వీపీఎఫ్ అంటే ఏమిటి ? పీపీఎఫ్ కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే, పన్నును ఆదా చేసే ఈ పెట్టుబడి పథకం గురించి తెలుసా?

పెట్టుబడి పథకం

ఫొటో సోర్స్, Getty Images

చాలామంది దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం, పన్నులను ఆదా చేసుకునేందుకు పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడుతుంటారు. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.

అయితే, పీపీఎఫ్ కంటే ఎక్కువ రాబడులను అందించే మరో పెట్టుబడి పథకం కూడా ఉంది. అదే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్).

ఆ పెట్టుబడి పథకం ఏంటి? ఎవరికి ఇది అనువైనది? వీపీఎఫ్‌కు పీపీఎఫ్‌కు తేడా ఏంటి? ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పీపీఎఫ్ గురించి..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చాలా మంచి, సురక్షితమైన పథకం.

పీపీఎఫ్ అకౌంట్ తెరిచేందుకు వయసుకు సంబంధించి ఎలాంటి నిబంధన లేదు. ఏ వయసు వ్యక్తి అయినా ఈ ఖాతాను తెరవవచ్చు.

అయితే ప్రతి ఏడాది పీపీఎఫ్‌లో కనీసం రూ.500ను, గరిష్ఠంగా రూ.లక్షన్నర డిపాజిట్ చేయాలి. ఈ పథకం ప్రస్తుతం 7.1 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

ఈ అకౌంట్ 15 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. 15 ఏళ్ల తర్వాత చాలామంది ఈ పెట్టుబడి పథకంలో పెట్టిన డబ్బులను ఉపసంహరించుకుని, ఖర్చు పెట్టుకుంటారు. కొంతమంది పీపీఎఫ్ టెన్యూర్‌ను పెంచుకుంటారు.

ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం డబ్బును ఒకేసారి లేదంటే ప్రతి నెలా కొంత చొప్పున కూడా జమ చేయొచ్చు.

పీపీఎఫ్‌ ఖాతాకు కాలవ్యవధి 15 ఏళ్లు. అంటే, ఈ కాలవ్యవధి పూర్తయిన తర్వాత మీ మొత్తం డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు.

అయితే, ఏదైనా కారణం వల్ల మీకు అకస్మాత్తుగా డబ్బులు అవసరం పడితే, ఆరేళ్ల తర్వాత మీ పీపీఎఫ్ ఖాతా నుంచి కొంత డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.

డబ్బులను విత్‌డ్రా చేసుకునేటప్పుడు, మీ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తాన్నిబట్టి విత్‌డ్రాయల్ లిమిట్‌ను నిర్ణయిస్తారు.

మెచ్యూరిటీకి ముందే మీ పీపీఎఫ్ ఖాతాను క్లోజ్ చేయాలనుకుంటే, మీరు ఆర్జించే వడ్డీ తగ్గుతుండొచ్చు. అందుకే, ఈ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

మనీ

ఫొటో సోర్స్, Getty Images

వీపీఎఫ్ అంటే?

ప్రతినెలా ఉద్యోగుల జీతం నుంచి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డబ్బులను డిడక్ట్ చేస్తారు.

అయితే, ఈపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టేందుకు సురక్షితమైన, పన్నులను ఆదా చేసుకునే మరో ఆప్షన్ కూడా ఉంది. అదే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్). దీని నుంచి కూడా మంచి రాబడులను పొందవచ్చు.

వేతనం పొందే ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్లకు అదనంగా పెట్టే పెట్టుబడే ఈ ఫండ్.

ఈపీఎఫ్ అనేది ఉద్యోగి నుంచి తప్పనిసరిగా జమచేసే వాటా అయితే, వీపీఎఫ్ అనేది స్వచ్ఛందంగా తీసుకునేది.

జీతం నుంచి డిడక్ట్ చేయాల్సిన 12 శాతం మొత్తాన్ని తీసివేసిన తర్వాత, దీనికి అదనంగా కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు.

దీన్ని కేవలం ఉద్యోగి మాత్రమే చెల్లిస్తారు. కంపెనీ లేదా ఎంప్లాయర్ ఈ ఆప్షన్‌కు కంట్రిబ్యూట్ చేయదు.

