ఆంధ్రప్రదేశ్: 'అప్పు తీరుస్తామని చెప్పినా నా భార్యను ట్రాక్టర్‌తో గుద్ది చంపేశాడు.. ఎస్టీలంటే ఇంత నిర్లక్ష్యమా?'

మహిళల ధర్నా

'అప్పు ఇచ్చాడు. తీరుస్తామని చెప్పారు. భూమి తనాఖా పెట్టుకున్నాడు. కాబట్టి ఆ భూమి స్వాధీనం చేయాలని పట్టుబట్టాడు. కుదరదని చెప్పడంతో వాగ్వాదానికి దిగాడు. చివరకు కనికరం లేకుండా వ్యవహరించాడు. కోపోద్రిక్తుడై ట్రాక్టర్ తో ఢీకొట్టి మహిళ ప్రాణాలు తీశాడు' అని పోలీసులు చెబుతున్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

అయినా అధికార యంత్రాంగంలో పెద్దగా స్పందన లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.

గుంటూరు జిల్లా నకరికల్లు మండల కేంద్ర పంచాయితీ పరిధిలోని శివారు గ్రామం శివపురం తండాలో ఆగష్ట్ 3న ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన లంబాడీ రైతు మంత్ర్యానాయక్ భార్య మంత్రు భాయి ప్రాణాలు కోల్పోయింది. ట్రాక్టర్ నడుపుతూ, అహంకారంతో బాధితురాలి ప్రాణాలు తీసిన బోనముక్కల శ్రీనివాసరెడ్డిని కఠినంగా శిక్షించాలని వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ మంగళవారం సాయంత్రం నిందితుడు శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసి మీడియా ముందుకు హాజరుపరచారు.

ఎస్పీ విశాల్ గున్ని
ఫొటో క్యాప్షన్, నిందితుడు శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసి మీడియా ముందుకు హాజరుపరచిన గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ

సాగర్ కాలువను ఆనుకుని ప్రశాంతంగా కనిపించే తండాలో కలవరం

బోనముక్కల శ్రీనివాసరెడ్డితో సమీప నర్సింగపాడు గ్రామం. అయినప్పటికీ గత కొన్నేళ్ళుగా శివాపురంలో వ్యవసాయం ప్రారంభించాడు. సుమారు 130 ఇళ్లున్న గ్రామంలో 85 శాతం మంది ఎస్టీలే. అందరికీ వ్యవసాయమే ఆధారం. అటవీ భూములు సాగు చేసుకుని వాటిపై హక్కులు సాధించారు. సాగర్ కాలువను ఆనుకుని ఉన్న గ్రామంలో ఈసారి వర్షాలు సకాలంలో కురియడంతో సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. అదే క్రమంలో తమ పొలంలో సాగు సన్నాహాల్లో మంత్ర్యా నాయక్ కుటుంబం సన్నద్దమయ్యింది.

రెండేళ్ల క్రితం మంత్ర్యానాయక్ వ్యవసాయ, కుటుంబ అవసరాల కోసం శ్రీనివాసరెడ్డి దగ్గర రూ 3.8లక్షలు అప్పు చేశాడు. దానికి కూడా తన భూమిని తనఖా పెట్టాడు. దానిని ఆసరగా మలచుకుని ఇప్పటికే గ్రామంలో కొందరి భూములు అదే క్రమంలో తన సొంతం చేసుకున్న శ్రీనివాసరెడ్డి మంత్ర్యానాయక్ పొలాన్ని కూడా దక్కించుకోవాలని చూసినట్టు స్తానికులు చెబుతున్నారు.

దానికి అనుగుణంగానే మంత్ర్యానాయక్ పొలంలో పనులకు ఎవరి ట్రాక్టర్ వెళ్లకుండా అడ్డుపడ్డాడు. చివరకు నాయక్ సమీప బంధువు రాజా తన ట్రాక్టర్ తో పొలం పనులకు సిద్ధం పడగా దానిని కూడా అడ్డుకోవడంతో పెద్ద వాగ్వాదం జరిగింది.

పొలం పనులు అడ్డుకోవద్దని అడగడానికి వెళ్లాం...

అప్పు ఇచ్చినందుకు తీరుస్తామని చెప్పాము..లేదంటే అసలు, వడ్డీ కూడా లెక్కలేసి భూమి రేటులో మినహాయించుకుని మిగిలిన మొత్తం ఇవ్వాలని అడిగాం. అయినా రెండూ చేయకుండా మమ్మల్ని పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. చివరకు ఎవరి ట్రాక్టర్ రాకుండా చేసినా మేము పనులకు ఆటంకం లేకుండా చేసుకున్నామని గొడవకు వచ్చారు. దాని గురించి అడుగుదామని వెళ్లాం. రోడ్డు మీదనే తగువు జరిగింది. ట్రాక్టర్ మీద నుంచి కిందకి దిగితే మాట్లాడదామని చెప్పాం. దానికే కోపం వచ్చి దురుసుగా ట్రాక్టర్ నడిపారు. దూసుకెళ్లడంతో చక్రాల కింద పడి నా భార్య తీవ్రంగా గాయపడింది. తండాలో ఉన్న ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి చనిపోయింది. పోలీసులకు చెప్పాం. కానీ అధికారులెవరూ మాకు న్యాయం చేయలేదు. నలుగురు ఆడబిడ్డలు మాకు. తల్లి లేనివాళ్లయిపోయారు. ఎలా బతకాలి. అంటూ మంత్ర్యానాయక్ బీబీసీ కి తెలిపారు.

