విదేశీ యువకులను ప్రలోభపెట్టి యుద్ధంలోకి నెడుతున్న రష్యన్ మహిళ - బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్

రష్యా, యుక్రెయిన్, మహిళ, సైన్యం, యుద్ధం

ఫొటో సోర్స్, Telegram

    • రచయిత, నవాల్ అల్ మఘాఫీ
    • హోదా, సీనియర్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ కరెస్పాండెంట్
    • రచయిత, షీదా కిరణ్
    • హోదా, బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్స్

ఒక వీడియోలో, ఒమర్(అసలు పేరు కాదు) పాస్‌పోర్ట్ కాలిపోతూ కనిపిస్తుంది. "ఇది బాగా కాలుతోంది" అని వీడియోలో కనిపించని ఓ మహిళ రష్యన్ భాషలో అనడం వినిపిస్తుంది.

సిరియాకు చెందిన 26 ఏళ్ల ఒమర్ ఓ నిర్మాణ కార్మికుడు. దాదాపు 9 నెలలుగా రష్యా తరఫున యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న సమయంలో, ఆ వీడియో క్లిప్ ఆయన ఫోన్‌కు వచ్చింది.

ఆమె గొంతు ఒమర్‌కు తెలుసు. ఆమె పేరు పోలినా అలెగ్జాండ్రావ్నా అజార్నిఖ్. మంచి జీతం, రష్యన్ పౌరసత్వం ఇప్పిస్తానని హామీ ఇచ్చి, సైన్యంలో చేరేలా ఒప్పందం కుదర్చడంలో ఆమె సాయం చేశారని ఆయన చెప్పారు. కానీ, ఇప్పుడామె చాలా కోపంగా ఉన్నారు.

తాను ఈ యుద్ధంలో ఎలా చిక్కుకున్నారో, ఎంత భయాందోళనకు గురయ్యారో యుక్రెయిన్ నుంచి వరుస వాయిస్ మెసేజ్‌ల ద్వారా ఒమర్ వివరించారు. భద్రతా కారణాల రీత్యా మారుపేరుతో ఆయన ఈ మెసేజ్‌లు పంపించారు.

తనకు 3,000 డాలర్లు (సుమారు రూ. 2,70,000) చెల్లిస్తే ప్రత్యక్ష యుద్ధంలో కాకుండా మరో పని అప్పగించేలా తాను చూసుకుంటానని ఆమె హామీ ఇచ్చారని ఒమర్ చెబుతున్నారు. కానీ, కేవలం పది రోజుల శిక్షణ అనంతరం ఆయన్ను నేరుగా యుద్ధభూమికి పంపించారు. దీంతో ఒమర్ డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడంతో ఆయన పాస్‌పోర్టును అజార్నిఖ్ తగలబెట్టారు.

తాను ఒక మిషన్‌కు వెళ్లేందుకు నిరాకరించగా, చంపేస్తామని లేదంటే జైల్లో పెడతామని తనను కమాండర్లు బెదిరించారని ఒమర్ చెప్పారు.

"మేం మోసపోయాం.. ఆమె ఓ మోసగత్తె, అబద్ధాలకోరు."

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ 40 ఏళ్ల మాజీ ఉపాధ్యాయురాలు అజార్నిఖ్.. తన టెలిగ్రామ్ చానల్ ద్వారా, రష్యా సైన్యంలో చేరేలా బీద దేశాల యువకులను ఎలా ప్రలోభపెడుతున్నారో బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది.

మాజీ టీచర్ అజార్నిఖ్ నవ్వుతూ కనిపిస్తున్న వీడియో సందేశాలు, ఆకర్షణీయమైన పోస్టులు 'మిలిటరీ సర్వీస్' (సైనిక సేవ), 'ఒక సంవత్సరం కాంట్రాక్ట్' వంటి ఆఫర్లు ఇస్తున్నాయి.

రష్యాలోకి ప్రవేశించి, సైన్యంలో చేరేందుకు అనుమతించే పత్రాలను ఆమె 'ఇన్విటేషన్'ల పేరుతో పంపించినట్లు, అలాంటి దాదాపు 500 కేసులను బీబీసీ వరల్డ్ సర్వీస్ గుర్తించింది.

వీరిలో ఎక్కువ మంది సిరియా, ఈజిప్ట్, యెమెన్‌ దేశాలకు చెందిన పురుషులు ఉన్నారు, సైన్యంలో చేరేందుకు తమ పాస్‌పోర్ట్ వివరాలను కూడా ఆమెకు పంపించినట్లు కనిపిస్తోంది.

