గొడ్డలివేటు నుంచి 16 వేల చెట్లను దిల్లీ ప్రజలు కాపాడుకున్న తీరిదీ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నికిత మంధాని
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీ ప్రజలు 16 వేల చెట్లను గొడ్డలివేటు నుంచి కాపాడుకున్నారు. ఉద్యమించి విజయం సాధించారు. ఈ పోరాటం సాగిన తీరు ఇదీ..
ప్రపంచంలోని అత్యంత కాలుష్యమయ నగరాల్లో దిల్లీ ఒకటి. గాలి నాణ్యత తరచూ ప్రమాదకర స్థాయులకు చేరుతుంటుంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో పచ్చదనం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం కాలుష్యాన్ని ఎంతో కొంత నియంత్రిస్తోందని చెప్పొచ్చు. అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా ఈ పచ్చదనం కూడా తగ్గిపోతోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం కోసం దిల్లీ నడిబొడ్డున వేల చెట్లను నరికివేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన గురించి వినగానే తనకు దిగ్భ్రాంతి కలిగిందని దీనికి వ్యతిరేకంగా ఉద్యమించినవారిలో ఒకరైన 48 ఏళ్ల జుహీ సక్లానీ చెప్పారు.
చెట్లను ప్రేమించేవారికి, కాలుష్యాన్ని చెట్లు తగ్గిస్తాయని నమ్మేవారికి ప్రభుత్వ ప్రతిపాదన తప్పుడు ప్రతిపాదనగా అనిపించిందని తెలిపారు. ఇదే తమను చెట్ల పరిరక్షణకు పోరాటం జరిపేలా చేసిందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2016 జులైలోనే ప్రతిపాదనకు ఆమోదం
దిల్లీలోని ఏడు ప్రాంతాల్లో వేల చెట్లను నరికేయాలనే ప్రతిపాదన 2016 జులైలోనే ఆమోదం పొందింది.
ఒక్క ప్రాంతంలోనే దాదాపు 11 వేల చెట్లను నరికివేయనున్నారని గత నెల్లో మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత దీనిపై చర్చ రేగింది.
చెట్ల నరికివేతను అడ్డుకొనేందుకు పర్యావరణవేత్తలు, కాలుష్య వ్యతిరేక పోరాట సంఘాల ప్రతినిధులు సహా దిల్లీలోని వందల మంది పౌరులు తక్షణం నడుం కట్టారు. అతికొద్ది సమయంలోనే అందరూ సంఘటితమయ్యారు.
వృక్షాల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజల్లో మద్దతు కూడగట్టేందుకు పర్యావరణ కార్యకర్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సోషల్ మీడియాలో, వాట్సప్ లాంటి మెసేజింగ్ సర్వీస్‌లలో ఈ పోరాటానికి మద్దతు పెరిగింది. వివిధ మార్గాల్లో వెయ్యి మందికి పైగా ప్రజలు నిరసన తెలిపేందుకు ఈ పోరాటం ప్రేరణ అందించింది.
బైఠాయింపులు, వర్క్‌షాప్‌లు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, ధ్యానం రూపంలో ప్రదర్శనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, చెట్లను కాపాడేకొనేందుకు నిరంతర కాపలా.. ఇలా పర్యావరణ కార్యకర్తలు చాలా ప్రయత్నాలు చేశారు.

ఫొటో సోర్స్, AFP
స్వచ్ఛమైన గాలి ప్రజల హక్కు
పర్యావరణం, యువత అంశాలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ 'స్వేచ్ఛ'కు చెందిన విమలేందు ఝా బీబీసీతో మాట్లాడుతూ- స్వచ్ఛమైన గాలిని పీల్చేందుకు ప్రజలకున్న హక్కును చెట్లను నరికివేయాలనే ప్రభుత్వ ప్రతిపాదన కాలరాస్తోందని వ్యాఖ్యానించారు.
పౌరుల హక్కులను, పర్యావరణాన్ని సంరక్షించాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. వాతావరణ కాలుష్యంలోంచి ప్రజలను బయటపడేసేందుకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వమే సమస్యను మరింత తీవ్రతరం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.
దిల్లీని మరింత నివాస యోగ్యంగా మార్చేందుకు చేస్తున్న పోరాటాల్లో విమలేందు చురుగ్గా పాల్గొంటున్నారు. వివిధ సందర్భాల్లో నాయకత్వం కూడా వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాల్లో ఆయన దిల్లీ వ్యాప్తంగా వేల మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు తాను చేస్తున్న ఉద్యమంలో దిల్లీలో ప్రస్తుతం చేస్తున్న పోరాటం ముఖ్యమైన భాగమని విమలేందు వ్యాఖ్యానించారు.
'ద న్యూ దిల్లీ నేచర్ సొసైటీ' పేరుతో చెట్లను కాపాడేందుకు సోషల్ మీడియాలో ఒక వేదికను ప్రారంభించిన వర్హేన్ ఖన్నా- ఒక్క చెట్టును కూడా నరికివేయడానికి తాము అంగీకరించబోమని తెలిపారు.