ట్రాక్టర్ డీకొన్న ప్రదేశం
ఫొటో క్యాప్షన్, ట్రాక్టర్ డీకొని గిరిజన మహిళ చనిపోయిన ప్రదేశం

చాలామంది పొలాలు అలాగే కాజేశారు..

శ్రీనివాసరెడ్డి తో పాటు పలువురు ఇతరులు కూడా ఎస్టీ రైతులకు అప్పులిచ్చి భూములు కాజేసిన అనుభవం తండాలో చాలామందికి ఉందని స్థానికులు చెబుతున్నారు. స్థానిక మహిళ సక్రూ నాయక్ బీబీసీ తో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించింది.

"ఐదేళ్ల క్రితం మా ఊరిలో శ్రీనివాసరెడ్డి కి భూమి లేదు. ట్రాక్టర్ తో పనులు చేయడం కోసం వచ్చాడు. కానీ, ఇప్పుడు 10 ఎకరాల పొలం ఆయన చేతుల్లో ఉంది. కొంత కౌలుకి, కొంత సొంత భూమి ఆయన సాగు చేస్తున్నారు. మంత్ర్యానాయక్ పొలం విషయంలో కూడా తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరించారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరంచారు. అటవీ భూములను సాగులోకి తెచ్చి, ఎస్టీలు పట్టాలు తెచ్చుకుంటే దానిని ఇతరులు కాజేస్తున్నారు. అమాయకులు రెండు, మూడు లక్షలకే సొంత భూములు కోల్పోయి మళ్లీ వాటిలోనే కూలీకి వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేవాళ్లే కనిపించడం లేదు" అని చెప్పారు.

ధర్నా చేస్తున్న ప్రజలు

బాధితురాలి మృతదేహంతో ఆందోళన

నర్సారావుపేట ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే మంత్రూ బాయి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. నలుగురు ఆడబిడ్డలున్న కుటుంబానికి ఆధారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమను ఆదుకోవాలని , నిందితుడిని శిక్షించాలని కోరుతూ శివాపురం తండాలో ఆందోళనకు దిగారు.

మృతదేహాన్ని ట్రాక్టర్ లో ఉంచి, రోడ్డుపై బైఠాయించారు. పట్టపగలు హత్య చేస్తే తమను కనీసం పరామర్శించేందుకు మండల స్థాయి అధికారులు కూడా రాలేదని వాపోయారు. వారికి వివిద ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు మద్ధతు పలికారు.

ఈ సందర్భంగా మృతురాలి కుమార్తె లచ్చిమి బాయి బీబీసీతో మాట్లాడారు. మేము నలుగురు ఆడబిడ్డలం. మా నాన్నకు ఉన్న రెండున్నర ఎకరాల పొలం తప్ప మరో దారి లేదు. అప్పు తీరుస్తామని చెప్పినా వినకుండా మా భూమి తీసుకోవాలనుకున్నారు. కుదరదని చెప్పినందుకే మా అమ్మని కడతేర్చారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఉరితీయాలి. మా కుటుంబానికి న్యాయం చేయాలి. రక్షణ కల్పించాలని కోరారు.

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా పెట్టాం...

నిందితుడు శ్రీనివాసరెడ్డిపై హత్యానేరంతో పాటుగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశామని విచారణాధికారి , నర్సారావుపేట రూరల్ సీఐ అచ్చెయ్య బీబీసీకి తెలిపారు.

"ఈ భూమి విషయంలో కొంతకాలంగా వివాదం ఉంది. భూమి స్వాధీనం చేసుకుంటానని శ్రీనివాసరెడ్డి బెదిరిస్తున్నారు. పొలం సాగు చేసుకుని క్రమంగా అప్పులు తీరుస్తామని మంత్ర్యానాయక్, అతని భార్య చెబుతున్నారు. చివరకు పొలంలోకి వెళ్లినట్టు తెలియగానే శ్రీనివాసరెడ్డి వచ్చాడు. వాగ్వాదం జరిగింది. దాని గురించి అడగడానికి వెళ్లిన మంత్రుబాయితోనూ తగువు పడ్డాడు. ట్రాక్టర్ తో తొక్కించాడు. దాంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం తెలియగానే అప్రమత్తం అయ్యాం. గ్రామంలో అవసరమైన చర్యలు తీసుకున్నాం" అని అచ్చెయ్య వెల్లడించారు

ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్

రాజకీయ ఒత్తిళ్లతో కేసు నీరుగార్చాలని చూస్తే సహించం

భూమిని కాజేయాలని ప్రయత్నించి, కుదరదని చెప్పినందుకు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన నిందితుడు శ్రీనివాసరెడ్డిని కఠినంగా శిక్షించాలని ఎస్టీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ ధారూ నాయక్ డిమాండ్ చేశారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "రాజకీయ కారణాలతో కేసుని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. నిందితుడు స్థానికంగా వైసీపీ కోసం పనిచేస్తూ ఉంటారు. అతనికి అండగా నిలిచేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పలకరించడానికి కూడా రాలేదు. మేము రోడ్డు మీద బైఠాయించి, అంత్ర్యక్రియలు అడ్డుకునే వరకూ చివరకు తహశీల్దార్ కూడా గ్రామానికి రాలేదు. ఎస్టీల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఈ ఘటన చాటుతోంది. తక్షణం తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం" అని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)