‘ఈ సినిమాతో ఎన్‌టీఆర్‌ను దేవుడిగా ఆరాధించడం మొదలైంది’

ఫొటో సోర్స్, Nandamuri Taraka Rama Rao/Facebook
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గర ఒక కుగ్రామమైన నిమ్మకూరులో వెంకటేశ్వరమ్మ, లక్ష్మయ్యలకు ఎన్‌టీఆర్ జన్మించారు. అయితే.. లక్ష్మయ్య సోదరుడు రామయ్య, చంద్రమ్మ దంపతులకు పిల్లలు లేకపోవటంతో వారికి ఎన్‌టీఆర్‌ని దత్తత ఇచ్చారు.
ఎన్‌టీఆర్ ఐదో తరగతి వరకూ ఆ ఊర్లోనే చదువుకున్నారు. అక్కడ హైస్కూల్ లేకపోవటంతో రామయ్య దంపతులు తమ దత్తపుత్రుడితో కలిసి విజయవాడకు నివాసం వచ్చారు. అక్కడ మునిసిపల్ స్కూల్‌లో చేరిన ఎన్‌టీఆర్ మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు.

ఫొటో సోర్స్, TDP/Facebook
అనంతరం 1940లో విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సులో చేరారు. ఇంటర్ చదివేటప్పుడు కుటుంబానికి చేదోడుగా సైకిల్ మీద తిరుగుతూ హోటళ్లకు పాలు పోశారనీ చెబుతారు.
ఆ కాలేజీలో తెలుగు శాఖాధిపతి ప్రఖ్యాత కవి విశ్వనాథ సత్యనారాయణ. 'కవి సామ్రాట్' బిరుదున్న విశ్వనాథ రాసిన 'రాచమల్లుని దౌత్యం' నాటకాన్ని కాలేజీలో ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఆడపిల్లలు నాటకాలకు దూరంగా ఉండటంతో.. అందులో కథానాయిక పాత్ర ఎన్‌టీఆర్ పోషించారు.

ఫొటో సోర్స్, TDP/Facebook
అదే ఆయన తొలి నటన.. పోషించిన తొలి పాత్ర. ఆ నాటక పోటీల్లో ఎన్‌టీఆర్‌కి ప్రథమ బహుమతి లభించింది.
ఆ మరుసటి ఏడాది కాలేజీ వార్షికోత్సవాల సందర్భంగా 'అనార్కలి' నాటకం వేశారు. అందులో కథానాయకుడు సలీం పాత్రను ఎన్‌టీఆర్ పోషించారు. ఆ నటనకు కూడా రెండో ఏడాదీ ప్రథమ బహుమతి పొందారు.

ఫొటో సోర్స్, TDP/Facebook
1942 మే నెలలో.. 20 ఏళ్ల వయసులో ఎన్‌టీఆర్‌కు తన మేనమామ కూతురు బసవతారకంతో వివాహమైంది. వీరిద్దరికి ఎనిమిది మంది మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు జన్మించారు.

ఫొటో సోర్స్, TDP/Facebook
ఎన్‌టీఆర్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో రెండుసార్లు ఫెయిలయ్యారు. అయినా పట్టువదలకుండా పరీక్షలు రాసి పాసయ్యారు. 1945లో గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఏ కోర్సులో చేరారు. నాటకాల మీద ఇష్టంతో అక్కడ స్నేహితులతో కలిసి 'నేషనల్ ఆర్ట్ థియేటర్' స్థాపించిన ఎన్‌టీఆర్ పలు నాటకాలు వేసేవారు.
ప్రముఖ తెలుగు దర్శకుడు సి.పుల్లయ్య తన ''కీలుగుర్రం'' సినిమాలో తొలిసారిగా ఎన్‌టీఆర్‌కు సినిమా ఆఫర్ ఇస్తానన్నారు. కానీ డిగ్రీ పూర్తి చేయటం కోసం ఆ ఆఫర్‌ని ఎన్‌టీఆర్ తిరస్కరించారు. ఆ తర్వాత ఎల్.వి.ప్రసాద్ తన 'మన దేశం' సినిమాలో ఎన్‌టీఆర్‌కి చిన్న పాత్ర ఇస్తానన్నారు. హీరో పాత్ర కోసం చూస్తున్న ఎన్‌టీఆర్ అదీ వద్దన్నారు.

ఫొటో సోర్స్, TDP/Facebook
ఈలోగా మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసిన ఎన్‌టీఆర్ సబ్-రిజిస్ట్రార్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 1947 అక్టోబర్‌లో ఆ ఉద్యోగంలో చేరారు. నెల జీతం రూ. 120.
దర్శకుడు బి.ఎ.సుబ్బారావు తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న 'పల్లెటూరి పిల్ల' సినిమాలో హీరో పాత్రకు ఎన్‌టీఆర్‌ను ఎంపిక చేశారు. అందుకు రూ. 1,116 పారితోషికం. ఆ ఆఫర్‌ను ఓకే చేసిన ఎన్‌టీఆర్.. తన ఉద్యోగానికి చేరిన నెల రోజుల్లోపే రాజీనామా చేసేసి.. సినిమాల్లో నటించటానికి మద్రాసు వెళ్లారు.

