బ్రోక్పా తెగ: విదేశీ మహిళలు గర్భం దాల్చేందుకు లద్ధాఖ్‌లోని వీరి గ్రామాలకు వస్తుంటారా?

- రచయిత, దీపక్ శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
లద్దాఖ్‌లో సింధూ నది ఒడ్డున ఉండే బియామా, దాహ్, హానూ, దార్చిక్ లాంటి గ్రామాలకు చెందిన దాదాపు 5వేల మంది బ్రోక్పా సముదాయానికి చెందిన ప్రజలు తమను తాము చిట్ట చివరి ‘స్వచ్ఛమైన ఆర్యులు’గా చెప్పుకుంటారు.
ఇంటర్నెట్ రాకతో అంతర్జాతీయంగా ఈ బ్రోక్పా ప్రజల గురించి శోధించేవారి సంఖ్య పెరిగింది. ‘ప్రెగ్నెన్సీ టూరిజం’ కోసం విదేశీయులు ఈ బ్రోక్పా ప్రజలు ఉండే ప్రాంతానికి వస్తుంటారని చెబుతారు.
ఈ బ్రోక్పా ప్రజలే స్వచ్ఛమైన ఆర్యులని కొందరు విశ్వసిస్తారు. అందుకే వారితో సంపర్కం చేసి ‘స్వచ్ఛమైన ఆర్యుల’కు జన్మనిచ్చే ఉద్దేశంతో మహిళలు విదేశాల నుంచి వస్తుంటారని, ఇక్కడ గర్భం దాల్చి వెళ్తుంటారని స్థానికులు చెబుతారు.
2007లో సంజీవ్ శివన్ తీసిన ‘ది ఆచ్టంగ్ బేబీ... ఇన్ సెర్చ్ ఆఫ్ ప్యూరిటీ’ అనే డాక్యుమెంటరీలో... జర్మనీకి చెందిన ఓ మహిళ లద్దాఖ్ వచ్చి, ఇక్కడి వ్యక్తి సాయంతో గర్భం దాల్చినట్లు చెప్పడం కనిపిస్తుంది.
కానీ, బ్రోక్పా ప్రజలు దీని గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. దీని వల్ల తమ సముదాయానికి చెడ్డ పేరు వస్తుందని వారు భావిస్తారు.

ఫొటో సోర్స్, RajeshJoshi/BBC
బాతాలిక్ గ్రామంలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ దుకాణదారుడు దీని గురించి మాట్లాడుతూ... ‘కొన్నేళ్ల క్రితం జర్మనీకి చెందిన ఓ మహిళతో లేహ్ లోని హోటళ్లలో చాలా రోజులు గడిపా. ఆమె గర్భం దాల్చాకే ఇక్కడి నుంచి వెళ్లింది. కొన్నేళ్ల తరువాత పుట్టిన బిడ్డను తీసుకొని నన్ను కలవడానికి వచ్చింది’ అని చెప్పారు.
ఏంటి వీరి ప్రత్యేకత?
బ్రోక్పా సముదాయానికి చెందిన ప్రజలంతా తమను తాము స్వచ్ఛమైన ఆర్యులుగా విశ్వసిస్తారు.
‘తరతరాలుగా మాకు ఈ విషయం చెబుతారు. ఆర్యన్లు ఎత్తుగా, పొడుగ్గా ఉంటారని మీరు చదివే ఉంటారు. మా సముదాయంలో అందరిలోనూ ఆ లక్షణాలు కనిపిస్తాయి. మేం ప్రకృతిని కూడా పూజిస్తాం. మేం స్వచ్ఛమైన ఆర్యులమని చెప్పడానికి మా సంస్కృతే నిదర్శనం’ అంటారు ల్హామో అనే బ్రోక్పా యువతి.
మిగతా లద్దాఖ్ వాసులతో పోలిస్తే బియామా, గార్కొనే దార్చిక్ దాహ్, హానూ లాంటి గ్రామాల్లో ప్రజల ముఖాలు చాలా భిన్నంగా కనిపిస్తాయి.
ఆర్యులు బహుశా బయటి నుంచే భారత ఉపఖండానికి వచ్చి ఉంటారనే విషయం ఇటీవలి డీఎన్ఏ పరిశోధనల్లో వెల్లడైంది.

