సూయజ్ కాలువ: ఆరు రోజుల యుద్ధం వల్ల ఎనిమిదేళ్లు ఎలా మూతపడింది... మళ్లీ ఎలా తెరుచుకుంది?

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన సరకుల రవాణాలో దాదాపు పది శాతానికిపైగా సూయజ్ కాలువ ద్వారానే జరుగుతుంది. కీలకమైన ఈ కాలువలో అనుకోకుండా ఓ ఓడ అడ్డంగా ఇరుక్కుపోయి ఇప్పటికే నౌకా వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడింది.
తాజాగా ఆ ఓడను కొంతవరకు కదిలించగలిగినా పూర్తిగా అది అక్కడి నుంచి కదిలి సూయజ్ కాలువ మార్గంలో అడ్డు తొలగడానికి ఎన్ని రోజులు పడుతుందో ఇంకా స్పష్టంగా తెలియదు.
ఇప్పటికే రోజుకు దాదాపు రూ.70వేల కోట్ల నష్టం జరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన ఓడ ఎవర్‌గ్రీన్ అనే సంస్థకు చెందింది. దీన్ని తిరిగి గాడిలో పెట్టి, ఈ జలమార్గాన్ని సుగమం చేసేందుకు ఇంకొన్ని రోజులు, వారాలు సైతం పట్టొచ్చని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు.
అయితే, సూయజ్ కాలువలో రవాణా నిలిచిపోవడం ఇదేమీ తొలిసారి కాదు.
1967లో ఈజిప్ట్, సిరియా, జోర్డాన్‌లకు ఇజ్రాయెల్‌తో యుద్ధం జరిగింది. ఆరు రోజుల పాటు ఆ యుద్ధం కొనసాగింది. అందుకే చరిత్ర పుస్తకాల్లో దీన్ని ‘సిక్స్ డే వార్’గా పేర్కొన్నారు.
రెండు పక్షాల మధ్య ఫైరింగ్ నేపథ్యంలో సూయజ్ కాలువలో అప్పుడు 15 వాణిజ్య ఓడలు చిక్కుకుపోయాయి. ఆ ఆరు రోజుల యుద్ధం ఫలితంగా సూయజ్ కాలువ ఎనిమిదేళ్లు మూతపడింది.
కాలువలో నిలిచిపోయిన 15 నౌకల్లో ఒకటి మునిగిపోగా... మిగతా 14 ఓడలు ఓ రకంగా అక్కడే మరో ఎనిమిదేళ్లు ఉన్నాయి.
అంత కాలం సూయజ్ కాలువను ఎందుకు మూసేశారు? అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది?

ఫొటో సోర్స్, Getty Images
ఆరు రోజుల యుద్ధం
ఈజిప్ట్ 1967 మేలో అప్పటి అధ్యక్షుడు గమాల్ అబ్దెల్ నాసిర్ నేతృత్వంలో ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సైనిక మోహరింపులు పెంచింది. ఇజ్రాయెల్‌తో యుద్ధం వస్తే, ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తామని వ్యాఖ్యానించింది.
సిరియా కూడా ఇలాంటి బెదిరింపులు మొదలుపెట్టింది. కొన్ని వారాల పాటు ఉద్రిక్తతలు కొనసాగి, 1967 జూన్ 5న యుద్ధం మొదలైంది. అదే రోజు ఇజ్రాయెల్ ఈజిప్ట్‌పై బాంబులు కురిపించి, ఆ దేశ వాయుసేన సామర్థ్యంలో 90 శాతాన్ని దెబ్బతీసింది.
సిరియా వాయుసేనను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఈ బాంబుల దాడి కొనసాగుతున్న సమయంలో బల్గేరియా, చెక్‌స్లొవేకియా, ఫ్రాన్స్, పోలాండ్, స్వీడన్, పశ్చిమ జర్మనీ, బ్రిటన్, అమెరికాలకు చెందిన 15 ఓడలు సూయజ్ కాలువలో ప్రయాణిస్తున్నాయి.
