పీఎఫ్ విత్‌డ్రా- కొత్త మార్పులు: 72 గంటల్లో రూ. 5 లక్షలు తీసుకోవచ్చు

ఫొటో సోర్స్, Getty Images
ఖాతాదారులు ఇప్పుడు ఆటో సెటిల్మెంట్ కింద 5 లక్షల రూపాయలు విత్‌డ్రా(ఉపసంహరణ) చేసుకోవచ్చని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ - ఈపీఎఫ్‌వో) ప్రకటించింది. కేవలం 72 గంటల్లోనే ఈ విత్‌డ్రా ప్రక్రియ పూర్తవుతుంది. గతంలో ఈ పరిమితి లక్ష రూపాయలుగా ఉండేది.
పీఎఫ్ మొత్తం నుంచి అడ్వాన్స్ తీసుకునేందుకు ఈపీఎఫ్‌వో ఆటో సెటిల్మెంట్ పరిమితిని లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇప్పుడు పీఎఫ్‌లో నుంచి అడ్వాన్స్ మొత్తాన్ని 72 గంటల్లో తీసుకోవచ్చని ఆయన అందులో రాశారు. అంటే, ఆటో సెటిల్మెంట్ కింద అప్లై చేసిన దరఖాస్తులు (క్లెయిమ్స్)కేవలం 3 రోజుల్లోనే పరిష్కారమవుతాయి.
మాన్సుఖ్ మాండవీయ పోస్ట్ ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 89.52 లక్షల ఆటో క్లెయిమ్స్(ఆటో సెటిల్మెంట్ దరఖాస్తులు) సెటిల్ అయ్యాయి. 2024 - 25లో ఆ సంఖ్య 2.32 కోట్లకు చేరింది. అంటే, ఒక్క ఏడాదిలో ఆటో క్లెయిమ్స్ సెటిల్మెంట్లలో 161 శాతం పెరుగుదల నమోదైంది.

EPFO ఆటో-సెటిల్మెంట్ అంటే ఏమిటి?
ఆటో సెటిల్మెంట్ అనేది.. త్వరితగతిన క్లెయిమ్స్‌ను సెటిల్ చేసేందుకు మానవ ప్రమేయం లేకుండా ఏర్పాటైన ఈపీఎఫ్‌వోలోని ఒక వ్యవస్థ. డిజిటల్ వెరిఫికేషన్, అల్గారిథమ్స్ ఆధారంగా ఆటోమేటిక్‌గా క్లెయిమ్స్ ఆమోదం పొందుతాయి.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఖాతాదారులకు త్వరితగతిన ఆర్థిక సాయం అందించేందుకు ఈపీఎఫ్‌వో తొలిసారి అడ్వాన్స్ క్లెయిమ్స్ ఆటో సెటిల్మెంట్‌ను ప్రారంభించింది.
అనారోగ్యం, పిల్లల విద్య, వివాహం లేదా ఇంటి నిర్మాణం వంటి అవసరాల కోసం పీఎఫ్ నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
2024 - 25లో, అన్ని అడ్వాన్స్ క్లెయిమ్స్‌లో 59 శాతం క్లెయిమ్స్ ఈ ఆటో మోడ్ ద్వారా సెటిల్ అయ్యాయి.
మీ బ్యాంక్ అకౌంట్‌తో మీ యూఏఎన్(యూనివర్సల్ అకౌంట్ నంబర్), ఆధార్, పాన్ లింక్ అయి ఉండి, కేవైసీ పూర్తి చేసి ఉన్నట్లయితే, మీ క్లెయిమ్ త్వరగా సెటిల్ అవుతుంది.
అయితే, నిర్దేశిత క్లెయిమ్స్‌కు మాత్రమే ఈ ఆటో సెటిల్మెంట్ సౌకర్యం అందుబాటులో ఉంది. అనారోగ్య కారణాలు, పిల్లల చదువు, వివాహం, గృహ నిర్మాణం వీటిలో ఉన్నాయి.
సాధారణంగా, మాన్యువల్ క్లెయిమ్స్ (మామూలు దరఖాస్తులు) ప్రక్రియకు రెండు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది. అయితే, ఆటో సెటిల్మెంట్‌కు 72 గంటలు మాత్రమే పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
పీఎఫ్ సొమ్మును ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేసుకోవడం ఎలా?
ప్రావిడెంట్ ఫండ్ సొమ్మును ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా మీరు మీ యూఏఎన్ నంబర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత, యూఏఎన్ నంబర్‌ను మీ ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలి.
యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత, ఈపీఎఫ్‌వో మెంబర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం మరో వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వివరాలు నమోదు చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత, ఆన్‌లైన్ సర్వీసెస్(సేవలను)కు వెళ్లి, క్లెయిమ్ (ఫారమ్ -31, 19, 10-c) ఎంచుకోవాలి. ముందుగా బ్యాంకు అకౌంట్ వివరాలను ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాత, మీ క్లెయిమ్‌ను సమర్పించవచ్చు(సబ్మిట్ చేయొచ్చు).

ఫొటో సోర్స్, Getty Images
ఈపీఎఫ్‌లో ఎంత వడ్డీ వస్తుంది?
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ప్రకారం, ఉద్యోగి బేసిక్ జీతంలో నుంచి 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది. యజమాని లేదా యాజమాన్య సంస్థ కూడా అంతే మొత్తాన్ని జత చేస్తుంది.
అయితే, యజమాని లేదా యాజమాన్య సంస్థ జత చేసే సొమ్ము మొత్తం మీ ఈపీఎఫ్ ఖాతాకు వెళ్లదు. అందులో 8.67 శాతం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్)లో జమ అవుతుంది, అయితే అది రూ.1250కి మించదు. మిగిలిన మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది.
ఈపీఎఫ్ మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80-C కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. గరిష్ఠ పరిమితి ఏడాదికి రూ.1.50 లక్షలు (పాత ట్యాక్స్ విధానంలో).
ఈపీఎఫ్‌వో వడ్డీ రేటు ప్రతి ఏటా మారొచ్చు. ఈపీఎఫ్‌వో సిఫార్సుల ఆధారంగా కేంద్రం వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. 2024-25 సంవత్సరానికి గానూ వడ్డీ రేటును 8.25 శాతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏటీఎం కార్డుతో పీఎఫ్ సొమ్ము విత్‌డ్రా చేసుకోవచ్చా?
ఖాతాదారులకు త్వరలో ఏటీఎం కార్డ్ లేదా యూపీఐ ద్వారా పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించాలని యోచిస్తోంది ఈపీఎఫ్‌వో.
పీటీఐ కథనాల ప్రకారం, పీఎఫ్ సొమ్ము మొత్తంలో ఒక నిర్దిష్ట భాగాన్ని ఖాతాలోనే ఉంచి, మిగిలిన మొత్తాన్ని యూపీఐ లేదా ఏటీఎం కార్డ్ ద్వారా విత్‌డ్రా చేసుకునే వ్యవస్థను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రూపొందిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














