ఈజిప్ట్ మమ్మీల పరేడ్: కైరో వీధుల్లో ప్రాచీన మమ్మీల అద్భుత పరేడ్.. వాటిని ఇప్పుడెందుకు తరలించారు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, వేల్ హుస్సేన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాజధాని కైరో నగరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
కైరో వీధుల్లో ప్రాచీన చక్రవర్తుల ఊరేగింపు అంగరంగవైభవంగా జరిగింది.
ఆనాటి పరేడ్‌ను తిరిగి చూసే అవకాశం లభించింది అక్కడి ప్రజలకు.
ఏంతో వైభవంగా.. కొన్ని కోట్ల రూపాయిల ఖర్చుతో ఈ వేడుక నిర్వహించారు.
కళ్లు మిరుమిట్లు గొలిపే ఈ వేడుకలో మొత్తం 22 మమ్మీలతో పరేడ్ చేశారు.
ఈ మమ్మీల్లో 18 మంది రాజులు, నలుగురు రాణులు.
ఈజిప్ట్ మ్యూజియం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త ప్రదేశానికి వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు.
వీటిని ఈజిప్ట్ జాతీయ సంపదగా భావిస్తారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా మధ్య వీటిని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్‌కు తీసుకెళ్లారు.

ఫొటో సోర్స్, REUTERS
17వ శతాబ్దపు చక్రవర్తి రెండవ సెకినెన్రే నుంచి క్రీస్తు పూర్వం 12వ శతాబ్ధం వరకు ఈజిప్ట్‌ను పాలించిన రాజుల మమ్మీలను పరేడ్‌గా తరలించారు.
గత సంవత్సరం ఈజిప్ట్‌లో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంది. అప్పుడు కఠిన ఆంక్షలు అమలు చేశారు.
కానీ, కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టడంతో బహిరంగ సమావేశాలపై పెట్టిన నిబంధనలను తొలగించారు.
శనివారం జరిగిన ప్రదర్శనలో రెండవ రామ్సెస్ చక్రవర్తి ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఆయన ఈజిప్ట్‌ను 67 సంవత్సరాల పాటు పాలించి మొట్టమొదటి శాంతి ఒప్పందంపై సంతకం చేసిన చక్రవర్తిగా అక్కడివారికి చిరస్మరణీయులు.

తొలి మహిళా చక్రవర్తి హట్షేప్సుట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మహిళలు చక్రవర్తులు కావడానికి సంప్రదాయాలు అంగీకరించని రోజుల్లోనే ఆమె పాలకురాలయ్యారు.
మమ్మీలను రవాణా చేసే వాహనాలను ప్రత్యేకంగా తయారు చేశారు.
లోపలి మమ్మీలు కదిలి పాడైపోకుండా వాటిని షాక్-ప్రూఫ్ వాహనాలుగా మార్చారు.
ఏ మాత్రం కుదుపులకు అవకాశం లేకుండా రోడ్లను కూడా రిపేర్ చేశారు.
బయటి వాతావరణ ప్రభావం మమ్మీలపై పడకుండా నైట్రోజన్ వాయువు నింపిన బాక్సులలో వీటిని ఉంచారు.

