‘దేశం నుంచి పారిపోవడానికి ఆరేళ్లు ప్లాన్ చేశాను..’

ఫొటో సోర్స్, SALWA
సౌదీ అరేబియాలో మహిళలు ఎదుర్కొంటున్న ఆంక్షలు మళ్లీ ప్రపంచం ముందు చర్చకు వచ్చాయి. రాహాఫ్ మొహమ్మద్ అల్-కునున్ అనే 18 ఏళ్ల యువతి సౌదీ నుంచి, తన కుటుంబం నుంచి పారిపోయిన నాటకీయ ఉదంతం ఇప్పుడు దీనికి కారణం.
ఆమె థాయ్‌లాండ్‌లో హోటల్ గదిలో తలుపులు వేసుకుని తన ఇంటికి తిరిగి వెళ్లటానికి నిరాకరించటం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ట్విటర్ వేదికగా తీవ్ర ఉద్యమాన్ని రగిల్చిన ఆమెకు కెనడా ఆశ్రయం కల్పించింది.
ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా నుంచి పారిపోయి కెనడా చేరిన మరొక మహిళ తన కథను బీబీసీకి చెప్పింది.
సాల్వా వయసు 24 సంవత్సరాలు. ఆమె ఎనిమిది నెలల కిందట తన 19 సంవత్సరాల చెల్లెలితో కలిసి పారిపోయింది. ఇప్పుడు మాంట్రియాల్‌లో నివసిస్తోంది. ఈ కథ ఆమె కథ. ఆమె సొంత మాటల్లోనే...
ఆరేళ్ల ముందు నుంచీ ప్రణాళిక...
మేం దేశం విడిచి వెళ్లాలని సుమారు ఆరేళ్లుగా ప్రణాళిక రచిస్తున్నాం. కానీ బయటకు వెళ్లటానికి మాకు పాస్‌పోర్ట్, జాతీయ ఐడీ కార్డు కావాలి.
నేను ఆ పత్రాలు పొందటానికి నా 'గార్డియన్ (సంరక్షకుడు)' అంగీకారం అవసరం. (సౌదీ అరేబియాలో మహిళలు చాలా అంశాల్లో వారి పురుష బంధువుల అనుమతి పొంది తీరాలి.)
అదృష్టవశాత్తూ అప్పటికే నాకు నేషనల్ ఐడీ కార్డు ఉంది. నేను యూనివర్సిటీలో చదువుతున్నపుడు నాకు ఆ ఐడీ ఇవ్వటానికి నా కుటుంబం అంగీకరించినందువల్ల అది లభించింది.
రెండేళ్ల కిందట ఒక ఇంగ్లిష్ లాంగ్వేష్ పరీక్ష రాయాల్సి వచ్చినపుడు నాకు పాస్‌పోర్ట్ కూడా వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
కానీ.. నా కుటుంబం దానిని నా దగ్గర నుంచి తీసేసుకుంది. దానిని మళ్లీ నా చేతుల్లోకి తీసుకోవాలి.
నేను నా తల్లి ఇంటి తాళాలు దొంగతనం చేశాను. ఓ షాపుకు వెళ్లి.. ఆ తాళాలకు నకిలీ తాళాలు చేయించటానికి ప్రయత్నించాను. కుటుంబం అనుమతి లేకుండా నేను ఇల్లు వదిలి బయటకు వెళ్లలేను. కాబట్టి వాళ్లు నిద్రపోతున్నపుడు నేను ఎవరి కంటా పడకుండా వెళ్లాను.
అది చాలా ప్రమాదకరమైన పని. నేను దొరికినట్లయితే వారు నన్ను చాలా హింసించేవారు.
నా దగ్గరకు తాళాలు వచ్చాయి. నా పాస్‌పోర్ట్, నా చెల్లెలి పాస్‌పోర్ట్ తీసుకున్నా. నా తండ్రి నిద్రపోతున్నపుడు ఆయన ఫోన్ కూడా తీసుకున్నాను.
