గ్రౌండ్ రిపోర్ట్: ‘మా చావులకు కూడా మేమే సాక్ష్యాలు తీసుకురావాలా?’

- రచయిత, ప్రియాంక దూబే
- హోదా, బీబీసీ ప్రతినిధి, భోజ్‌పూర్ (బిహార్) - బథానీటోల నుంచి
సాధు పల్టన్ రామ్‌కు తన వయసెంతో తెలియదు. ఎవరో ఒకరి సాయం లేకుండా ఆయన సొంతంగా లేచి నిలబడలేరు.
బక్కపలచని నల్లటి దేహం, పొడవాటి తెల్ల గడ్డంతో గ్రామం మొదట్లో తన ఇంటి ముందు కూర్చున్న పల్టన్ రామ్ ముందు నుంచే సాధువేమీ కాదు.
ఆయన సాధువుగా మారిన కథ, ఆ ఊరి కథ రెండూ ఒకటే.
పల్టన్ రామ్ బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా, బథానీటోల గ్రామవాసి. 1996 జులై 21న 'రణవీర్ సేన' ఆ ఊరిపై దాడికి పాల్పడింది.
ఆ దాడిలో రణవీర్ సేన సభ్యులు 21 మంది దళితులనూ, ముస్లింలనూ సామూహికంగా హత్య చేశారు. వారిలో 11 మంది మహిళలు, ఆరుగురు పిల్లలున్నారు. ఆఖరుకు ముగ్గురు పాలుతాగే పిల్లల్ని కూడా వారు వదిలిపెట్టలేదు.

'బథానీటోల మారణకాండ' దేశంలో దళితులపై జరుగుతున్న హింసాకాండకు సంబంధించిన చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోతుంది.
ఆ మారణకాండలో పల్టన్ రామ్ 13 ఏళ్ల కూతురు ఫూలా కుమారి కూడా మరణించింది. ఆ గ్రామంలో మరణించిన వారి స్మృతిలో ఒక స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించారు.
పల్టన్ రామ్ ఉంటున్న ఒక గది ఇల్లు సరిగ్గా స్మారక చిహ్నానికి ఎదురుగా ఉంది.
పల్టన్ రామ్ ధోవతి కట్టుకుని ఇంటి వరండాలో కూర్చున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన చెవులు సరిగా వినిపించడం లేదు. మే నెల ఎండలు, బలహీనత కారణంగా ఆయన మాట్లాడ్డానికి కూడా కష్టపడుతున్నారు.
కూతురు ఫూలా కుమారి గురించి ప్రశ్నించగా ఆయన ఆ స్మారక స్థూపం వైపు చూపుతూ, ''నా ఫూలా అక్కడుంది. నేను ఇక్కడి నుంచి రోజూ నా కూతుర్ని చూస్తుంటాను'' అన్నారు.
ఇలా చెప్పాక ఆయన కళ్లలో నీళ్లు నిలిచాయి.

