తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!

ఫొటో సోర్స్, MeliBio
- రచయిత, ఎమ్మా వూలాకాట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"నేను వీగన్ కావడం వలన తేనెను తినే అవకాశాన్ని కోల్పోతాను" అని మెలిబయో సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డార్కో మాన్‌డిక్ అన్నారు.
వీగన్ ఆహార అలవాట్లు ఉన్న వాళ్లు కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినే అవకాశాన్ని కోల్పోతారు.
అందుకే తేనెటీగలు లేకుండా తేనె తయారు చేయాలని అనుకున్నారు.
అయితే, అలా తయారైన తేనె మాత్రం సహజ సిద్ధమైన తేనెలాగే ఉండాలని భావించారు.
"తేనెను సాధారణంగా తేనెపట్ల నుంచి సేకరిస్తారు. దాన్ని తేనెటీగలు పూల మకరందం నుంచి సేకరించి, ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌గా మార్చి తేనెపట్లలో భద్రపరుస్తాయి" అని డార్కో మాన్‌డిక్ చెప్పారు.
"ఇదే పనిని మేము సూక్ష్మజీవుల ద్వారా ప్రయోగశాలలో తయారు చేయాలని ప్రయత్నిస్తున్నాం" అని ఆయన అన్నారు.
గత కొన్నేళ్లుగా మాంసానికి, డైరీ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా హరిత ఆధారిత ఉత్పత్తులు వాడకం పెరిగింది.
కానీ రుచిలో, రంగులో, వాడకంలో అవి అసలైన వాటికి దగ్గరగా కూడా ఉండవని చాలామంది అంటారు.
మెలిబయో లాంటి సంస్థలు వీగన్ ఉత్పత్తులను ఫెర్మెంటేషన్ ద్వారా అసలైన ఉత్పత్తులకు దగ్గరగా ఉండేలా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నాయి.
ఫెర్మెంటేషన్ ద్వారా సూక్ష్మజీవులు అవసరమైన పదార్ధాలను ఉత్పత్తి చేస్తాయి.
ఉదాహరణకు ఈస్ట్‌లో చక్కెర కలపడం ద్వారా బీర్ తయారీకి కావాల్సిన ఆల్కహాల్ తయారవుతుంది.
ఇదే విధానాన్ని సరైన పద్ధతిలో వాడి తేనె నుంచి గుడ్డు తెల్ల సొన, పాల వరకు ఏదైనా తయారు చేయవచ్చు.

ఫొటో సోర్స్, Sophotogenic Photography
ఈస్ట్ ఫెర్మెంటేషన్ ద్వారా పాలు, చీజ్ తయారు చేస్తోంది లండన్‌కి చెందిన స్టార్టప్ బెటర్ డైరీ.
ఈ సంస్థ కూడా ఇదే విధానాన్ని ఉపయోగిస్తోంది.
"మాకేమి కావాలో ఆ ఉత్పత్తిని తయారు చేసేందుకు మేము ఈస్ట్‌ని వివిధ పద్ధతుల్లో ఉపయోగిస్తాం" అని సంస్థ సహ వ్యవస్థాపకుడు జీవన్ నాగరాజ చెప్పారు.
ఈ విధానాన్ని పాటించి 2028 నాటికల్లా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎగ్ ప్రోటీన్ ఉత్పత్తిదారు కావాలని శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన క్లారా ఫుడ్స్ భావిస్తోంది.

