బాత్ రూంలో హిడెన్ కెమెరా నుంచి తప్పించుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Science Photo Library
- రచయిత, గురుప్రీత్ సైనీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలో ఒక మహిళ రెస్టారెంట్‌లో ఉన్న బాత్రూంలోకి వెళ్లినపుడు, అక్కడ చాటుగా దాచిన ఒక ఫోన్ చూసి కంగారు పడిపోయారు.
ఆ ఫోన్‌ను బాత్రూంలో అలా ఎందుకు దాచి ఉంచారు? ఫోన్ కెమెరా ఆన్‌లో ఉంది. రికార్డింగ్ నడుస్తోంది. ఫోన్ ఓపెన్ చేసి చూసిన తర్వాత దాన్లో చాలా మంది మహిళల వీడియోలు ఉన్నట్టు తెలిసింది. ఆ వీడియోలను వాట్సప్ ద్వారా షేర్ కూడా చేశారు.
బాత్రూం నుంచి బయటికొచ్చిన మహిళ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్‌కు దానిపై ఫిర్యాదు చేశారు. ఆ ఫోన్ హౌస్ కీపింగ్ పని చేసే ఒక వ్యక్తిదని తేలింది.
గతంలో కూడా ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బాత్రూం, చేంజింగ్ రూమ్, హోటల్ గదుల్లో హిడెన్ కెమెరాలు పెడుతున్నట్టు గుర్తించారు.
2015లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇలాంటి ఒక ఫిర్యాదు చేశారు. ఒక స్టోర్‌లోని సీసీటీవీ కెమెరా ఒక చేంజింగ్ రూమ్ వైపు ఉండడంపై ప్రశ్నించారు.
అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మహిళల మనసులో ఒక భయం లాంటిది ఏర్పడుతుంది
పబ్లిక్ టాయ్‌లెట్, చేంజింగ్ రూమ్ లేదా హోటళ్లకు వెళ్లకుండా ఉండడం అనేది కష్టమే. కానీ అప్రమత్తంగా ఉండడం వల్ల హిడెన్ కెమెరాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
హిడెన్ కెమెరాలను గుర్తించండి
మొదట కెమెరాను ఎక్కడెక్కడ రహస్యంగా అమర్చగలరో తెలుసుకోవాలి.
హిడెన్ కెమెరాలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ మీరు బాత్రూంలో ఉన్నా, ఏదైనా స్టోర్ చేంజింగ్ రూంలో బట్టలు మార్చుకుంటున్నా, లేక హోటల్ గదిలో మీ భాగస్వామితో ఉన్నా అక్కడ జరిగేదంతా రికార్డ్ చేయగలుగుతాయి.
ఈ కెమెరాలను సాధారణంగా ఎక్కడ దాస్తారంటే..
- అద్దాల వెనుక
- తలుపుపై
- గోడ మూల ఎక్కడైనా
- పైకప్పులో
- ల్యాంప్‌లో
- ఫొటో ఫ్రేంలో
- టిష్యూ పేపర్ డబ్బాలో
- పూలకుండీలో
- స్మోక్ డిటెక్టర్‌లో

ఫొటో సోర్స్, Getty Images
కెమెరా ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి
మొదట పరిశీలించాలి: అన్నిటికంటే మొదట మీరు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. మీరు ఎప్పుడైనా పబ్లిక్ టాయిలెట్, చేంజింగ్ రూమ్, లేదా హోటల్లోని ఏదైనా గదిలోకి వెళ్తే నాలుగు వైపులా జాగ్రత్తగా చూడాలి. లోపల ఉన్న వస్తువులన్నీ పరిశీలించాలి. పైకప్పు మూలల్లో కూడా గమనించాలి.
ఏదైనా రంధ్రం ఉందా?: ఎక్కడైనా రంధ్రాలు కనిపిస్తే అందులో కెమెరా ఏదైనా పెట్టారేమో తెలుసుకోడానికి దానిలోపల గమనించాలి. నిజానికి కెమెరాలను అద్దాల వెనుక, ఫొటో ఫ్రేమ్ లేదా బ్యాక్ డోర్ లాంటి చోట పెడతారు. కాస్త అప్రమత్తంగా ఉంటే వాటిని గుర్తించవచ్చు.
