హరిత విప్లవం.. దిల్లీ కాలుష్యానికి ఇదే కారణమా?

కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చలికాలం వస్తుందంటే దిల్లీ వాసుల్లో వణుకు మొదలవుతుంది. ఆ వణుకుకు కారణం చలి పులి కాదు, దిల్లీని కమ్మేసే పొగ మంచు (స్మాగ్).

మామూలు రోజుల్లోనే అంతంత మాత్రంగా ఉండే దిల్లీ గాలి నాణ్యత చలికాలంలో మరింత దిగజారుతుంది. ఇప్పటికే చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట దుబ్బను తగలబెట్టడం మొదలుపెట్టారు. ఆ ప్రభావం నేరుగా దిల్లీపైనే పడుతుంది.

‘రెండ్రోజుల క్రితం నేను హరియాణా మీదుగా దిల్లీ వస్తున్నప్పుడు దారిలో దట్టమైన పొగ కనిపించింది. కారు ఆపి వెళ్లే చూస్తే, అక్కడ మొత్తం భూమినే ఎవరో తగలబెడుతున్నట్లు అనిపించింది. నిజానికి, పంటను కోసేశాక ఎవరో తమ పొలంలో మిగిలిన పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. బలమైన గాలులు కూడా లేకపోవడంతో ఆ పొగంతా వాతావరణంలో ఉండిపోతుంది’ అని నాగేంద్ర శర్మ చెప్పారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శర్మ మీడియా సలహాదారుగా సేవలందిస్తున్నారు.

‘తదుపరి పంట వేసేందుకు మూడు వారాల్లోగా పంట వ్యర్థాలను తగలబెట్టాలని రైతులు చెప్పారు. ఖరీదైన యంత్రాలను ఉపయోగించే శక్తి లేక వాళ్లు పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. ఇది ప్రతి సంవత్సరం ఉండే సమస్యే’ అని శర్మ అన్నారు.

ఈ ఏడాది కూడా ఇప్పటికే ఆ సమస్య మొదలైంది. గత ఆదివారం నగరంలో మారథాన్ జరిగింది. దానికోసం గాలిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక యంత్రాలను వినియోగించినట్లు నిర్వాహకులు చెప్పారు.

కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

చలికాలంలో చాలాసార్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ విధించిన పరిమితుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా దిల్లీలో కాలుష్యం నమోదవుతుంది. గత ఏడాది వైద్యులు ఏకంగా నగరంలో ‘మెడికల్ ఎమర్జెన్సీ’ ప్రకటించారు. జలుబు, జ్వరాలతో చాలామంది ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారు.

గాలిలో ఒక క్యుబిక్ మీటర్ పరిధిలో పీఎం 2.5 అనే కణరూప ద్రవ్య పదార్థాలు 25మైక్రోగ్రాములకు మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. కానీ, గతేడాది దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వాటి పరిమితి ఏకంగా క్యుబిక్ మీటరుకు 700 మైక్రోగ్రాముల వరకు చేరింది.

గతేడాది గాలి నాణ్యత సూచీల్లో దిల్లీ నిలకడగా చెత్త రికార్డును నమోదు చేసింది. ఆ గాలిని పీలిస్తే రోజుకు రెండు ప్యాకెట్ల సిగరెట్లు తాగినట్లేనని వైద్యులు చెప్పారు. నగరం గ్యాస్ చాంబర్‌లా మారిపోయిందని అన్నారు.

అలాంటి దశే ఇప్పుడు రాజధానిలో ప్రారంభమవుతోంది.

‘ప్రమాదకరమైన పొగమంచు ఇప్పుడిప్పుడే ముసురుకుంటోంది. పంట వ్యర్థాలను తగలబెట్టే ప్రక్రియ ఇంకొన్ని రోజులపాటే సాగినా, ఈ పొగమంచు మాత్రం మరో 3-4 నెలలు ఉంటుంది. ఈ సమయంలోనే గాలి నాణ్యత అత్యల్ప స్థాయికి చేరుతుంది. కొన్ని ప్రాంతాల్లో గాలిలో గ్యాస్ మండుతున్న వాసన కూడా వస్తుంది’ అంటారు త్వరలో విడుదల కానున్న ‘ది గ్రేట్ స్మాగ్ ఆఫ్ ఇండియా’ పుస్తక రచయిత సిద్ధార్థ్ సింగ్.

కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

పొగ వల్లే ఎక్కువ నష్టం

దిల్లీ కాలుష్యానికి అనేక ఇతర కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా పంటల నుంచి వెలువడే పొగే ఎక్కువ నష్టం కలిగిస్తోంది.

ఉత్తర భారతంలో ఏటా చలికాలంలో దాదాపు 20లక్షల మంది రైతులు 23 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలను 80 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో తగలబెడతారు. దాన్నుంచి వెలువడే పొగలో నైట్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి అనేక రకాల హానికారక పదార్థాలు కలిసుంటాయి.

2012-2016 మధ్య దిల్లీలో దాదాపు సగం కాలుష్యానికి ఆ పొగే కారణమని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అంచనా వేశారు.

ఈ కాలుష్యానికి, హరిత విప్లవానికి దగ్గర సంబంధం ఉందని సిద్ధార్థ్ సింగ్ చెబుతారు. హరిత విప్లవం ఫలితంగానే పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో వరి, గోధుమల సాగు విపరీతంగా పెరిగింది. గోధుములను చలికాలంలో సాగు చేస్తారు. వరి పంటను జూలై-ఆగస్టు మధ్యలో వేస్తారు.

హరిత విప్లవం కారణంగా దేశానికి ఆహార భద్రత లభించింది. వరి, గోధుమల దిగుబడి బాగా పెరిగింది. మరోపక్క అది కాలుష్యానికీ, భూగర్భ జలాల తరుగుదలకూ కారణమైంది.

కాలుష్యం

‘హరిత విప్లవం కచ్చితంగా అవసరం. కానీ దాని తదనంతర పరిణామాలపైన దృష్టి పెట్టడమూ కీలకం. ఆ పరిణామాలే ‘వ్యవసాయ-పర్యావరణ’ సంక్షోభానికి కారణమవుతున్నాయి’ అంటారు సిద్ధార్థ్.

పంట వ్యర్థాలను తొలగించకపోతే అది రైతులకు హానికరంగా మారుతుంది. పశువులకు అది దానాలాగ కూడా పనికిరాదు. దాన్ని తొలగించకపోతే పంట వేసే యంత్రాల్లో అది చిక్కుకుపోతుంది. అందుకే రైతులు దాన్ని తగలబెడుతున్నారు. దాంతో, మరో పంట వేయడానికి మార్గం సుగమమవుతోంది.

కొన్ని కొత్త రకం పరికరాల ద్వారా ప్రభుత్వం ఈ సమస్యను తగ్గించే ప్రయత్నం చేసింది. ట్రాక్టర్లకు అమర్చే ‘నాట్ల యంత్రాల’ ద్వారా వరినాట్లు వేయొచ్చని, ఆ యంత్రాల్లో పాత పంట వ్యర్థాలు కూడా చిక్కుకోవని ప్రభుత్వం అంటోంది. కానీ, వాటి ఖరీదెక్కువ. ఒక్కో యంత్రం ధర రూ.1.3 లక్షల దాకా ఉంటుంది.

పంజాబ్, హరియాణాల్లో ఇలాంటి 21వేల యంత్రాలు కావాలి. కానీ, గతేడాది 2,150 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ‘సూపర్ స్ట్రా మేనేజ్‌మెంట్ సిస్టమ్’ అనే యంత్రం కూడా ఈ సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుంది. కానీ, దాని ఖరీదూ ఎక్కువే.

ఐదేళ్లలో ఈ సమస్య పరిష్కారం కావాలంటే, ఏటా దేశంలో 12వేల ‘హ్యాపీ సీడర్’ యంత్రాలను కొనాలని సిద్ధార్థ్ సింగ్ సూచిస్తారు. భారత్‌లో టెక్నాలజీ ఆధారిత రెండో హరిత విప్లవం అవసరమని, అది ఈ వ్యవసాయ-పర్యావరణ సంక్షోభానికి తెరదించుతుందని ఆయన చెబుతారు. అది జరిగే వరకు దిల్లీలోని 1.8కోట్ల మందిని విషపూరిత వాయువుల సమస్య వేధిస్తూనే ఉంటుందంటారు సింగ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)