ఘనాలో శవాల్ని ఆర్నెల్ల దాకా పూడ్చరు

ఘనా

ఫొటో సోర్స్, Getty Images

గత వారం ఎప్పట్లానే ఘనాలో అంత్యక్రియలకు సంబంధించిన మరో కథ చర్చనీయాంశమైంది.

ఆరేళ్ల క్రితం చనిపోయిన ఓ పెద్దాయన మృతదేహం ఇప్పటికీ భద్రంగా ఓ శీతల పెట్టెలో ఉంది. ఆ మృతదేహానికి అంతిమ సంస్కారాలు ఎవరు నిర్వహించాలనేదానిపై కుటుంబ సభ్యుల మధ్య నలుగుతున్న వివాదం ఇంకా సద్దుమణగలేదు.

ఆ విషయం తెలియగానే నాకు చాలా కోపమొచ్చింది. ఆ తరవాత దానిపైన అంతగా దృష్టిపెట్టలేదు. మా దేశంలో ఇలాంటి విషయాలు మామూలే కదా అనిపించింది.

చాలా నెలలు, ఒక్కోసారి సంవత్సరాల పాటు శవాలకు దహన సంస్కారాలు నిర్వహించకుండా అలా భద్రపరిచే ఉదంతాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి.

సుదీర్ఘమైన, ఖరీదైన అంత్యక్రియలుగా కూడా ఘనాలోని మరణానంతర క్రతువులు చాలాసార్లు చర్చకొస్తాయి. ముఖ్యంగా చిత్రవిచిత్రంగా తయారు చేసే శవపేటికలు చాలామంది దృష్టిని ఆకర్షిస్తాయి.

అంతిమ సంస్కారాల్లో పాటలు, నృత్యాలు కూడా సాధారణం.

కానీ ఇన్నేళ్లుగా వీటన్నింటినీ చూస్తున్నా నాకు కొన్ని విషయాలు ఎంతకీ అర్థం కావట్లేదు.

ఇలాంటి భిన్నమైన శవపేటికలే అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇలాంటి భిన్నమైన శవపేటికలే అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి

అందులో అంత్యక్రియల్లో ‘కుటుంబ సభ్యుల’ సంగతి ఒకటి. సాధారణంగా భార్య, పిల్లలను భర్త కుటుంబంగా భావిస్తారు. కానీ ఆ భర్త చనిపోతే అతడి కుటుంబ సభ్యుల జాబితా మారిపోతుంది. భార్యా పిల్లల్ని అతడి కుటుంబ సభ్యులుగా భావించరు.

ఆ వ్యక్తి ఏ కుటుంబంలో అయితే పుట్టాడో, దాన్ని అతడి సొంత కుటుంబంగా భావిస్తారు. ఆ శవంపైన అన్ని హక్కులు ఆ కుటుంబ సభ్యులకే ఉంటాయి. ఆంతిమ సంస్కారాలను ఎవరు నిర్వహించాలనే విషయాన్ని ఆ కుటుంబ సభ్యులే నిర్ణయిస్తారు తప్ప, అందులో భార్యా పిల్లలకు ఎలాంటి ప్రమేయం ఉండదు.

ఒక్కోసారి ఆ కుటుంబ సభ్యులతో చనిపోయిన వ్యక్తికి సంబంధాలు తెగిపోయి 20-30ఏళ్లు గడిచినా సరే, చనిపోయాక మాత్రం భార్య, పిల్లలకంటే ఎక్కువ హక్కులు వారికే ఉంటాయి. అంతిమసంస్కారాలకు వాళ్లే పెద్దదిక్కుగా ఉంటారు.

అందుకే మరణానంతర వివాదాలు తేలేవరకు అక్కడ మృతదేహాలు చాలాకాలం పాటు శీతల పెట్టెలోనే మగ్గిపోతుంటాయి.

ఘనా

ఫొటో సోర్స్, Getty Images

మేం అంతిమ సంస్కారాలకు చాలా ప్రాధాన్యమిస్తాం. వీలైనంత గౌరవంగా వాళ్లను సాగనంపాలనుకుంటాం. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటికి రంగులేసి అందంగా అలంకరిస్తాం. మరమ్మతులు చేయిస్తాం. ఒక్కోసారి మరింత వైభవంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కొత్త ఇంటిని కూడా నిర్మిస్తాం. అలాంటి సందర్భాల్లో ఆ కార్యక్రమం కాస్త ఆలస్యమవుతుంది.

ఈ మధ్య నానా మెంకా అనే ఓ పారిశ్రామికవేత్త చనిపోయారు. ఆయన చనిపోయినట్లు తెలపడానికి 226 పేజీలున్న ఆకర్షణీయమైన బ్రోచర్లను ముద్రించారు. 84ఏళ్ల ఆయన జీవితంలోని ముఖ్యమైన సందర్భాలన్నింటినీ ఆ బ్రోచర్‌లో పొందుపరిచారు.

ఆ ఫొటోలను సేకరించడానికి చాలా సమయం పట్టింది. అప్పటిదాకా ఆయన మృతదేహం అంతిమ సంస్కారాలకు నోచుకోలేదు.

రిఫ్రిజిరేటర్లను కనిపెట్టడం వల్ల కలిగిన లాభాల సంగతి అటుంచితే, జరిగిన నష్టాలు మాత్రం చాలా ఉన్నాయనిపిస్తుంది. వాటివల్లే కదా... మా దేశంలో ఇలా చనిపోయినవాళ్లని చాలాకాలం పాటు ఖననం చేయకుండా భద్రపరుస్తున్నారు.

చాలామంది తమకు నచ్చినట్టుగా ఇలాంటి శవపేటికలు తయారు చేయించుకుంటారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాలామంది తమకు నచ్చినట్టుగా ఇలాంటి శవపేటికలు తయారు చేయించుకుంటారు

ఈ శీతల పెట్టెలు ప్రాచుర్యం పొందకముందు రెండు మూడు రోజుల్లోనే మేం శవాలను ఖననం చేసేవాళ్లం. ఆ తరవాత ఇతర కార్యక్రమాలకు తేదీల్ని నిర్ణయించేవాళ్లం.

ఇప్పుడైతే మూడు నుంచి ఆర్నెల్లపాటు మృతదేహాన్ని భద్రపరచడం ఆనవాయితీగా మారింది. ఏడాదిపాటు దాన్ని పొడిగించేవాళ్లూ ఉన్నారు.

చనిపోయిన కొద్ది రోజుల్లోనే మృతదేహాల్ని స్మశానానికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే కూడా వివాదాలు చెలరేగుతుంటాయి. ఇలాంటి అనుభవం స్వయంగా నాకే ఎదురైంది.

మా అమ్మ 90ఏళ్ల వయసులో చనిపోయారు. ఆమెను మూడు వారాల్లోనే సమాధి చేశాం. దాన్ని చాలామంది అపవిత్రంగా భావించారు. మా అమ్మపైన మాకు ప్రేమలేదనీ, అందుకే అంత త్వరగా సమాధి చేశామనీ నిందించారు.

అందుకే నాకు ఫ్రిజ్‌లపైన కూడా కోపమొస్తోంది. అవే లేకపోతే జనాలు ఇన్నిన్ని రోజులు శవాల్ని భద్రపరచరు. ఈ పిచ్చి బారిన పడకుండా ఉండేవారు.

(ఘనాకు చెందిన ఎలిజబెత్ ఒహీన్ అనే మహిళా జర్నలిస్టు రాసిన లేఖ ఇది)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)