అజార్నిఖ్ తమను తప్పుదారి పట్టించారని, వారిని యుద్ధానికి పంపించబోమని చెప్పి మోసం చేశారని, అలాగే ఏడాది వరకు అక్కడి నుంచి బయటకు రాలేరన్న విషయాన్ని కూడా ఆమె చెప్పలేదని, ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరించేవారని.. సైన్యంలో చేరిన చాలామందితోపాటు వారి బంధువులు కూడా బీబీసీకి తెలిపారు.

ఇదే విషయమై, అజార్నిఖ్‌ను బీబీసీ సంప్రదించినప్పుడు, ఆమె ఈ ఆరోపణలను ఖండించారు.

అజార్నిఖ్ ద్వారా సైన్యంలో చేరిన తమ వారు మరణించారని లేదా కనిపించకుండా పోయారని 12 కుటుంబాలవారు బీబీసీకి తెలిపారు.

రష్యా, యుక్రెయిన్, మహిళ, సైన్యం, యుద్ధం

ఫొటో సోర్స్, Telegram

ఫొటో క్యాప్షన్, ఒమర్ పాస్‌పోర్టును తగలబెట్టి, దానిని వీడియో తీసి పంపించారు అజార్నిఖ్.

దేశీయంగా నిర్బంధ సైనిక శిక్షణను రష్యా మరింత విస్తృతం చేసింది. అలాగే, ఖైదీలను కూడా సైన్యంలో చేర్చుకుంది. యుద్ధంలో భారీ నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ.. యుక్రెయిన్‌లో తన కార్యాకలాపాలను కొనసాగించేందుకు పెద్ద మొత్తంలో ఆకర్షణీయమైన బోనస్‌లు అందిస్తోంది.

నాటో వివరాల ప్రకారం, 2022లో యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు రష్యాకు చెందిన 10 లక్షలకుపైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు లేదా గాయాలపాలయ్యారు. కేవలం 2025 డిసెంబర్‌లోనే 25 వేల మంది సైనికులు మృతి చెందినట్టు నాటో పేర్కొంది.

బీబీసీ న్యూస్ రష్యా పరిశోధన ప్రకారం.. సంతాప ప్రకటనలు, బహిరంగంగా అందుబాటులో ఉన్న ఇతర రికార్డుల ఆధారంగా చూస్తే ఈ ఏడాది యుక్రెయిన్‌లో రష్యన్ సైనికుల మరణాలు గతంలో కంటే వేగంగా పెరిగినట్లు సూచిస్తున్నాయి.

ఎంతమంది విదేశీయులు రష్యా సైన్యంలో చేరారో కచ్చితంగా చెప్పడం కష్టమే. అయినప్పటికీ, బీబీసీ రష్యా తన పరిశోధనలో విదేశీ సైనికుల మరణాలు, గాయాలపాలవడం గురించి కూడా పరిశీలించింది. దాని ప్రకారం, క్యూబా, నేపాల్, ఉత్తర కొరియా వంటి దేశాలకు చెందిన కనీసం 20 వేల మంది విదేశీయులు రష్యా సైన్యంలో చేరి ఉండవచ్చని అంచనా.

ఈ యుద్ధంవల్ల యుక్రెయిన్ కూడా భారీ నష్టాలను చవిచూసింది. తన సైన్యంలో కూడా విదేశీయులను సైనికులుగా చేర్చుకుంది.

రష్యా, యుక్రెయిన్, మహిళ, సైన్యం, యుద్ధం

ఫొటో సోర్స్, Roman Chop/Global Images Ukraine via Getty Images

ఫొటో క్యాప్షన్, 2022లో ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 లక్షలకుపైగా రష్యన్ సైనికులు మరణించడం లేదా గాయపడినట్లు నాటో చెబుతోంది.

'ఎక్కడ చూసినా శవాలే'

తనతో పాటు 14 మంది సిరియన్ యువకులు 2024 మార్చిలో, మాస్కో విమానాశ్రయంలో చిక్కుకుపోయినప్పుడు ఒమర్‌కు అజార్నిఖ్‌తో మొదటిసారి పరిచయం ఏర్పడింది.