ఫొటో సోర్స్, EPA
మమ్మీలను తరలించే కార్యక్రమానికి ప్రభుత్వం లక్షల డాలర్లు ఖర్చు పెట్టింది.
దీన్ని ఒక అద్భుత ఘట్టంలా నిర్వహించింది.
ఈ పరేడ్‌ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, పర్యటకులు తరలివచ్చారు.
దేశవ్యాప్తంగా అనేకమంది ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించారు.
“మమ్మీలను జాగ్రత్తగా కొత్త మ్యూజియానికి చేర్చడానికి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది” అని కైరోలోని అమెరికన్ యూనివర్సిటీలో ఈజిప్టాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సలీమా ఇక్రమ్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
మమ్మీలను ఎప్పుడు గుర్తించారు?
ఈజిప్టు పురాతన రాజధానిగా పిలిచే థేబ్స్ ప్రాంతంలో 1881, 1898 సంవత్సరాలలో రెండు దఫాలుగా ఈ మమ్మీలను గుర్తించారు.
థేబ్స్ ప్రాంతం నుంచి పాలకుల మమ్మీలను కైరోలోని మ్యూజియానికి చేర్చారు.
వీటిలో కొన్ని మమ్మీలను నైలు నదిలోని జలమార్గం నుంచి తరలించగా, మరికొన్నింటిని మొదటి తరగతి ఏసీ రైల్లో తీసుకువచ్చారు.
ఈజిప్షియన్ మ్యూజియంలో ఉంచిన ఈ మమ్మీలను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా అనేకమంది టూరిస్టులు వస్తుంటారు.
భద్రత దృష్ట్యా సొంత సమాధుల నుంచి వేరే దగ్గరకు ఇలాంటి తరలింపులు జరగడం కైరోలో, థీబ్స్ దగ్గర గతంలో కూడా చూశామని డాక్టర్ ఇక్రమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
వ్యాలీ ఆఫ్ ది కింగ్స్
ఈ మ్యూజియం ప్రజల సందర్శనార్ధం ఈ నెలలో తెరుచుకోనుంది.
దీంతో పర్యటక రంగం పుంజుకోవచ్చని ఈజిప్ట్ అధికారులు ఆశిస్తున్నారు.
దేశానికి విదేశీ మారకం తెచ్చిపెట్టే ప్రధాన ఆధారం ఇది.
దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి వల్ల పర్యటక పరిశ్రమ బాగా దెబ్బతింది.
కోవిడ్ మహమ్మారితో అది మరింత కుంగిపోయింది.
ఈ కొత్త మమ్మీలను 'రాయల్ హాల్ ఆఫ్ మమ్మీస్'లో ప్రదర్శనకు పెడతారు.
ఏప్రిల్ 18 నుంచి ప్రజలు వీటిని చూసేందుకు అనుమతిస్తారు.
లక్సర్‌లో 'వ్యాలీ ఆఫ్ ది కింగ్స్'లో ఉన్నట్లు అనుభూతి చెందేలా ఆ హాలును రూపొందించారు.
ప్రముఖ టుటాన్ఖమున్ సేకరణను పొందుపరిచేందుకు గాజా గ్రేట్ పిరమిడ్స్‌కు దగ్గరలో మరో కొత్త విలాసవంతమైన మ్యూజియాన్ని వచ్చే సంవత్సరం తెరవనున్నారు.

ఫొటో సోర్స్, REUTERS
చక్రవర్తుల శాపం
ఒకవైపు కొందరు దీనిని ఉత్తమ వినోద కార్యక్రమంగా చూస్తున్నారు.
మరోవైపు, చారిత్రకంగా చెడుకు సంకేతంగా చూసే మూఢ నమ్మకాలతో కూడా ఈజిప్ట్ మమ్మీలు ముడి పడి ఉన్నాయి.
ఇటీవల కాలంలో ఈజిప్ట్‌లో వరుసగా దుర్ఘటనలు సంభవించాయి.
సోహాగ్ ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదంలో చాలా మంది ప్రజలు మరణించారు.
కైరోలో ఒక భవనం కూలిపోయి 18మంది చనిపోయారు.
ఈ మమ్మీలను తరలించడానికి భారీగా సన్నాహాలు చేస్తున్న సమయంలో సూయజ్ కాలువలో వారం రోజుల పాటు ఎవర్ గివెన్ నౌక చిక్కుకుంది.
అంతర్జాతీయ జల రవాణాకు అంతరాయం కలిగింది.

ఫొటో సోర్స్, EPA
దీనికంతటికీ ఈజిప్టును పాలించిన ప్రాచీన చక్రవర్తుల శాపం అని నిందించవచ్చా అంటూ సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నించారు.
ఈ ప్రాచీన ఈజిప్ట్ మమ్మీలను ప్రదర్శనకు పెట్టడం వెనకున్న నైతికత గురించి ఎప్పటి నుంచో చర్చిస్తున్నారు.
చనిపోయిన వారిని గౌరవించాలని, వాటిని ప్రదర్శించ కూడదని చాలామంది ముస్లిం స్కాలర్లు అంటున్నారు.
మమ్మీల పరేడ్ నిర్వహించడం చనిపోయిన వారిని అగౌరవపరచడమే అంటూ 1980లో అప్పటి అధ్యక్షుడు అన్వర్ సదాత్ ఈజిప్ట్ మ్యూజియంలో 'రాయల్ మమ్మీ రూమ్' ని మూసివేయమని ఆదేశాలు ఇచ్చారు.
వాటిని తిరిగి సమాధి చేయమని కోరినప్పటికీ ఆయనకది తీరని కోరికగానే మిగిలిపోయింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’.. తెలుగు రాష్ట్రాల్లో 104 మందిలో యూకే, 20 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








