స్పైడర్ మ్యాన్ : గాల్లో వేలాడే పిల్లాడ్ని కాపాడిన లైవ్ వీడియో

ఫొటో సోర్స్, FACEBOOK
నాలుగో అంతస్తు బాల్కనీలో నాలుగేళ్ల పిల్లాడు వేలాడుతున్నాడు. ఆ పిల్లాడి ప్రాణాలు గాల్లో ఉన్నాయి. కింద గుమికూడిన ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. హఠాత్తుగా ఒక 'స్పైడర్ మ్యాన్' అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మెట్లెక్కినట్లు చకచకా నాలుగు అంతస్తులు ఎక్కేసి, పిల్లాడిని కాపాడాడు. ఇది సినిమా కథ కాదు.. శనివారం నాడు ఫ్రాన్స్‌లో జరిగిన యదార్థ సంఘటన.
పిల్లాడ్ని కాపాడిన వ్యక్తి 'మాలి' దేశం నుంచి ఫ్రాన్స్‌కు వలస వచ్చిన 22 సంవత్సరాల 'మమాదు గస్సామా'.
ఆ విదేశీయుడికి ఫ్రాన్స్ ప్రధాని మాక్రోన్ ఆహ్వానం పంపారు. పిల్లాడ్ని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అతడి సాహసానికి మెడల్ బహూకరించి, ఫ్రాన్స్ పౌరసత్వంతోపాటు ఫైర్ సర్వీస్‌లో ఓ ఉద్యోగం కూడా ఇచ్చి గౌరవించారు.
పిల్లాడ్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిముషాల వ్యవధిలో బాల్కనీ నుంచి మరో బాల్కనీకి ఎగబాకి, నాలుగో అంతస్తులో వేలాడుతున్న పిల్లాడ్ని కాపాడటం ఆ వీడియోలో చూడొచ్చు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
గత సంవత్సరం స్వదేశం నుంచి ఎన్నో ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలు చేసి, ఫ్రాన్స్‌లో స్థిరపడటానికి వచ్చానని మమాదు గస్సామా తెలిపారు.
''నాకు ఆలోచించే వ్యవధి లేదు. ఆ పిల్లాడ్ని చూడగానే పరిగెత్తి వెళ్లాను. ఒక్కో అంతస్తు ఎక్కుతున్నపుడు నా ధైర్యం కూడా అంతకంతకూ పెరిగింది. పిల్లాడు గట్టిగా ఏడుస్తున్నాడు. వాడి కాలికి కూడా గాయం అయ్యింది. ఎలాగోలా రక్షించగలిగాను. ఆ దేవుడే నాకు సహాయం చేశాడు'' అన్నాడు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, AFP
ఆ సమయంలో పిల్లాడి ఇంట్లో ఎవ్వరూ లేరు. తల్లి ఊళ్లో లేదు. తండ్రి ఉన్నా, పిల్లాడ్ని అలా వదిలి వెళ్లినందుకు అతడిని పోలీసులు విచారిస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