సిరియాలో ఉద్యోగాలు అంతంతమాత్రమే. జీతాలు కూడా చాలా తక్కువ. రష్యాలోని చమురు కేంద్రాలకు కాపలాగా ఉండే ఉద్యోగమని అక్కడి రిక్రూటర్ తమతో చెప్పారని ఒమర్ తెలిపారు. కానీ, మాస్కోకు వచ్చిన తర్వాత.. తాము మోసపోయినట్లు వారికి అర్థమైంది.

ఇతర ఉద్యోగావకాశాల కోసం ఆన్‌లైన్‌లో చూస్తున్నప్పుడు.. వారిలో ఒకరు అజార్నిఖ్ చానల్‌ను చూసి ఆమెకు మెసేజ్ చేసినట్టు ఒమర్ చెప్పారు.

కొన్ని గంటల్లోనే ఆమె విమానాశ్రయానికి వచ్చి, వారిని రైలులో పశ్చిమ రష్యాలోని బ్రయాన్స్క్‌లోని రిక్రూట్‌మెంట్ కేంద్రానికి తీసుకెళ్లారు.

అక్కడ ఆమె, రష్యా సైన్యంలో పనిచేసేలా ఒక ఏడాది కాంట్రాక్ట్‌ను ఆఫర్ చేశారు. నెలకు సుమారు 2,500 డాలర్ల జీతం( దాదాపు రూ. 2,25,000), చేరడంతోనే 5,000 డాలర్ల(సుమారు రూ. 4,50,000) బోనస్ కూడా ఉంటుందని చెప్పారు. సిరియాలో కనీసం వారి ఊహకు కూడా అందనంత డబ్బు అది.

ఒమర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆ కాంట్రాక్టులు రష్యన్ భాషలో ఉన్నాయి. వారిలో ఎవరికీ అర్థం కాలేదు. అలాగే, రష్యన్ పౌరసత్వం ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఆమె వారి పాస్‌పోర్టులు కూడా తీసుకున్నారు. అంతేకాదు, తమకు వచ్చే బోనస్‌లో నుంచి 3,000 డాలర్లు (సుమారు రూ. 2,70,000) తనకు ఇస్తే, నేరుగా యుద్ధక్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని ఆమె హామీ ఇచ్చారని ఒమర్ చెప్పారు.

కానీ, కేవలం పది రోజుల శిక్షణ ఇచ్చి, ఎలాంటి సైనిక అనుభవం లేనప్పటికీ, నెలరోజుల్లోనే తనను యుద్ధభూమికి పంపారని ఒమర్ చెప్పారు.

"నూటికి నూరు శాతం మేం ఇక్కడే చచ్చిపోతాం" అని ఆయన బీబీసీ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు పంపిన వాయిస్ మెసేజ్‌లో పేర్కొన్నారు.

"ఎన్నో గాయాలు, నిరంతరం పేలుళ్లు, విపరీతమైన షెల్లింగ్. మీరు పేలుళ్లలో చనిపోకపోయినా, మీద పడే శిథిలాలే చంపేస్తాయి" అని 2024 మేలో ఆయన చెప్పారు.

"ఎక్కడ చూసినా శవాలే.. శవాల మీద నుంచి నడిచాను కూడా, దేవుడా నన్ను క్షమించు" అని ఆ మరుసటి నెలలో మాట్లాడినప్పుడు ఆయన తెలిపారు.

"ఎవరైనా చనిపోతే, వాళ్లను చెత్త బ్యాగ్‌లో వేసి చెట్టు కింద పడేయడం నా కళ్లారా చూశాను" అని కూడా ఆయన అన్నారు.

2022లో వచ్చిన ఒక రష్యన్ ఆదేశం ప్రకారం, యుద్ధం ముగిసే వరకు సైనికుల కాంట్రాక్టులను తమంతట తాముగా పొడిగించే అధికారం సైన్యానికి ఉందని, ఈ విషయాన్ని అజార్నిఖ్ ముందుగా చెప్పలేదని దాదాపు ఏడాది తర్వాత ఒమర్‌కు తెలిసింది.

"వారు ఒప్పందాన్ని పొడిగిస్తే, నేను అయిపోతాను, దేవుడా!!" అని ఒమర్ అన్నారు.

ఆయన కాంట్రాక్ట్‌ను పొడిగించారు.