దీనిలో పీపీఎఫ్ కంటే ఎక్కువ రాబడులు వస్తాయి. అలాగే, పీపీఎఫ్ మాదిరి పన్ను ఆదా ప్రయోజనాలను పొందవచ్చు.

2025 నవంబర్ నెలలో పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. అయితే, వీపీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతం.

ఈపీఎఫ్ వడ్డీ రేటు, వీపీఎఫ్ వడ్డీ రేటు ఎల్లప్పుడూ ఒకేవిధంగా ఉంటుంది. ఈ వడ్డీ రేటు పీపీఎఫ్ వడ్డీ రేటు కంటే ఎక్కువ. వీపీఎఫ్-ఈపీఎఫ్ వడ్డీ రేట్లు పీపీఎఫ్ కంటే ఎక్కువగా ఉన్నాయి.

డబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

వీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం ఎలా?

వీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం చాలా తేలిక. దీని కోసం మీ ఆఫీసులోని అకౌంట్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించి, వీపీఎఫ్ ఖాతాను తెరుచుకోవచ్చు.

ప్రతినెలా ఎంత మొత్తంలో డిపాజిట్ చేయాలనుకుంటున్నారో వారికి తెలియజేయాలి.

ఆ తర్వాత నుంచి ప్రతి నెలా మీ జీతం నుంచి వీపీఎఫ్ కోసం కొంత మొత్తం డిడక్ట్ అవుతుంది.

ఉద్యోగాలు మారినప్పుడు, అదే యూఏఎన్ నెంబర్ ద్వారా మీ ఈపీఎఫ్, వీపీఎఫ్ డబ్బులను ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చు.

డబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

వీపీఎఫ్‌పై వచ్చే పన్ను ప్రయోజనమెంత?

పీపీఎఫ్ మాదిరిగానే పన్ను ప్రయోజనాలను వీపీఎఫ్ అందిస్తోంది. ఆదాయపు పన్నుకు చెందిన సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

వీపీఎఫ్‌లో పెట్టిన పెట్టుబడులకు, వాటిపై ఆర్జించిన వడ్డీకి, మెచ్యూరిటీ సమయంలో పొందిన మొత్తానికి.. మూడింటికీ పన్ను ఉండదు.

దీన్నే ఈఈఈ (EEE) అంటారు. అంటే, ఎగ్జెంట్ – ఎగ్జెంట్ – ఎగ్జెంట్ కేటగిరీ.

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,000 వరకు ఈపీఎఫ్, వీపీఎఫ్‌లో పన్ను రహిత (ట్యాక్స్-ఫ్రీ) పెట్టుబడులు పెట్టుకోవచ్చు.

ఒకవేళ ఈపీఎఫ్-వీపీఎఫ్‌లలో ఉద్యోగి వాటా రూ. 2.5 లక్షలకు మించితే, ఆ అదనపు మొత్తంపై ఆర్జించే వడ్డీకి పన్ను విధిస్తారు. ఎంప్లాయర్ వాటా పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది.

వీపీఎఫ్‌కు లాకిన్ వ్యవధి ఈపీఎఫ్ మాదిరిగానే ఉంటుంది. అంటే, పీఎఫ్ నుంచి డబ్బులు ఉపసంహరించుకునేటప్పుడు ఎలాంటి షరతులు ఉంటాయో అవి ఇక్కడ కూడా వర్తిస్తాయి.

కొంత మనీని విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అయితే, అకౌంట్ తెరిచి, కనీసం ఐదేళ్లు అయితేనే పన్ను ఊరట లభిస్తుంది.

(గమనిక: ఈ వ్యాసంలో అందించిన సమాచారం ఆర్థిక పరిజ్ఞానం కోసమే. దీనిని ఆర్థిక సలహాగా భావించకూడదు. పాఠకులు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సొంతంగా పరిశోధన చేసి లేదా ఆర్థిక సలహాదారుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నాం. ఈ సమాచారం ఆధారంగా చేసిన పెట్టుబడుల వల్ల కలిగే ఏదైనా ఆర్థిక నష్టానికి BBC తెలుగు బాధ్యత వహించదు.)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)