మోదీ బుల్లెట్ ట్రైన్‌పై గుజరాత్ రైతులు ఏమంటున్నారు?

బుల్లెట్ రైలు గుజరాత్ వ్యతిరేకత

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, హరీష్ ఝాలా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లోనూ వ్యతిరేకత ఎదురవుతోంది.

బుల్లెట్ ట్రైన్ కోసం చేపట్టిన భూసేకరణను హైకోర్టులో సవాలు చేసిన గుజరాత్ రైతులు, ఈ భూసేకరణ ప్రక్రియ, పరిహారంపై ప్రశ్నలు సంధించారు.

ప్రభుత్వ భూసేకరణ చట్టంపై కోర్టుకెక్కిన రైతులు, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఒక రాష్ట్రానికి చెందింది కాదని.. దీనిలో చాలా రాష్ట్రాలు ఉన్నాయని అంటున్నారు.

ఇంతగా వ్యతిరేకత ఉన్నా ఈ ప్రాజెక్టుకు రైతుల నుంచి పూర్తి సమ్మతి దొరుకుతుందని నేషనల్ హైవే స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్) అధికారులు ధీమాతో ఉన్నారు.

బుల్లెట్ రైలు గుజరాత్ వ్యతిరేకత

ఫొటో సోర్స్, Getty Images

భూములు, ఇళ్లకు ముప్పు

సుమారు 10 రోజుల ముందు నైన్‌పూర్(ఖేడా జిల్లా) నుంచి 'ఖేడుత్ సంపర్క్ అభియాన్' పేరుతో రైతులు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభించారు. రాష్ట్రంలోని 192 గ్రామాల్లో, దాదాపు 2,500 మంది రైతులను ఒక్కతాటిపైకి తీసుకురావాలని భావిస్తునారు.

నైన్‌పూర్ గ్రామానికి చెందిన రైతు కనాభా చౌహాన్‌కు ఐదు ఎకరాల పొలం ఉంది. ఆయనకు భూసేకరణ నోటీసు అందింది. ఆయన "మా కుటుంబంలో 15 మంది ఉన్నారు. ఈ భూమిని చిన్నచిన్న కమతాలుగా సాగు చేసుకుంటున్నాం. ఈ భూమిని ఇవ్వలేం" అన్నారు.

"నాకు సుమారు అర ఎకరం భూమి ఉంది. అందులో మా ఉమ్మడి కుటుంబంలోని 6-7 కుటుంబాలు, మా పశువులు ఉంటాయి. ఇదంతా భూసేకరణ పరిధిలోకి వచ్చింది. మా భూమిని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు తీసుకుంటే, మా కుటుంబంలో ఉన్న 50 మందికి నిలువ నీడ లేకుండా పోతుంది" అని ఛాపడా గ్రామంలోని మనూ చౌహాన్ చెప్పారు.

"ఖేడా జిల్లాలో కూరగాయల తోటలున్నాయి. ఇక్కడి రైతులు ఉద్యాన పంటలతో లాభాలు సంపాదిస్తారు. నేను ఎకరం భూమిలో గుమ్మడికాయలు పండిస్తాను. ఏడాదికి రూ.5 లక్షల వరకు వస్తుంది. ఇది తీసుకుని ఎక్కడో బీడు భూమి ఇస్తే అది నాకెందుకూ పనికిరాదు". అంటారు మనూ చౌహాన్.

బుల్లెట్ రైలు గుజరాత్ వ్యతిరేకత

ఫొటో సోర్స్, T G PATEL

ఫొటో క్యాప్షన్, కనాభా చౌహాన్, రైతు

'సంపన్న వర్గాల కోసం బుల్లెట్ ట్రైన్'

మెట్రో మ్యాన్ శ్రీధరన్ ప్రకటనతో కూడా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దిల్లీ మెట్రో మాజీ చీఫ్ శ్రీధరన్ 'హిందుస్థాన్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుల్లెట్ ట్రైన్ సంపన్న వర్గాల కోసమే అన్నారు.