ఆ ఫోన్ ఉపయోగించి అంతర్గత మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఆయన అకౌంట్‌తో లాగిన్ అయ్యాను. అందులో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్‌ని మార్చి నా ఫోన్ నంబర్ చేర్చాను.
అదే అకౌంట్‌ను ఉపయోగించుకుని.. మేమిద్దరం దేశం వదిలి వెళ్లటానికి ఆయన అనుమతిని నేనే ఇచ్చాను.

ఫొటో సోర్స్, Getty Images
రాత్రివేళ అందరూ నిద్రిస్తున్నపుడు...
రాత్రివేళ అందరూ నిద్ర పోతున్నపుడు మేం బయటపడ్డాం. చాలా చాలా భయాందోళనలతో బయటికి వచ్చాం.
మేం కారు నడపకూడదు. కాబట్టి ఒక ట్యాక్సీని పిలిచాం. అదృష్టవశాత్తూ.. సౌదీ అరేబియాలో దాదాపు ట్యాక్సీ డ్రైవర్లందరూ విదేశాలకు చెందిన వారే. కాబట్టి మేం ఒంటరిగా ప్రయాణం చేయటం వారికి వింతగా కనిపించలేదు.
రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరాం. మేం ఏం చేస్తున్నామో ఎవరైనా గమనించినట్లయితే మమ్మల్ని చంపేసి ఉండేవారు.
నా చదువు చివరి సంవత్సరంలో నేను ఆస్పత్రిలో పనిచేస్తూ.. జర్మనీకి విమానం టికెట్లు, ట్రాన్సిట్ వీసా కొనటానికి సరిపోయేంత డబ్బులు దాచాను. నిరుద్యోగ భృతి ద్వారా వచ్చిన డబ్బులు కూడా దాచుకున్నాను.

ఫొటో సోర్స్, Getty Images
నా చెల్లెలితో కలిసి జర్మనీ విమానం ఎక్కగలిగాను. నేను విమానం ఎక్కటం అదే మొదటిసారి. చాలా అద్భుతంగా అనిపించింది. నాకు సంతోషంగా ఉంది.. భయంగానూ ఉంది.
మేం ఇంట్లో లేమని గుర్తించిన తర్వాత నా తండ్రి పోలీసులకు ఫోన్ చేశాడు. కానీ అప్పటికే మేం బయటపడ్డాం.
అంతర్గత మంత్రిత్వశాఖలో ఆయన మొబైల్ నంబర్‌ను మార్చి, నా నంబర్ పెట్టాను కాబట్టి.. అధికారులు ఆయనకు ఫోన్ చేయటానికి ప్రయత్నించినపుడు ఆ ఫోన్లు నాకు వచ్చాయి.
మేం విమానం దిగినప్పుడు నా ఫోన్‌కి పోలీసుల నుంచి ఓ మెసేజ్ వచ్చింది. నిజానికి అది నా తండ్రికి పంపించిన మెసేజ్.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
తొలుత జర్మనీకి.. అక్కడి నుంచి కెనడాకి...
సౌదీ అరేబియాలో జీవితం లేదు. రోజూ యూనివర్సిటీకి వెళ్లటం.. ఇంటికి తిరిగి రావటం.. అంతే. రోజంతా ఇంకేమీ చేయటానికి లేదు.
వాళ్లు నన్ను హింసించారు. కొట్టారు.. తిట్టారు.. మగవాళ్లు అధికులని చెప్పేవాళ్లు. నా చేత బలవంతంగా ప్రార్థనలు చేయించేవాళ్లు. రంజాన్‌లో బలవంతంగా ఉపవాసం ఉంచేవాళ్లు.
నేను జర్మనీలో దిగిన తర్వాత.. ఆశ్రయం కోసం ఒక లాయర్ కావాలని లీగల్ ఎయిడ్ విభాగానికి వెళ్లాను. కొన్ని ఫామ్స్ నింపి నా కథ చెప్పాను.
