ఇంట్లో వాయు కాలుష్యం: గాలి నాణ్యతను పెంచుకునే ఐదు మార్గాలు

అరికా పామ్, డెవిల్స్ ఐవీ, డ్రాగన్ ట్రీ, స్నేక్ ప్లాంట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుడి నుంచి ఎడమకు: అరికా పామ్, డెవిల్స్ ఐవీ, డ్రాగన్ ట్రీ, స్నేక్ ప్లాంట్.. వీటన్నిటికీ విషాన్ని పీల్చుకునే గుణాలున్నాయని చెప్తారు

ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం ఏటా 70 లక్షల మంది మరణాలకు కారణమవుతోంది. కానీ ఈ ముప్పును తప్పించుకునే దారి కనిపించదు.

కేవలం గాల్చి పీల్చుకోవటం వల్ల ప్రతి పది మందిలో తొమ్మిది మంది వ్యాధుల ముప్పును ఎదుర్కొంటున్నారు. స్ట్రోక్ (మెదడు పోటు), ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు వంటివి అందులో ముఖ్యమైనవి.

ఈ అతిసూక్ష్మ కాలు ష్య కారకాలు అంతటా ఉన్నాయి. అవి మనకి కీడు చేస్తున్నాయి. ప్రత్యేకించి మన ఇళ్లలోనే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది.

యూఎస్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పరిశోధన ప్రకారం.. కాలుష్య ప్రభావం తరచుగా బయటి కన్నా ఇళ్ల లోపల రెండు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉంటుంది.

‘‘ఇంటి లోపలి గాలిలో.. బయట ఉన్న కాలుష్యమంతా ఉంటుంది. దానికి ఇంట్లో వంట చేయటం, శుభ్రం చేసే ఉత్పత్తుల నుంచి వెలువడే వాయువులు, నిర్మాణ వస్తువుల నుంచి వచ్చే కాలుష్యాలు కూడా తోడవుతాయి’’ అని ఎయిర్‌ల్యాబ్స్ సంస్థలో చీఫ్ సైన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మాథ్యూ ఎస్ జాన్సన్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తుంగా ఎయిర్ ఫిల్టరింగ్ టెక్నాలజీని ఈ సంస్థ ఏర్పాటుచేస్తుంటుంది.

అదృష్టవశాత్తూ మీ ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరచుకోవటానికి కొన్ని మార్గాలున్నాయి. అందులో ఐదు చిట్కాలివీ...

కిటికీ తలుపు తెరచి తాజా గాలిని ఆశ్వాదిస్తున్న ఓ యువతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోజులో కనీసం రెండు మూడు సార్లు ఇంటి తలుపులు, కిటికీలు తెరవాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు

1. వెంటిలేషన్ పెంచండి

ఇంట్లోకి గాలి రాకపోకలు (వెంటిలేషన్) సరిగా లేకపోవటం వల్ల కాలుష్యాలు ఇంట్లోని గాలిలోనే ఉండిపోతాయి.

వెంటిలేషన్ వల్ల తాజా గాలి లోపలికి రావటానికి వీలవుతుందని ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (తెరి) సంస్థకు చెందిన ఆర్.సురేశ్ చెప్తున్నారు.

‘‘రోజులో కనీసం రెండు మూడు సార్లు ఇంటి తలుపులు, కిటికీలు తెరవాలి. మీకు అలర్జీలు, బయట విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటివి ఉన్నట్లయితే.. ఫిల్టర్డ్ ఎయిర్-కండిషనింగ్ సిస్టమ్ ద్వారా ఇంట్లో వెంటిలేషన్ సక్రమంగా ఉండేటట్లు చూసుకోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.

వంట చేసేటపుడు, స్నానం చేసేటపుడు.. కాలుష్యకాలను తొలగించటానికి, గాలిలో తేమను (హ్యుమిడిటీని) తగ్గించటానికి ఎక్ట్రాక్టర్‌ను ఆన్ చేయటం మంచిది.

