పిల్లల్లో పోషకాహార లోపానికి పేగుల్లో సూక్ష్మజీవులతో పరిష్కారం దొరుకుతుందా

ఫొటో సోర్స్, INTERNATIONAL CENTRE FOR DISEASE RESEARCH
పోషకాహార లోపం ఉన్న పిల్లలకు.. అరటిపండ్లు, వేరు సెనగలు, సెనగలు వంటి బలవర్ధక ఆహారం ఇవ్వటం వల్ల వారి పేగుల్లో మంచి బ్యాక్టీరియా మెరుగుపడుతుందని.. ఇది వారి ఎదుగుదల మొదలవటానికి దోహదపడుతుందని తాజా పరిశోధన చెప్తోంది.
ఈ ఆహార పదార్థాలు ప్రత్యేకించి పేగుల్లో ఆరోగ్యవంతమైన సూక్ష్మజీవులను పెంచటానికి బాగా ఉపయోగపడతాయని బంగ్లాదేశ్ చిన్నారులపై అమెరికా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
ఈ ఆహారం అందించటం వల్ల పిల్లల్లో ఎముకలు, మెదడు, శరీరం ఎదుగుదల ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల్లో 15 కోట్ల మంది పోషకాహార లోపంతో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి.
అదే వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన చిన్నారులతో పోలిస్తే.. పోషకాహార లోపం గల చిన్నారులు బలహీనంగా ఉండటం, ఎదుగుదల లేకపోవటమే కాదు.. వారి పేగుల్లో వివిధ రకాల బ్యాక్టీరియా కూడా అసంపూర్ణంగా, ఎదుగుదల లేకుండా ఉంటుంది.

ఫొటో సోర్స్, Science Photo Library
మంచి బ్యాక్టీరియాను పెంచటం ఎలా?
ఎదుగుదల లేకపోవటానికి ఇదే కారణం కావచ్చునని సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు భావించారు. అయితే.. ఈ సమస్యను పరిష్కరించటానికి అన్ని రకాల ఆహారాలూ సమానంగా సాయం చేయవు.
బంగ్లాదేశీ చిన్నారుల్లోని పేగుల్లో ఉన్న ప్రధాన రకాల బ్యాక్టీరియాను పరిశోధకులు అధ్యయనం చేశారు.
అనంతరం.. ఎలుకలు, పందులపై ప్రయోగాలు చేసి.. వాటి పేగుల్లో ఈ తరహా బ్యాక్టీరియా పెరగడానికి ఎలాంటి ఆహారం దోహదం చేస్తోందో పరీక్షించారు.
ఆ తర్వాత.. బంగ్లాదేశ్‌కు చెందిన 68 మంది పోషకాహార లోపం గల చిన్నారులకు నెల రోజుల పాటు వివిధ రకాల ఆహారాలను అందించి అధ్యయనం చేశారు.
ఏడాది నుంచి ఏడాదిన్నర వయసు గల పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ పిల్లల ఎదుగుదలను నిశితంగా పర్యవేక్షించారు.
పరిశోధకులు అందించిన ఆహారంలో ఒక ఆహారం మిగతా వాటికన్నా చాలా ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు. అది.. అరటిపళ్లు, సోయా, వేరుసెనగ పిండి, సెనగలు కలిపి తయారు చేసిన ముద్ద.
ఎముకల ఎదుగుదలకు, మెదడు అభివృద్ధికి, రోగనిరోధక శక్తి పనితీరు మెరుగుపడటానికి తోడ్పడే సూక్ష్మజీవుల పెరుగుదలను ఈ ఆహారం పెంచినట్లు గుర్తించారు.
బంగ్లాదేశ్ ప్రజలకు చౌకగా అందుబాటులో ఉండే, వారు స్వీకరించటానికి అంగీకరించగల పదార్థాలనే ఈ ఆహారంలో వినియోగించారు.