ఫొటో సోర్స్, RajeshJoshi/BBC
వారి ఆచార వ్యవహారాల్లో వైదిక సంస్కృతి ప్రభావం కనిపిస్తుందని చాలా మంది పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
లద్దాఖ్ లోని ఇతర ప్రజలకు భిన్నంగా బ్రోక్పాలు తమ సంస్కృతి వైదిక సంస్కృతికి దగ్గరగా ఉంటుందని అంటారు.
''మా సంస్కృతి వైదిక సంస్కృతితో చాలా ముడిపడి ఉంటుంది. మా భాషపై కూడా సంస్కృతం ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడిని సూర్య్ అంటాం. గుర్రాన్ని అశ్వ్ అంటాం. మేం దేవీదేవతల్ని పూజిస్తాం'' అని చెప్పారు స్వాంగ్ అనే బ్రోక్పా సముదాయానికి చెందిన వ్యక్తి. కార్గిల్ కాలేజీలో బోధించే ఈయన బ్రోక్పా సముదాయంపైన పరిశోధనలు జరుపుతున్నారు.
''చరిత్రకారుల విషయానికొస్తే.. ఎ.హెచ్.ఫ్రెంకీ అనే చరిత్రకారుడు హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ టిబెట్ అనే పుస్తకంలో కూడా రాశాడు. మేం నివసించే దర్ద్ అనే ఈ ప్రాంతాన్ని ఆర్యన్ స్టాక్ అని ఆయన అభివర్ణించారు. ఇంకా చాలా మంది రచయితలు కూడా మమ్మల్ని అలెగ్జాండర్ ద గ్రేట్ వారసులని పేర్కొన్నారు'' అంటారాయన.

ఫొటో సోర్స్, RajeshJoshi/BBC
మరోపక్క పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్‌లో ఉంటోన్న కలాశ్ తెగ ప్రజలు, హిమాచల్ ప్రదేశ్‌లోని మలానా, బడా భాంగల్ గ్రామాల ప్రజలు కూడా తమను తాము అలెగ్జాండర్ వారసులుగానే చెప్పుకుంటారు.
ఇటీవల తమ మాండలికం ‘బ్రోక్సకాట్’లో స్వాంగ్ ఓ నిఘంటువునూ తీసుకొచ్చారు. సంస్కృతానికి తమ భాషకూ చాలా సారూప్యతలున్నాయని ఆయన చెబుతారు.
బ్రోక్పాల జానపదాలను గమనిస్తే వాళ్ల పూర్వీకులు ఏడో శతాబ్దంలో పశ్చిమ హిమాలయాల నుంచి గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతం పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్‌లో ఉంది.
బ్రోక్పాలు ఏటా అక్టోబర్‌లో బొనోనా అనే పంట కోతల వేడుకులను నిర్వహిస్తారు. ఈ వేడుకలను బ్రోక్పాల సముదాయాలు స్థిరపడిన ఒక్కో గ్రామంలో ఒక్కో ఏడాది నిర్వహిస్తారు. తమ వంతు వచ్చినప్పుడు పాకిస్తాన్‌లోని బ్రోక్పాల గ్రామం ఈ వేడుకలను నిర్వహిస్తుందనే నమ్మకంతో ఓ ఏడాది భారత్‌లో వేడుకలు జరపరు. కానీ, సరిహద్దుకు అవతలివైపు చాలామంది ఇస్లామ్‌లోకి మారడంతో అక్కడి ఆర్యుల గ్రామాలు ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయో లేదోనన్నది అనుమానమే.

ఫొటో సోర్స్, RajeshJoshi/BBC
బ్రోక్పాల ప్రస్తుత తరం చదువుకు చాలా ప్రాధాన్యమిస్తోంది. ఆ తెగలో ఎక్కువమంది వ్యవసాయంమీదే ఆధారపడ్డారు. ఇంకొందరు ఆర్మీలో చిన్నచిన్న పనులు చేస్తారు.
స్మార్ట్ ఫోన్ల రాకతో వీరి జీవనశైలీ మారుతోంది. సోషల్ మీడియా సాయంతో సరిహద్దుకు అవతలి వైపున్న తమ సముదాయంలోని ప్రజలతో వీళ్లు మాటకలుపుతున్నారు.
‘వాళ్లు మా మాండలికంలోనే మాట్లాడతారు. వాళ్లు కూడా తాము ఆర్యులమని గర్వపడతారు’ అని చెబుతారు ల్హామో.

ఫొటో సోర్స్, RajeshJoshi/BBC
ఉపాధి కోసం పట్నానికి వెళ్తారా అని ప్రశ్నిస్తే, వీళ్ల నుంచి భిన్నమైన జవాబులు వినిపిస్తాయి. ‘మా గుర్తింపును పరిరక్షించుకుంటూ ఉపాధి పొందడం పెద్ద సవాలుగా మారింది’ అంటారు సెవాంగ్.
ప్రస్తుతం ఈ 21వ శతాబ్దపు ‘ఆర్యులు’, రాజ్యాల కోసం కాకుండా ఉపాధి కోసం యుద్ధం చేస్తున్నారు. కానీ ఉపాధి కోసం తమ గుర్తింపును దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేమని వాళ్లు చెబుతారు.
ఇవి కూడా చదవండి
- గర్భనిరోధక మాత్రలు వాడితే మహిళకు మగ లక్షణాలు వస్తాయా?
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్‌లో హింస ఏమైనా తగ్గిందా?
- చరిత్ర: బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యాహంకారం’.. కళ్లకు కడుతున్న ఫొటోలు
- బాత్ రూంలో హిడెన్ కెమెరా నుంచి తప్పించుకోవడం ఎలా?
- #HisChoice: నేను పెళ్లి చేసుకోలేదు.. ఒంటరిగానే ఉంటా.. ఈ సమాజానికేంటి నష్టం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










