కరోనావైరస్: సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్ల వల్ల మనకు కోవిడ్ వస్తుందా

సరకులు కొంటున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

చైనాలో ఇటీవల ఆహార పదార్థాల ప్యాకెట్లపై కోవిడ్-19 జాడ కనిపించింది. దక్షిణ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలు, కోడి మాంసం ప్యాకెట్లపై కరోనావైరస్ ఆనవాళ్లను గుర్తించారు.

ఈ పరిణామంతో ఆహార పదార్థాల ప్యాకెట్లతో కరోనావైరస్ వ్యాపిస్తుందా అన్న విషయంపై మళ్లీ చర్చ మొదలైంది.

నిజానికి ఆహార పదార్థాల ప్యాకెట్ల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేసే పరిస్థితి లేదు.

అట్టపెట్టెలు, ప్లాస్టిక్ ఉత్పత్తుల మీద కరోనావైరస్ రోజులపాటు ఉండకపోయినా, కొన్ని గంటలు జీవించి ఉండొచ్చని ఇదివరకు జరిగిన అధ్యయనాల్లో తేలింది.

తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కరోనావైరస్ ఎక్కువ కాలం జీవించి ఉండే అవకాశం ఉంది. చాలావరకూ అహారపదార్థాల ప్యాకెట్లు, ముఖ్యంగా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తులను అత్యంత చల్లని ఉష్ణోగ్రతల వద్దే నిల్వ ఉంచుతారు.

అహారపదార్థాల ప్యాకెట్లను క్రిమిసంహారకాలతో కడగనక్కర్లేదు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అహారపదార్థాల ప్యాకెట్లను క్రిమిసంహారకాలతో కడగనక్కర్లేదు

వైరస్ మనుగడ విషయంలో ప్రయోగశాలలో కనిపించిన ఫలితాలే, బయట కూడా ఉంటాయని చెప్పలేమని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు.

‘‘బయటి ప్రపంచంలో వాతావరణ మార్పులు తరచుగా, వేగంగా ఉంటాయి. అంటే, వైరస్ ఎక్కువ కాలం జీవించి ఉండే అవకాశాలు తక్కువ’’ అని డా. జూలియాన్ టాంగ్ అంటున్నారు. డా. టాంగ్ యూనివర్సిటీ ఆఫ్ లీసెష్టర్‌లో శ్వాసకోశ సంబంధ కోర్సు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

రట్గర్స్ యూనివర్సిటీలో పనిచేస్తున్న మైక్రో బయాలజీ అధ్యాపకులు ఇమాన్యువల్ గోల్డ్‌మ్యాన్ కూడా ఈ విషయంపై మాట్లాడారు.

‘‘ప్రయోగశాలలో అధ్యయనాల కోసం దాదాపు కోటి వైరస్ కణాలను పరిశీలిస్తారు. కానీ, ఒక ప్యాకెట్ మీద వంద వైరస్ కణాలు ఉండొచ్చు’’ అని ఆయన అన్నారు.

"నిర్జీవమైన ఉపరితలాల మీద వైరస్ ఎక్కువకాలం బతికి ఉండలేదు. వీటి ద్వారా వైరస్ సోకే అవకాశం చాలా తక్కువ. వైరస్ సోకిన వ్యక్తి తుమ్ము, దగ్గు ద్వారా వెలువడే వైరస్ కణాలు పడినచోటును... ఒకటి లేదా రెండు గంటలలోపు తాకితే వైరస్ సోకే ప్రమాదం ఉంది తప్పితే, అంతకన్నా ఎక్కువసేపు వైరస్ నిలవలేదు" అని ప్రొఫెసర్ గోల్డ్‌మ్యాన్ జులైలో లాన్సెట్ జర్నల్‌తో అన్నారు.

‘నిర్జీవమైన ఉపరితలాల మీద వైరస్ ఎక్కువకాలం బతికి ఉండలేదు’

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ‘నిర్జీవమైన ఉపరితలాల మీద వైరస్ ఎక్కువకాలం బతికి ఉండలేదు’

వైరస్ ఎలా సోకుతుంది?

ఆహారపదార్థాల ప్యాకింగ్ సంస్థల్లో పనిచేస్తున్నవారు... వైరస్ ఉన్న ఉపరితలాలను తాకిన వెంటనే కళ్లు, ముక్కు, నోరు తుడుచుకుంటే వైరస్ సోకే అవకాశం ఉంది.

అయితే, కోవిడ్-19 వ్యాప్తికి ఇది ప్రధాన మార్గమని శాస్త్రవేత్తలు భావించట్లేదు.

"వైరస్ కణాలున్న ఉపరితలాన్ని తాకడం ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కానీ వైరస్ వ్యాప్తికి ఇది ప్రధాన మార్గం కాదని భావిస్తున్నారు" అని యూఎస్ హెల్త్ ఏజెన్సీ ద సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెబ్‌సైట్‌లో రాశారు.

కరోనావైరస్ ప్రధానంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకే వ్యాపిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

కరోనావైరస్ వ్యాప్తి చెందే విధానాలు:

· రెండు మీటర్ల భౌతిక దూరం పాటించకుండా ఉన్నప్పుడు, వ్యక్తుల మధ్య వ్యాపించవచ్చు.

· తుమ్ము, దగ్గు లేదా మాట్లాడుతున్నప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా సోకుతుంది.

· తుంపరలు నేరుగా ముక్కు లేదా నోట్లోకి పోయినప్పుడు లేదా శ్వాసలోకి వెళ్లినప్పుడు వైరస్ సోకుతుంది.

‘‘ఒక వ్యక్తికి ప్యాకెట్ ఉపరితలం నుంచి వైరస్ సోకిందని నిరూపించడం కూడా కష్టమే. ఇంకే, ఇతర ఆధారాలు లేవని కచ్చితంగా తెలిస్తే తప్ప ప్యాకెట్ల ద్వారా వ్యాధి సంక్రమించిందని నిర్ధరించలేం’’ అని డా. టాంగ్ అంటున్నారు.

భౌతిక దూరం

ఫొటో సోర్స్, Getty Images

పాటించాల్సిన జాగ్రత్తలు

"ప్రస్తుతానికి ఆహారం లేదా ఆహారపదార్థాల ప్యాకింగ్ ద్వారా కోవిడ్-19 సోకిందని నిర్థారించదగిన కేసులు లేవు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

అయితే, ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉండేందుకు కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే...

అహారపదార్థాల ప్యాకెట్లను క్రిమిసంహారకాలు వాడి శుభ్రపరుచుకోనక్కర్లేదు. ప్యాకెట్ ముట్టుకున్న తర్వాత, ఆహారం తీసుకునేముందు తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

సరుకులు కొనుక్కోవడానికి వెళ్తే, దుకాణంలోకి వెళ్లేముందు చేతులను శానిటైజర్‌తో శుభ్రపరుచుకోవడం ఉత్తమం. కొనడం పూర్తైన తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కొనుక్కున్న సరుకుల ప్యాకెట్లను సర్దుకున్న తరువాత లేదా వాడిన తరువాత చేతులు శుభ్రపరుచుకోవడం తప్పనిసరి.

నేరుగా ఇంటికే సరుకులు తెప్పించుకోవడం కూడా మేలు. అయితే సరుకులు అందిస్తున్నవాళ్లు వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార పరిశుభ్రత పాటిస్తున్నారో లేదో తరచి చూసుకోవడం మంచిది. ఇంటికి తెప్పించుకునే సరుకులు అందుకున్నాక కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

ప్లాస్టిక్ సంచులను ఒకసారి వాడగానే, పారేయడం మంచిదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)