PUBG: ఎలా ఆడతారు? ఇందులో గెలుపు ఓటములు ఏమిటి?

పబ్‌జీ గేమ్

ఫొటో సోర్స్, Pubg

పబ్‌జి... ఈ మధ్య కాలంలో పిల్లలు, యువత నోట ఈ ఆట పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇదొక పాపులర్ వీడియో గేమ్.

'ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్‌ గ్రౌండ్స్'కు సంక్షిప్త రూపమే పబ్‌జి.

దీన్ని దక్షిణ కొరియాకు చెందిన పబ్‌జి కార్పొరేషన్ తయారు చేసింది. 2017లో ఇది విడుదలైంది.

కంప్యూటర్ లేదా మొబైల్‌లో ఒంటరిగా లేదా జట్టుతో కలిసి ఈ ఆటను ఆడొచ్చు.

వీడియో క్యాప్షన్, PUBG… ఈ ఆటకు ఎందుకంత క్రేజ్?

పబ్‌జిలోకి లాగిన్ అయ్యాక ఫేస్‌బుక్ లేదా మరేదైనా సోషల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదా గెస్ట్ మోడ్‌లో కూడా గేమ్‌ ఆడవచ్చు.

ఒంటరిగా ఆడుతున్నపుడు ఇతరుల సహకారం లభించదు. మీరు ఒక్కరే ఆడుతున్నప్పుడు మిగతా 99 మందిని (తక్కువ నిడివి ఉన్న గేమ్ మోడ్‌లో అయితే 27 మందిని) చంపాల్సి ఉంటుంది.

జట్టుగా కలిసి ఆడుతున్నపుడు ఇద్దరు లేకుంటే నలుగురు కలిసి ఇతరులను చంపాల్సి ఉంటుంది. వీరితో వర్చువల్‌గా మాట్లాడుకోవచ్చు.

పబ్‌జీ గేమ్

ఫొటో సోర్స్, Pubg

యుద్ధభూమి

ఆటలో 8X8 కిలోమీటర్ల యుద్ధ భూమి ఉంటుంది. ఇందులో పలు భవనాలు, శిథిలాలు, వాహనాలు, ఆయుధాలు, సముద్రం తదితరాలు ఉంటాయి.

ఇందులో మొదట విమానం నుంచి ప్యారాషూట్‌ ద్వారా 'హీరో' యుద్ధభూమిలో అడుగుపెడతాడు.

ఇక్కడకు దిగిన తర్వాత తనను తాను రక్షించుకోడానికి హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వంటివి సాధించాలి. ఇతరులను హతమార్చేందుకు ఆయుధాలను సేకరించాల్సి ఉంటుంది.

పబ్‌జీ గేమ్

ఫొటో సోర్స్, Pubg

ఆయుధాలు

ఈ గేమ్‌ని ఖాళీ చేతులతో కూడా ఆడొచ్చు. కాకుంటే ఇతరులను దూరం నుంచి చంపాలంటే ఆయుధాల అవసరం ఉంటుంది.

కత్తులు, రకరకాల తుపాకులు, బుల్లెట్లు, బాంబులు, గ్రెనేడ్‌లు, స్మోక్ గ్రెనేడ్‌లు తదితరాలుంటాయి.

వీటితో పాటు గాయపడినపుడు కట్లు వేసేందుకు బ్యాండెయిడ్స్, ప్రథమ చికిత్స కిట్లు, ఎనర్జీ డ్రింకులు ఉంటాయి. ఇవన్నీ దొరకాలంటే యుద్ధభూమిలో ఉన్న భవనాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది.

అలాగే వాహనాలు కూడా ఉంటాయి. వాటిని డ్రైవ్ చేసుకొని వెళ్లొచ్చు.

పబ్‌జీ గేమ్

ఫొటో సోర్స్, Pubg

ఆడటం ఎలా..

ఇది చాలా సులభం. చేతిలో ఉన్న ఆయుధాలతో అవతలివారిని చంపుకుంటూ వెళ్లాలి. లేకుంటే అవతలివారి చేతుల్లో చావాల్సి ఉంటుంది. అలాగే గేమ్‌లో రెడ్ జోన్, నీలి మేఘాలు తరుముకుంటూ వస్తాయి.

రెడ్ జోన్‌లో ఉన్నప్పుడు వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. ఇక్కడ బాంబు దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి.

నీలి మేఘాలు తరుముకుంటూ వస్తాయి. వీటిలో చిక్కుకుంటే ఖేల్ ఖతం. అందుకే వీటి బారిన పడకుండా.. గేమ్‌లో సూచించిన సర్కిల్లో ఉంటూనే గేమ్ ఆడాలి.

గేమ్‌లో సర్కిల్ చిన్నదవుతూ.. అందరికీ వీలైనంతగా ఒకరికొకరిని దగ్గర చేస్తూ ఉంటుంది. దీంతో గేమ్ రసవత్తరంగా మారుతుంది.

సర్కిల్ బయటకు వస్తే నీలి మేఘాల్లో చిక్కుకుని చనిపోతారు.

పబ్‌జీ గేమ్

ఫొటో సోర్స్, Pubg

ఇది గేమ్‌కి సంబంధించి ప్రాథమిక సమాచారం మాత్రమే.. ఇందులో నైపుణ్యం పెరిగే కొద్దీ.. లెవెల్స్ మారుతూ ఉంటాయి. అలాగే కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి.

ఈ వర్చువల్ కాయిన్స్‌తో గన్స్, ఇతర ఆయుధాలను కొనుగోలు చేయొచ్చు. అయితే ఇది పిల్లల్లో హింసాత్మక ధోరణిని ప్రేరేపించేలాగా ఉందని విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఆడుతున్న వీడియోగేమ్స్ జాబితాలో ఇది ముందుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)