుంది. అది మొత్తం శరీరంపై ప్రభావం చూపిస్తుంది. అలా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా ఇన్‌ఫ్లమేటరీ సెల్స్, కెమికల్ అలాగే ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ స్పందన వల్లే ఆ లక్షణాలు కొనసాగుతుంటాయి” అన్నారు.
“చికన్‌గునియాలో 8 నుంచి 10 రోజులు జ్వరం తర్వాత కోలుకుంటారు. కానీ ఆ తర్వాత చాలామంది రోగుల్లో కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు కొన్ని నెలల వరకూ ఉంటాయి. చాలా మందికి అది ఆర్థరైటిస్‌గా కూడా మారుతుంది” అంటారు జోషి.
కానీ, కొన్ని కేసుల్లో ఈ లక్షణాల నుంచి మెల్లమెల్లగా కోలుకోవడం కూడా ఉంటుంది.
“శరీరం సహజంగా దానికదే మెల్లమెల్లగా మరమ్మతులు చేసుకుంటుంది. అందుకే స్పృహతప్పడం, కళ్లు తిరగడం లాంటి కొన్ని సమస్యలు మెల్లమెల్లగా వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ బలహీనత, శ్వాస ఇబ్బందులు లేదా పక్షవాతం లాంటివి ఉన్నప్పుడు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది” అంటారు డాక్టర్ ప్రవీణ్ గుప్తా
కరోనావైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఆ లక్షణాలు కొన్ని వారాల్లో తగ్గిపోవచ్చు. లేదంటే రెండు నుంచి ఆరు నెలల సమయం కూడా పట్టచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనావైరస్ నుంచి కోలుకున్న వ్యక్తిలో 30 నుంచి 40 రోజుల వరకూ యాంటీబాడీస్ ఉంటాయి. ఆ సమయంలో అతడు కరోనాకు గురయ్యే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అయినా, వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
“మీ శరీరం ఒక వైరస్‌తో పోరాడి గెలిచింది. మీ రోగనిరోధక శక్తిపై ఇప్పటికే చాలా ఒత్తిడి ఉంది. అందుకే మీ ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలి” అంటారు డాక్టర్ శరద్ జోషి
మాస్క్, హైజీన్, సోషల్ డిస్టెన్సింగ్ గురించి జాగ్రత్తలు పాటించండి. అలా చేయకపోతే మీకు వేరే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న మీ శరీరంపై అది తీవ్రంగా ప్రభావం చూపవచ్చు.
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి సమస్య ఎదురైనా, డాక్టర్‌కు కచ్చితంగా చూపించండి.
ఇవి కూడా చదవండి:
- చైనా బలం, భారత్ బలహీనత అదే
- కోర్టు ధిక్కారానికి ప్రశాంత్‌భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా - సుప్రీం కోర్టు తీర్పు
- అధికారుల అవినీతిని అడ్డుకోవడానికి ప్రత్యేక చట్టం - బిల్లు రూపొందించాలన్న సీఎం జగన్
- చెస్ ఒలంపియాడ్: ఫైనల్ రౌండ్ ఆడుతుండగా ఇంటర్నెట్ సమస్య.. సంయుక్త చాంపియన్లుగా భారత్, రష్యా
- మోదీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, మార్కెట్ పరిస్థితులు ఎందుకు మెరుగుపడట్లేదు?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- మోదీ ‘మన్ కీ బాత్’కు యూట్యూబ్‌లో డిస్‌లైక్‌ల వెల్లువ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