2. మీ ఇంటిని ఇండోర్ ప్లాంట్లతో నింపండి

ఖరీదైన ఎయిర్ ఫిల్టర్లు కొనటం భారమా? దానికి బదులుగా.. హౌస్ ప్లాంట్స్.. అంటి ఇంటి మొక్కలతో మీ ఇంట్లో ఖాళీ ప్రదేశాలను నింపండి.

ఇలాంటి కొన్ని మొక్కలు గాలిలోని విషపదార్థాలను తొలగించగలవు. ఇవి ‘‘ఇంట్లో కాలుష్యానికి నమ్మకమైన, చౌకైన పరిష్కారం’’ అని ఆర్. సురేశ్ చెప్పారు.

అయితే.. దీనిని బలపరచేందుకు సరైన అధ్యయనాలు లేవని కొందరు సందేహవాదులు అంటారు. అయినా.. పచ్చగా కళకళలాడే ఈ మొక్కలు మీ ఆత్మను కూడా ప్రకాశించేయగలవు.

సోఫాలో కూర్చున్న ముగ్గురు సభ్యుల కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధూమపానం ఆరోగ్యానికి హానికరం

ఇంట్లో పెంచుకునే కొన్ని మొక్కలు ఇవీ:

అరికా పామ్ (Areca Palm): ఇంట్లో పెంచుకోగల తేలికైన మొక్కల్లో ఇదొకటి. నాసా నిర్వహించిన ‘క్లీన్ ఎయిర్’ అధ్యయనంలో గాలిని ప్రక్షాళన చేయగల గుణాలు అత్యధికంగా ఉన్నాయని దీనికి రేటింగ్ ఇచ్చారు.

  • ముఖ్యమైన ప్రయోజనం: కార్బన్ డైఆక్సైడ్‌ను పీల్చుకుంటుంది

డెవిల్స్ ఐవీ (Devil's Ivy/Money plant): ఈ తీగను ఇంట్లో పెంచుకోవటం, నిర్వహించటం చాలా తేలిక.

  • ముఖ్యమైన ప్రయోజనం: సింథటిక్ పెయింట్లు, కార్పెట్ల నుంచి విడుదలయ్యే వొలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్లు (వీఓసీలు)ను తొలగించటానికి తోడ్పడుతుంది.

డ్రాగన్ ట్రీ (Dragon Tree): తూర్పు ఆఫ్రికాలో పుట్టిన ఈ మొక్కను ఇంట్లో, ఆఫీసుల్లో అలంకరణగా ఉపయోగిస్తుంటారు.

  • ముఖ్యమైన ప్రయోజనం: బెంజీన్, ఫార్మాల్డీహైడ్, టొల్యూన్, క్జైలీన్ వంటి విషతుల్యాలను తగ్గించటానికి బాగా పనిచేస్తుంది.

స్నేక్ ప్లాంట్ (Snake plant): పూలు పూచే ఈ మొక్కకు ఎక్కువగా నీటి అవసరం ఉండదు. శీతాకాలంలో నీటి అవసరం చాలా తక్కువ.

  • కీలక ప్రయోజనం: ప్రత్యేకించి రాత్రి సమయంలో కార్బన్ డైఆక్సైడ్‌ను పీల్చుకుంటుంది. ఫార్మాల్డీహైడ్‌, నైట్రోజన్ డైఆక్సైడ్‌‌లను తొలగించటానికి సాయపడుతుంది.

ఏ మొక్కను ఎంచుకున్నా కానీ.. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలని ఆర్.సురేశ్ సూచిస్తున్నారు.

‘‘ఇంట్లో మొక్కలు సహజమైన వాయు శుద్ధి పరికరాలుగా పనిచేయాలంటే.. వాటిని ఆరోగ్యంగా ఉంచటం అవసరం’’ అన్నది ఆ సూచన.

లేదంటే.. అవి గాలిలోకి బయొలాజికల్ కాలుష్యాలను విడుదల చేస్తాయని హెచ్చరిస్తున్నారు.

ఇంటి మొక్కల పరిరక్షణలో కొన్ని చిట్కాలు ఇవి.