ఆ సమయంలో సూయజ్ కాలువల్లో చిక్కుకున్న 15 ఓడల్లో బ్రిటిష్ ఓడ ‘ఎగాపెనోర్’ ఒకటి. అప్పుడు ఆ ఓడలో సేవలు అందించిన పీటర్ ఫ్లైక్ ఆ సందర్భం గురించి బీబీసీతో మాట్లాడారు.
‘‘మా ఓడ సూయజ్ కాలువ దక్షిణ కొసకు చేరుకునేటప్పటికి... అరబ్ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మధ్య యుద్ధం మొదలైందని మా కెప్టెన్ చెప్పారు. మేం ముందుకు కదులుతున్న కొద్దీ ఎడారిలో యుద్ధ విమానాలు టేకాఫ్ అవుతుండటం చూశాం. నాకు బాగా గుర్తుంది. ఇజ్రాయెల్ విమానాలు బాగా తక్కువ ఎత్తులోనే తిరుగుతున్నాయి. ఈజిప్ట్ వాయుసేన స్థావరాలపై బాంబులు కురిపిస్తున్నాయి. వాళ్ల గురి తప్పలేదు’’ అని వివరించారు పీటర్.
ఎగాపెనోర్ అప్పుడు మలేసియా నుంచి బ్రిటన్‌కు రబ్బర్, ప్లాస్టిక్ వస్తువులు తీసుకువెళ్తూ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అదే సమయంలో చైనా నుంచి అక్రోట్లు, పామాయిల్‌ను తీసుకువస్తున్న ‘మెలాంపుస్’ ఎడలో జాన్ హ్యూస్ అనే ఆయన పనిచేశారు.
‘‘అప్పుడు సినాయి ఎడారి నుంచి రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఎగిరాయి. అవి మా ఓడ మీదుగానే వెళ్లాయి. అవి వేగంగా వెళ్లినప్పుడు వచ్చిన శబ్ధానికి మా చెవులకు చిల్లులు పడతాయా అనిపించింది’’ అని బీబీసీతో చెప్పారు జాన్ హ్యూస్.
ఇజ్రాయెల్ బాంబుల దాడి వల్ల అమెరికాకు చెందిన ఓ ఓడ సూయజ్ కాలువలో మునిగిపోయింది. ఈ యుద్ధం నేపథ్యంలో సూయజ్ కాలువలో ప్రయాణిస్తున్న ఓడలు గ్రేట్ బిటర్ సరస్సులో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.
‘‘ఆ సమయంలో సూయజ్ కాలువలో ప్రయాణిస్తున్న ఓడలు తమను లక్ష్యాలుగా అనుకుని దాడులు చేస్తారని భయపడ్డాయి. అందుకే గ్రేట్ బిటర్ సరస్సులో ఆశ్రయం పొందాయి’’ అని అమెరికాలోని కాంప్‌బెల్ యూనివర్సిటీలో మెరిటైమ్ హిస్టరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సైల్ మార్కోగ్లియానో చెప్పారు.
యుద్ధం రెండో రోజు సూయజ్ కాలువ చివరి కొనవైపు ఉన్న ఓడలు ఈజిప్ట్ దాడుల్లో మునిగిపోయాయి. ఇజ్రాయెల్ కాలువ దారిని ఉపయోగించుకోకుండా ఈజిప్ట్ అక్కడ బాంబులు పెట్టింది.
మూడు అరబ్ దేశాలు ఓడిపోవడంతో జూన్ 10న ఈ యుద్ధం ముగిసింది. కానీ, ఆ తర్వాత సూయజ్ కాలువను ఈజిప్ట్ మూసేసింది. అందులో చిక్కుకున్న 14 ఓడలకు బయటపడే మార్గం లేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
గ్రేట్ బిటర్ లేక్ అసోసియేషన్
‘‘సూయజ్ కాలువలో చిక్కుకుపోయిన ఓడల దేశాలు... ఇజ్రాయెల్, ఈజిప్ట్‌తో ఏ ఒప్పందమూ చేసుకోలేకపోయాయి. ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని అందరూ అనుకున్నారు. కానీ, సాధ్యపడలేదు’’ అని ప్రొఫెసర్ సైల్ మాక్రోగ్లియానో అన్నారు.