ఫొటో సోర్స్, Clara Foods
ఇలాంటి ఉత్పతులు వీగన్లను సంతోషపర్చడం మాత్రమే కాకుండా వీటి వలన పర్యావరణ లాభాలు కూడా ఉంటాయి.
మాంసాహార ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తులు కలిపి ప్రపంచవ్యాప్తంగా 14.5 శాతం గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలకు కారణమవుతున్నాయని యుఎన్ ఆహార, వ్యవసాయ సంస్థ తెలిపింది.
"తేనె వినియోగం వలన చాలా జాతుల తేనెటీగల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది" అని మెలిబయో చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాన్‌డిక్ చెబుతున్నారు.
"తేనెను వాణిజ్యపరంగా తయారు చేయడం ఒక రకం జాతి తేనెటీగలకు మాత్రమే మేలు చేస్తోంది. ఇవి అడవి తేనెటీగలు, దేశీయ జాతులతో పోటీ పడి వాటిని వెనక్కి నెట్టేస్తున్నాయి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, MeliBio
ఈ వీగన్ ఉత్పత్తులను మనం మొదట నేరుగా సూపర్ మార్కెట్ ర్యాక్‌లలోనో, అందమైన ప్యాకెట్లలోనో కాకుండా కొన్ని ఇతర పదార్ధాలతో కలిపి చూస్తాం.
"మార్కెట్‌లో అమ్మే మూడింట రెండు వంతుల తేనెను ఇతర ఆహార, పానీయ, సౌందర్య సాధనాలు, ఔషధ ఉత్పత్తుల్లో వాడతారు. అందుకే ముందు మేము వ్యాపారాలతో అనుసంధానం అయి బిజినెస్ టు బిజినెస్ మోడల్ మొదలుపెడతాం" అని మాన్‌డిక్ అన్నారు.
ఇప్పటికే అమెరికాలో తమ కంపెనీతో వ్యాపారం చేసేందుకు 15 సంస్థలు అంగీకరించినట్లు ఆయన చెప్పారు.
ఈ సంవత్సరాంతానికి తమ సంస్థ ఉత్పత్తుల సరఫరా మొదలవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.
బెటర్ డైరీ కూడా ఇలాంటి వ్యూహాన్నే అనుసరిస్తోంది.
ఈ సంస్థ తమ ఉత్పత్తులను కొన్ని రెస్టారెంట్ చైన్‌లకు ఇవ్వాలని ఆలోచిస్తోంది.
"పిజ్జా హట్, మాక్ డోనల్డ్ లాంటి సంస్థల్లో వాడే చీజ్‌లా వీగన్ చీజ్ ఉండటం కష్టం" అని బెటర్ డైరీ సహ వ్యవస్థాపకుడు జీవన్ నాగరాజు చెప్పారు.
ఈ ఉత్పత్తులను వర్గీకరించే విషయంలో కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని నిజంగానే పాలు, గుడ్లు, తేనె అని వర్గీకరించవచ్చా?
"ఇందులో ఉండే పదార్ధాలు ఒకేలాంటివి కాబట్టి అలా వర్గీకరించడంలో తప్పు లేదు" అని నాగరాజ అన్నారు.

ఫొటో సోర్స్, MeliBio
పులయబెట్టడం ద్వారా మాంసాహార ఉత్పత్తుల్లా ఉండే ఉత్పత్తులను తయారు చేస్తే అవి అసలైన పదార్ధాల కంటే మేలుగా ఉంటాయి.
సాధారణ తేనె కంటే 100 రెట్లు ఎక్కువ ధర ఉండి ఆరోగ్య లాభాలున్నాయని చెప్పే మనుక తేనె లాంటి తేనెను ఈ ప్రక్రియ ద్వారా ఎందుకు తయారు చేయకూడదు అని నాగరాజా ప్రశ్నించారు.
ఇలాగే, పాలు, చీజ్ కూడా తయారు చేయవచ్చు.
"ఇలా చేయడం వలన లాక్టోజ్ ఉత్పత్తుల్లో చేరదు. దానిని మరొక రకం చక్కెరతో కలపడం వలన దానిని జీర్ణం చేసుకోవడం సులభం అవుతుంది" అని నాగరాజ అన్నారు.
మేము ఆవు పాలతో మొదలు పెడుతున్నాం. కానీ ఇదే నైపుణ్యాన్ని వాడి చంటి పిల్లలకు తల్లిపాలు కూడా తయారు చేయవచ్చని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- చాలా ఏళ్లుగా చిప్స్ మాత్రమే తింటున్నాడు.. చివరికి కంటి చూపు కోల్పోయాడు
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- కరోనావైరస్: రొయ్యల సాగుదారుల చిక్కులేంటి.. లాక్ డౌన్‌తో నష్టం ఎంత?
- అమెరికా అధ్యక్షుడు ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- వేరుసెనగ పప్పు తింటే చనిపోతారా?
- ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం
- డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









