శుభ్రత అంటే ఏమిటి? ఆరోగ్యవంతమైన వాతావరణం అంటే ఏమిటి... రెండింటికీ ఏమిటి తేడా?

చేతులు కడుక్కోవడం

ఫొటో సోర్స్, Getty Images

ఇంట్లో మురికిగా ఉండే ప్రదేశాలను శుభ్రం చేయడం కంటే.. హానికారక సూక్ష్మజీవులను నిరోధించడంపై ప్రజలు దృష్టిపెట్టాలని బ్రిటిష్ రాయల్ సొసైటీ ఫర్ పబ్లిక్ హెల్త్ (ఆర్ఎస్‌పీహెచ్) నివేదిక తెలిపింది.

సరైన సమయానికి చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఫ్లోర్‌ని తుడవటం ఆరోగ్యవంతమైన వాతావరణానికి కీలకం. అయితే, ప్రతి నలుగురిలో ఒకరు మాత్రం వీటికి ప్రాధాన్యం లేదని భావిస్తున్నారని ఈ నివేదిక హెచ్చరించింది.

శుభ్రత అంటే దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవడమని చెప్పుకోవచ్చు. కానీ, ఆరోగ్యవంతమైన పరిసరాలు అంటే రోగకారకాలు, సూక్ష్మక్రిములు లేకుండా మెరుగుపర్చుకోవడం. శుభ్రత కన్నా మెరుగైన ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని మన చుట్టూ ఏర్పాటు చేసుకుంటే అంటువ్యాధుల్ని నివారించవచ్చు. అలాగే యాంటీబయోటిక్ నిరోధక శక్తిని కూడా అడ్డుకోవచ్చు.

అలాగే, ‘‘అతి శుభ్రం’’గా ఉండటం అనేది కూడా ఏదీ లేదు.

ఆర్ఎస్‌పీహెచ్ నివేదిక ప్రకారం.. మురికి, క్రిములు, శుభ్రత, ఆరోగ్యవంతంగా ఉండడానికి మధ్య తేడాను అర్థం చేసుకోవడంలో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

రెండు వేల మందితో ఒక సర్వే చేయగా, అందులో 23 శాతం మంది.. హానికారక సూక్ష్మ క్రిముల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని భావిస్తున్నారని తేలింది.

అయితే, అది ‘‘కీడు చేసే నమ్మకం’’ అని, అలా చేయడం వల్ల పిల్లలు ప్రమాదకరమైన అంటురోగాల బారిన పడతారని ఈ నివేదిక తయారు చేసిన నిపుణులు చెబుతున్నారు.

దానికి బదులు, ఆయా ప్రదేశాలను నిర్ణీత సమయాలకు శుభ్రం చేయడంపై దృష్టి పెట్టాలని, అవి శుభ్రంగా కనిపించినప్పటికీ తగిన శ్రద్ధ పెట్టి ఎలాంటి క్రిములు లేకుండా చూడాలని, అప్పుడే చెడ్డ సూక్ష్మ క్రియుల వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడెప్పుడు.. ఎక్కడెక్కడ పరిసరాలను ఆరోగ్యవంతంగా ఉంచాలి?

  • ఆహారాన్ని తయారు చేసే, వడ్డించే ప్రాంతాలు
  • వేళ్లు, చేత్తో ఆహారం తీసుకునేప్పుడు, తర్వాత
  • మరుగుదొడ్డి వాడిన తర్వాత
  • ఎవరైనా దగ్గేప్పుడు, తుమ్మేప్పుడు, ముక్కును చీదేప్పుడు
  • ఇల్లు, వంటగదిలో ఉండే మురికి బట్టలు, మసిగుడ్డలు
  • పెంపుడు జంతువులతో ఉన్నప్పుడు
  • చెత్త, వ్యర్థాలను చేత్తో తాకినప్పుడు, పారేసేప్పుడు
  • అంటువ్యాధి సోకిన వారికి సపర్యలు చేసేప్పుడు
Presentational grey line
Presentational grey line
చేతిని నాకుతున్న కుక్క

ఫొటో సోర్స్, Getty Images

ఆహారం వండుతున్నా, వడ్డిస్తున్నా, సర్దుతున్నా చేతులు శుభ్రం చేసుకోవాలి. అలాగే, మరుగుదొడ్డి వాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, పెంపుడు జంతువులతో గడిపినప్పుడు, జబ్బుపడిన వారికి సపర్యలు చేసినప్పుడు చేతులు కడుక్కోవాలని ఈ నివేదిక చెబుతోంది.

మాంసం వంటి వంటకాలు చేసినప్పుడు వంటగదిలోని నేలను, దిమ్మల్ని, మాంసం కోసిన చెక్క/బోర్డుల్ని శుభ్రం చేయడం చాలా కీలకం. అలాగే, శాండ్‌విచ్‌లు, చిరుతిళ్లు తయారు చేసేముందు కూడా ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి.

కలుషితమైన ప్రదేశాన్ని, పాత్రల్ని శుభ్రం చేశాక ఆయా గుడ్డలు, స్క్రబ్‌లను, బ్రష్‌లను కడగటం మంచిది.

ఇంట్లో నేలపైన, కుర్చీలు, బల్లల వంటి ఫర్నీచర్‌పైన చాలా దుమ్ము పట్టినట్లు ఉంటుంది, అయితే.. అక్కడ ఉండే క్రిములు చాలా వరకు ఆరోగ్యానికి ఎక్కువ హాని చేకూర్చేవి కాదు.

