ఈజిప్ట్ గోల్డెన్ సిటీ: పురావస్తు తవ్వకాల్లో బయటపడిన 3000 ఏళ్ల నాటి ‘బంగారు నగరం’

ఫొటో సోర్స్, Reuters
ఈజిఫ్ట్‌లో పురాతన నగరం ఒకటి బయటపడింది.
ఇసుకలో సమాధి అయిన 3000 సంవత్సరాల కిందటి బంగారు నగరం ఇన్నాళ్లకు బయటపడింది.
దీనిని టుటన్‌ఖమున్ సమాధి తర్వాత అత్యంత ముఖ్యమైన పురావస్తు అన్వేషణల్లో ఒకటిగా చెబుతున్నారు.
లక్సర్ దగ్గర గుర్తించిన ఈ అద్భుతమైన, అరుదైన కట్టడాలను చూసి ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యపోతున్నారు.
'గోల్డెన్ సిటీ'గా పిలిచే ఈ నగరం పేరు ఏథెన్ అని చెబుతున్నారు.
ఏథెన్ అతిపెద్ద పురాతన నగరం అని, ఇంత పెద్ద నగరాన్ని ఈజిఫ్టులో ఇప్పటివరకు కనుగొనలేదు" అని ప్రముఖ ఈజిఫ్టాలజిస్ట్ జహీ హవాస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
2020 సెప్టెంబర్‌లో తవ్వకాలు ప్రారంభించిన తర్వాత దీనిని కొన్ని వారాల్లోనే పూర్తిగా వెలుగులోకి తీసుకురాగలిగారు.
ఈ నగరం ఈజిఫ్టులో అత్యంత శక్తిమంతులైన ఫారోల్లో ఒకరైన మూడో అమెన్‌హొటెప్ కాలం నాటిది. ఆయన క్రీ.పూ 1391 నుంచి 1353 వరకు పాలించారు.

ఫొటో సోర్స్, DR ZAHI HAWASS ON FACEBOOK
ఈ నగరాన్ని ఆయన తర్వాత ఆయ్, టుటన్‌ఖమున్ ఫారోలు కూడా పాలించారు.
దాదాపు చెక్కుచెదరని వారి సమాధులను బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్త హోవర్డ్ కార్టర్ 1922లో వాలీ ఆఫ్ కింగ్స్‌లో కనుగొన్నారు.
"టుటన్‌ఖమున్ సమాధి తర్వాత ఇప్పుడు గుర్తించిన ఈ పురాతన నగరం, రెండో అతి ముఖ్యమైన పురాతత్వ అన్వేషణగా నిలిచింది" అని బాల్టిమోర్‌లోని జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్సిటీ ఈజిఫ్టాలజీ ప్రొఫెసర్ బెస్టీ బ్రియాన్ చెప్పారు.

"పురాతన ఈజిఫ్ట్ ప్రజల జీవితం గురించి తెలుసుకోడానికి ఇది మనకు ఒక అరుదైన దృశ్యాన్ని అందించింది" అని ఆమె చెప్పారు. ఫారోల సామ్రాజ్యంలో ఇది అత్యంత సంపన్న నగరం.
భారీ సంఖ్యలో ఆభరణాలు, రంగుల మట్టిపాత్రలు, పేడ పురుగుల ఆకారంలో ఉన్న తాయెత్తులు, మూడో ఆమెన్‌హొటెప్ ముద్ర ఉన్న ఇటుకలు, ఇంకా ఎన్నో వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
రాజధాని కైరోకు దక్షిణంగా దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో 'వాలీ ఆఫ్ కింగ్స్'కు దగ్గరగా లక్సర్ పశ్చిమ తీరంలో ఈ తవ్వకాలు జరిపారు.
"అన్ని వైపులా పేర్చిన ఇటుకల వరుసలు కనిపిస్తూ ఉండడంతో ఆ బృందాలు ఆశ్చర్యపోయాయి. దాదాపు పూర్తిగా ఉన్న గోడలు, రోజువారీ జీవితానికి అవసరమైన వస్తువులు ఆ గదుల్లో ఉన్నాయి. ఆ నగరం మంచి స్థితిలో ఉంది" అని డాక్టర్ హవాస్ చెప్పారు.
తవ్వకాలు ప్రారంభించిన ఏడు నెలలకు దానికి చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాలను కూడా ఈ బృందాలు వెలుగులోకి తెచ్చాయి. వాటిలో ఒక బేకరీ, ఒక పరిపాలనా కేంద్రం, నివాస ప్రాంతం లాంటివి ఉన్నాయి.

ఫొటో సోర్స్, ZAHI HAWASS ON FACEBOOK
"ఇన్నాళ్లూ కనిపించని ఈ గోల్డెన్ సిటి కోసం ఎందరో విదేశీయులు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎవరూ దానిని గుర్తించలేకపోయారు" అని డాక్టర్ హవాస్ చెప్పారు. ఆయన గతంలో పురావస్తుశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయని, నిధి నిక్షేపాలతో నిండిన సమాధులు బయటపడతాయని తాము ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.
రాజకీయ అస్థిరత, కరోనా మహమ్మారి కారణంగా ఈజిఫ్ట్ పర్యటక రంగం కుదేలైంది. టూరిజాన్ని ప్రోత్సహించి దానికి కొత్త ఊపిరులూదాలని ప్రయత్నిస్తోంది అక్కడి ప్రభుత్వం.

ఫొటో సోర్స్, Reuters
ఈజిఫ్ట్ ఇటీవలే తమ దేశ ప్రాచీన పాలకుల అవశేషాలను కైరో వీధులగుండా ఊరేగింపుగా తీసుకెళ్లింది.
కనులవిందుగా జరిగిన ఆ కార్యక్రమంలో మొత్తం 22 మమ్మీలను పరేడ్‌గా తీసుకెళ్లారు.
వాటిని నియో క్లాసికల్ ఈజిఫ్టియన్ మ్యూజియం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని న్యూ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిఫ్టియన్ సివిలైజేషన్‌కు తరలించారు.
కొత్త మ్యూజియానికి తరలించిన మమ్మీల్లో అమెన్‌హొటెప్ త్రీ, ఆయన భార్య క్వీన్ టియేవి కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’.. తెలుగు రాష్ట్రాల్లో 104 మందిలో యూకే, 20 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









