ఆపరేషన్ కహుతా: పాకిస్తాన్ అణు కేంద్రాన్ని ఇజ్రాయెల్-భారత్ ధ్వంసం చేయాలని అనుకున్నాయా..

ఫొటో సోర్స్, Gettty Images
- రచయిత, వసంత్
- హోదా, బీబీసీ కోసం
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకర దాడుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
ఈ దాడుల్లో కొన్ని వందల మంది మరణించగా, కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు.
కాల్పుల విరమణ చేయడం తప్పదని భావించిన ఇజ్రాయెల్.. హమాస్‌ను, హమాస్ నిర్మాణాలను వీలైనంత ధ్వంసం చేయాలని భావించింది.
తీవ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ కూడా ఇజ్రాయెల్ పద్ధతినే అనుసరించాలని నిపుణులు ఆన్‌లైన్‌లో చర్చించడం మొదలు పెట్టారు.
అలాగే, ఇజ్రాయెల్ సహాయంతో సరైన సమయంలో భారతదేశం ధైర్యంగా వ్యవహరించి ఉంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఆపగలిగి ఉండేదనే చర్చలు కూడా జరిగాయి.
అయితే, ఇజ్రాయెల్ నిజంగానే పాకిస్తాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి ఉత్సాహం చూపించిందా? ఆ పని పూర్తి చేయడానికి గుజరాత్‌లోని ఎయిర్ బేస్‌ను ఉపయోగించుకోవాలని అనుకుందా? కహుతాలో పాకిస్తాన్ చేస్తున్న అణ్వాయుధ కార్యక్రామాన్ని ఆపే అవకాశాన్ని ఇండియా చాలాసార్లు వదులుకుందా?
వీటిపై విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయం మాత్రం నేటికీ చర్చనీయాంశమే.
ఇరాక్ ఆక్రమణ
1981 జూన్ 7న ఇజ్రాయెల్ వైమానిక దళం మూడు శత్రు దేశాల సరిహద్దులను దాటింది.
ఇరాక్‌లోని ఓసిరాక్‌లో నిర్మాణంలో ఉన్న అణు కేంద్రాన్ని పేల్చి విధ్వంసం సృష్టించింది.
అప్పట్లో ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న ఈజిప్ట్‌లోని సినాయ్ ఎడారి నుంచి ఇజ్రాయెల్‌కు చెందిన ఎనిమిది ఎఫ్-16, రెండు ఎఫ్-15 ఫైటర్ జెట్‌లు బయలుదేరాయి.
ఇవి 120 మీటర్ల ఎత్తులో సౌదీ అరేబియా, జోర్డాన్ మీదుగా వెళ్లాయి.
వీటితో పాటు 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి సరిపోయే అదనపు ఇంధన ట్యాంకులను సౌదీ అరేబియాలోని ఎడారి ప్రాంతంలో జారవిడిచారు.
ఇరాక్ భూభాగంలోకి ప్రవేశించగానే రాడార్‌కు దొరక్కుండా ఉండేందుకు ఇజ్రాయెల్ విమానాలు 30మీటర్ల ఎత్తులో ఎగిరాయి.
సాయంత్రం 5.30 నిమిషాలు అయ్యేటప్పటికి వేర్వేరు దిశల్లో ఈ విమానాలు 2130 మీటర్ల ఎత్తుకు చేరాయి.
ఆ తర్వాత గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో ఓసిరాక్ డోమ్ వైపు దూసుకెళ్లాయి. ఆ తర్వాత ఒక దాని తర్వాత ఒకటి 16 టైం డిలే బాంబులను 35 డిగ్రీల కోణంలో ఆ ప్లాంట్‌పై జారవిడిచాయి. అందులో రెండు పేలలేదు. కానీ మిగిలిన బాంబులు వాటి పనిని కానిచ్చాయి.
ఫ్రెంచ్ డిజైన్‌లో రూపొందించిన రియాక్టర్ ఈ బాంబు దాడిలో ధ్వంసమైంది.
ఇంతలో ఇరాక్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ గర్జించాయి.
కానీ ఇజ్రాయెల్ విమానాలు వెనక్కి వెళ్లేందుకు అప్పటికే 12,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నాయి.
