సముద్రంలో వదిలిన సీసా తెచ్చిన సందేశం.. 31 ఏళ్ల తర్వాత..

అలైనా బెరెస్‌ఫోర్డ్‌

ఫొటో సోర్స్, Alaina Beresford

ఫొటో క్యాప్షన్, స్కాట్లాండ్‌లోని మోరేలో పోర్ట్‌నాకీలో అలైనా బెరెస్‌ఫోర్డ్‌ నివసిస్తున్నారు.
    • రచయిత, కెన్ బ్యాంక్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక పాఠశాల విద్యార్థిని సీసాలో పంపిన సందేశానికి మూడు దశాబ్ధాల తర్వాత సమాధానం వచ్చింది.

స్కాట్లాండ్‌లోని మోరేలో పోర్ట్‌నాకీకి చెందిన అలైనా బెరెస్‌ఫోర్డ్‌ 12 ఏళ్ల వయసులో ఉండగా.. అంటే, 1994లో స్కూల్ ప్రాజెక్ట్‌లో భాగంగా సీసాలో సందేశాన్ని పంపారు.

ఆ సీసా లేఖ సముద్రం దాటింది, ఏళ్ల తర్వాత బీచ్‌ను శుభ్రం చేస్తున్న వలంటీర్‌కు నార్వే ద్వీపంలో కనిపించింది. ఈ విషయాన్ని అలైనాకు తెలియజేయడానికి ఆమె ఒక పోస్ట్‌కార్డ్ పంపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సీసా, నార్వే
ఫొటో క్యాప్షన్, సీసా ప్రయాణించిన ప్రాంతం

మూడు దశాబ్ధాల తర్వాత కూడా తన లేఖ పాడైపోకుండా ఉండటం ఆశ్చర్యంగా ఉందని అలైనా బీబీసీతో చెప్పారు.

ఆ లేఖను అలైనా చేతితో రాసి, ఒక బాటిల్‌లో పెట్టారు. ఆ బాటిల్ ఈశాన్య స్కాట్లాండ్‌లో తయారైన ఒక ఫిజీ డ్రింక్ బాటిల్.

అలైనా లేఖ

ఫొటో సోర్స్, Alaina Beresford

ఫొటో క్యాప్షన్, 12 ఏళ్ల వయసులో లేఖ రాసినట్లు అలైనా తెలిపారు.

ఆ లేఖలో ఏం రాశారు?

మూడు దశాబ్ధాల కిందట అలైనా రాసిన లేఖలో ఇలా ఉంది:

"డియర్ ఫైండర్(కనుగొన్న వ్యక్తి), నా పేరు అలైనా స్టీఫెన్, నాకు 12 సంవత్సరాలు. పోర్ట్‌నాకీలో నివసిస్తున్నాను. నేను నీటిపై ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, కాబట్టి ఒక బాటిల్‌లో సందేశం పంపాలని నిర్ణయించుకున్నా. నా టీచర్ భర్త ఈ సీసాలను తీసుకొని సముద్రం మధ్యలో పడేశారు.

మీరు ఈ సందేశాన్ని కనుగొన్నప్పుడు, దయచేసి మీ పేరు, అభిరుచులు, మీరు దీన్ని ఎక్కడ, ఎప్పుడు కనుగొన్నారో, కుదిరితే మీ ప్రాంతం గురించి కొంత సమాచారంతో తిరిగి రాయండి.

మీ భవదీయులు,

అలైనా స్టీఫెన్

పీఎస్: స్కాట్లాండ్"

పియా, అలైనా

ఫొటో సోర్స్, Alaina Beresford

ఫొటో క్యాప్షన్, పియా రాసిన లేఖ

ఎవరా వలంటీర్?

ఇప్పుడు, 31 సంవత్సరాల తరువాత, అలైనాకు పియా బ్రాడ్‌మాన్ నుంచి బాటిల్ ఫోటోలతో పాటు ఒక పోస్ట్‌కార్డ్ వచ్చింది.

ఆమె ఏం రాశారంటే:

"నా పేరు పియా, నేను జర్మనీ నుంచి వచ్చాను. ఈరోజు నార్వేలో వేగా సమీపంలోని లిషెల్లోయా అనే చిన్న ద్వీపంలోని ఒక బాటిల్‌లో మీ సందేశాన్ని కనుగొన్నాను.

నేను నాలుగు నెలలు బీచ్‌లను శుభ్రం చేయడానికి వలంటీర్‌గా ఇక్కడికి వచ్చాను. ఈరోజు మేం లిషెల్లోయాను శుభ్రం చేశాం. పోస్ట్‌కార్డ్ ముందు భాగంలో, మేం పనిచేసే బోట్ నెమో, మేం నివసించే సెయిల్ బోట్ ఫాన్‌ను మీరు చూడవచ్చు. వేగా చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా చూడవచ్చు. మీ టీచర్ భర్త ఈ బాటిల్‌ను ఎప్పుడు, ఎక్కడ సముద్రంలో పడేశారోనని ఆశ్చర్యంగా ఉంది.

పీఎస్: నాకు 27 సంవత్సరాలు, నాకు రాక్ క్లైంబింగ్(రాతి గుట్టలు ఎక్కడం), సెయిలింగ్ అంటే చాలా ఇష్టం!"

అలైనా పంపిన బాటిల్

ఫొటో సోర్స్, Pia Brodtmann

'నమ్మలేకపోతున్నా'

ప్రస్తుతం అలైనాకు 42 సంవత్సరాలు. తన పేరుతో ఉన్న పోస్ట్‌కార్డ్‌ను చూసి షాక్ అయ్యానని అలైనా చెప్పారు.

"నేను ఇప్పటికీ అదే చిరునామాలో నివసిస్తున్నా" అని ఆమె తెలిపారు.

"నేను కొంతకాలం బక్కీల, ఆ తర్వాత పోర్ట్‌నాకీలోని మరొక ఇంట్లో నివసించాను. కానీ, తరువాత నా తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వచ్చాను. నాకు 12 ఏళ్ల వయసులో, అంటే 31 సంవత్సరాల కిందట ఆ సందేశాన్ని పంపడం, నమ్మలేకపోతున్నా!" అని అలైనా అన్నారు.

స్కాట్లాండ్‌, అలైనా బెరెస్‌ఫోర్డ్‌

ఫొటో సోర్స్, Aileen Stephen

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం అలైనాకు 42 సంవత్సరాలు.

సోషల్ మీడియాలో పియాను కనుగొని, ఆ లేఖ ఫోటోను పంపాలని అలైనా మెసేజ్ చేశారు.

"ఆమె దానిని పంపినప్పుడు ఆశ్చర్యపోయాను. అది ఇప్పటికీ ఎంత స్పష్టంగా ఉందో, నమ్మలేకపోతున్నా" అని అలైనా అన్నారు.

"నేను ఉత్తరం రాసినట్లు గుర్తులేదు కానీ, అదొక బాటిల్‌లో ఉందని గుర్తుంది. నా టీచర్ భర్త ఒక జాలరి, దానిని సముద్రంలో పడేశారు. నా సందేశం ప్రకారం, నేను పీ7లో ఉన్నప్పుడు నీటిపై స్కూల్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని రాశాను.

పియా, నేను టచ్‌లో ఉన్నాం. మేం ఇలా మాట్లాడుకుంటూనే ఉంటామని ఆశిస్తున్నాను" అని అలైనా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)