రాజమండ్రి: మతాలకు అతీతంగా కోవిడ్ మృతులకు అంత్యక్రియలు చేస్తున్న యువకులు

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఒక ఇంట్లో తండ్రి మరణించారు. ఆయనకు కోవిడ్-19 లక్షణాలున్నాయి. దాంతో ఆయన భార్య, బిడ్డలు కూడా మృతదేహం దగ్గరకు వెళ్లలేదు. ఆయన బాత్రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. బాత్రూమ్‌కు తాళంవేసి ఎవరైనా రావాల్సిందేనని ఎదురుచూడడమే తప్ప వాళ్లేమీ చేయలేదు.
ఆంబులెన్సులు, ప్రభుత్వ ఆస్పత్రికి వారు ఫోన్ చేశారు. కానీ వాళ్లెవరూ వచ్చే అవకాశం కనిపించలేదు. సిబ్బంది కొరతతోపాటు ఉన్న వారిలో కొందరు కోవిడ్-19 ప్రభావంతో ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
"రెండు రోజుల తర్వాత మాకు ఫోన్ వచ్చింది. వెళ్లి చూస్తే అత్యంత దయనీయ స్థితిలో ఆయన పడి ఉన్నారు. మా మిత్రులు కొందరు భయపడినా.. మేమే సాహసం చేసి అంత్యక్రియలు పూర్తి చేశాం. అప్పుడే అనిపించింది... కన్నవారి కోసం ఎంతో కూడబెట్టి, కష్టపడి ఆస్తులు సంపాదించి ఇస్తే, చివరకు చనిపోయిన తర్వాత పట్టించుకోకుండా వదిలేశారని, మృతులకు మళ్లీ ఓ రెండు నిమిషాలు ప్రాణం వస్తే అలాంటి కుటుంబాన్ని చూసి ఏమంటారో తెలుసుకోవాలని అనిపించింది" అని రాజమహేంద్రవరం నగరానికి చెందిన అమీర్ పాషా వ్యాఖ్యానించారు.
గత 20 రోజుల్లో 13 మంది కోవిడ్-19 మృతులకు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అమీర్ పాషాతోపాటు ఆయన మిత్రులు మరో ఐదుగురు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కరోనావైరస్ మృతదేహాల అంత్యక్రియలు ఇబ్బందిగా మారడంతో.. అలాంటివారికి ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో ఈ యువకులు సాగుతున్నారు. కుల, మతాలకు అతీతంగా అవసరమైనవారికి ఇలాంటి ఆపద సమయంలో తోడుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్టు వారు చెబుతున్నారు.

ఇప్పుడు ఎంత చేసినా తక్కువే..
అమీర్ పాషా గత కొన్నేళ్లుగా రాజమహేంద్రవరం పరిసరాల్లో వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజారోగ్యం, హెచ్‌ఐవీ నిర్మూలన వంటి సమస్యలపై ఆయన పనిచేశారు. పీపుల్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో బాలల హక్కుల కోసమూ ఆయన ఉద్యమిస్తున్నారు. బాలల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అయితే, ఎంతో కాలంగా ఎంతో సేవ చేస్తున్నప్పటికీ కరోనావైరస్ సమయంలో ప్రజలకు అండగా నిలవడం అత్యంత సంతృప్తినిచ్చిందని అమీర్ చెబుతున్నారు.
వలస కార్మికులను ఆదుకునేందుకు ఆయన సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని పేదలకు తన స్నేహితులు, బంధువుల సహాయంతో బియ్యం, ఇతర నిత్యావసరాలు కూడా అందించారు. 60 రోజుల పాటు ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. 235మంది గర్భిణులకి పౌష్టికాహార కిట్స్ కూడా ఇచ్చారు. ఇలా కరోనావైరస్ వ్యాప్తి నడుమ వివిధ దశల్లో తమ సేవల ద్వారా అమీర్ బృందం పనిచేస్తోంది.
కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. కొందరు కరోనా బాధితులతోపాటు, అలాంటి లక్షణాలతో చనిపోయిన వారిని కూడా చేరదీసేందుకు చాలా మంది సిద్ధపడడం లేదు. చివరకు సాధారణ మరణాల విషయంలో కూడా అనేక సందేహాలతో దూరంగా ఉంటున్నారు. సొంతవారే కడచూపుకు కూడా సిద్ధం కాని ఘటనలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో అన్నీ ఉండి, అనాథలుగా మిగిలిపోతున్న మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణకు అమీర్ పాషా బృందం సిద్ధపడింది.