ఇజ్రాయెల్ విమానాలను ఒక్క ఇరాక్ విమానం కూడా పట్టుకోలేకపోయింది. ఇజ్రాయెల్ విమానాలు వెనక్కి తిరిగి వచ్చేసరికి ట్యాంకుల్లో కేవలం 450 లీటర్ల ఇంధనం మాత్రమే ఉంది. అది కేవలం 270 కిలోమీటర్లు ప్రయాణించడానికి మాత్రమే సరిపోతుంది.
ఆ దాడుల్లో 11 మంది సైనికులు, ఒక ఫ్రెంచ్ పౌరుడు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇజ్రాయెల్ చర్యలను భద్రతా సమితి ఖండించింది.
మరోవైపు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మించుకునేందుకు ఇరాక్‌కు ఫ్రాన్స్, ఇటలీ సహాయం చేయడాన్ని ఇజ్రాయెల్ విమర్శించింది.
ఇజ్రాయెల్‌పై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
ఇజ్రాయెల్ వైమానిక దళం నిర్వహించిన ఈ దాడులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భద్రతానిపుణులు ఆశ్చర్యపోయారు.
ఇలాంటి పనినే చేయాలని భారతీయ భద్రతా నిపుణులు కూడా ఆలోచించారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ అణు కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆపరేషన్
భారతదేశంలో 1975లో ఎమర్జెన్సీ విధించారు.
1977 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.
దేశంలో మొట్టమొదటిసారి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటయింది.
పాకిస్తాన్‌తో 1971 యుద్ధం తర్వాత భారతీయ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ ('రా') ఆ దేశ రాజకీయ నాయకులపై నిఘా పెడుతోందని భావించారు.
జనతా పార్టీ అధికారంలోకి రాగానే 'రా' బడ్జెట్‌ను 30 శాతం తగ్గించేసింది.
దీనితో పాటు పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన దేశంగా మారకుండా ఉండేందుకు ఒక రహస్య ఆపరేషన్ కూడా చేపట్టారు.
2018లో పాకిస్తాన్ గ్రూప్ కెప్టెన్ ఎస్‌ఎం హాలీ ఆ దేశ రక్షణ శాఖ పత్రిక 'పాకిస్తాన్ డిఫెన్స్ జనరల్'లో ఒక వ్యాసం రాశారు.
1977లో ఒక రా ఏజెంట్‌కు పాకిస్తాన్ కహుతా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బ్లూ ప్రింట్ లభించిందని, దాన్ని భారత్‌కు ఇవ్వడానికి 10 వేల డాలర్లను డిమాండ్ చేశారని అందులో రాశారు.
ఈ విషయం అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయికి తెలియగానే, ఆయన అప్పటి పాకిస్తాన్ మిలటరీ పాలకుడు జనరల్ జియా ఉల్ హక్‌కు ఫోను చేసి "మీరు కహుతా దగ్గర అణు బాంబును నిర్మిస్తున్నట్లు మాకు తెలుసు" అని చెప్పారు.
దాంతో ఈ అంశంపై విచారణ మొదలైంది. 'రా' గూఢచారిని పట్టుకున్నారు. కానీ ఆ రహస్య బ్లూ ప్రింట్‌ను ఇండియా కనిపెట్టలేకపోయింది.
కానీ పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీ దిశగా అడుగులు వేస్తున్నట్లు 'రా' అనుమానించింది. దాంతో పాకిస్తాన్‌లో ఉన్న తమ గూఢచర్య నెట్‌వర్క్‌ను అప్రమత్తం చేసింది రా.
ఇస్లామాబాద్ సమీపంలోని కహుతా దగ్గర అణ్వాయుధ కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఒక సీక్రెట్ మిషన్‌లో 'రా' గుర్తించింది.
అయితే, ఈ విషయాన్ని ధృవీకరించుకోవడానికి 'రా' గూఢచారులు మరో ఆపరేషన్ చేపట్టారు.
కహుతాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల తల వెంట్రుకలు సేకరించారు. సైంటిస్టులు జట్టు కత్తిరించుకోవడానికి వెళ్లే సెలూన్‌కి వెళ్లి వారి తల వెంట్రుకల శాంపిళ్లను సేకరించారు.
ఆ శాంపిళ్లను భారతదేశానికి పంపారు. ఆ వెంట్రుకల్లో రేడియో యాక్టివ్ పదార్థాలు ఉన్నట్లు నిరూపితమైంది. అంటే, ఆ శాస్త్రవేత్తలు పని చేస్తున్న చోట అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.