రష్యా, యుక్రెయిన్, మహిళ, సైన్యం, యుద్ధం

ఫొటో సోర్స్, Telegram

ఫొటో క్యాప్షన్, కొత్తగా భర్తీ చేసిన వారితో అజార్నిఖ్

అజార్నిఖ్ ద్వారా నియమితులైన ఒమర్‌తో సహా 8 మంది విదేశీ సైనికులతో, అలాగే కనిపించకుండాపోయిన లేదా చనిపోయినట్లు భావిస్తున్న 12 మంది యువకుల కుటుంబ సభ్యులతో బీబీసీ మాట్లాడింది.

వారిలో ఎక్కువ మంది అజార్నిఖ్ తమను తప్పుదోవ పట్టించారని లేదా మోసం చేశారని విశ్వసిస్తున్నారు. వీరికి తమను సైన్యంలోకి తీసుకుంటున్నట్లు తెలిసినప్పటికీ, నేరుగా యుద్ధానికి పంపుతారని ఊహించలేదని వారు అంటున్నారు. ఒమర్ మాదిరిగానే, చాలామంది తమకు తగినంత శిక్షణ ఇవ్వలేదని లేదా ఏడాది తర్వాత తిరిగి వచ్చేయొచ్చని అనుకున్నారు.

ఈజిప్టుకు చెందిన యూసఫ్ (పేరు మార్చాం) బీబీసీతో మాట్లాడుతూ, తన అన్నయ్య మొహమ్మద్ 2022లో రష్యాలోని యెకాటెరిన్‌బర్గ్ నగరంలోని యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లారని, కానీ ఫీజు చెల్లించడం ఇబ్బందిగా మారిందని చెప్పారు.

పోలినా అనే రష్యన్ మహిళ ఆన్‌లైన్ ద్వారా సహాయం చేస్తున్నారని, రష్యన్ సైన్యం కోసం పనిచేయడం ద్వారా తన చదువు కొనసాగించే అవకాశం కూడా ఉందని కుటుంబ సభ్యులతో తన సోదరుడు చెప్పినట్లు యూసఫ్ చెప్పారు.

"వసతి, పౌరసత్వం, నెలవారీ ఖర్చులకు ఆమె ఇచ్చారు" అని యూసుఫ్ తెలిపారు.

"కానీ, అకస్మాత్తుగా మొహమ్మద్‌ను యుక్రెయిన్‌కు పంపారు. యుద్ధంలో చిక్కుకున్నట్లు ఆయనకు అర్థమైంది" అని యూసఫ్ చెప్పారు.

తన సోదరుడు మొహమ్మద్‌తో 2024 జనవరి 24న చివరిసారి మాట్లాడారు యూసఫ్. దాదాపు ఏడాది తర్వాత, టెలిగ్రామ్‌లో రష్యన్ నంబర్ నుంచి యూసఫ్‌కు ఒక మెసేజ్ వచ్చింది, అందులో మొహమ్మద్ మృతదేహం ఫోటోలు ఉన్నాయి. ఆయన దాదాపు ఏడాది క్రితమే మరణించారని కుటుంబానికి తర్వాత తెలిసిందని యూసఫ్ చెప్పారు.

రష్యా, యుక్రెయిన్, మహిళ, సైన్యం, యుద్ధం
ఫొటో క్యాప్షన్, హబీబ్, అజార్నిఖ్ ఇద్దరూ దాదాపు మూడేళ్లపాటు రష్యాకు వీసా ఇన్విటేషన్‌ల విషయంలో కలిసి పనిచేశారు.

'కొంతమందికి పిచ్చిపట్టింది'

రష్యన్ సైన్యంలో పనిచేసిన మరో సిరియన్ హబీబ్. అజార్నిఖ్ రష్యా సైన్యానికి 'అత్యంత కీలకమైన రిక్రూటర్లలో ఒకరిగా' మారారని ఆయన చెప్పారు.

ఆయన కెమెరా ముందు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు, కానీ భద్రతా కారణాల వల్ల మారుపేరుతో మాట్లాడారు. అజార్నిఖ్‌తో కలిసి 'దాదాపు మూడేళ్లపాటు రష్యాకు వీసా ఇన్విటేషన్‌'ల విషయంలో కలిసి పనిచేసినట్టు హబీబ్ చెప్పారు.

అయితే, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించకపోవడంతో ఆయన పాత్రను బీబీసీ నిర్ధరించలేకపోయింది. 2024లో చేసిన ఒక సోషల్ మీడియా పోస్టులో ఆయన అజార్నిఖ్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది.