సూయజ్ కాలువ మూసివేతపై అనిశ్చితి అలాగే కొనసాగుతూ పోయింది. దీంతో ఓడల్లో ఉన్న సరకులు, యంత్రాలను చూసుకునేందుకు ఆ ఓడల సంస్థలు సిబ్బందిని నియమించాయి. ఆ సిబ్బందిని శాశ్వతంగా అక్కడే ఉంచకుండా, తరచూ బదిలీలు చేపడుతూ వారి స్థానంలో కొత్త సిబ్బందిని నియమిస్తూ వచ్చాయి.
‘‘ఆ ఓడల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులు గ్రేట్ బిటర్ లేక్ అసోసియేషన్ అనే సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ, మానసిక ఆరోగ్యం కూడా కాపాడుకునే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసుకున్నారు’’ అని మార్కోగ్లియానో చెప్పారు.
ఈ సంఘం వివిధ దేశాల మధ్య క్రీడా పోటీలను కూడా నిర్వహించింది. డైవింగ్, షూటింగ్, స్ప్రింటింగ్, వాటర్ పోలో, ఆర్చెరీ లాంటి అంశాల్లో పోటీలను పెట్టి, పతకాలు కూడా ఇచ్చింది.
పోస్ట్ ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. పోస్టల్ స్టాంపులను కూడా జారీ చేసి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సేకర్తలకు పంపించింది.

ఫొటో సోర్స్, Getty Images
‘ఈజిప్ట్‌పైనే ఎక్కువ ప్రభావం’
‘‘ఏళ్లు గడిచినా, సూయజ్ మూసివేత అలాగే కొనసాగింది. చాలా సంస్థలు ఆ ఓడలను వదులుకుని, ఇన్సూరెన్స్ సంస్థల నుంచి పరిహారం పొందేందుకు దరఖాస్తులు పెట్టుకున్నాయి’’ అని మార్కోగ్లియానో అన్నారు.
ఇక ఆ ఓడలపై సినాయి ఎడారి నుంచి కొట్టుకు వచ్చిన దుమ్ము పేరుకుపోయి, అవి పసుపు రంగులోకి మారిపోయాయి. అందుకే వాటిని ‘ఎల్లో ఫ్లీట్’ అనేవారు.
‘‘సూయజ్ కాలువ 1869లోనే మొదలైంది. కానీ, 1960వ దశకం నుంచి ఈ మార్గంలో రవాణా కార్యకలాపాలు చాలా పెరిగాయి. ఆఫ్రికా చుట్టూ ప్రయాణించాల్సిన అవసరం తప్పడంతో ఈ మార్గం చాలా కీలకంగా మారింది’’ అని ‘ద సీ అండ్ సివిలైజేషన్: ఎ మెరిటైమ్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్’ అనే పుస్తకం రాసిన లింకన్ పెన్ బీబీసీతో అన్నారు.
‘‘1967లో ఈ మార్గం మూతపడటంతో చాలా కాలం పాటు అది ప్రపంచంపై ప్రభావం చూపించింది. అందరికన్నా ఎక్కువ ప్రభావితమైంది ఈజిప్టే. ఎందుకంటే, ఈజిప్ట్ జీడీపీలో నాలుగు శాతం ఆదాయం ఈ కాలువలో ప్రయాణించే ఓడల నుంచి తీసుకునే ఫీజుల ద్వారానే వచ్చేది’’ అని ఆయన వివరించారు.
