గ్రౌండ్ రిపోర్ట్: మంద్సౌర్ అత్యాచారం నిందితుడ్ని పట్టించిన బూటు

- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్‌లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన తర్వాత నగరంతోపాటూ దేశమంతటా కలకలం రేగింది.
ఇండోర్ నగరంలోని ఒక పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం పాపకు చికిత్స అందిస్తున్నారు.
అత్యాచారం చేసిన తర్వాత పాపను దారుణంగా హింసించారు. మొదట్లో చిన్నారి బతకదేమో అనుకున్నారు. ఇప్పుడు పాప ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని డాక్టర్లు భావిస్తున్నారు.
ఈ నేరం జరిగిన తర్వాత పోలీసులు అనుమానితులను గుర్తించడంలో సోషల్ మీడియా, డిజిటల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించాయి.

కేసు విచారణ
మంద్సౌర్ నగరంలోని ఒక స్కూల్ నుంచి జూన్ 26న మధ్యాహ్నం ఏడేళ్ల పాప బయటికి వచ్చింది. ఆ చిన్నారిని అక్కడ ఎవరూ గమనించలేదు.
స్కూల్లో సీసీ టీవీ కెమెరా పాడయ్యింది. గేట్ దగ్గర ఉన్న సీసీ టీవీ కెమెరా పాడవడమే కాదు, వేరే దిశలో తిరిగి ఉంది.
స్కూల్ వదిలిన మూడు గంటల తర్వాత కూడా పాప ఇంటికి చేరలేదు. దీంతో చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పాప సీతామవు పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లిందేమో అని తండ్రికి అనుమానం వచ్చింది. ఈలోపు పోలీసులు 15 బృందాలతో అన్నివైపులా గాలించారు. కానీ చిన్నారి ఆచూకీ దొరకలేదు.
పాప కుటుంబం కొన్ని రోజుల క్రితం ఒక భూమికి సంబంధించిన ఒప్పందం చేసుకుందని, దాని విలువ కొన్ని కోట్లలో ఉంటుందని పోలీసులకు తర్వాత తెలిసింది. దాంతో విచారణ మరో మలుపు తిరిగింది. కిడ్నాపింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కానీ దానికి కూడా ఎలాంటి ఆధారాలూ లభించలేదు.
బుధవారం మధ్యాహ్నం చార్లీ మొబైల్ పోలీస్ స్క్వాడ్‌కు లక్ష్మణ్ గేట్ ప్రాంతంలో రక్తసిక్తమైన శరీరంతో ఒక పాప కనిపించింది.

దినేశ్ అదే ప్రాంతంలో ఉప్పుశనగలు, పల్లీలు అమ్ముతుంటారు.
"నేను రోడ్డుపై నిలబడి ఉన్నా. అది చూడగానే, పాపం, అంత చిన్న పాపపై అంత దారుణం ఎవరు చేశారా అనిపించింది" అని దినేశ్ అన్నారు.
షాక్‌కు గురైన పాప బాధతో ఏం మాట్లాడలేకపోతోంది, సైగలు కూడా చేయలేకపోతోంది. చిన్నారి శరీరంపై చాలా గాయాలున్నాయి. బట్టలు రక్తంతో తడిచిపోయాయి.
పాపను చికిత్స కోసం తీసుకెళ్లారు. కేసును అత్యాచారం, హత్యాయత్నంగా మార్చారు.
సీసీటీవీలో అనుమానితుడి దృశ్యాలు
కానీ చిన్నారిని ఆ స్థితికి తెచ్చిన వారి గురించి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. చివరికి బుధవారం రాత్రి ఒక 'సీక్రెట్ అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్' జరిగింది. స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో వివరాలు సేకరించాలని పోలీసులు నిర్ణయించారు.
ఆ ఏరియాలో ఉన్న షాపు వాళ్లందరినీ కలిసిన పోలీసులు వారి సాయం తీసుకున్నారు. తమ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజి పోలీస్ కంట్రోల్ రూంకు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పారు.