నేను కెనడాను ఎంచుకున్నాను. ఎందుకంటే.. మానవ హక్కుల విషయంలో ఈ దేశానికి మంచి పేరు ఉంది. శిరియా శరణార్థులకు ఇక్కడ పునరావాసం కల్పిస్తున్న వార్తలను నేను గమనించేదాన్ని. నాకు ఇదే ఉత్తమ దేశమని నిర్ణయించుకున్నాను.
ఆశ్రయం కోసం నా అభ్యర్థనను ఆమోదించారు. టొరంటోలో దిగినప్పుడు విమానాశ్రయంలో కెనడా జెండాను చూసినపుడు.. విజయం సాధించానన్న ఓ అద్భుత భావన కలిగింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు నా చెల్లెలితో కలిసి మాంట్రియాల్‌లో నివసిస్తున్నాను. నా మీద ఎలాంటి ఒత్తిడీ లేదు. ఇక్కడ ఎవరూ నాచేత ఏదీ బలవంతంగా చేయించరు.
సౌదీ అరేబియాలో వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండి ఉండొచ్చు. కానీ ఇక్కడే చాలా బాగుంది. ఎందుకంటే నా ఇంట్లోంచి బయటకు వెళ్లాలని నేను అనుకున్నపుడు నేను వెళ్లిపోవచ్చు. ఎవరి ఆమోదమూ నాకు అవసరం లేదు. అలా నడుచుకుంటూ బయటకు వెళ్లొచ్చు.
అది నాకు చాలా చాలా సంతోషం కలిగిస్తుంది. నేను స్వేచ్ఛగా ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు నచ్చిన దుస్తులను నేను వేసుకోవచ్చు.
ఇక్కడ శరత్కాలంలో రంగులు, మంచు అంటే నాకు చాలా ఇష్టం. ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను. కానీ అది చాలా కష్టం. సైకిల్ తొక్కటం, ఈత, ఐస్ స్కేట్ కూడా నేర్చుకుంటున్నా.
నా జీవితంలో నేను ఏదో చేయగలుగుతున్నా అన్న భావన నాకు కలుగుతోంది.
నా కుటుంబంతో నాకు ఎలాంటి సమాచార సంబంధాలూ లేవు. నాకూ, వాళ్లకీ అదే మంచిదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇదే నా ఇల్లు అనిపిస్తుంది. ఇక్కడే బాగుంది.
బీబీసీ ప్రతినిధి గారెత్ ఎవాన్స్, వరల్డ్ సర్వీస్ రేడియోలో ఔట్‌సైడ్ సోర్స్‌లతో సాల్వా చెప్పిన కథనం.
- ‘నేను ఇస్లాం మతాన్ని వదిలేశా.. నా కుటుంబమే నన్ను చంపాలనుకుంటోంది’
- సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేత
- సౌదీ అరేబియాలో తలాక్: 'రహస్య విడాకుల్లో' మహిళలకు మెసేజ్ తప్పనిసరి
- సౌదీ అరేబియా: మహిళతో కలిసి టిఫిన్ తిన్నందుకు వ్యక్తి అరెస్ట్
- ట్రంప్ రష్యా కోసం పనిచేస్తున్నారా? ‘విచారణ మొదలుపెట్టిన అమెరికా’
- తులసీ గబార్డ్: అమెరికా అధ్యక్ష పీఠంపై ఈ హిందూ మహిళ కూర్చోగలరా?
- నమ్మకాలు-నిజాలు: బహిష్టు సమయంలో కడుపు నొప్పి వస్తే పిల్లలు పుట్టరా?
- బ్రిటన్: సెక్స్ కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న యువత
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- ఎయిడ్స్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఇదేనా?
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్‌లో ఎందుకు కొనసాగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








