'ఒకేసారి అంతమంది చనిపోయి కనిపించడంతో వణికిపోయా'

- రచయిత, మహమ్మద్ షాహిద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సంత్‌నగర్ బురాడీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణించడంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది.
ఉత్తర దిల్లీలో ఉన్న సంత్‌నగర్ బురాడీ ప్రాంతంలో 4ఎ నంబర్ వీధిలోకి వెళ్లగానే కుడి వైపు రెండు ఫ్లాట్ల తర్వాత ఒక మూడంతస్తుల ఇల్లుంది. అందులో ఇప్పుడు ఒక పెంపుడు కుక్క మాత్రమే మిగిలింది. ఈ ఇంట్లో ఉన్న మొత్తం 11 మంది ఆదివారం ఉదయం విగతజీవులుగా కనిపించారు.
భాటియా పరివార్‌గా పేరుపడ్డ ఈ ఇంట్లో 10 మంది ఉరితాళ్లకు వేలాడుతూ కనిపించారు. వారిలో అందరికంటే పెద్ద మహిళ నేలపై చనిపోయి ఉంది. వీరిలో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు. ఈ కుటుంబం రాజస్థాన్‌కు చెందినది. కానీ 20 ఏళ్లకు పైగా వాళ్లు బురాడీలోనే ఉంటున్నారు.
సుమారు 75 ఏళ్ల మహిళ నారాయణ్, ఆమె ఇద్దరు కొడుకులు భుప్పి (46), లలిత్ (42), కోడళ్లు సవిత (42), టీనా (38) కూడా ఉరివేసుకుని ఉన్నారు. భుప్పీ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, లలిత్ 12 ఏళ్ల కుమారుడు కూడా చనిపోయి కనిపించారు.
భర్త చనిపోయిన నారాయణ్ కుమార్తె, ఆమె కూతురు ప్రియాంక (30) కూడా మృతుల్లో ఉన్నారు. ప్రియాంకకు ఇటీవలే జూన్ 17న నిశ్చితార్థం అయ్యింది, ఆగస్టులో ఆమెకు పెళ్లి జరగాల్సి ఉంది.
"ప్రాథమిక విచారణలో స్పష్టంగా ఏదీ తేలలేదు. ఈ మరణాలపై విచారణ చేపట్టాం, ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అనేది ఇప్పుడే చెప్పలేం" అని సెంట్రల్ రేంజ్ జాయింట్ పోలీస్ కమిషనర్ రాజేష్ ఖురానా అన్నారు.

ఉదయం వెలుగులోకి వచ్చిన ఘోరం
ఈ ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్‌లో రెండు షాపులు ఉన్నాయి. ఒక కిరాణా షాపును భుప్పీ చూస్తుంటారు. ఇంకొకటి ప్లైవుడ్ షాపు. దానిని లలిత్ చూసుకుంటారు.
ఇంతమంది చనిపోయిన ఈ ఘటన గురించి వారి పక్కింట్లో ఉండే గుర్‌చరణ్ సింగ్‌కు మొదట తెలిసింది. ఆయన భార్య రోజూ ఉదయం పాలు తీసుకురావడానికి భాటియా కుటుంబం షాపుకు వెళ్తుంది.
రోజూ ఉదయాన్నే తెరిచే ఆ షాపు ఉదయం 7 గంటల వరకూ తెరవకపోవడంతో, ఇంట్లోకి వెళ్లి చూడమని ఆమె గుర్‌చరణ్‌కు చెప్పింది.
"నేను లోపలికి వెళ్లేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. అందరి శవాలూ సీలింగుకు వేలాడుతున్నాయి. వాళ్ల చేతులు కట్టేసి ఉన్నాయి. అంత మంది అలా చనిపోయి వేలాడుతుండడం చూసి నేను వణికిపోయా. ఇంటికి వచ్చి నా భార్యకు చెప్పగానే తను చూడ్డానికి వెళ్లాలనుకుంది. నేను నా భార్యను అక్కడికి వెళ్లకుండా ఆపాను" అని గురుచరణ్ సింగ్ చెప్పారు.
ఆ తర్వాత గురుచరణ్ తమ పక్కింట్లో ఉన్న పోలీసుకు ఈ విషయం చెప్పారు. ఆయన ఉదయం 7.30కు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేశారు.

ఆ కుటుంబం చాలా మంచిదని, షాపులో ఏదైనా తీసుకుంటే, డబ్బులు తర్వాత ఇవ్వండని చెప్పేవారని గురుచరణ్ గుర్తు చేసుకున్నారు.
"వాళ్లు చాలా మంచివాళ్లు. ఎప్పుడూ పూజలు చేస్తుంటారు. సాయంత్రం ఇంట్లో అంతా కలిసి పూజ చేస్తారు" అని ఈ కుటుంబానికి సన్నిహితుడైన నవనీత్ బాత్రా చెప్పారు.
నారాయణ్‌కు ఉన్న పెళ్లైన కూతురు పానిపత్‌లో ఉందని, ఆమె మరో కొడుకు రాజస్థాన్‌లో ఉంటాడని బాత్రా చెప్పారు.