బ్యాక్టీరియా ఎలా పోతుంది?

ఇంట్లో నేలను కానీ, పాత్రల్ని కానీ వేడిగా ఉన్న సబ్బు నీటితో కడగడంతో బ్యాక్టీరియాను తొలగించవచ్చు. ఆ బ్యాక్టీరియా నీటితో పాటు కొట్టుకుపోతుంది.

అయితే బ్యాక్టీరియాను పూర్తిగా చంపాలంటే మాత్రం నీటిని 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కొద్దిసేపు మరిగించాలని ఆహార ప్రమాణాల సంస్థ చెబుతోంది.

ఎలాంటి ఉత్పత్తులు వాడాలి?

మూడు విభాగాలు ఉన్నాయి. ఏ ఉత్పత్తి అయినా ఈ మూడింటిలో ఒక దాని పరిధిలోకి వస్తుంది. ఈ మూడింటిలో ఒక్కొక్కటీ ఒక్కో రకంగా పనిచేస్తాయి.

  • డిటర్జెంట్లు - నేలను శుభ్రం చేస్తాయి. నూనెలు, ఇతర జిడ్డును వదిలిస్తాయి. కానీ, బ్యాక్టీరియాను చంపలేవు.
  • క్రిమిసంహారకాలు/క్రిమినాశకాలు - బ్యాక్టీరియాను చంపుతాయి. కానీ నేలపై ఉన్న జిడ్డు, కనిపించే మురికిని సమర్ధవంతంగా శుభ్రం చేయలేవు.
  • శానిటైజర్లు - నేలను శుభ్రం చేయడానికి, క్రిములను చంపడానికి.. రెండింటికీ వాడొచ్చు. తొలుత శానిటైజర్‌తో నేలను శుభ్రం చేసి దానిపై ఉండే మురికిని, అంటుకుపోయిన ఆహార పదార్థాలను, జిడ్డును తొలగించాలి. తర్వాత శుభ్రంగా ఉన్న నేలపైన కూడా శానిటైజర్లను ఉపయోగిస్తే క్రిములను చంపొచ్చు.

అయితే, దేనిని వాడుతున్నా సరే వాటిపై ఉండే మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

ఆహారాన్ని తయారు చేసిన తర్వాత నేలను, రాతి దిమ్మెలను శుభ్రం చేయడానికి గుడ్డకు బదులు పేపర్ టవల్స్ వాడి చూడండి. ఇలా చేయడం వల్ల వంటగదిలో ఉపయోగించే గుడ్డలు అపరిశుభ్రం కాకుండా, కలుషితం కాకుండా ఉంటాయి.

మాంసం కోస్తున్న కత్తి

ఫొటో సోర్స్, Getty Images

నిపుణులు ఏం చెబుతున్నారు?

శుభ్రతకు, పరిసరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి మధ్య తేడాను ప్రజలు తప్పక తెలుసుకోవాలని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ శాల్లీ బ్లూమ్‌ఫీల్డ్ చెప్పారు.

‘‘శుభ్రత అంటే మురికి లేకుండా చేయడం. ఆరోగ్యవంతంగా పరిసరాలను ఉంచుకోవడం అంటే మురికితోపాటు రోగకారక క్రిములను అరికట్టడం. తద్వారా అంటువ్యాధులు సోకకుండా చూసుకోవడం. ముఖ్యంగా ఆహారాన్ని తయారు చేసేప్పుడు, మరుగుదొడ్డి వాడేప్పుడు, పెంపుడు జంతువులతో గడిపేటప్పుడు ఇది చాలా ముఖ్యం.’’

‘‘ఆరుబయట స్నేహితులు, కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువులతో గడపడం, ఆడుకోవడంతో ‘మంచి బ్యాక్టీరియా’ను పొందవచ్చు. ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల్ని పెంపొందించుకోవచ్చు. కానీ, ప్రజలు చెడు బ్యాక్టీరియా బారిన పడకుండా చూసుకోవడం కూడా కీలకం. మంచి పరిశుభ్రత విషయంలో ఇవేవీ ఇబ్బంది కాదు’’ అని రాయల్ సొసైటీ ఫర్ పబ్లిక్ హెల్త్‌లో ఆహార పరిశుభ్రత నిపుణులు, ట్రస్టీ అయిన ప్రొఫెసర్ లిసా అకెర్లీ తెలిపారు.

‘‘పరిసరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధుల్ని నియంత్రించవచ్చు. ఇది చాలా సులభమైన, చౌక అయిన వ్యవహారం. పైగా, మంచి బ్యాక్టీరియాకు గురికావటం ద్వారా మీ శరీరానికి మేలు జరుగుతుంది.’’

‘‘ఇంట్లో, ప్రతిరోజూ పరిశుభ్రత పాటించడం ద్వారా అంటురోగాలను తగ్గించొచ్చు. తద్వారా మన పిల్లల్ని రక్షించుకోవడంతో పాటు, ఆసుపత్రులపై ఒత్తిడిని కూడా తగ్గించొచ్చు. అంతేకాదు యాంటీబయోటిక్ నిరోధకతపై పోరాడటంలోనూ ఇది కీలకపాత్ర పోషిస్తుంది’’ అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)