హరప్పా నాగరికతనాటి ‘దంపతుల’ సమాధి చెబుతున్న చరిత్ర

ఫొటో సోర్స్, VASANT SHINDE
ప్రపంచంలో తొట్ట తొలి పట్టణ నాగరికతల్లో భాగమైన ఒక నగర శివార్లలో సుమారు 4,500 సంవత్సరాల కిందట ఒక పురుషుడిని, ఒక మహిళను కలిపి సమాధి చేశారు.
హరప్పా (సింధు లోయ) నాగరికతలోని ఒక నగరంలో ఆ ఇద్దరి అస్తిపంజరాలను మూడేళ్ల కిందట భారత్, దక్షిణ కొరియా పురాశాస్త్రవేత్తలు, పరిశోధకులు గుర్తించారు. ఆ ప్రాంతం ఇప్పుడు హరియాణాలోని రాఖీగఢీ గ్రామంలో భాగం.
ఆ ఇద్దరి మరణాల వెనుక కారణాలను తెలుసుకోవటానికి పరిశోధకులు మూడేళ్లు అధ్యయనం చేశారు. వారు గుర్తించిన అంశాలను ఓ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించారు.
''ఆ మహిళ - పురుషుడు ఒకరికొకరు అభిముఖంగా చాలా దగ్గరగా ఉన్నారు. వారు దంపతులు కావచ్చునని మేం అనుకుంటున్నాం. వారిద్దరూ ఒకే సమయంలో చనిపోయినట్లు కనిపిస్తోంది. అయితే వారు ఎలా చనిపోయారన్నది ఇంకా అంతుచిక్కలేదు'' అని ఆ పరిశోధకుల బృందానికి సారథ్యం వహిస్తున్న శాస్త్రవేత్త వసంత్ షిండే చెప్పారు.
వారిని అర మీటరు లోతున్న ఇసుక గుంటలో సమాధి చేశారు. చనిపోయేటప్పటికి ఆ పురుషుడి వయసు సుమారు 38 సంవత్సరాలు, మహిళ వయసు దాదాపు 35 సంవత్సరాలు ఉంటాయని అంచనా వేశారు. ఇద్దరూ గణనీయమైన పొడవు ఉన్నారు. పురుషుడు 5.8 అడుగులు, మహిళ 5.6 అడుగుల ఎత్తు ఉన్నారు.
వారిద్దరూ చనిపోయేటప్పటికి ఆరోగ్యంగానే ఉండివుండారని పరిశోధకులు భావిస్తున్నారు. వారి ఎముకలపై చేసిన పరీక్షల్లో ఎటువంటి గాయాలకు కానీ, బ్రెయిన్ ఫీవర్ వంటి అనారోగ్యాలకు కానీ గురైన దాఖలాలు కనిపించలేదు.

ఫొటో సోర్స్, MANOJ DHAKA
విశిష్టమైన ఈ 'జంట సమాధి' ఆ కాలపు నాటి ప్రత్యేక అంత్యక్రియల ఆచారాల్లో భాగంగా చేసినది కాదని పురాశాస్త్రవేత్తలు అంటున్నారు. ''ఆ స్త్రీ, పురుషులిద్దరూ దాదాపు ఒకే సమయంలో చనిపోయారు.. అందువల్లే వారిని జంటగా ఒకే సమాధిలో పూడ్చిపెట్టారు'' అని చెప్తున్నారు.
పురాతన ఉమ్మడి సమాధులు చాలా ఆసక్తిని రేకిత్తిస్తుంటాయి.
ఇటలీలోని ఒక గ్రామంలోని ఒక నవీనశిలాయుగపు సమాధిలో.. ఒక పురుషుడు, ఒక స్త్రీ ఆలింగనం చేసుకుని ఉన్న అస్తిపంజరాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. రష్యాలో గుర్తించిన మరొక ప్రాచీన సమాధిలో ఇద్దరు స్త్రీ-పురుషులు ఒకరికొకరు అభిముఖంగా ఉండి చేతులు పట్టుకుని ఉన్నారు.
అలాగే గ్రీస్‌లో గుర్తించిన దాదాపు 6,000 సంవత్సరాల నాటి మరో సమాధిలో స్త్రీ, పురుషుల జంట ఒకటి ఒకరిపై మరొకరు కాళ్లు, చేతులు వేసుకుని ఆలింగనం చేసుకుని ఉన్నారు.
