ఇన్‌స్టాగ్రామ్ కోడిగుడ్డు: 2.6 కోట్ల మంది ఎందుకు దీన్ని లైక్ చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రపంచంలో అద్భుతాలకు కొదవలేదు. సుందరమైన సూర్యోదయాలు, అప్పుడే పుడుతున్న పసిపాపలు... ఇదిగో ఈ గుడ్డు. ఇది మామూలు గుడ్డు కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు స్థాయిలో 26000000 లైకులు పొందిన గుడ్డు ఇది.
అసలు ఈ గుడ్డు ఏంటి? ఈ రికార్డు ఏంటి? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? దీని వెనుక ఉన్నదెవరు? వాళ్ల ఉద్దేశం ఏంటి?
ప్రపంచంలోనే అత్యధికమంది ఇష్టపడిన (లైక్ చేసిన) గుడ్డు కథేంటో మీరూ చదవండి..

ఫొటో సోర్స్, @world_record_egg / Instagram
@world_record_egg అనే అకౌంట్ ద్వారా జనవరి 4వ తేదీన ఒక గుడ్డు ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
ఈ ఫొటోతో పాటు... ‘అందరం కలసి ప్రపంచ రికార్డు సృష్టిద్దాం. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా లైక్ చేసిన పోస్ట్‌ను సృష్టిద్దాం. కెలీ జెన్నర్ (1.8 కోట్ల లైకులు) రికార్డును బద్దలు కొడదాం! మన వద్ద ఉంది ఇదే’ అని క్యాప్షన్ పెట్టారు.
అప్పటి నుంచి (జనవరి 14 సాయంత్రం 5 గంటల వరకు) ఈ పోస్టుకు 2.6 కోట్ల లైకులు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకూ ఇన్‌స్టాలో అత్యధిక లైకులు పొందిన ఫొటో రికార్డు బద్దలయ్యింది.
ఇదీ ఈ గుడ్(డ్డు) రికార్డు.

ఫొటో సోర్స్, @kyliejenner / Instagram
ఇప్పటి వరకూ ఇన్‌స్టాలో రికార్డు ఫొటో ఏంటి?
అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్ కెలీ జెన్నర్ తనకు ‘స్టోర్మీ’ అనే బిడ్డ పుట్టినట్లు 2018 ఫిబ్రవరి 6వ తేదీన ఒక ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు కోటీ ఎనభై లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
ఈ రికార్డును జనవరి 13వ తేదీనే గుడ్డు తుడిచిపెట్టేసింది. పోస్ట్ చేసిన పది రోజుల్లోనే తన లక్ష్యం అయిన 1.8 కోట్ల లైకులను పొందేసింది.
ఇప్పుడు కెలీ జెన్నర్ బిడ్డ ఫొటోకు వస్తున్న కామెంట్లన్నీ గుడ్డు గురించి చేస్తున్నవే.
దీనికి కెలీ కూడా స్పందించారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
వేడివేడి రోడ్డుపై గుడ్డును పగలకొడుతున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు.
ఆ గుడ్డు ఉడకలేదనుకోండి. అయితే ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారో మాత్రం అందరికీ అర్థమైంది.

ఫొటో సోర్స్, Instagram / @world_record_egg
ఇదంతా ఎవరు చేశారు? ఎందుకు చేశారు? గుడ్డు రహస్యం ఏంటి?
కొంతమందికి అసలు ఇది నిజంగా గుడ్డేనా? అని కూడా సందేహాలు వచ్చాయి. అయితే, అది నిజంగా గుడ్డే (గుడ్డు ఫొటోనే.)
అయితే, ఈ అకౌంట్‌కు యజమాని ఎవరు? అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఎగ్ గ్యాంగ్ (గుడ్డు బృందం) పేరిట ఈ అకౌంట్ ఉంది. అయితే వారి లక్ష్యం మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైకులు పొందటమేనని తెలుస్తోంది.
వారు అనుకున్నది జరిగిపోయింది. మరి గుడ్డు ఏమవుతుంది? దాని భవిష్యత్తు ఏంటి? అనేది మాత్రం ఇప్పటి వరకు సమాధానాల్లేని ప్రశ్నలే.
గుడ్డు ఫొటోను పోస్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించిన ‘ఎగ్ గ్యాంగ్’ ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
- ఇన్‌స్టాగ్రామ్‌తో డబ్బులు సంపాదించడం ఎలా?
- ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల అమ్మకం
- సౌదీ: ‘నా చేత బలవంతంగా ప్రార్థనలు చేయించేవాళ్లు. రంజాన్‌లో ఉపవాసం ఉంచేవాళ్లు’
- ఇన్‌స్టాగ్రామ్ ఫొటోల్లో భారత రైలు ప్రయాణం
- ఇన్‌స్టాగ్రామ్: నకిలీ కామెంట్లు, నకిలీ లైక్‌లు ఇక కుదరవు
- రష్యా మంత్రి బంపర్ ప్రైజ్: సరైన సమాధానం చెబితే 2.5 ఎకరాల భూమి ఫ్రీ
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- #fallingstarschallenge: చైనా యువతీ, యువకులు ఎందుకిలా పడిపోతున్నారంటే..
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- అరటిపండు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందా
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