ఈ సమాచారం తెలిసిన తర్వాత కహుతా ప్లాంట్ బ్లూ ప్రింట్ కోసం ఒక కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు.
కానీ ఆ సమయంలో ఇందిరాగాంధీ మళ్లీ అధికారంలోకి వచ్చారు. 'రా' ఆపరేషన్ కహుతాను ప్రారంభించింది.
ఇరాక్ న్యూక్లియర్ ప్లాంటును ఇజ్రాయెల్ విధ్వంసం చేసినట్లుగానే భారతదేశం కూడా పాకిస్తాన్‌లోని కహుతా అణు కేంద్రాన్ని పేల్చేయాలని అనుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ ఈ ప్రతిపాదన చేసిందా?
"గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విమానాలు ప్రవేశించేందుకు గుజరాత్‌లో ఉన్న జామ్‌నగర్ ముఖ్యమైన ద్వారం" అని భారత ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి ఒకరు చెప్పారు.
అందుకే విదేశాల్లో కొనుగోలు చేసిన చాలా విమానాలను ఇక్కడికే తీసుకొస్తారు.
"రాఫెల్ విమానాలు కూడా ఇక్కడికే రావాల్సి ఉండేది. కానీ వాటి సామర్ధ్యాన్ని, పైలట్ల ప్రావీణ్యాన్ని ప్రదర్శించేందుకు జామ్‌నగర్‌కు బదులు హర్యానాలోని అంబాలాకు వచ్చాయి" అని చెప్పారు.
పాకిస్తాన్‌లో ఉన్న కహుతా అణు కేంద్రంపై కొత్తగా కొనుగోలు చేసిన జాగ్వర్ ఎయిర్ క్రాఫ్ట్‌తో దాడి చేయాలని భారత్ భావించిందని "పాకిస్తాన్: ది యునైటెడ్ స్టేట్స్ అండ్ ది గ్లోబల్ న్యూక్లియర్ కాన్స్పిరసీ" అనే పుస్తకంలో రాసినట్లు ఆడ్రియన్ లెవీ, క్యాథెరిన్ స్కాట్ క్లార్క్ అనే విలేఖరులు పేర్కొన్నారు.
1983 ఫిబ్రవరిలో భారత సీనియర్ సైనికాధికారులు రహస్యంగా ఇజ్రాయెల్‌లో పర్యటించారు.
కహుతా ప్లాంటు భద్రత వ్యవస్థను గుర్తించే ఒక ఎలక్ట్రానిక్ పరికరం గురించి వాళ్లు ఆ పర్యటనలో ఎంక్వైరీ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎఫ్-16 ఫైటర్ జెట్ల సమాచారం ఇజ్రాయెల్ భారతదేశానికి ఇచ్చింది.
దానికి ప్రతిఫలంగా మిగ్-23 ఎయిర్ క్రాఫ్ట్ సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు ఇచ్చింది భారత్.
ఇజ్రాయెల్ పొరుగు అరబ్ దేశాల్లో ఈ సోవియట్ ఎయిర్ క్రాఫ్టులు ఉన్నాయి. అందుకే ఇజ్రాయెల్‌కు ఈ సమాచారం అవసరమైంది.
సీనియర్ భద్రతా నిపుణులు భరత్ కర్నాడ్ తన బ్లాగ్‌లో ఇలా రాశారు.
"నేను 1983లో ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆరన్ యారివ్‌ను బీరుత్‌లో కలిసాను. ఈ ప్లాన్‌కు సంబంధించిన అనేక విషయాలను ఆయన నాతో చెప్పారు"
ఆ ప్రణాళిక ప్రకారం ఆరు ఎఫ్-16 ఫైటర్ జెట్లు, 6 ఎఫ్-15 విమానాలు ఇజ్రాయెల్‌లోని హైఫా నుంచి బయలుదేరి దక్షిణ అరేబియా సముద్రం మీదుగా భారత్‌లోని జామ్‌నగర్ చేరాల్సి ఉంది. అక్కడ పైలట్లు కాసేపు ఆగి కావాల్సిన మార్పులు చేసుకుంటారు.