‘‘అరబ్ దేశాలకు కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతకుముందు యురోపియన్ దేశాలకు అవి ఈ మార్గంలోనే చమురును పంపేవి. ఈ మార్గం మూతపడటంతో యూరప్‌కు రష్యా చమురు ఎక్కువగా అమ్మడం మొదలుపెట్టింది. అప్పట్లో అమెరికా, యురోపియన్ దేశాలే ఎక్కువగా అంతర్జాతీయ వాణిజ్యం సాగించేవి. చైనా ఇంకా అప్పటికి పెద్ద ఆర్థికశక్తిగా ఎదగలేదు. యురోపియన్ దేశాల ఓడలు చిన్నగా ఉండేవి. అవి ఆఫ్రికా దక్షిణ తీరం గుండా పోవాల్సి వచ్చేవి. దీంతో రవాణా ఖర్చులు బాగా పెరిగాయి’’ అని లింకన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఎలా తెరుచుకుంది?
‘‘సూయజ్ కాలువను మూసివేయడం ద్వారా ఈజిప్ట్ యురోపియన్ దేశాలకు ఓ పాఠం చెప్పాలనుకుంది. పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్నాయన్నది ఈజిప్ట్ భావన. చమురు రవాణాను, అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీసి... అమెరికాను, యురోపియన్ దేశాలను వైఖరి మార్చుకునేలా చేయాలని ఈజిప్ట్ అనుకుంది’’ అని లింకన్ వివరించారు.
కానీ, ఈజిప్ట్ వ్యూహం పనిచేయలేదు. సూయజ్ కాలువ మూసివేత కొనసాగుతూ వచ్చింది. ఏ పక్షమూ తాము బలహీనమని చూపించుకోవడానికి ఇష్టపడకపోవడం ఈ పరిస్థితి కొనసాగడానికి ఓ కారణమైంది.
చివరికి సూయజ్ కాలువ మరో యుద్ధంతో తెరుచుకుంది. 1973లో యోమ్ కిప్పుర్ యుద్ధం జరిగింది. ఇందులో ఈజిప్ట్, సిరియా... ఇజ్రాయెల్‌పై దాడి చేశాయి. యూదులు పవిత్రంగా భావించే రోజున ఆ దాడి జరిగింది.
‘‘ఈ యుద్ధం అన్ని పక్షాలూ చర్చలకు వచ్చేలా చేసింది. సూయజ్ కాలువను తెరవాలని ఈ చర్చల్లో అంగీకారం కుదిరింది. ఆ కాలువను మూసి ఉంచడం వల్ల ఎవరూ సాధించేదేమీ లేదని అన్ని పక్షాలూ అర్థం చేసుకున్నాయి. అన్వర్ అల్ సాదత్ నేతృత్వంలో ఉన్న అప్పటి ఈజిప్ట్ ప్రభుత్వం సూయజ్ కాలువను తిరిగి తెరవాలని నిర్ణయం తీసుకుంది’’ అని ఆయన చెప్పారు.
సూయజ్ కాలువలో మునిగిపోయిన ఓడలను, అమర్చిన బాంబులను తీయడానికి ఓ ఏడాది సమయం పట్టింది. సరిగ్గా అరబ్ దేశాలకు, ఇజ్రాయెల్‌కు యుద్ధం మొదలైన తేదీనే (జూన్ 5న) 1975లో సూయజ్ కాలువ తిరిగి తెరుచుకుంది.
అక్కడ చిక్కుకుని ఉన్న 14 ఓడల్లో రెండే పనికొచ్చాయి.. మిగతావి మళ్లీ నడపడానికి వీల్లేకుండా పాడయ్యాయి. ఆ రెండు ఓడలు జర్మనీకి చెందినవే.
‘‘సూయజ్ కాలువ ఎంత కీలకమైందో... సముద్ర మార్గంలో రవాణాలో ఎన్ని సమస్యలు ఉంటాయో... ఇలాంటి సంక్షోభాల వల్లే తెలిసివస్తుంది. ఒక యుద్ధం... అంతెందుకు ఒక ఓడ కూడా అంతర్జాతీయ వాణిజ్యానికి ఓ ఆటంకంగా పరిణమించవచ్చు’’ అని మార్గోగ్లియానో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- దావూద్ ఇబ్రహీం వెంట బాలీవుడ్ ఎందుకు పరుగులు పెడుతోంది
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








