ఇన్‌స్టాగ్రామ్‌లో రష్యా మంత్రి బంపర్ ప్రైజ్: సరైన సమాధానం చెబితే 2.5 ఎకరాల భూమి ఫ్రీ

MINVR.RU/YOUTUBE

ఫొటో సోర్స్, తూర్పు సైబీరియా ప్రాతం

పోటీలో గెలుపొందిన వారికి ఉచితంగా 2.5 ఎకరాల భూమిని ప్రకటించిన ఓ రష్యా మంత్రి విమర్శలపాలయ్యారు.

రష్యాలోని తూర్పు ఆసియా ప్రాంత అభివృద్ధి మంత్రి అలెగ్జాండర్ కొజ్లొవ్ ఓ 'మిస్టరీ ప్రైజ్ డ్రా' ప్రకటించారని రాంబ్లర్ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది.

''నేను ప్రకటించే బహుమతి ఏంటో ఊహించి చెప్పండి. కరెక్ట్‌గా చెప్పిన వారికి బహుమతి ఉంటుంది. నా ఇన్ట్సాగ్రామ్ అకౌంట్‌ను సబ్‌స్రైబ్ చేసుకొని కామెంట్ చేయడంతో పాటు మీ స్నేహితులకు కూడా ట్యాగ్ చేయండి'' అని మంత్రి సూచించారని రాంబర్ల్ సైట్ తెలిపింది.

ఆ ప్రకటనతో మంత్రి అకౌంట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. రోజుల వ్యవధిలో 8 వేల మంది ఆయన అకౌంట్‌లో కామెంట్ చేశారు.

గెలుపొందినవారికి మంత్రితో డిన్నర్ చేసే అవకాశం కల్పిస్తారని చాలా మంది ఊహించారు.

అయితే, వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ పోటీలో గెలుపొందిన వారికి ఉచితంగా భూమిని ఇస్తానని మంత్రి ప్రకటించారు.

అలెగ్జాండర్ కొజ్లొవ్

ఫొటో సోర్స్, ALEXANDER KOZLOV/INSTAGRAM

రష్యా తూర్పు ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'ఫార్ ఈస్ట్రన్ హెక్టార్ ప్లాన్' కింద విజేతలకు భూమిని అందిస్తానని తెలిపారు.

తూర్పు సైబీరియాలో గ్రామీణ జనాభా పూర్తిగా పడిపోవడంతో అక్కడ మెరుగైన సౌకర్యాలను కల్పించి జనాభా పెంచేందుకు రష్యా ప్రభుత్వం 'ఫార్ ఈస్ట్రన్ హెక్టార్ ప్లాన్' అమలు చేస్తోంది.

ఈ పథకంలో భాగంగా రష్యన్లు ఎవరైనా అక్కడ స్థిరపడాలనుకుంటే వారికి ఉచితంగా రెండున్నర ఎకరాల భూమిని ఇస్తుంది.

అయితే, ఫార్ ఈస్ట్రన్ హెక్టార్ ప్లాన్' పథకాన్ని ఈ పోటీ తప్పుదారి పట్టించేలా ఉందని కొందరు విమర్శించారు. లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వకుండా పోటీలో గెలిచిన వారికి ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు.

తూర్పు సైబీరియాలో అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించడంలో మంత్రి విఫలమయ్యారని మరికొందరు ఆరోపించారు. రహదారి, విద్యుత్ సరఫరా కల్పించడంలో అలసత్వం చోటు చేసుకుంటోందని తెలిపారు.

నెటిజన్ల విమర్శలకు మంత్రి బదులిస్తూ, 'ఈ పోటీకి నేను కేటాయించింది 10 నిమిషాలు మాత్రమే' అని చెప్పారు. ఈ పోటీ వల్ల అసలైన లబ్ధిదారులకు నష్టం ఏమీ ఉండదని తెలిపారు.

తూర్పు సైబీరియా ప్రాతం

ఫొటో సోర్స్, ANDSHEL/WIKICOMMONS

'ఫార్ ఈస్ట్రన్ హెక్టార్ స్కీమ్‌'ను ప్రాచుర్యంలోకి తెచ్చేలా మంత్రి కృషిచేశారని చాలా మంది సోషల్ మీడియాలో ప్రశంసించారు.

ఈ పోటీలో గలినా సొరకినా(29) అనే వైద్య విద్యార్థిని గెలుపొందారు.''నువ్వు ప్లాట్ గెలుచుకున్నట్లున్నావ్! అని ఫ్రెండ్ చెప్పే వరకు నేనే విజేతనని తెలియదు" అని ఆమె చెప్పినట్లు అముర్ ఇన్ఫో న్యూస్ సైట్ వెల్లడించింది. అయితే, గెలుచుకున్న ప్లాట్‌ను ఏం చేయాలనేది ఆమె ఇంకా నిర్ణయించుకోలేదు.

ప్రస్తుతానికి 13 మంది సరైన సమాధానం చెప్పి విజేతలుగా నిలిచారు. త్వరలోనే వారు 'ఫార్ ఈస్ట్ డెవెలప్‌మెంట్ మినిస్ట్రీ' నుంచి బ్యాడ్జ్‌లు అందుకోనున్నారు. విజేతల ఇంటికే నేరుగా తన సంతకంతో కూడిన పోస్ట్ కార్డ్ ను పంపిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటకీ రష్యా ప్రభుత్వం ఫార్ ఈస్ట్రన్ డెవెలప్‌మెంట్ స్కీమ్‌ను సమర్థంగా అమలు చేస్తోంది. ఈ పథకాన్ని 2016లో ప్రారంభించినప్పటి నుంచి 70 వేల మంది అక్కడ స్థిరపడ్డారని ఫార్ ఈస్ట్రన్ డెవెలప్‌మెంట్ స్కీమ్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)