ఆ సమయంలో పేలుడు సామగ్రి, ఇతర పరికరాలతో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కార్గో విమానం సి-17 జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్ ఎయిర్ పోర్టుకు చేరింది. ఎఫ్-16 విమానాలు జామ్‌నగర్‌లో బయలుదేరి గాలిలోనే ఇంధనం నింపుకుని ఉదంపూర్ చేరుతాయి.
"అక్కడ నుంచి ఈ విమానాలు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి ప్రవేశిస్తాయి. అయితే, రాడార్లకు చిక్కకుండా పర్వత శ్రేణుల్లో ఎగురుతాయి. పర్వతాల నుంచి ఈ విమానాలు బయటకు వచ్చేలోగా రెండు ఎఫ్-16 విమానాలు కహుతా అణు కేంద్రంపై బాంబులు వేస్తాయి"
"ఆ సమయంలో ఎఫ్- 15 విమానాలు మాత్రం గాలిలోనే ఉంటాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రతిస్పందన వస్తే ఇవి అడ్డుకుంటాయి. ఈ దాడి తర్వాత ఎఫ్-16 విమానాలు పశ్చిమ దిక్కుగా ఎగిరి పాకిస్తాన్ గగనతలాన్ని దాటేస్తాయి"
"అవి తక్కువ ఎత్తులో ఎగురుతాయి. పర్వతాల వెనక వైపు నుంచి దక్షిణం వెళ్లి తమ రహస్య ప్రాంతానికి చేరుకుంటాయి"
"ఆ పర్వతాల్లో ఇజ్రాయెల్ విమానాలను ఎదుర్కొనే సాహసాన్ని పాకిస్తాన్ విమానాలు చేయలేవని ఇజ్రాయెల్ వ్యూహకర్తలు భావించారు"
"అయితే ఈ దాడిలో తమ పాత్ర లేదని భారత్ చెబుతుందని ఇజ్రాయెల్ భావించింది. అందుకే తన విమానాలపై సొంత సైన్యపు చిహ్నంతో ఎగిరేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది అని ఆ దేశ మిలటరీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆరన్ యారివ్‌తో చర్చను ఉటంకిస్తూ సీనియర్ భద్రతా నిపుణులు భరత్ కర్నాడ్ రాశారు.
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు డాక్టర్ రాజగోపాలన్.
"పాకిస్తాన్‌లోని కహుతా అణు కేంద్రంపై దాడి చేయడానికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు ఇజ్రాయెల్ విమానాలు వస్తాయని చాలా చర్చలు జరిగాయి. కానీ ఈ ప్రణాళిక గురించి అమెరికా, రష్యా ఆందోళన చెందినట్లు అమెరికా, హంగరి డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్లలో బయటపడింది"
"అయితే దీని గురించి వాళ్లది కేవలం ఊహేనా? లేక వారి దగ్గర స్పష్టమైన సమాచారం ఉందా అనే విషయంపై స్పష్టత లేదు. దాని గురించి కచ్చితంగా ఏమీ చెప్పలేం" అని ప్రొఫెసర్ డాక్టర్ రాజగోపాలన్ అన్నారు.
కహుతా అణు కేంద్రంపై సంయుక్త దాడికి సంబంధించి ఇజ్రాయెల్ సైనిక అధికారులు భారత్‌తో మూడుసార్లు మాట్లాడినట్లు టెల్ అవివ్ నుంచి ప్రచురితమయ్యే 'ది జెరూసలెం పోస్ట్' 1987 ఫిబ్రవరిలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ నుంచి యుద్ధ విమానాలను రహస్యంగా జామ్‌నగర్ వరకు తీసుకురావడం, అక్కడికి చేరుకున్న విషయాన్ని ఇతరులకు తెలియకుండా దాచిపెట్టడం ఇజ్రాయెల్‌కు కష్టమయ్యేదని ప్రొఫెసర్ డాక్టర్ రాజగోపాలన్ అన్నారు.
పాకిస్తాన్ అణు బాంబును తయారు చేయగలిగితే, అది ఇరాక్, లిబియా, ఇరాన్‌లకు కూడా చేరుకుంటుందని ఇజ్రాయెల్ అనుమానించింది.
యురేనియం శుద్ధి సాంకేతికతను యూరోపియన్ యూనియన్ సంస్థలు, ఇరాన్, లిబియా, ఉత్తర కొరియాకు అమ్మేశారనే ఆరోపణలు పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ ఖాన్‌పై వచ్చాయి.
డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్ల ప్రకారం.. కహుతా అణు కేంద్రంపై భారత్ దాడికి సంబంధించిన సమాచారం తమకు వస్తే తప్పకుండా చెబుతామని అప్పటి అమెరికా దౌత్యవేత్త.. పాకిస్తాన్ మిలటరీ పాలకుడు జనరల్ జియాకు హామీ ఇచ్చారు.
1984 సెప్టెంబరు 22న అమెరికా నిఘా సంస్థ - సీఐఏ డిప్యూటీ డైరెక్టర్.. భారత్ వైమానిక దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లు పాకిస్తాన్ సీనియర్ అధికారులకు తెలియచేశారు.
అదే రోజు సీఐఏను కోట్ చేస్తూ అలాంటి దాడి జరగొచ్చని ఏబీసీ టెలివిజన్ కథనం ప్రసారం చేసింది.
భారతదేశంపై పశ్చిమ దేశాల ఒత్తిడి పెరగడంతో అప్పటి భారత ప్రధాని ఇందిర ప్లాన్‌ను రద్దు చేసి ఉంటారు.
ఒక నెల రోజుల తర్వాత అక్టోబరు 31 ఇందిర హత్యకు గురయ్యారు. ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ భారత ప్రధాని అయ్యారు.
ఇజ్రాయెల్‌తో భారత్ సంబంధాలు
1948 మే 15న ప్రపంచ చిత్రపటంపై యూదుల రాజ్యం ఇజ్రాయెల్ ఆవిర్భవించింది.
దానికి సరిగ్గా 9 నెలల ముందు భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది.
ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించడానికి భారతదేశానికి రెండున్నరేళ్లు పట్టింది.
1950 సెప్టెంబరు 15న భారతదేశం ఇజ్రాయెల్‌ను గుర్తించింది. 1951లో ఇజ్రాయెల్ తమ దౌత్య కార్యాలయాన్ని ముంబయిలో తెరిచింది.
1952లో భారతదేశం కూడా ఇజ్రాయెల్‌లో దౌత్య కార్యాలయాన్ని తెరవాలని అనుకుంది. కానీ ఆ నిర్ణయం వాయిదా పడింది.
జులై 1956లో సూయెజ్ కాలువను జాతీయం చేస్తున్నట్లు ప్రకటించారు ఈజిప్ట్ అధ్యక్షుడు నాసర్. అంతకు ముందు అది బ్రిటన్, ఫ్రాన్స్ యాజమాన్యంలో ఉండేది.
అప్పుడు ఇజ్రాయెల్ ఈజిప్ట్‌పై దాడి చేసింది. ఆ తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ పాత్ర వల్ల ఆ దేశంలో దౌత్య కార్యాలయాన్ని తెరవాలనే ఆలోచనను భారత్ విరమించుకుంది.
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగానే కొనసాగాయి.
1968లో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి 'రా' విడిపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌తో ఇంటెలిజెన్స్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి.
1965, 1971 యుద్ధాల్లో భారతదేశానికి ఇజ్రాయెల్ రహస్యంగా సాయం చేసిందని రక్షణ శాఖ నిపుణులు రాహుల్ బేడీ గతంలో బీబీసీకి చెప్పారు.
ఆ సమయంలో భారత సైనికాధికారులు, నిఘా అధికారులు టర్కీ, సైప్రస్ మీదుగా ఇజ్రాయెల్ వెళ్లేవారని చెప్పారు.
"వాళ్ల పాస్‌పోర్టులపై ఇజ్రాయెల్ స్టాంపులు ఉండేవి కావు. కానీ వారు ప్రయాణం చేయడానికి కావాల్సిన అనుమతులను ఒక కాగితంపై రాసి ఇచ్చేవారు"
"ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మేయర్ ఫిరంగులు, ఇతర ఆయుధాలను పంపించారని, ఆయుధాల వ్యాపారి ష్లోమో బ్లాడ్ క్విజ్ ద్వారా భారత్‌కు చేరవేసేవారని గేరి జె బాస్ అనే విలేఖరి తన పుస్తకం 'బ్లడ్ టెలిగ్రామ్' లో రాశారు.
