తెలంగాణలో కరోనా మరణాలు తక్కువ చేసి చూపుతున్నారా

ఫొటో సోర్స్, facebook/EatalaRajendarTRS
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలు ఎన్ని అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ బులెటిన్లో చూపిస్తున్న సంఖ్యకు వాస్తవ సంఖ్యకు మధ్య తేడాలు కనిపిస్తున్నాయి.
కరోనాతో రాష్ట్రంలో రోజూ పెద్ద సంఖ్యలో జనం చనిపోతున్నా, ప్రభుత్వం లెక్కలను బయట పెట్టడం లేదన్న వాదన సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా వినిపిస్తోంది. శ్మశాన వాటికలలో జనం తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం స్థానికంగా చెప్పే లెక్కలకు, రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య శాఖ చెప్పే లెక్కలకు పొంతన లేదు. దీనిపై బీబీసీ తెలుగు సహా పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. దాంతోజిల్లా స్థాయిలో బులెటిన్ ఇవ్వడమే ఆపేశారు.
ప్రభుత్వం ఇస్తున్న లెక్కలలో స్పష్టత లేదంటూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ కొనసాగుతోంది. ప్రజారోగ్య అధికారుల నుండి హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే పలుమార్లు వివరణ కోరింది. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం కూడా వెలిబుచ్చింది.
బులెటిన్ పేజీల సంఖ్య పెంచినప్పటికీ అందులో ఇస్తున్న సమాచారంలో స్పష్టత లేదు. ఉదాహరణకు మరణించిన వారి మొత్తం సంఖ్య మాత్రమే ఇస్తున్నారు. జిల్లాల వారీగా మరణించిన వారి వివరాలు ఇవ్వడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ పరీక్షలు, మరణాలపై గోప్యత, దాని చుట్టూ చెలరేగిన దుమారం రాష్ట్ర ప్రజల్లో భయాన్ని పెంచుతోంది.
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో జులై 16, 17 తేదీలలో మరణించిన వారి వివరాలు ఆ ఆసుపత్రి వర్గాల నుంచి బీబీసీ సేకరించింది. ఈ ఆస్పత్రిలో కేవలం కోవిడ్ పేషెంట్లకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు.
కేవలం గాంధీ ఆసుపత్రిలోనే జులై 16 వ తేదీన 14 మంది కరోనా తో మరణించారు. జులై 17న 10 మంది మరణించారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో జులై 16న మొత్తం పది మంది, జులై 17న ఏడుగురు మరణించారని ప్రభుత్వ బులెటిన్లో వెల్లడించారు.
గాంధీ ఆసుపత్రిలోజులై 16, 17 తేదీలలోమరణించిన వారి కుటుంబ సభ్యులతో బీబీసీ తెలుగు మాట్లాడింది. జిల్లా ప్రజారోగ్య అధికారులను ఆరా తీసింది. అన్నిటినీ క్రోడీకరించగా, ప్రభుత్వ బులెటిన్లో వెల్లడించిన మరణాల సంఖ్యకు, వాస్తవ సంఖ్యకు అంతరాలు కనిపించాయి.

ఫొటో సోర్స్, @Eatala_Rajender
ప్రతి రోజూ సాయంత్రం ఐదు గంటలకు జిల్లాల నుండి సమాచారం సేకరించి రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసేది. అంటే ఉదాహరణకు, జులై 15 వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి జులై 16 వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వచ్చిన లెక్కలన్నీ జులై 16న విడుదల చేసే బులెటిన్ లో వెల్లడి చేసే వారని ప్రజారోగ్య అధికారులు బీబీసీ తెలుగుకి వివరించారు.
జులై 25 వరకు ఇదే పద్ధతి లో బులెటిన్ విడుదల అయ్యేది. ఇప్పుడు, మరుసటి రోజు ఉదయం విడుదల చేస్తున్నారు. అంటే ముందు రోజు సాయంత్రం ఎనిమిది గంటల వరకు నమోదైన వివరాలను మరుసటి రోజు ఉదయం బులెటిన్ లో విడుదల చేస్తున్నారు.
జులై 16న గాంధీ ఆసుపత్రిలో మరణించిన 14 మంది కుటుంబ సభ్యులతో బీబీసీ తెలుగు మాట్లాడే ప్రయత్నం చేసింది. ఒకరు తప్ప అందరు కరోనా పాజిటివ్ తేలిన తర్వాతే గాంధీ ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. వారిలో ఒకరి కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు నిరాకరించారు. మరో ఇద్దరి కుటుంబ సభ్యులు అందుబాటులోకి రాలేదు.
కానీ, ఈ కుటుంబాలకు చెందిన ముగ్గురు జులై 16 వ తేదీన గాంధీ ఆసుపత్రిలో మరణించినట్టు బీబీసీ తెలుగు నిర్ధరణ చేసుకొంది.
మిగతా 10 మందిలో ఏడుగురు జులై 16 వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపే మరణించారు. ఇందులో ఒకరు కరోనా నిర్ధరణ కాకముందే మరణించారు. కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఎమర్జెన్సీలో జులై 15న గాంధీకి తీసుకొని వచ్చారు. మరుసటి రోజే మరణించారు. ఆ తరువాత కుటుంబ సభ్యులు ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలింది.
ఇది కేవలం గాంధీ ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య.