హరప్పా నాగరికత సమాధుల్లో సాధారణంగా కనిపించే మట్టి కుండలు, రాతి పూసల నగలు కొన్ని కూడా రాఖీగఢీ సమాధిలో లభించాయి.
''హరప్పా సమాధుల్లో చాలా స్పష్టంగా కనిపించే అంశం.. అవి చాలా నిరాడంబరంగా ఉంటాయి. పశ్చిమాసియా రాజుల తరహాలో భారీ సమాధులు ఉండవు'' అని టోనీ జోసెఫ్ పేర్కొన్నారు. 'ఎర్లీ ఇండియన్స్: ద స్టోరీ ఆఫ్ అవర్ ఏన్‌సెస్టర్స్ (ఆదిమ భారతీయులు: మన పూర్వీకులు - వారు ఎక్కడి నుంచి వచ్చారనే కథ) రచయిత ఆయన.
ఉదాహరణకు మెసపటోమియాలో రాజులను విలువైన నగలు, కళాఖండాల రాశులతో సహా సమాధి చేసేవారు. ఆసక్తికరమైన విషయం ఏమింటే.. మెసపటోమియా సమాధుల్లో కనిపించిన గోమేధం (కార్నీలియన్), ఇంద్రనీలం (లాపిస్ లాజుల), వైడూర్యం (టర్కోయీజ్)లతో చేసిన నగలు.. హరప్పా నుంచి ఎగుమతి చేసినవి కావచ్చునని పరిశోధకుల అంచనా.
హరప్పా నగరాల్లోని సమాధుల్లో సాధారణంగా ఆహారంతో నిండిన కుండలు, కొన్ని నగలు కనిపిస్తాయి. మరణానంతర జీవితం ఉంటుందని ఆ నాటి ప్రజలు విశ్వసించి ఉండొచ్చునని.. అందుకే సమాధుల్లో వీటిని ఉంచారని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, MANOJ DHAKA
రాఖీగఢీలో వెలుగుచూసిన ఈ జంట.. వేలాది మంది జనం నివసించిన 1,200 ఎకరాల విస్తీర్ణంలోని నగరంలో నివసించినట్లు పురాశాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ భారత్, పాకిస్తాన్‌లలో గుర్తించిన సుమారు 2,000 హరప్పా నాగరికత ప్రాంతాల్లోకెల్లా రాఖీగఢీ పట్టణమే అతి పెద్దది. బాగా ప్రాచుర్యంలో ఉన్న పాకిస్తాన్‌లోని మొహెంజొదారో కన్నా ఇది విశాలమైనది. (ఈ ప్రాచీన నాగరికతను మొదటిసారి 1920లో ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న మొహెంజొదారోలో గుర్తించారు.)
నిజానికి.. ఒక హరప్పా సమాధిలో స్త్రీ-పురుషులను జంటగా పూడ్చిపెట్టిన సమాధిని పురాశాస్త్రవేత్తలు గుర్తించటం ఇదే మొదటిసారి కాదు.
ప్రస్తుతం గుజరాత్ అంటున్న లోథాల్‌లో.. సమాధిలో ఒకరిపై ఒకరిని పడుకోబెట్టినట్లు ఉన్న స్త్రీ - పురుషుల జంటను 1950 ల్లో గుర్తించారు. ఆ మహిళ పుర్రె మీద గాయాల గుర్తులున్నాయి. దీనిపై కొందరు పురాశాస్త్రవేత్తలు వివాదాస్పద అంచనాలు వేశారు. ఆమె తన భర్త చనిపోవటంతో తానూ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. అది నిజమా కాదా అన్నది తేలే అవకాశం లేదు.
రాఖీగఢీలోని ఈ ప్రాచీన స్మశానంలో పురాశాస్త్రవేత్తలు 70 సమాధులను గుర్తించారు. ఇది ప్రాచీన పట్టణానికి కేవలం ఒక కిలోమీటరు దూరంలోనే ఉంది. వాటిలో ఇప్పటివరకూ 40 సమాధులను తవ్వారు. వాటన్నిటిలోకీ ఈ స్త్రీ, పురుషుల జంట సమాధి చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?
- గోత్రం అంటే ఏమిటి.. అది ఎలా పుట్టింది
- అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- సిపాయిల తిరుగుబాటు: పబ్‌లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
- హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు?
- మొదటి ప్రపంచ యుద్ధం: భారత సైన్యం అక్కడికి చేరుకోకపోతే.. చరిత్ర మరోలా ఉండేది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








