ఇజ్రాయెల్ - ఇరాన్ స్నేహితుల నుంచి బద్దశత్రువులుగా ఎలా మారాయి?

ఫొటో సోర్స్, Getty Images
1948లో ఇజ్రాయెల్ ఏర్పాటైనప్పుడు తుర్కియే తర్వాత ఇజ్రాయెల్‌ను గుర్తించిన రెండో ముస్లిం మెజారిటీ దేశం ఇరాన్. ఆ సమయంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండేవి. తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయి రెండు దేశాలు బద్దశత్రువులుగా మారాయి.
జూన్ 13న, ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్‌పై దాడి చేసింది. తెహ్రాన్, నతాంజ్, ఇస్ఫహాన్ సహా అనేక సైనిక, అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్‌కు 'ఆపరేషన్ రైజింగ్ లయన్' అని పేరుపెట్టింది. ప్రతీకారంగా, ఇరాన్ కూడా ఇజ్రాయెల్ నగరాలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.
ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, రెండు వైపుల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి అవి ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు.
అసలు.. ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య శత్రుత్వం బద్దశత్రువులుగా ఎలా మారాయి?


ఫొటో సోర్స్, Getty Images
రెండు దేశాల మధ్య మంచి సంబంధాలున్న కాలం
1979 వరకు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నాయి. ఆ సమయంలో, అయతొల్లా ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ విప్లవానంతరం ఇరాన్‌లో అధికారం చేతులు మారింది.
అయితే, 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుకు దారితీసిన పాలస్తీనా విభజన ప్రణాళికను ఇరాన్ వ్యతిరేకించింది. అయినప్పటికీ, తుర్కియే తర్వాత ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించిన రెండో ముస్లిం-మెజారిటీ దేశంగా ఇరాన్ నిలిచింది.
ఆ సమయంలో ఇరాన్.. పహ్లావి రాజవంశానికి చెందిన షాల ఏలుబడిలో ఉంది. పశ్చిమాసియాలో అమెరికాకు కీలకమైన మిత్రదేశంగా ఉండేది. అందుకే పొరుగు అరబ్ దేశాల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నప్పటికీ, ఇరాన్‌తో స్నేహాన్ని కొనసాగించడానికి ఇజ్రాయెల్ వ్యవస్థాపకులు, మొదటి ప్రధాన మంత్రి డేవిడ్ బెన్-గురియన్ ప్రయత్నించారు.
కానీ, 1979లో అయతొల్లా ఖమేనీ విప్లవం షాను పడగొట్టి ఇస్లామిక్ రిపబ్లిక్‌ను స్థాపించింది. ఖమేనీ తనను తాను ప్రపంచంలో 'అణచివేతకు గురైన వారిని రక్షించే వ్యక్తిగా' అభివర్ణించుకున్నారు. అమెరికా, దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్ 'సామ్రాజ్యవాదాన్ని' తిరస్కరించడాన్ని తన సైద్ధాంతిక పునాదిగా చేసుకున్నారు.
ఖమేనీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంది. ఇజ్రాయెల్ పౌరుల పాస్‌పోర్టులను గుర్తించడం ఆపేసింది. తెహ్రాన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో)కి అప్పగించింది. ఆ సమయంలో, పీఎల్‌వో ప్రత్యేక పాలస్తీనా దేశం కోసం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి నాయకత్వం వహిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇద్దరి మధ్య శత్రుత్వం ఎలా పెరిగింది?
ఈ విషయంపై మరింత తెలుసుకోవడానికి, ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ సెంటర్‌లో ఇరాన్ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్న అలీ వేజ్‌తో బీబీసీ ముండో సర్వీస్ మాట్లాడింది.
ఇజ్రాయెల్‌తో శత్రుత్వం కొత్త ఇరానియన్ ప్రభుత్వ ప్రాథమిక విధానాల్లో భాగమని అలీ వేజ్ అన్నారు. దీనికి కారణం ఏంటంటే, ప్రభుత్వంలోని చాలామంది నాయకులు లెబనాన్ వంటి చోట్ల పాలస్తీనియన్లతో కలిసి గెరిల్లా యుద్ధంలో పాల్గొన్నారు. వారికి పాలస్తీనియన్లపై తీవ్రమైన సానుభూతి ఉంది.
కొత్త ఇరాన్ తనను తాను ఇస్లామిక్ శక్తిగా చూపించుకోవాలని కోరుకుంది. అందుకే ఆ సమయంలో చాలా అరబ్ ముస్లిం దేశాలు వదిలిపెట్టిన పాలస్తీనా సమస్యను నెత్తికెత్తుకుంది.
ఆ విధంగా ఖమేనీ పాలస్తీనా సమస్యపై తన వాదనను వినిపించడం ప్రారంభించారు. ఆ తర్వాత, తెహ్రాన్‌లో పాలస్తీనా మద్దతుదారుల భారీ ప్రదర్శనలు సాధారణమయ్యాయి. ఈ ప్రదర్శనలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చింది.