కుటుంబానికి దైవభక్తి ఎక్కువ
అవుటర్ రింగ్ రోడ్ దగ్గరున్న బురాడీ ప్రాంతం మొదట గ్రామంలా ఉండేది. కానీ దిల్లీ జనాభా పెరిగిన తర్వాత యూపీ, బిహార్, ఉత్తరాఖండ్ నుంచి చాలా మంది వచ్చి బురాదీ ప్రాంతంలో ఉండడం ప్రారంభించారు.
ఈ ప్రాంతంలో ఎక్కువగా పోటీ పరీక్షలకు సిధ్ధమయ్యే యువకులు కూడా ఉంటారు. భాటియా ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో లైబ్రరీ కూడా ఉంది.
ఈ కుటుంబం ఎప్పుడూ ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం తను చూడలేదని భాటియా ఇంటి పక్కనే ఉండే టీపీ శర్మ చెప్పారు.
"వీళ్ల మంచితనం చూసి ఏదైనా కావాలంటే అందరూ వీళ్ల షాపులోనే కొంటూ ఉంటారు. వీళ్లు గొడవపడడం మేమెప్పుడూ చూళ్లేదు. ఈ మధ్యే భుప్పీ తన మేనకోడలు నిశ్చితార్థం చేశాడు. ఇంట్లో అంతా బాగానే ఉంది. ఇంట్లో అందరూ కలిసే ఉంటారు కాబట్టి కుటుంబ కలహాలు కూడా ఏవీ లేవు" అన్నారు శర్మ.

వీధి బయట బండి పెట్టుకున్న మహమ్మద్ యూసఫ్, తన మనవరాళ్లు, ఆ ఇంట్లో ట్యూషన్‌కు వెళ్తారని చెప్పాడు. లలిత్ ఇద్దరు కూతుళ్లు వాళ్లకు ట్యూషన్ చెబుతారన్నారు.
"నేను నా మనవరాళ్లను ఈ ఇంటి దగ్గర వదిలి వెళ్లేవాడ్ని. వాళ్లు నాతో ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. ఆ ఇంటిని ఎప్పుడు చూసినా, వారికి ఏదో సమస్య ఉందని అనిపించలేదు" అన్నారు యూసఫ్.
ఈ కుటుంబానికి దైవభక్తి చాలా ఎక్కువని స్థానికులు చెబుతున్నారు. పూజారి మూల్‌చంద్ శర్మ ఆ ఇంటికి దగ్గరలోనే ఉంటారు. వారిది సంపన్న కుటుంబం అని ఆయన చెప్పారు.
"నిన్న రాత్రి నేను భుప్పీని కలిశా. నేను ఆయనతో ప్లైవుడ్ తెప్పించుకున్నా. ఈరోజు ఉదయం ఆయన నాకు వాటిని ఇస్తానని చెపారు" అన్నారు శర్మ.

ఆత్మహత్యా లేక హత్యా?
"ఈ కుటుంబంతో నేను భజనలకు వెళ్లేదాన్ని. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వాళ్లు ముందుంటారు" అని అదే వీధిలో ఉండే సీమ చెప్పారు.
"కిరాణా షాపు బయట వీళ్లు ఒక పేపరుపై మంచి సూక్తులు రాసేవారు. రోజూ ఏదో ఒక మంచి విషయం గురించి రాసి పెడుతూ ఉండేవారు. అంత మంచి ఆలోచనలు ఉండే వాళ్లు ఆత్మహత్య ఎలా చేసుకుంటారు?" అన్నారు సీమ.
వారిది సంపన్న కుటుంబం అని, పిల్లలు కూడా బాగా చదువుకున్నవాళ్లని సీమ చెప్పారు. అందుకే ఈ మరణాలపై సందేహం వస్తోందని అన్నారు. ఆ ఇంట్లో అందరూ ఇరుగుపొరుగును చాలా గౌరవించేవారని వివరించారు.
ఇంత పెద్ద విషాదం జరగడంతో నేతలందరూ ఘటనా స్థలం దగ్గరికి చేరారు. మొదట ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత స్థానిక ఎంపీ మనోజ్ తివారీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘటనా స్థలం దగ్గరికి చేరుకున్నారు.

సోనీపత్ నుంచి వచ్చిన నారాయణ్ కూతురితో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నప్పుడు, ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నప్పుడు ఇలా ఎందుకు జరిగిందని ఆమెను అడిగారు.
పోలీసుల రిపోర్ట్ వచ్చేవరకూ వేచిచూడాలని అరవింద్ కేజ్రీవాల్, మనోజ్ తివారీ చెప్పారు. ఇప్పుడే దీనిపై అనుమానాలు వ్యక్తం చేయలేమని అన్నారు.
అయితే, హత్య జరిగుండవచ్చనే విషయాన్ని కూడా పోలీసులు కొట్టిపారేయడం లేదు. మృతదేహాలన్నింటినీ పోస్టుమార్టానికి పంపించారు.
ఇంత ఘోరం జరగడానికి కారణం ఏంటి అనేదానిపై పోస్టుమార్టం లేదా పోలీసుల విచారణ తర్వాతే స్పష్టత రానుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