ఏదైనా వైరు కనిపిస్తోందా?: ఎక్కడైనా అదనపు వైరు వెళ్తోందేమో కూడా గమనించాలి. అలా ఏదైనా కనిపిస్తే అది ఎక్కడికి వరకు వెళ్లుందో చూడాలి. ఆ వైరు మిమ్మల్ని దాచిన కెమెరా దగ్గరకు తీసుకెళ్లచ్చు. కానీ, చాలా కెమెరాలకు ఎలాంటి వైర్లూ ఉండవు. బ్యాటరీలతో నడుస్తాయి. మాగ్నెట్‌లా ఎక్కడైనా అతికించేలా ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
లైట్ ఆఫ్ చేసి చూడాలి: మీరు చేంజింగ్ రూమ్, లేదా హోటల్ గదిలో ఉంటే, ఒకసారి లైట్ ఆఫ్ చేసి నాలుగు వైపులా చూడండి. ఎక్కడైనా ఎల్ఈడీ వెలుగు లాంటిది వస్తోందేమో గమనించండి. అలా కనిపిస్తే అది కెమెరా కావచ్చు. నిజానికి కొన్ని నైట్ విజన్ కెమెరాలు కూడా ఉంటాయి. అవి చీకట్లో జరిగే వాటిని కూడా రికార్డ్ చేస్తాయి. ఈ కెమెరాలకు ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. చీకట్లో వాటిని గుర్తించవచ్చు.
మిర్రర్ టెస్ట్: చేంజింగ్ రూమ్, బాత్రూంలో మనకు అద్దాలు కనిపిస్తాయి. వాటి ముందు నిలుచుకుని మీరు బట్టలు మార్చుకుంటారు. టాయిలెట్‌కు వెళ్తారు. హోటల్ గదుల్లో కూడా చాలా పెద్ద అద్దాలు ఉంటాయి. ఆ అద్దాలకు అవతల ఉన్న ఎవరైనా మిమ్మల్ని చూస్తుండచ్చు. లేదా వాటి వెనుక కెమెరా అమర్చిన కెమెరా రికార్డ్ చేస్తుండచ్చు. అలాంటప్పుడు ఆ అద్దాలను పరిశీలించడం చాలా అవసరం. ఆ అద్దాలపై వేలు పెట్టి చూడండి. మీ వేలుకు అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబానికి మధ్య కాస్త గ్యాప్ కనిపిస్తే అది అద్దమే. కానీ మీ వేలుకు, అద్దంలో ఇమేజ్‌కు మధ్య గ్యాప్ కనిపించకపోతే ఏదో జరుగుతున్నట్టు లెక్క.
ఫ్లాష్ ఆన్ చేసి చూడాలి: లైట్ ఆఫ్ చేసి మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి. నాలుగు వైపులా చూడండి. ఎక్కడైనా రిఫ్లెక్షన్ వస్తుంటే, అది కెమెరాపై అద్దం వల్ల వస్తుండచ్చు. ఆ దిశగా వెళ్లి అక్కడ హిడెన్ కెమెరా ఏదైనా పెట్టారేమో జాగ్రత్తగా గమనించండి.
యాప్ అండ్ డిటెక్టర్:ఇప్పుడు హిడెన్ కెమెరా గురించి తెలుసుకోడానికి మనకు చాలా యాప్స్ లభిస్తున్నాయి. కానీ సైబర్ నిపుణుల చెబుతున్న దాని ప్రకారం కొన్ని యాప్స్ ఫేక్ కూడా కావచ్చు. కొన్ని హిడెన్ కెమెరాల గురించి చెప్పడానికి బదులు, మీ ఫోన్లో వైరస్ రిలీజ్ చేస్తాయి. ఇవి కాకుండా మార్కెట్లో కొన్ని డిటెక్టర్ డివైస్‌లూ ఉన్నాయి. వాటిని కొని మీ దగ్గర ఉంచుకోవచ్చు. కానీ వాటి ఖరీదెక్కువ, అందరూ కొనలేని అలాంటి డివైస్‌లు ఎక్కువగా పోలీసులు ఉపయోగిస్తుంటారు.