ఇంటర్వ్యూలో ఆయన "బుల్లెట్ ట్రైన్ సంపన్న వర్గాల అవసరాలు మాత్రమే తీరుస్తుంది. ఇది చాలా ఖరీదైనది. సామాన్యులకు అందుబాటులో ఉండదు. దీనికి బదులు భారత్‌కు ఆధునికంగా, సురక్షితంగా, వేగంగా ఉండే ఒక రైల్వే వ్యవస్థ అవసరం" అన్నారు.

గుజరాత్ ఖేడుత్ సమాజం నేత జయేష్ పటేల్ కూడా బుల్లెట్ ట్రైన్ అవసరాన్ని ప్రశ్నించారు. "భారతీయ రైల్వే ఇంజనీర్లు గంటకు 225 కి.మీ వేగంతో నడిచే ఇంజిన్ తయారు చేశారు. అహ్మదాబాద్-ముంబయి మధ్య ఇప్పుడున్న రైల్వే ట్రాక్ ఆధునికీకరణ కోసం రూ.25 కోట్లు పెట్టుబడి పెడితే, ఆ ట్రైన్ స్పీడును గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వరకూ పెంచచ్చు" అన్నారు.

బుల్లెట్ రైలు గుజరాత్ వ్యతిరేకత

ఫొటో సోర్స్, Getty Images

"జపాన్ నుంచి లక్షా 10 వేల కోట్ల వ్యయంతో ఒక బుల్లెట్ ట్రెయిన్ కొనుగోలు చేస్తున్నప్పుడు, ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్రంలోని సారవంతమైన భూమిని ఎందుకు సేకరిస్తున్నారు". అని జయేష్ పటేల్ ప్రశ్నించారు.

ఈ భూసేకరణను సూరత్ రైతులు గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు.

బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు రెండు జిల్లాల నుంచి వెళ్లనుంది. దీని కోసం జిల్లా కలెక్టర్ కింది అధికారులు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు.

బుల్లెట్ రైలు గుజరాత్ వ్యతిరేకత

ఫొటో సోర్స్, T G PATEL

ఫొటో క్యాప్షన్, మనూభాయ్ చౌహాన్, రైతు

రాజకీయం జరుగుతోంది

"మార్కెట్ రేటు ఆధారంగా కొత్త ధరను నిర్ణయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాని ప్రకారమే తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు" అని సూరత్ డిప్యూటీ కలెక్టర్ ఎం.కె.రాథోడ్ తెలిపారు.

అయితే, పరిహారం గురించి చెప్పడానికి ఆయన నిరాకరించారు. " రైతులు ఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశం ఇప్పుడు కోర్టులో ఉంది. అందుకే దాని గురించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయను" అన్నారు.

బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని జాయింట్ వెంచర్ కంపెనీ నేషనల్ హైవే స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ చెబుతోంది. ఇది కేంద్రం, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే రాష్ట్రాల జాయింట్ వెంచర్‌గా ఉంటుంది.

"రైతుల వ్యతిరేకతలో అర్థం ఉంది. వాళ్లకు ఉన్న ఆస్తులు భూమి, ఇల్లే. వాటిని తీసుకుంటున్నప్పుడు, వ్యతిరేకత వస్తుంది." అని ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్ ప్రజా సంబంధాల అధికారి ధనుంజయ్ కుమార్ అన్నారు.

బుల్లెట్ రైలు గుజరాత్ వ్యతిరేకత

ఫొటో సోర్స్, Getty Images

"ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్ స్థాపించిన తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించడంలో జరిగిన జాప్యంతో రాజకీయం చేయడానికి పార్టీలకు అవకాశం లభించింది" అని ఆయన అన్నారు.