అద్భుత మరమ్మత్తు
వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ గోర్డన్ సారథ్యంలో.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డయేరియల్ డిసీజ్ రీసెర్చ్ సిబ్బంది ఈ అధ్యయనం నిర్వహించారు.
పిల్లల్లో పోషకాహారలోపాన్ని నయం చేయటానికి సూక్ష్మజీవుల మీద దృష్టి కేంద్రీకరించటం లక్ష్యంగా ఈ అధ్యయనం నిర్వహించినట్లు ఆయన చెప్పారు.
అయితే.. ''సూక్ష్మజీవులు అరటిపండ్లు, వేరెసెనగలను చూడవు.. తాము ఉపయోగించుకుని, పంచుకోగల పోషకాల సమాహారాన్ని చూస్తాయి'' అని పేర్కొన్నారు.
''ఈ ఫార్ములా జంతువులు, మనుషుల్లో ఉత్తమంగా పనిచేసింది.. అతిగొప్పగా మరమ్మతు చేసింది'' అని తెలిపారాయన. ఇతర దేశాల్లో విభిన్న రకాల ఆహారాలు ఇదే తరహా ప్రభావం చూపవచ్చునన్నారు.
బియ్యం తదితర ధాన్యాలు ప్రధానంగా ఉన్న ఇతర ఆహారాల ప్రభావం తక్కువగా కనిపించింది. అంతేకాదు.. అవి పేగులను మరింతగా దెబ్బతీశాయి కూడా.
ఈ ఆహారాలు ఉత్తమంగా ఎందుకు పనిచేశాయనే అంశం మీద ఇంకా స్పష్టత రాలేదని ప్రొఫెసర్ గోర్డన్ చెప్పారు. అయితే.. పిల్లలు బరువు పెరగటం, ఎత్తు పెరగటం మీద ఈ ఆహారాలు దీర్ఘ కాలిక ప్రభావం చూపుతాయా అనేది తెలుసుకోవటానికి ఇంకా విస్తృత ప్రయోగం కొనసాగుతోందని తెలిపారు.

పేగుల్లో సూక్ష్మజీవులు ఏమిటి?
- మన శరీరంలో మనిషి కన్నా సూక్ష్మజీవులు అధికంగా ఉంటాయి. మన శరీరంలోని అన్ని కణాలనూ లెక్కిస్తే.. అందులో కేవలం 43 శాతం మాత్రమే మానవ కణాలు.
- మిగతా అంతా మన శరీరంలోని సూక్ష్మజీవులే.. అందులో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు, ఏక కణ జీవులు ఉంటాయి
- మానవ జీనోమ్ - మనిషి జన్యు సంకేతాల పూర్తి పటం - జన్యువులు అని పిలిచే 20,000 సూచనలతో తయారయింది
- కానీ.. మన శరీరంలోని సూక్ష్మజీవుల జన్యువులన్నిటినీ కలిపితే.. ఈ సంఖ్య 20 లక్షల నుంచి రెండు కోట్ల సూక్ష్మజీవుల జన్యువులుగా తేలుతుంది
- దీనిని రెండో జీనోమ్ అని పిలుస్తారు.. అలర్జీ, ఊబకాయం, పార్కిన్సన్స్, ఆటిజం, కుంగుబాటు వంటి వ్యాధులకు దీనికి సంబంధం ఉంటుంది
ఇవి కూడా చదవండి:
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- చంద్రశేఖర్ ఆజాద్ తనను తాను కాల్చుకొని చనిపోయాడనేది నిజమేనా?
- ఫేస్ యాప్ ఉపయోగిస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త
- పిల్లలకు పాలు తప్పనిసరిగా తాగించాలా
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని మీరు చాలా రోజులు తింటారా?
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- శుభ్రత అంటే ఏమిటి? పరిసరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం అంటే ఏమిటి...
- క్యాన్సర్లు, గుండె పోటును దూరం చేసే ఇది వంటగదిలోనే ఉంటుంది కానీ ఎక్కువ మంది తినడం లేదు
- ఇవి తింటే.. మీ జుట్టు భద్రం!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