అప్పుడే ఆలోచన వచ్చింది
"కరోనావైరస్ సోకినవారికి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వానికి గగనం అవుతోంది. పెరుగుతున్న కేసుల సంఖ్యతో పోలిస్తే సేవలు అందించడం సమస్య అవుతోంది. ఈ నేపథ్యంలో మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ పెద్ద సమస్యగా మారుతోందని గమనించాం. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. శాస్త్రీయంగా అన్నింటినీ పరిశీలించాం. పీపీఈ కిట్లు ధరించి, ఇతర జాగ్రత్తలు పాటిస్తూ మృతదేహాలను తరలించడం వల్ల ఇబ్బంది రాదని నిర్ధరించుకుని ఈ ప్రయత్నం ప్రారంభించాం" అని అమీర్ వివరించారు.
"ఇప్పటివరకు మాకు 35 ఫోన్ కాల్స్ వచ్చాయి. 13 మందికి మాత్రం అంత్యక్రియలు నిర్వహించగలిగాం. కొందరికి ఇతర మార్గాల్లో సహాయం చేశాం. మేం అన్ని జాగ్రత్తలూ పాటిస్తున్నాం. మా కుటుంబాల నుంచి కూడా సహకారం అందుతోంది. చనిపోయిన వాళ్ల బంధువులే రాని పరిస్థితుల్లో, మేం వెళ్లడం ఆత్మసంతృప్తినిస్తోంది. కానీ ఇంట్లో వాళ్ల గురించి కొంత భయం ఉంటుంది. అందుకే శానిటైజేషన్‌పై చాలా శ్రద్ధ పెడుతున్నాం"
కొందరు మిత్రులు వెనక్కి తగ్గినా..
కరోనావైరస్ మృతులకు ఆయా మతాచారాలను అనుసరించి వీరు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ బృందంలో కూడా వివిధ మతాలను అనుసరించే వారుండడం విశేషం. అచ్యుత్ సుధీర్, కర్రి దుర్గా ప్రసాద్, షేక్ రసూల్, కుమార్ బాబు వంటి వారు కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయితే, తొలుత ఈ బృందంలో చేరిన కొందరు వెనకడుగు వేశారు. ముఖ్యంగా మృతదేహాల కోసం వెళ్లిన సమయంలో ఉన్న చిక్కులను దృష్టిలో ఉంచుకుని కొంత భయాందోళనతో తప్పుకున్నట్టు చెబుతున్నారు. మనసులో సేవ చేయాలనే సంకల్పం ఉన్నప్పటికీ ఆయా మృతదేహాల స్థితి చూసి ముందుకు రాలేకపోయారని అమీర్ పాషా అంటున్నారు.