శ్రీధరన్ ప్రకటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన ధనుంజయ్ "మా లక్ష్యం అహ్మదాబాద్, ముంబయి మధ్య రోడ్డు, విమానాల్లో ప్రయాణించే వ్యాపారులే. మేం వాళ్లను ఆకర్షించాలనుకుంటున్నాం" అని తెలిపారు.

"మనం ఎయిర్ పోర్టుకు వెళ్లేటప్పుడు, విమానం దిగి వెళ్లేటపుడు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయే సమయం, ఫ్లైట్‌ కోసం పట్టే సమయం, అన్నీ కలిపితే విమానంలో ప్రయాణించినా అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్లడానికి ఐదు గంటలు పడుతుంది. అదే బుల్లెట్ ట్రెయిన్‌లో ఆ సమయం రెండు నుంచి రెండున్నర గంటలు ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు ముంబయి ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి". అన్నారు.

బుల్లెట్ రైలు గుజరాత్ వ్యతిరేకత

ఫొటో సోర్స్, T G PATEL

ఫొటో క్యాప్షన్, జయేష్ పటేల్, గుజరాత్ కిసాన్ సొసైటీ అధ్యక్షుడు

పరిహారమే సమస్యా?

"భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. అందుకే ప్రభుత్వం భూసేకరణ చేస్తోంది. గుజరాత్‌లో మేం రైతులతో మాట్లాడలేదు. అందుకే వ్యతిరేకతలు వస్తున్నాయి. రైతుల వ్యతిరేకత ప్రాజెక్టు గురించి కాదు, వారు పరిహారం విషయంలోనే ఆందోళన చెందుతున్నారు. మేం రైతులకు 2016 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తాం. జంత్రీ ధరలకు 25 శాతం అదనంగా చెల్లిస్తాం" అని ధనుంజయ్ చెప్పారు.

"మొత్తం ప్రాజెక్టు ఎలివేటెడ్ ట్రాక్‌పై ఉంటుంది. అందుకే బుల్లెట్ ట్రెయిన్ ట్రాక్‌ కోసం 17 మీటర్ల వెడల్పు భూమి మాత్రమే తీసుకుంటాం" అని ఆయన చెప్పారు.

"భూమికి బదులు బుల్లెట్ ట్రెయిన్‌లో ఉద్యోగాలు ఇవ్వడమో లేదంటే ఇంటికి బదులు ఇల్లు ఇవ్వడమో ఉండదు. వారికి భూమి బదులు పరిహారంగా డబ్బు చెల్లిస్తాం. అని ధనుంజయ్ తెలిపారు.

దీనిపై సామాజిక ప్రభావం ఏమేరకు ఉంది, ఇంకా పూర్తిగా అంచనా వేయలేదు అని ఆయన అన్నారు.

బుల్లెట్ రైలు గుజరాత్ వ్యతిరేకత

ఫొటో సోర్స్, Getty Images

ఈ రైలు గుజరాత్ ప్రధాన నగరం అహ్మదాబాద్‌ను భారత దేశ ఆర్థిక రాజధానితో కలుపుతుంది.

బుల్లెట్ ట్రెయిన్ వల్ల 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే 8 గంటల సమయం 3 గంటలకు తగ్గిపోతుంది.

ఈ రైలు వెళ్లే దారిలో 12 స్టేషన్లు ఉంటాయి.

ఎక్కువ ట్రాక్ భూమికి పైన అంటే ఎలివేటెడ్‌గా ఉంటుంది.

ఈ మార్గంలో బుల్లెట్ రైలు 7 కిలోమీటర్ల దూరం సముద్రం అడుగున నిర్మించే సొరంగంలో ప్రయాణిస్తుంది.

ఈ రైలు 750 మంది ప్రయాణికులు వెళ్లడానికి వీలుగా ఉంటుంది.

బుల్లెట్ ట్రెయిన్ గరిష్ఠ వేగం గంటకు 350 కిలోమీటర్లు, ఇప్పటివరకూ భారత్‌లో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్ల కంటే ఇది రెట్టింపు వేగం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)