కింది కోర్టులో శిక్ష.. పైకోర్టులో నిర్దోషులు
14 ఏళ్ల న్యాయపోరాటం అనంతరం, భోజ్‌పూర్ కింది కోర్టు 68 మంది నిందితులలో 23 మందిని దోషులుగా తేల్చింది. 20 మందికి జీవిత ఖైదు విధించగా, ముగ్గురికి మరణశిక్ష విధించారు.
కానీ పట్నా హైకోర్టు 2012, ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పులో సరైన సాక్ష్యాధారాలు లేవనే కారణంతో వారందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ విడుదల చేసింది. విడుదలైన వారిలో రణవీర్ సేన చీఫ్ బ్రహ్మేశ్వర్ 'ముఖియా' కూడా ఉన్నారు.
ఉన్నత కులాల వారితో సాయుధ దళాలను ఏర్పాటు చేసిన బ్రహ్మేశ్వర్ ముఖియాను 2012లోనే హత్య చేశారు.
హైకోర్టు తీర్పుతో బథానీటోల బాధితులు న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ వారికి న్యాయం జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
ప్రతి 15 నిమిషాలకు ఒక దళితునిపై కేసు
ఈ ఏడాది జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలను పరిశీలిస్తే, గత పదేళ్లలో (2007-17) దేశంలో దళితులపై హింస 66 శాతం పెరిగింది. ప్రతి 15 నిమిషాలకు ఒక దళితునిపై కేసు నమోదు అవుతోంది.
గత నవంబర్‌లో విడుదల చేసిన ఎస్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం, 2015లో దళితులపై 38,670 కేసులు నమోదు కాగా, 2016లో 40,801 కేసులు నమోదయ్యాయి.
హోమ్ శాఖ 2018, ఏప్రిల్‌లో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, దళితులపై జరుగుతున్న దాడుల కేసుల్లో కేవలం 16.3 శాతం మంది నిందితులకు మాత్రమే శిక్ష పడుతోంది.

అరగంటలో 21 మందిని కాల్చేశారు
పల్టన్ రామ్‌తో సంభాషిస్తుండగా, మిగతా వాళ్లు మా చుట్టూ గుమికూడారు.అక్కడికి 40 మీటర్ల దూరంలో మార్వారీ చౌధరీ మల్లాహ్ నివాసం ఉంది.
బథానీటోల మారణకాండలో ఆ ఇంటి ప్రాంగణంలోనే 14 మంది మరణించారు. మరణించిన వారంతా మహిళలు, పిల్లలే.
చౌధరి నాటి సంఘటనను వివరిస్తూ, ''ఆ ఘటన జరిగిన రోజు చాలా మంది పని కోసం వెళ్లారు. మధ్యాహ్నం సుమారు 60 మంది రణవీర్ సేన సభ్యులు 'రణవీర్ బాబాకు జై' అంటూ నినాదాలు చేస్తూ వచ్చారు. వాళ్ల చేతుల్లోని తుపాకులు దీపావళి టపాసుల్లా పేలాయి. అరగంట సమయంలో వాళ్లు 21 మందిని కాల్చేశారు. మా ఇంటిలో కూడా ముగ్గురు హత్యకు గురయ్యారు.'' అని వివరించారు.
కూలీ పెంచమన్నందుకే..
తమ కూలీని 20 రూపాయల నుంచి 21 రూపాయలకు పెంచమని అడిగినందుకే ఈ మారణకాండకు పాల్పడ్డారని ఈ హత్యాకాండకు ప్రత్యక్ష సాక్షి అయిన వృద్ధుడు హీరాలాల్ తెలిపారు.
''మొదట మేం దాదాపు 150 మంది వెట్టిచాకిరీ చేసేవాళ్లం. అయితే 79లో వచ్చిన కలెక్టర్ మనోజ్ కుమార్ శ్రీవాస్తవ మమ్మల్ని వెట్టి నుంచి విముక్తి చేశారు. ఇది గ్రామంలోని ఉన్నత కులాల వారికి కంటగింపుగా మారింది.'' అని హీరాలాల్ తెలిపారు.
''ఆ తర్వాత కూడా మాకు అతి తక్కువ కూలీ ఇచ్చేవాళ్లు. దాంతో మేం మా కూలీ పెంచమన్నాం. ప్రభుత్వ కనీస కూలీ రేటు రోజుకు రూ.21 ఉంటే ఎంతో పోరాటం తర్వాత మాకు రూ.20 ఇచ్చేవాళ్లు. కూలీ రేటు పెంచమని అడిగితే నక్సలైట్లలా మారకండి అని హెచ్చరించేవాళ్లు. బిహార్‌లో రణవీర్ సేన ఏర్పడినపుడు బథానీని ఖతం చేయాలనుకున్నారు, చేశారు'' అని ఆయన అన్నారు.