ఫొటో సోర్స్, TDP/Facebook
ఎల్.వి.ప్రసాద్ సినిమా 'మన దేశం'లో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ పాత్రకు ఒప్పుకుని నటించారు. అదే వెండితెరపై ఎన్‌టీఆర్‌కి తొలి సినిమా అయింది. ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా 'పల్లెటూరి పిల్ల' ఆంధ్రా ప్రాంతంలో ఏడు థియేటర్లలో 100 రోజులు ఆడింది.
జానపద సినిమా 'పాతాళ భైరవి'తో ఎన్‌టీఆర్ కెరీర్ మలుపు తిరిగింది. మాయా బజార్ సినిమాలో కృష్ణుడి పాత్రతో ఎన్‌టీఆర్ తొలిసారి దేవుడి పాత్రలో కనిపించి అలరించారు. అయితే.. 'శ్రీ వేంకటేశ్వర మహత్యం' సినిమాలో ఆయన చేసిన పాత్రతో ఎన్‌టీఆర్‌ను తెలుగు ప్రజలు దేవుడిగా ఆరాధించటం మొదలైంది.

ఫొటో సోర్స్, TDP/Facebook
1949 నుంచి 1982 వరకూ 33 ఏళ్లలో 292 సినిమాల్లో ఎన్‌టీఆర్ నటించారు. అందులో 274 తెలుగు సినిమాలైతే 15 సినిమాలు తమిళం, మూడు సినిమాలు హిందీవి ఉన్నాయి.
1982లో బొబ్బిలి పులి సినిమా థియేటర్లలో రిలీజైంది. ఆ ఏడాది మే 28.. ఎన్‌టీఆర్ 60వ జన్మదినం. తన షష్ఠిపూర్తి రోజే ఆయన తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. 'ఆరు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం' నినాదంతో రాష్ట్రమంతటా 'చైతన్య రథం'లో పర్యటించి ప్రచారం చేశారు.

ఫొటో సోర్స్, TDP/Facebook
ఎన్నికల్లో టీడీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. 1983 జనవరి 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్‌టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఏడాదిన్నర తిరగకుండానే ఆయనకు తొలి రాజకీయ గండం ఎదురైంది.
ఎన్‌టీఆర్ గుండెకు శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లినపుడు.. 1984 ఆగస్టు 15న నాటి ఆర్థికమంత్రి నాదెండ్ల భాస్కరరావు పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందన్నారు. అప్పటి ఏపీ గవర్నర్ రామ్‌లాల్ ఎన్‌టీఆర్‌ను సీఎం పదవి నుంచి తొలగించి నాదెండ్లను సీఎంగా ప్రమాణం చేయించారు.

ఫొటో సోర్స్, TDP/Facebook
అమెరికా నుంచి తిరిగివచ్చిన ఎన్‌టీఆర్ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని వారినందరినీ రాజ్‌భవన్ వద్దకు తీసుకెళ్లారు. కానీ గవర్నర్ రామ్‌లాల్ స్పందించకపోవటంతో ప్రజలమధ్య యాత్ర చేస్తూ.. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల మద్దతు కూడగట్టారు.
ఈ ఒత్తిడితో రామ్‌లాల్‌ను పదవి నుంచి తొలగించిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ.. శంకర్‌దయాళ్‌శర్మను గవర్నర్‌గా నియమించారు. ఎన్‌టీఆర్ నెల రోజుల సంక్షోభం తర్వాత మళ్లీ సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి అయ్యారు.

ఫొటో సోర్స్, TDP/Facebook
1985లో ఎన్‌టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి గెలిచారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్లు పూర్తి కాలం అధికారంలో ఉన్నారు. అయితే.. అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు ప్రభుత్వ వ్యతిరేకతల కారణంగా 1989 ఎన్నికల్లో ఎన్‌టీఆర్ అధికారం కోల్పోయారు.
1994 డిసెంబర్ ఎన్నికల్లో మళ్లీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆయన తన జీవిత కథ రాయటానికి వచ్చి సన్నిహితురాలిగా మారిన లక్ష్మీపార్వతిని వివాహమాడారు. రాజకీయాల్లో, ప్రభుత్వంలో ఆమె జోక్యం పెరుగుతోందని ఆరోపణలు పెరిగిపోయాయి.

ఫొటో సోర్స్, Nandamuri Lakshmi Parvathi/Facebook
ఎన్‌టీఆర్ మూడోసారి సీఎంగా ప్రమాణం చేసి తొమ్మిది నెలలు తిరగకముందే.. అల్లుడు నారా చంద్రబాబునాయుడు, అసంతృప్త నేతలు, ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుగుబాటు చేశారు. ప్రభుత్వ, పార్టీ పదవుల నుంచి ఆయనను తొలగించారు (వైశ్రాయ్ ఆపరేషన్).ఆ పదవులు చంద్రబాబు చేపట్టారు. ఈ అంశంపై అప్పటి నుంచి ఇప్పటి దాకా భిన్నమైన కోణాలు, వ్యాఖ్యానాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Nandamuri Taraka Rama Rao/Facebook
చంద్రబాబు తనను వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తూ ఎన్‌టీఆర్ ప్రజల మధ్యకు వెళ్లారు. అయితే.. 1995 జనవరి 18వ తేదీన ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