అజార్నిఖ్ రష్యాలోని నైరుతి వొరోనెజ్ ప్రాంతానికి చెందినవారు. ఆమె గతంలో అరబ్ విద్యార్థులు మాస్కోకు చదువు కోసం వచ్చేందుకు సాయంకోసం ఫేస్‌బుక్ గ్రూప్‌ను నడిపారు. 2024లో తన సొంత టెలిగ్రామ్ చానల్‌ మొదలుపెట్టారు.

చాలామంది విదేశీయులు ప్లాంట్లు, సంస్థలకు, చెక్‌పాయింట్ల వద్ద కాపలా వంటి పనులుగా భావించి వచ్చారని హబీబ్ చెప్పారు.

"ఇక్కడికి వస్తున్న అరబ్బులు వెంటనే చనిపోతున్నారు. కొందరు పిచ్చోళ్లయ్యారు, శవాలను చూడడం చాలా కష్టంగా అనిపిస్తుంది" అని ఆయన అన్నారు.

తాను ఒక సైనిక శిక్షణ కేంద్రంలో ఒమర్‌, సిరియన్ యువకుల బృందాన్ని కలిసినట్లు హబీబ్ చెప్పారు.

"ఆమె వారికి పౌరసత్వం, మంచి జీతం, భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇక్కడ ఒక్కసారి కాంట్రాక్ట్‌పై సంతకం చేస్తే బయటకు వెళ్లడమనేది ఉండదు" అని ఆయన అన్నారు.

"ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో వాళ్లెవరికీ తెలియదు. వారిపై కాల్పులు జరిపినా, తిరిగి కాల్చలేరు. కాల్పులు జరపకపోతే, చచ్చిపోతారు."

"వాళ్లు చనిపోతారని తెలిసినా పోలినా వాళ్లను తీసుకెళ్లేవారు" అని ఆయన అన్నారు.

ఆమె ఒక్కో వ్యక్తి నియామకానికి సంబంధించి, సైన్యం నుంచి 300 డాలర్లు(సుమారు 27 వేల రూపాయలు) అందుకునేవారని హబీబ్ తెలిపారు.

బీబీసీ దీనిని ధ్రువీకరించలేకపోయింది. అయితే, అలా నియమితులైన ఇతరులు కూడా హబీబ్‌కు డబ్బు చెల్లింపులను తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

రష్యా, యుక్రెయిన్, మహిళ, సైన్యం, యుద్ధం

ఫొటో సోర్స్, Telegram

ఫొటో క్యాప్షన్, బీబీసీపై పరువు నష్టం దావా వేస్తానని అజార్నిఖ్ బెదిరించారు.

'ఏదీ ఉచితంగా రాదు'

2024 మధ్య నుంచి అజార్నిఖ్ తన పోస్టులలో.. నియామకాలు పొందే వ్యక్తులు 'యుద్ధంలో పాల్గొనాల్సి ఉంటుంది' అని స్పష్టంగా కనిపించడం మొదలైంది. విదేశీ సైనికుల మరణాల ప్రస్తావన కూడా ఉంది.

"మీరు యుద్ధానికి వెళ్తున్నారని మీ అందరికీ బాగా తెలుసు" అని 2024 అక్టోబర్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో ఆమె అన్నారు.

"ఏం చేయాల్సిన అవసరం లేదు, ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉంటే.. రష్యన్ పాస్‌పోర్ట్ వస్తుందని అనుకుంటున్నారా? ఏదీ ఫ్రీగా రాదు" అని ఆమె అందులో అన్నారు.

అదే ఏడాది, మరో సందర్భంలో.. సైన్యంలో ఉన్న యువకుడి తల్లికి అజార్నిఖ్ పంపిన వాయిస్ మెసేజ్ బీబీసీ విన్నది. అందులో, "రష్యన్ సైన్యం గురించి చెడుగా పోస్టులు పెడుతున్నావు" అంటూ.. ఆమెను బూతులు తిడుతూ.. "నీ కొడుకు ప్రాణాలకే ప్రమాదం, నీ సంగతి, నీ పిల్లల సంగతి తేలుస్తాను" అంటూ అజార్నిఖ్ బెదిరించారు.

అజార్నిఖ్‌ను సంప్రదించేందుకు బీబీసీ అనేక ప్రయత్నాలు చేసింది. మొదట్లో, బీబీసీ రష్యా అడిగినప్పుడు ఇంటర్వ్యూ ఇస్తానని ఆమె చెప్పారు, కానీ భద్రతా సమస్యల కారణంగా బీబీసీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.