1990ల వరకూ ఇజ్రాయెల్‌లో ఇరాన్ పట్ల నిజమైన శత్రుత్వం మొదలుకాలేదని వేజ్ అన్నారు. ఎందుకంటే, ఆ సమయంలో ఇజ్రాయెల్‌కు అతిపెద్ద ముప్పు సద్దాం హుస్సేన్ నేతృత్వంలోని ఇరాక్.
అంతేకాకుండా, ఆ సమయంలో 'ఇరాన్-కాంట్రా' ఒప్పందాన్ని కుదిర్చిన మధ్యవర్తుల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఇది 1980, 1988 మధ్య పొరుగున ఉన్న ఇరాక్‌తో యుద్ధం వస్తే ఉపయోగించడం కోసం ఇరాన్‌కు అమెరికా ఆయుధాలను సరఫరా చేసిన రహస్య కార్యక్రమం.
కానీ, కాలక్రమేణా ఇజ్రాయెల్ ఇరాన్‌ను తన ఉనికికి పెద్ద ముప్పుగా చూడటం ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ - ఇరాన్ 'షాడో వార్'
మరో ప్రధాన ప్రాంతీయ శక్తి అయిన సౌదీ అరేబియాను కూడా ఇరాన్ ఎదుర్కోవలసి వచ్చిందని వేజ్ చెప్పారు. ఇరాన్ ప్రధానంగా పర్షియన్, షియాల ఆధిపత్యంలో ఉంది. అరబ్ ప్రపంచంలో ఎక్కువగా సున్నీ ముస్లింల దేశాలు ఉన్నాయి. తన ప్రత్యర్థి దేశాలు ఏదో ఒక రోజు దాడి చేయవచ్చని ఇరాన్ ప్రభుత్వం గ్రహించింది. ఈ భయం కారణంగా, అది ఒక వ్యూహాత్మక ప్రణాళికపై పనిచేయడం ప్రారంభించింది.
ఆ తర్వాత, ఇరాన్‌తో అనుబంధంగా ఉన్న సంస్థల నెట్‌వర్క్ ఏర్పడింది. ఈ సంస్థలు తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా సాయుధ చర్యను చేపట్టాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉగ్రవాద సంస్థగా భావించే లెబనాన్ హిజ్బొల్లా వాటిలో అత్యంత ప్రముఖమైనది. ఇరాన్ 'యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్'గా చెప్పే నెట్‌వర్క్ ఇప్పుడు లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్ వరకు విస్తరించి ఉంది.
ఇజ్రాయెల్ ఖాళీగా కూర్చోలేదు. అది ఇరాన్, దాని మిత్రరాజ్యాల సమూహాలపై దాడులు చేసింది. ఈ దాడులు తరచూ ఇరాన్ నిధులు, వనరులందించే సాయుధ సమూహాలున్న దేశాల్లో జరిగాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఈ సంఘర్షణను 'షాడో వార్' అని పిలుస్తారు. ఎందుకంటే రెండు దేశాలు చాలా సందర్భాలలో ఒకదాన్నొకటి లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ, ఆ విషయాన్ని అధికారికంగా అంగీకరించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ నిఘా
ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడం, అది అణ్వాయుధ శక్తిగా మారకుండా నిరోధించడం ఇజ్రాయెల్ ప్రాథమిక లక్ష్యం.
తమ అణు కార్యక్రమం కేవలం పౌర ప్రయోజనాల కోసమేనన్న ఇరాన్ వాదనను ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. ఈ శతాబ్దం మొదటి దశాబ్దంలో ఇరాన్ అణుకేంద్రాలకు తీవ్రనష్టం కలిగించిన 'స్టక్స్‌నెట్' అనే కంప్యూటర్ వైరస్‌ను అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిందని చెబుతారు.
తమ అణు కార్యక్రమ అధిపతులు, మరికొందరు సీనియర్ శాస్త్రవేత్తలపై దాడులు చేసింది ఇజ్రాయెల్ నిఘా సంస్థేనని ఇరాన్ ఆరోపించింది.
వీటిలో అత్యంత ముఖ్యమైన సంఘటన 2020లో మొహ్సిన్ ఫఖ్రీజాదే హత్య. అయితే, ఈ హత్యలో తన ప్రమేయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తోంది.
ఇరాన్ 'అణు కార్యక్రమానికి'' సంబంధించిన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని తాజా దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి అన్నారు. "ఇరాన్‌ను ఆపకపోతే, అది చాలా తక్కువ సమయంలోనే అణ్వాయుధాలను తయారు చేయగలదు. ఇది ఒక సంవత్సరం, కొన్ని నెలలు లేదా అంతకుముందే జరగవచ్చు. ఇది ఇజ్రాయెల్ ఉనికికి తీవ్రమైన ప్రత్యక్ష ముప్పు" అని నెతన్యాహు అన్నారు.
ప్రస్తుతం రెండు దేశాలు ఒకదానిపై ఒకటి నిరంతరం దాడి చేసుకుంటున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














