అధికారుల అవినీతిని అడ్డుకోవడానికి ప్రత్యేక చట్టం - బిల్లు రూపొందించాలన్న సీఎం జగన్

ఫొటో సోర్స్, AFP
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా ఒక చట్టం ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
దీనికోసం అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చేలా బిల్లు రూపొందించాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం మీడియా ప్రకటన విడుదల చేసింది.
“కొన్ని అవినీతి కేసులపై విచారణ గత 25 ఏళ్లుగా కొనసాగుతోంది, అంటే అవినీతిని నిరోధించే విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా లేదనే సంకేతాలు వెళ్తున్నాయి. అవినీతికి ఆస్కారం లేని విధానాలతో మనం ముందుకు వెళ్లాలి. అవినీతికి పాల్పడాలంటేనే భయపడే పరిస్థితి రావాలి” అని సీఎం వ్యాఖ్యానించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ప్రకటనలో తెలిపింది.
అవినీతిని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గత ఏడాది నవంబరులో కాల్ సెంటర్ ప్రారంభించారు. ఇప్పటి వరకు దానికి దాదాపు 45 వేల కాల్స్ వచ్చాయని ఏసీబీ తమ ప్రెస్ నోట్ లో వెల్లడించింది. ఇందులో అవినీతికి సంబంధించి 1747 ఫిర్యాదులు ఉన్నాయని, వాటిలో 1712 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపింది.
ఎమ్మార్వో, ఎండీఓ, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అధికార యంత్రాంగం అవినీతికి పాల్పడకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
సదరు కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించి దానికి తగినట్లు చర్యలు తీసుకోవాలని గత వారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ సూచించినట్టు సమాచారం.
ఏపీ-అహ్మదాబాద్ ఐఐఎం ఒప్పందం
అవినీతి నిరోధానికి సంబంధించి గతంలో అహ్మదాబాద్ ఐఐఎం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. గత వారం అహ్మదాబాద్ ఐఐఎం ‘గుడ్ గవర్నెన్స్’పై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది.
అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ తీసుకుంటున్న చర్యలను ఐఐఎం పరిశీలించింది. అందులో భాగంగా ఫిబ్రవరి ఒకటి నుంచి 18 వ తేది వరకు వివిధ ప్రభుత్వ విభాగాల్లో నమోదైన అవినీతి కేసుల వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు.
ఆ వివరాల ప్రకారం, ఫిబ్రవరిలో 18 రోజుల్లో ఆరు అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. 2016 జనవరి నుంచి 2020 ఫిబ్రవరి వరకూ తహశీల్దార్ కార్యాలయాల్లో అవినితికి పాల్పడుతూ మొత్తం 83 మంది ఉద్యోగులు పట్టుబడినట్లు ఐఐఎం తన నివేదికలో వెల్లడించింది.
అయితే అధికార యంత్రాంగంలో అవినీతిని నిర్మూలించే దిశగా ప్రభుత్వం ఆలోచించడంపై రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాజకీయాల్లో అవినీతి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/ATCHANNAIDUK
అవినీతి కేసుల్లో ప్రజా ప్రతినిధులు
ఇందులో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా ప్రతినిధులపై ఉన్న అవినీతి కేసులను బీబీసీ తెలుగు పరిశీలించింది.
వైసీపీ ప్రజాప్రతినిధుల్లో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. హైదరాబాద్ సీబీఐ కోర్టులో దీనిపై విచారణ కోనసాగుతోంది.
విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై బినామీ లావాదేవీల చట్టం కింద 2015లో కేసు నమోదయ్యింది. కోర్టులో అక్టోబర్ 2018 నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే కె.చెన్నకేశవరెడ్డిపై అవినితి నిరోధక చట్టం కింద నమోదైన కేసు విచారణ ఆగస్టు 2015 నుంచి కర్నూలు ఏసీబీ కోర్టులో కొనసాగుతోంది.
2014 నుంచి 2019 వరకు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈఎస్ఐ లో రూ.151 కోట్ల కుంభకోణం చేశారనే ఆరోపణలపై జూన్‌లో కేసు నమోదు చేసిన ఏసీబీ, ఆయన్ను అరెస్ట్ చేసింది. శుక్రవారం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఈ అంశంపై రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవితో బీబీసీ తెలుగు మాట్లాడింది.
“ప్రజలకు జగన్ సంక్షేమ పథకాలపై ఉన్న ఆసక్తి, ప్రభుత్వం తీసుకునే ఈ అవినీతి నిరోధక చర్యలపై కనిపించదు. కీలక నేతలపై ఉన్న కేసులే ఏళ్ళ తరబడి సాగుతుంటే, వారి కింద ఉన్న వారి అవినీతి ఏముందిలే అనే భావన ప్రజల్లో బలంగా ఉంది” అంటున్నారాయన.
ఇవి కూడా చదవండి:
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- ఫైనల్ పరీక్షలు రాయకుండా విద్యార్థుల్ని ప్రమోట్ చేయొద్దు - సుప్రీం కోర్టు తీర్పు
- రెండో ప్రపంచ యుద్ధం జపాన్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేసింది?
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- కరోనావైరస్: స్కూళ్లను కోళ్ల పరిశ్రమల్లా మార్చేస్తున్నారు
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