భయం నీడలో బతుకు
ఇప్పటివరకు తమ జీవితాల్లో ఎలాంటి మార్పూ లేదని 50 ఏళ్ల కపిల్ తెలిపారు. ''వాళ్లు పెట్టే బాధలను మేం నిశబ్దంగా భరించినంత వరకే గ్రామంలో శాంతి ఉంటుంది. నేటికి కూడా దళితులకు రోజుకు రూ.100 కూలీనే ఇస్తున్నారు. దేశంలో ఇదే తక్కువ కూలీ. మేం నోరు మూసుకుని పని చేయడం మినహా గత్యంతరం లేదు. మా వాళ్లను హత్య చేసిన వారి పొలాల్లోనే మేం పని చేయాల్సి వస్తోంది'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
హీరాలాల్, ''దేశంలో ప్రస్తుతం పరిస్థితిని చూస్తూనే ఉన్నారు. ముస్లింలు, దళితులపై దాడులు పెరుగుతున్నాయి. నిన్న ఎవరో హిందూ మతం పేరిట ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చారు. ఏదైమైనా, కేసుల్లో నిందితులను నిర్దోషులుగా విడుదల చేశాక, ఉన్నత కులాల వారి ధైర్యం పెరిగిపోయింది'' అని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారిగా పని చేసి రిటైరై ప్రస్తుతం సామాజిక కార్యకర్తగా పని చేస్తున్న ఎస్ ఆర్ దారాపురి, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని తెలిపారు.
ఎన్‌సీఆర్‌బీ తాజా గణాంకాల ప్రకారం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై నేరాలు ఇతర రాష్ట్రాలకన్నా ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.
22 ఏళ్ల పాటు నిద్రపోలేకపోయా..
బథానీటోల మారణకాండంలో నయీముద్దీన్ కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మారణకాండతో బెదిరిపోయిన నయీముద్దీన్ మిగిలిన తన కుటుంబసభ్యులను తీసుకుని గ్రామాన్ని వీడి, ఆరాలో ఉండాలని నిర్ణయించుకున్నారు.
మరణించిన వారిలో నయీముద్దీన్ సోదరి, పెద్ద కోడలు, పదేళ్ల కొడుకు, మూడు నెలల మనవరాలు ఉన్నారు.
''గత 22 ఏళ్లుగా నాకు నిద్ర పట్టడం లేదు. నా కుటుంబ సభ్యుల మృతదేహాలను స్వయంగా నేనే నా ట్రాక్టర్‌లో తీసుకెళ్లి ఖననం చేశాను. నా పదేళ్ల కుమారుడి తలపై కత్తితో నరికారు. ''
ఈ మాటలు చెబుతుంటే ఆయన కళ్లు నీళ్లతో నిండిపోయాయి.

మా కేసు చూడనే చూడరు..
''మాకు ఏం న్యాయం లభిస్తుంది? సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉండేది. కానీ లాయర్ మా కేసు కోర్టులో మూలుగుతోందని చెప్పారు. ఆ జడ్జిగారు కూర్చోనే కూర్చోరు. కూర్చున్నా మా కేసునే చూడరు'' అని నయీముద్దీన్ అన్నారు.
''కింది కోర్టులో జడ్జి నేను ఏడ్వడం చూసి నాకు న్యాయం చేస్తానన్నారు. 14 ఏళ్ల అనంతరం ఆయన 20 మందికి జీవిత ఖైదు, ముగ్గురికి మరణశిక్ష విధించారు. మరి పైకోర్టు కేవలం 6 నెలల విచారణలోనే వారందరినీ ఎలా నిర్దోషులుగా తేల్చింది?'' అని ప్రశ్నించారు.
''జడ్జి సాక్ష్యాలు లేవని అన్నారు. సాక్ష్యాలను తీసుకురావడం పోలీసుల విధి. మా చావులకు కూడా మేమే సాక్ష్యాలు తీసుకురావాలా?''
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