అలాంటి వారిని చూసి బాధ కలిగింది
ఇతర అనారోగ్య సమస్యలతో మరణించిన వారిని కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్న తీరు చూసి మనసుకి చాలా బాధ కలిగిందంటున్నారు ఈ బృందంలో ఉన్న కర్రి దుర్గా ప్రసాద్. ఓ ప్రైవేటు పైనాన్స్ కంపెనీలో కలెక్షన్ మేనేజర్‌గా పనిచేసిన ఆయన నాలుగు నెలల నుంచి ఖాళీగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో అమీర్ పాషా పంచుకున్న ఆలోచన నచ్చి, ఆయనతో చేతులు కలిపినట్టు దుర్గా ప్రసాద్ చెప్పారు.
"కోవిడ్-19 మరణాలు కలచివేస్తున్నాయి. అలాంటి సమయంలో అమీర్ పాషా పోస్ట్ నచ్చింది. ఆయనతో మాట్లాడితే.. చేస్తున్న సేవల గురించి చెప్పారు. ఆయన టీమ్‌లో చేరాను. మానసికంగా చాలా సంతృప్తిగా ఉంది. మృతుల కుటుంబాల వారు చేతులెత్తి దండాలు పెడుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితి రాకుండా అందరూ ముందుకు వస్తే మంచిదనిపిస్తోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజల్లో అవగాహన పెరగాలి
కరోనా మృతదేహాల పట్ల ప్రజల్లో భయాందోళనలకు అపోహలే దానికి కారణం అంటున్నారు రసూల్. అమీర్ బృందంలో ఆయన కూడా ఓ సభ్యుడు. సీతానగరం మండలం ముగ్గళ్ల మసీదులో ఆయన ఇమామ్‌గా పనిచేస్తున్నారు. కరోనా సమయంలో ప్రార్థనలకు అవకాశం లేదని ఆయన అంటున్నారు. అమీర్ పాషా ఆలోచన, ఆయన సేవలు చూసి తోడుగా ఉంటున్నానని చెప్పారు.
"కరోనావైరస్‌తో చనిపోయినా ఆ మృతదేహాల మీద వైరస్ ఎక్కువసేపు ఉండదు. అయినా అపోహలు ఎక్కువగా ఉండడంతో చాలామంది దగ్గరకి రావడం లేదు. అది తొలగిపోవాలి. అందరూ ముందుకు రావాలి. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ప్రభుత్వం, మీడియా కూడా దానికి అనుగుణంగా ప్రచారం చేస్తే ప్రజల్లో ఆందోళన తగ్గుతుంది" అని ఆయన వివరించారు.

మతం కన్నా మానవత్వమే ముఖ్యం
అంతిమ సంస్కారాల నిర్వహణలో చొరవ చూపిన వారిని ఎంతగా అభినందించినా తక్కువేనని రాజమహేంద్రవరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పెద్దాడ నవీన్ బీబీసీతో చెప్పారు.
"సమాజంలో నెగిటివ్ ఆలోచనలు పెరిగిన దశలో పాజిటివ్‌గా ఆలోచించిన బృందం సేవలు అసామాన్యం. నేను కూడా అనుభవపూర్వకంగా గమనించాను. ఒక క్రిస్టియన్ మరణించారు. ముస్లిం స్వచ్ఛంద సేవకులైన మహ్మద్ అమీర్ పాషా బృందం ఆ శవాన్ని తమ భుజాలపై మోశారు. హిందూ శ్మశాన వాటిక కైలాసభూమిలో ఆ మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. మతం కంటే మానవత్వమే ఉన్నతమైనదనడానికి ఈ ఘటన ఓ సాక్ష్యం.
మృత్యువులోకి మనిషిని గౌరవంగా సాగనంపాలన్న సంస్కారమే మానవీయ విలువల్లో గొప్పది. ఈ విషయంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి సేవలు వెలకట్టలేనివి" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎంతో రుణపడి ఉంటాం
బంధువులు ఎవరూ రాకపోవడంతో అమీర్ పాషాకు ఫోన్ చేశామని, వారు అందించిన సహకారం మరచిపోలేనని ధవళేశ్వరానికి చెందిన రాజు అన్నారు.
"మా పెద్దమ్మ చనిపోయింది. మా మతాచారం ప్రకారం ఖననం చేయాలి. కానీ ఎవరూ దగ్గరకి కూడా రాలేదు. అప్పుడు ఎవరో చెబితే అమీర్ పాషా కోసం ప్రయత్నించాను. వారు చెప్పిన సమయానికి వచ్చి, మా ఆచారాలను పాటిస్తూ ఖననం చేసేందుకు తోడ్పడ్డారు. ఇలాంటి సేవలు ఎన్నడూ వినలేదు. సొంతవారిని పిలిచినా రాకుండా సాకులు చెప్పారు. కానీ ముక్కూ మొహం తెలియని వాళ్లు వచ్చి కార్యక్రమం పూర్తి చేశారు. వారి సేవలకు జీవితాంతం రుణపడి ఉంటాం" అని రాజు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి
- మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