నియమాకాలు పొందిన వ్యక్తులకు యుద్ధంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండా వేరే పని ఇస్తామని హామీ ఇచ్చారా? అని ఫోన్‌లో బీబీసీ అడిగినప్పుడు, ఆమె ఫోన్ కట్ చేశారు.

తరువాత బీబీసీ 'ప్రొఫెషనల్ కాదు' అని, పరువు నష్టం కేసు పెడతానంటూ బెదిరిస్తూ అజార్నిఖ్ వాయిస్ మెసేజ్ పంపించారు.

ఈ వ్యవహారంపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖలను బీబీసీ సంప్రదించింది. కానీ, ఎలాంటి స్పందనా రాలేదు.

రష్యా, యుక్రెయిన్, మహిళ, సైన్యం, యుద్ధం

ఫొటో సోర్స్, Telegram

ఫొటో క్యాప్షన్, జనవరి 2024లో అజార్నిఖ్ టెలిగ్రామ్ చానల్‌లో షేర్ చేసిన ఫోటోలో హబీబ్ ఆమెతో ఉన్నట్లు కనిపిస్తోంది.

'నగదు ప్రోత్సాహకాలు'

అజార్నిఖ్ వంటి వ్యక్తులు రష్యన్ సైన్యం కోసం పనిచేస్తున్న అనధికారిక నియామక నెట్‌వర్క్‌లో భాగమని ఈ కేసును ట్రాక్ చేస్తున్న జర్నలిస్టులు, పరిశోధకులు చెబుతున్నారు.

రష్యన్ సైన్యంలో చేరడానికి అరబిక్‌లో ఆఫర్ చేస్తున్న మరో రెండు టెలిగ్రామ్ అకౌంట్లను బీబీసీ గుర్తించింది. ఒకటి ఇన్విటేషన్ లెటర్, పేర్ల జాబితాను చూపించగా, మరొకటి "ఎలైట్ బెటాలియన్"లో చేరడానికి పెద్దయెత్తున బోనస్‌లను ప్రకటించింది.

సెప్టెంబర్‌లో, యువకులను ఉద్యోగ ఆఫర్లతో ఆకర్షించి యుక్రెయిన్లో యుద్ధానికి పంపే అక్రమ రవాణా ముఠాను ఛేదించినట్లు కెన్యా పోలీసులు తెలిపారు.

"రష్యాలోని కొన్ని స్థానిక, మునిసిపల్ యంత్రాంగాలు.. రష్యన్లు లేదా విదేశీయులను సైన్యంలో చేర్చే హెచ్‌ఆర్ నిపుణులు, స్థానికులకు 4,000 డాలర్ల( సుమారు రూ. 3,62,000) వరకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు" అని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ పరిశోధకురాలు కాటెరినా స్టెపనెంకో బీబీసీతో చెప్పారు.

"ప్రారంభంలో నియామకాల కోసం వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ గ్రూప్, జైళ్లు వంటి పెద్ద సంస్థలను రష్యా ఉపయోగించిందని, 2024 నుంచి స్థానిక వ్యక్తులు, చిన్న కంపెనీలను కూడా ఉపయోగించుకుంటోంది" అని ఆమె చెప్పారు.

హబీబ్ ఇప్పుడు సిరియాకు తిరిగి వచ్చారు. తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి అనేక మంది కమాండర్లకు లంచం ఇచ్చానని ఆయన చెబుతున్నారు.

ఒమర్ చివరికి రష్యన్ పౌరసత్వం పొందారు. సిరియాకు తిరిగి వచ్చారు. సైన్యంలో పనిచేసిన ఇద్దరు సిరియన్ యువకులు మరణించినట్లు వారి కుటుంబాలు తెలిపాయి.

"ఆమె మమ్మల్ని కేవలం నంబర్స్ లేదా డబ్బుగా మాత్రమే చూస్తుంది, మనుషులుగా చూడదు" అని అజార్నిఖ్ గురించి ఒమర్ అన్నారు.

"మాకు చేసిన దానికి మేం ఆమెను ఎప్పటికీ క్షమించం."

అదనపు రిపోర్టింగ్: ఓల్గా ఇవ్షినా, గెహాద్ అబ్బాస్, అలీ ఇబ్రహీం, విక్టోరియా అరకేలియన్, రేయాన్ మారౌఫ్.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)