ఫొటో సోర్స్, TSMSIDC
తెలంగాణ లో 61 ప్రభుత్వ ఆసుపత్రులను కోవిడ్ కోసం కేటాయించినట్టు జులై 16 బులెటిన్ లో తెలిపారు. దీంతో పాటు కోవిడ్ చికిత్స అందిస్తున్న 57 ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలు కూడా ఇచ్చారు.
జూలై 16 నాటికి 61 ప్రభుత్వ ఆసుపత్రులలో 1692 మంది రోగులు ఉన్నారని బులెటిన్ లో తెలిపారు. అందులో 635 మంది గాంధీలో వైద్యం పొందుతున్నారని ప్రకటించారు. జులై 16 న కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు 1676. మోత్తం అక్టివ్ కేసులు 13,328. అంటే 11,636 మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం పొందుతుండాలి.
మరి ఈ ఆసుపత్రులలో జులై 16 న ఎవరు మరణించలేదా?
జిల్లా అధికారులను కూడా ఆరా తీసాము. రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఒకరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకరు మరణించినట్టు అధికారులు తెలిపారు.
ఒకరు జులై 16న హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారని బీబీసీ తెలుగు కి ఉన్న సమాచారం.
జులై 17న ఏడుగురు మరణించారని ప్రభుత్వ బులెటిన్లో వెల్లడించారు.
గాంధీ ఆసుపత్రి వర్గాల నుంచి బీబీసీ సేకరించిన సమాచారం ప్రకారం కేవలం ఆ ఆసుపత్రిలోనే పది మంది మరణించారు.
జులై 17 వ తేదీన గాంధీ ఆసుపత్రిలో మరణించిన 10 మంది కుటుంబ సభ్యులతో బీబీసీ తెలుగు మాట్లాడే ప్రయత్నం చేసింది. ఒకరు తప్ప అందరు అందుబాటు లోకి వచ్చారు. ఐదుగురు సాయంత్రం ఐదు గంటలలోపే మరణించారు. అంటే అదే రోజు బులెటిన్ లో వారి మరణాలను లెక్కించాలి.
ముందు రోజు, జులై 16 వ తేదీ సాయంత్రం ఐదు గంటల తరువాత మరణించిన ముగ్గురిని జులై 17 వ తేదీ బులెటిన్లో లెక్కించాలి. దీంతో, కేవలం గాంధీ ఆసుపత్రి లోనే మరణించిన వారి సంఖ్య ఎనిమిది. జులై 16 వ తేదీన ప్రైవేటు ఆసుపత్రిలో మరణించిన మరొకరిని కూడా లెక్క లోకి తీసుకుంటే తొమ్మిది మంది.

ఫొటో సోర్స్, ANI
జిల్లాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం, ఖమ్మం జిల్లాలో ఒకరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకరు మరణించినట్టు అధికారులు తెలిపారు.
జులై 17 నాటికి 61 ప్రభుత్వ ఆసుపత్రులలో 1793 మంది రోగులు ఉన్నారని బులెటిన్ లో తెలిపారు. అందులో 622 మంది గాంధీలో వైద్యం పొందుతున్నారని ప్రకటించారు. జులై 17 న కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు 1478. మొత్తం అక్టివ్ కేసులు 13,389. అంటే 11,596 మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం పొందుతుండాలి.
మరి ఆ లెక్కలు ఎక్కడ?
ఇవి కూడా చదవండి:
- ఏడుగురు ఫ్రెండ్స్ చనిపోయారు.. నేను చనిపోయినా బాగుండేది’
- అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం
- 'నా భర్త నన్ను కొడుతుంటే అందరూ ఇది
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- ఆంధ్రప్రదేశ్లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- పాకిస్తాన్ కొత్త మ్యాప్ గురించి చైనా ఎందుకు నోరు మెదపలేదు
- భారత్-చైనా సరిహద్దుల్లో భారీ రవాణా సదుపాయాలు ఎందుకు నిర్మిస్తున్నారు?
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