దిల్లీలో సుమారు రెండు కోట్ల మంది బతుకుతున్నారని, చెట్లను నరికివేస్తే ప్రతి ఒక్కరిపైనా తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
చెట్లను తొలగించే స్థానంలో వచ్చే నిర్మాణాలతో ఎవరో ప్రయోజనం పొందుతారని, కానీ చెట్ల తొలగింపు వల్ల ప్రతి ఒక్కరూ బాధపడాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
చెట్టుకు 10 మొక్కలు నాటుతామన్న కేంద్రం
చెట్ల నరికివేతపై ప్రజావ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం మొదట్లో తేలిగ్గా తీసుకొంది. పైగా, ''కేవలం 14 వేల చెట్లనే'' తాము తొలగించబోతున్నామని చెప్పింది.
నరికివేసే ప్రతి చెట్టుకు బదులుగా పది మొక్కలు నాటుతామని ప్రభుత్వం తర్వాత హామీ ఇచ్చింది.

ఫొటో సోర్స్, AFP
'ఇదో అర్థరహితమైన హామీ'
ఈ హామీపై జుహీ సక్లానీ స్పందిస్తూ, ఇది అర్థరహితమైనదని కొట్టిపారేశారు. దేశంలో మొక్కలు బతికి చెట్లుగా ఎదిగే అవకాశాలు చాలా తక్కువని ప్రస్తావించారు. పైగా, తాము ఉండే ప్రాంతాలకు 30 కిలోమీటర్ల దూరంలో మొక్కలు నాటితే తమకుండే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
ఇప్పుడు నరికేయాలనుకున్న చెట్లలో 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న చెట్లు ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని వర్హేన్ ఖన్నా తప్పుబట్టారు.
ఇక చెట్లు నరికివేయబోమన్న మంత్రి
పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి గత నెల 28న 'ట్విటర్' వేదికగా ఒక ప్రకటన చేశారు. దిల్లీలో కాలనీల పునరభివృద్ధి(రీడెవలప్‌మెంట్) కోసం ఇకపై చెట్లను నరికివేయబోమని హామీ ఇచ్చారు.
దిల్లీ రీడెవలప్‌మెంట్ ప్రణాళికలను సమీక్షించుకుంటామని, చెట్లను నరికేయాల్సిన అవసరం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా వీటిని మార్చుకుంటామని గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్ర బీబీసీతో చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం కొంత 'బిల్టప్-అప్ ఏరియా'ను వదులుకోవాల్సి రావొచ్చని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యాయపోరాటం ఇదీ
ఒకవైపు క్షేత్రస్థాయిలో, ఆన్‌లైన్‌లో ఉద్యమం సాగుతుండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్‌జీటీ)లో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.
ప్రభుత్వ ప్రాజెక్టుపై హైకోర్టు, ఎన్‌జీటీ రెండూ స్టే ఇచ్చాయి.
తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు దిల్లీలో ఎక్కడా ఒక్క చెట్టు కూడా కొట్టివేయడానికి వీల్లేదని హైకోర్టు ఈ నెల 4న ఆదేశించింది. రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టుల పేరుతో పర్యావరణాన్ని దెబ్బతీసి, దిల్లీకి హాని కలిగించే చర్యలను తాము అనుమతించబోమని వ్యాఖ్యానించింది.
'ఇది దిల్లీ ప్రజల విజయం'
హైకోర్టులో పిటిషన్ వేసిన కౌశల్ కాంత్ మిశ్రతోపాటు ఇతర పర్యావరణ కార్యకర్తలు న్యాయస్థానం నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది దిల్లీ ప్రజల విజయమని వ్యాఖ్యానించారు. దేశంలో అందరికీ సమాన అవకాశాల కల్పన, సుపరిపాలన కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థ 'యూత్ ఫర్ ఈక్వాలిటీ' వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన కౌశల్ వృత్తిరీత్యా ఎముకలు, కీళ్ల వైద్యుడు.
ప్రభుత్వ కాంట్రాక్టర్లు చెట్లను నరికివేయడం, తొలగించడం కొనసాగిస్తున్నారని, హైకోర్టు, గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని పర్యావరణ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇలా ఒక చెట్టును కొట్టివేస్తుండటాన్ని ప్రత్యక్షంగా చూసిన విమలేందు ఝా ఈ అంశంపై కోర్టు ధిక్కరణ కేసు వేశారు.
చెట్ల నరికివేత ఆగదనే ఆందోళన పర్యావరణవేత్తల్లో ఇంకా ఉంది. అందుకే పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజలను ముఖ్యంగా బాలలను చైతన్యపరచడం మీద వారు దృష్టి పెట్టారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: 'ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నా కులంతో పనేంటి?'
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- మోదీ బుల్లెట్ ట్రైన్‌పై గుజరాత్ రైతులు ఏమంటున్నారు?
- సోషల్ మీడియా: మీరు లైక్ చేస్తే వాళ్లు లాక్ చేస్తారు.. యూజర్లను వ్యసనపరుల్ని చేస్తున్న కంపెనీలు
- అప్పట్లో ఫుట్‌బాల్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ఫుట్‌బాల్
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- #UnseenLives: ఊరికి రోడ్డొచ్చాక కూలీల జీవితంలో కొంత మార్పొచ్చింది
- ప్రజ్ఞానంద: అక్కను ఓడించాలని చెస్ నేర్చుకున్నాడు.. ఇప్పుడు గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు
- దేశంలో 'వాట్సప్ హత్యలను' ఎవరు ఆపగలరు?
- #MeetToSleep: దిల్లీ అమ్మాయిలు పార్కుల్లో ఒంటరిగా ఎందుకు పడుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