కెమికల్ స్ప్రే ఉపయోగించి కిటికీ అద్దాన్ని శుభ్రం చేస్తున్న బాలుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోజువారీ వాడే ఉత్పత్తుల్లో రసాయనాలు ఇంట్లో గాలి కాలుష్యాన్ని తీవ్రం చేస్తున్నాయి

3. వాసనలను హరిత మార్గంలో తుడిచిపెట్టండి

ఇంతకుముందు చెప్పిన హానికరమైన వీఓసీల గురించి మీకు తెలుసు. కృత్రిమ సువాసనలను ఉపయోగించిన ప్రతిసారీ ఈ రసాయనాలు విడుదలవుతాయి.

అయితే.. ఇవి గాలిలో ఇతర కాలుష్యకాలతో కలిసి ప్రమాదకరమైన మిశ్రమంగా తయారవుతన్నట్లు కనిపిస్తోంది.

ఉదాహరణకు.. ఇంటిని శుభ్రం చేయటానికి ఉపయోగించే రసాయన మిశ్రమాలు గాలిలో కలిసినపుడు.. ఫార్మాల్డీహైడ్‌ను విడుదల చేయగలవు. ఈ కాలుష్యకానికి క్యాన్సర్‌కు లింకు ఉందని పరిశోధనలు చెప్తున్నాయి.

మరేం చేయాలి?

సువాసన రహితమైన ఉత్పత్తులను ఉపయోగించాలి. డియోడరెంట్లు, కార్పెట్ క్లీనర్లు, ఎయిర్ ఫ్రెషెనర్లు వంటి ఏరోసోల్ స్ప్రేలు పరిహరించాలి.

వంటగది విషయానికి వస్తే.. సువాసనతో శుభ్రం చేయటానికి నిమ్మకాయ బద్దలు, బేకింగ్ సోడా ఉత్తమమని ఆర్. సురేశ్ సిఫారసు చేస్తున్నారు.

నోట్లో సిగార్, చేతిలో వైన్ గ్లాసుతో సోఫాలో కూర్చున్న ఇంగ్లిష్ బుల్‌డాగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధూమపానం ఆరోగ్యానికి హానికరం

4. ఇంట్లో ధూమపానం నిషేధించండి

ధూమపానమనేదే ఆరోగ్యానికి హానికరం. అటువంటిది ఇంట్లో ధూమపానానికి పూర్తిగా నిషేధించాలి.

ఇంట్లో పోగుపడే పొగ.. అంతర్గతంగా గాలి నాణ్యత మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వెంటిలేషన్ సరిగా లేకుంటే ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల ఇతరులకు కూడా తీవ్ర అనారోగ్యాలు వాటిల్లే ప్రమాదముంది.

ఇంట్లో పొగాకు పొగ పీల్చుకునే శిశువుల్లో.. ఆకస్మిక శిశు మరణాల ప్రమాదం ఎక్కువ.

ఇంటి బయట ఆరవేసిన దుస్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉతికిన దుస్తులను తెరచిన కిటికీ వద్ద ఆరేయటం వంటి చిన్న పనుల ద్వారా చాలా మార్పు ఉంటుంది

5. అలర్జీ కారకాలను వదిలించుకోండి

పుప్పొడి రేణువులు, ధూళి పేలు.. అనారోగ్య ముప్పును పెంచుతాయి. ముఖ్యంగా ఆస్తమా, అలర్జీ వంటివి ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువ.

గాలిలో అధిక తేమ వల్ల.. గాలిలో బూజు బీజాలు పెరుగుతాయి. వాటివల్ల.. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారిలో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.

దీనిని నివారించటానికి ఈ కింది సులభమైన పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు:

  • పడకను తరచుగా శుభ్రం చేసుకోవాలి
  • గాలిలో తేమను తగ్గించే పరికరాలను ఉపయోగించాలి
  • కార్పెట్‌ను శుభ్రం చేసుకోవాలి - అందుకోసం కాలుష్యం తక్కువగా విడుదల చేసే వ్యాక్యూమ్‌లు వాడాలి
  • ఉతికిన దుస్తులను తెరచిన కిటికీ సమీపంలో ఆరవేయాలి
  • బయటి కాలుష్యకాలు ఇంట్లోకి రాకుండా నివారించటానికి డోర్‌మ్యాట్ ఉపయోగించాలి

ఇవి కూడా చదవండి...

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)