చిప్స్ తప్ప ఇంకేం తినేవాడు కాదు.. చివరికి కంటి చూపు కోల్పోయాడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మైఖేల్ రాబర్ట్స్
- హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్
చిప్స్ వంటి చిరుతిళ్ల మీదే ఆధారపడిన ఓ 17 ఏళ్ల యువకుడు కంటిచూపు కోల్పోయాడు. ఆ సమస్య నయం కూడా కాదని వైద్యులు చెబుతున్నారు. దీంతో.. చిరుతిళ్లు అధికంగా తినటం వల్ల వచ్చే ప్రమాదాలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్రిటన్‌లోని బ్రిస్టల్‌కు చెందిన టీనేజీ యువకుడు ప్రైమరీ స్కూల్ దాటినప్పటి నుంచీ కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్, ప్రింగిల్స్, వైట్ బ్రెడ్ మాత్రమే తినేవాడు. అప్పుడప్పుడూ ఓ ముక్క మాంసం మాత్రం తినేవాడు.
అతడికి కంటి చూపు సమస్యలు తలెత్తటంతో నేత్రనిపుణులు పరీక్షించారు. అతడి చూపు నయం కానంతగా దెబ్బతినిందని.. దాదాపుగా అంధత్వ స్థాయికి దిగజారిందని గుర్తించారు.
వైద్య పరీక్షల్లో అతడికి విటమిన్ లోపం, పోషకాహార లోపం తీవ్రంగా ఉన్నాయని వెల్లడైంది.
సదరు టీనేజర్‌కు 14 ఏళ్ల వయసులో బాగా నిస్సత్తువగా అనారోగ్యంగా అనిపిస్తుండటంతో డాక్టర్‌ను సంప్రదించారు. అప్పుడు అతడికి బి12 విటమిన్ లోపం ఉన్నట్లు గుర్తించారు. ఆ విటమిన్ సప్లిమెంట్లు అందించటం మొదలుపెట్టారు. కానీ.. అతడు ఆ చికిత్సను కొనసాగించలేదు. ఆహార అలవాట్లను మెరుగుపరచుకోలేదు.

ఫొటో సోర్స్, Getty Images
మూడేళ్ల తర్వాత.. అతడి చూపు మందగించటం పెరుగుతుండటంతో బ్రిస్టల్ ఐ హాస్పిటల్‌కు తీసుకువచ్చారని ఆనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ పేర్కొంది.
''అతడు రోజూ తినే ఆహారంలో స్థానిక దుకాణంలో కొనే చిప్సే అధికం. ప్రింగిల్స్ కూడా తినేవాడు. అప్పుడప్పుడు వైట్ బ్రెడ్, కాస్త మాంసం తినేవాడు. కానీ పండ్లు, కూరగాయలు ఏవీ తినేవాడు కాదు'' అని ఆస్పత్రిలో అతడికి చికిత్స అందించిన డాక్టర్ డెనీజ్ అటాన్ వివరించారు.
''ఆహారంలో కొన్ని రుచులు తనకు వెగటు కలిగిస్తాయని.. తనకు అవి అసలు సహించవని అతడు చెప్పాడు. అందుకే చిప్స్, క్రిప్స్ వంటి ఆహారాలు మాత్రమే తనకు సరిపోతాయని భావించాడు'' అని ఆమె తెలిపారు.
అతడి శరీరంలో విటమిన్ బి12తో పాటు కాపర్, సెలీనియం, విటమిన్ డి వంటి ఇతర ముఖ్యమైన విటమిన్లు, మినరళ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు.
అయితే.. అతడు అధిక బరువు కానీ తక్కువ బరువు కానీ లేడు. కానీ పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. ''అతడి ఎముకల్లో మినరళ్లు పోయాయి. ఈ వయసు పిల్లాడికి ఇలా జరగటం దిగ్భ్రాంతికరం'' అని డాక్టర్ డెనీజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం అతడి కంటిచూపు స్థాయిని బట్టి అంధుడిగానే చెప్పొచ్చన్నారు. ''అతడి చూపు మధ్యలో బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. దానర్థం అతడు డ్రైవ్ చేయలేడు. చదవటం, టీవీ చూడటం, ముఖాలను గుర్తించటం చాలా కష్టం'' అని ఆమె వివరించారు.
అయితే అస్పష్టంగా పైపైన చూడగలడని.. కాబట్టి సొంతంగా నడవగలడని తెలిపారు.
ఈ యువకుడికి వచ్చిన కంటి సమస్యను న్యూట్రిషనల్ ఆప్టిక్ న్యూరోపతిగా చెప్పారు. దీనిని ఆరంభ దశలోనే గుర్తించినట్లయితే చికిత్స చేయవచ్చు. కానీ దీర్ఘ కాలం విస్మరిస్తే ఆప్టిక్ ఫైబర్‌కు సంబంధించిన నాడీ కణాలు చనిపోతాయి. ఆ సమస్య శాశ్వతంగా మారిపోతుంది.
ఇటువంటి ఉదంతాలు చాలా అరుదని డాక్టన్ డనీజ్ పేర్కొన్నారు. అయితే.. పిల్లలు సరైన ఆహారం తినకుండా అరకొరగా ఎంచుకుని తినటం వల్లే జరిగే హాని గురించి తల్లిదండ్రులకు అవగాహన ఉండాలన్నారు. ఇటువంటి పరిస్థితి కనిపిస్తే తక్షణమే నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు.
''ప్రతి భోజనంలో ఒకటి, అర కొత్త ఆహారాలను పరిచయం చేస్తూ ఉండాలి. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు అందించినప్పటికీ.. ఆరోగ్యవంతమైన ఆహారం తినటానికి అవి ప్రత్యామ్నాయం కాబోవు'' అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని మీరు చాలా రోజులు తింటారా?
- కోడళ్ల సంఘం: ఏమిటీ కోడళ్ల ప్రత్యేకత?
- #నో బ్రా ఉద్యమం: బ్రా వేసుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న దక్షిణ కొరియా మహిళలు
- పది కోట్ల మందికి అన్నం పెట్టే పరిశ్రమ.. పడి లేవలేకపోతోంది
- భార్యలను హత్య చేయగల భర్తలను ఇలా ముందే పసిగట్టవచ్చు
- బడి పిల్లలకు కూరకు బదులు ఉప్పు: వార్త రాసిన జర్నలిస్టుపై యూపీ పోలీసుల కేసు
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
- దళితులు: వివక్ష, కట్టుబాట్ల మీద పెరుగుతున్న ధిక్కారానికి కారణమేమిటి? ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయి?
- భర్త వేధింపులకు సంప్రదాయ ‘కట్టె’డి
- వేధింపుల బాధితులు ‘వన్ స్టాప్’ కేంద్రాలకు వెళ్లాలి. అక్కడెవరూ లేకపోతే ఎక్కడికెళ్లాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