ఇలా సాయం చేసినందుకు ప్రతిఫలంగా భారత్‌తో దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని ఇజ్రాయెల్ భావించిందని, దాని కోసం పరోక్షంగా సంకేతాలు పంపిందని ఆయన రాశారు.
కానీ అలా చేయడం వల్ల సోవియట్ యూనియన్‌కు ఆగ్రహం వస్తుందని, దానికి తాము సిద్ధంగా లేమని ఇండియా చెబుతూ వచ్చింది.
అయితే, 1992లో ఇజ్రాయెల్‌లో దౌత్య కార్యాలయాన్ని తెరిచింది భారత్. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అప్పటి హోమంత్రి ఎల్‌కే అద్వానీ ఇజ్రాయెల్ వెళ్లారు. ఒక భారతీయ మంత్రి ఇజ్రాయెల్‌కు వెళ్లడం అదే మొదటిసారి.
2003లో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ప్రధానమంత్రి కాకముందే వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో గుజరాత్‌కి, ఇజ్రాయెల్‌కు మధ్య సంబంధాలను ఆయన పటిష్టపరిచారు.
2014లో భారతదేశానికి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. ఇజ్రాయెల్‌లో బెంజమిన్ నెతన్యాహు అధికారంలోకి వచ్చారు.
ఇక అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. అంతకు ముందు వరకు వజ్రాలు, ఔషధాలు, వ్యవసాయం, పశుసంవర్ధక రంగాలకు పరిమితమైన ద్వైపాక్షిక సంబంధాలు ఆ తర్వాత భద్రతతో పాటు మరిన్ని ముఖ్యమైన రంగాలకు విస్తరించాయి.
భారతదేశం, పాకిస్తాన్ అణు కేంద్రాలపై దాడుల గురించి పశ్చిమ దేశాల మీడియాలో కథనాలు ఎక్కువగా ప్రచురితమయ్యేవి. దాంతో ఇరు దేశాల అణు కేంద్రాలపై పరస్పర దాడులు నిర్వహించవద్దని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి సలహా ఇచ్చినట్లు భారత ప్రభుత్వ మాజీ సీనియర్ అధికారి కే సుబ్రహ్మణ్యం "1964 - 98: ఏ పర్సనల్ రికలెక్షన్" అనే పుస్తకంలో రాశారు.
ఇరు దేశాల అణు కేంద్రాలపై దాడులు జరుపుకోకూడదని భారత్, పాకిస్తాన్‌లు 1985లో అంగీకరించాయి. ఇదే విషయాన్ని 1988లో అధికారికంగా అంగీకరించాయి. ఇది 1991లో ఈ ఒప్పందంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
1992 నుంచి ప్రతి సంవత్సరం మొదటి రోజున ఇరు దేశాల్లో ఉన్న అణు కేంద్రాల సమాచారాన్ని భారత్ - పాకిస్తాన్‌లు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అప్పటి ఇజ్రాయెల్ ప్రధానిని కలిశారు.
ఇరు దేశాల ప్రధానమంత్రుల మధ్య జరిగిన తొలి సమావేశం ఇదే.
వీఐపీలకు భద్రత కల్పించే ది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ) స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్స్ (ఎస్‌పీజీ)లను ఇజ్రాయెల్ కమాండోల తరహాలోనే ఏర్పాటు చేశారు. వారికి శిక్షణ ఇవ్వడానికి ఇజ్రాయెల్ ఎంతో సాయం చేసింది.
1998లో భారత్ అణ్వాయుధ పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా అణ్వాయుధ పరీక్ష నిర్వహించింది. కానీ, ఆ పరీక్షను గోప్యంగా ఉంచలేకపోయింది. శాటిలైట్ చిత్రాలతో ఆ విషయం ప్రపంచానికి తెలిసిపోయింది.
ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ పాకిస్తాన్ తమ అణు కార్యక్రమాన్ని ఆపలేదు.
ఆ సమయంలో ఇండియా, ఇజ్రాయెల్ కలిసి తమ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేశాయని, ఇజ్రాయెల్ విమానాలు రెండుసార్లు తమ గగనతలంలోకి ప్రవేశించాయని పాకిస్తాన్ ఆరోపించింది.
అయితే, ఈ ఆరోపణలను భారత్, ఇజ్రాయెల్ ఖండించాయి.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