ఫొటో సోర్స్, AVON AND SOMERSET POLICE
కెమెరా కనిపిస్తే ఏం చేయాలి
మీకు హిడెన్ కెమెరా కనిపిస్తే, కంగారు పడకూడదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కెమెరాను తాకకండి. ఎందుకంటే దానిపై నిందితుల వేలిముద్రలు ఉంటాయి. పోలీసులు వచ్చేవరకూ అక్కడే ఉండండి.
"ఎవరైనా ఒక మహిళ అనుమతి లేకుండా కెమెరాతో వారిని ఫొటో లేదా వీడియో తీయడం, దానిని వేరే వారికి షేర్ చేయడం నేరం. దీనికి ఐటీ యాక్ట్ సెక్షన్ 67A, 66E( గోప్యత, వేధింపులు), ఐపీసీ సెక్షన్ 354A కింద కేసు నమోదు చేయవచ్చు. దానివల్ల నిందితులకు మూడేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా ఉండవచ్చు" అని సైబర్ నిపుణురాలు కర్ణిక చెప్పారు.
"ఫిషింగ్, హ్యాకింగ్ తర్వాత ఇలాంటి కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2016లో సైబర్ క్రైమ్‌లో సుమారు 11 వేల మందిని అరెస్టు చేశారు. వీరిలో సగం మందిని ఇలాంటి వీడియోలు తీసినందుకు పట్టుకున్నారు" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, PA
ఈ వీడియోలను ఏం చేస్తారు
"కొంతమంది అలాంటి వీడియోలను స్వయంగా చూడడం కోసం రికార్డ్ చేస్తారు. వీటికి చాలా పెద్ద మార్కెట్ ఉండడంతో కొందరు వాటిని అమ్ముకుంటారు. హిడెన్ కెమెరాలతో తీసిన వీడియోలను వెబ్ సైట్స్‌లో పెడతారు. వీటిని చాలా మంది చూస్తుంటారు" అని మరో సైబర్ నిపుణుడు వినీత్ కుమార్ చెప్పారు.
"cybercrime.gov.in పేరుతో ఉన్న భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం పిల్లలకు సంబంధించిన కేసులు నమోదు చేస్తున్నారు. కానీ కొంత కాలం తరవాత ఇందులో మహిళలకు సంబంధించిన కేసులు కూడా తీసుకుంటారు. మహిళలు ప్రస్తుతం మహిళా కమిషన్ సైబర్ సెల్‌లో వీటి గురించి ఫిర్యాదు చేయవచ్చు. దానితోపాటు మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సైబర్ సెల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు" అని వినీత్ తెలిపారు.
హిడెన్ కెమెరాలను గుర్తించడానికి సైబర్ నిపుణులు ఎన్నో ట్రిక్స్ చెప్పారు. కానీ అది మనం అత్యంత అప్రమత్తంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది.
ఇవి కూడా చూడండి:
- ఆన్లైన్లో మీ వ్యక్తిగత డేటా చోరీ కాకుండా ఉండాలంటే ఈ 5 పనులు చేయండి
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- మీకున్న ప్రైవసీ ఎంత? మీ వ్యక్తిగత సమాచారం ఎంత భద్రం?
- బరువు పెరిగితే.. క్యాన్సర్ ముప్పు
- చాక్లెట్ అంతం: ప్రపంచ ఉత్పత్తిలో సగం తినేస్తున్న యూరప్, అమెరికా ప్రజలు
- బిగ్ బాస్: పోటీదారులను హౌజ్‌లోకి ఎలా తీసుకెళ్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు!
- మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- ఈ డ్రెస్సులే లైంగిక వేధింపులకు కారణమా?
- చివరికి తిట్లు కూడా మహిళలకేనా!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