ఆ ప్రాంతంలో బట్టలు, సరుకులు అమ్మే కొన్ని దుకాణాలు కూడా ఉన్నాయి.
"నా షాపు ముందు గత ఏడాదే సీసీ టీవీ కెమెరా బిగించాను. మేం వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసి పోలీసులకు పంపించాం అని కుమార్ (పేరు మార్చాం) చెప్పారు.
గంటలకొద్దీ ఉన్న ఫుటేజిని పరిశీలించిన తర్వాత చివరికి స్కూల్ యూనిఫాంలో ఉన్న ఒక పాప, ఒక యువకుడి వెనక వెళ్తున్నట్టు కనిపించే మూడు వీడియోలు పోలీసులకు దొరికాయి.
అది ఈ కేసులో మొదటి విజయం. కానీ ఆ యువకుడి ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో పోలీసులు అతడిని గుర్తించలేకపోయారు. కానీ ఆ యువకుడు వేసుకున్న బూట్ల బ్రాండ్ మాత్రం స్పష్టంగా కనిపించింది.
పోలీసులు మరో ప్లాన్ వేశారు. ఇందులో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. ఎవరైనా యువకుడిని గుర్తిస్తారనే ఉద్దేశంతో ఆ మూడు సీసీటీవీ ఫుటేజి క్లిప్స్ మంద్సౌర్ నగరంలో వైరల్ చేయడం ప్రారంభించారు.
ఎవరో పాపపై అత్యాచారం చేశారని, చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వ్యాపించాయి.

ఉన్న సమయం చాలా తక్కువ
ఈ కేసులో రాజకీయ ప్రకటనలు మొదలయ్యాయి. చివరికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ గురించి ప్రజల సాయం పొందాలని భావించారు.
"అనుమానిత సీసీటీవీ ఫుటేజి దర్యాప్తు విషయంలో ప్రజల నుంచి ఊహించని సహకారం లభించింది" అని పోలీస్ చీఫ్ మనోజ్ కుమార్ సింగ్, నగరంలోని కొందరు నేతలు బీబీసీకి చెప్పారు.
అయితే ఫుటేజిలో కనిపించే యువకుడిని గుర్తించాలనుకున్న పోలీసుల ముందుకు సుమారు పదికి పైగా పేర్లు వచ్చాయి.
దాంతో మరోసారి సోషల్ మీడియా, డిజిటల్ నిపుణుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. జనం చెప్పిన పేర్లున్నవారి ఫేస్‌బుక్ అకౌంట్లను పోలీసులు జల్లెడపట్టారు.
తర్వాత రోజు పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి సోషల్ మీడియా అకౌంట్‌లో అదే బ్రాండ్ స్పోర్ట్స్ షూస్‌తో రెండు ఫొటోలు కనిపించాయి.
"అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఈ ఘటనలో తన ప్రమేయం ఉందని ఆ యువకుడు ఒప్పుకున్నాడు" అని పోలీస్ చీఫ్ మనోజ్ కుమార్ సింగ్ చెప్పారు.

అయితే పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు అనుమానితుల్లో ఒకరి కుటుంబం తమ కొడుకును నిర్దోషిగా చెబుతోంది. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
ఇద్దరు నిందితులు ప్రస్తుతం పోలీస్ రిమాండులో ఉన్నారు. చికిత్స నుంచి కోలుకున్న తర్వాత బాలిక నిందితుడిని గుర్తించగలిగితే ఈ కేసు మిస్టరీ పూర్తిగా విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- 'ఒకేసారి అంతమంది చనిపోయి కనిపించడంతో వణికిపోయా'
- కంప్యూటర్ స్క్రీన్ రంగుతో నిద్రను నియంత్రించొచ్చు
- YoutubeStars: చెముడు హర్ష.. వైవా హర్షగా ఎలా మారాడు?
- బీబీసీ రియాలిటీ చెక్: అది భార్యాబిడ్డల అమ్మకం కాదు.. ‘ కులాచారం’
- సర్జికల్ స్ట్రైక్స్ చేశాక ప్రాణాలతో బయటపడడం ఎంత కష్టం?
- నల్లడబ్బు స్విస్ బ్యాంకులకు ఎలా తరలిపోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








